సుశీలస్వరమాధురి

39

‘పిల్లలూ దేవుడూ చల్లనివారే
కల్లకపటమెరుగని కరుణామయులే..’

ఈ పాట మొదటిసారి ఎప్పుడు వినిఉంటాను?

ఇప్పుడు తేదీలు చూస్తే, లేతమనసులు సినిమా 1966 లో వచ్చినట్టుంది.
అంటే, బహుశా, నాలుగైదేళ్ళ వయసులో వినిఉంటాను. బహుశా నేను విన్న మొదటిసినిమా పాట కూడా ఇదే అయిఉండవచ్చు.

ఆ పాట విన్నప్పుడల్లా చాలా ఏళ్ళదాకా, మనసుముందొక చిత్రం కదలాడేది, పెద్ద ఇల్లు, ఆ ఇంటినిండా దీపాలు,

‘ఫుట్టినపుడు మనిషి మనసు తెరచియుండును
ఆ పురిటికందు మనసులొ దైవముండును..’

ఇంకా నా ఊపిరితిత్తులు గులాబి రంగులోనే ఉండే ఆ కాలంలో ఆ పాట విన్నప్పుడల్లా ఏదో దేవలోకపు వెలుతురు లాంటిది నా మనసంతా నిండిపోయేది.

నేను సంగీతకారుల పరివారంలో పుట్టలేదు. బాల్యంలోనే త్యాగరాయకీర్తనలో, పురందరదాస కీర్తనలో వింటూ పెరిగినవాణ్ణి కాను.

చెంబై, సుబ్బులక్ష్మి, పట్టమ్మాళ్,బాంబే జయశ్రీ అనే పేర్లు ఎన్నాళ్ళ తర్వాతి మాట!

కనీసం బాలసరస్వతి, భానుమతి, జమునారాణి, జిక్కి, లీల అనే పేర్లు వినడానికి కూడా ఎన్నో ఏళ్ళు పట్టిన కాలం.

నూర్జహాన్, షంషాద్, లత, గీతారాయ్- రాజమండ్రివెళ్ళాకగానీ, ఈ కోకిలలు నాకు పరిచయం కాలేదు.

కాని ఆ పసితనపు రోజుల్లో, ఆ పల్లెలో, మధ్యాహ్నాలూ, అర్థరాత్రులూ కూడా ఒకేలాంటి నిశ్శబ్దం ఆవరించి ఉండే ఆ అడివి మధ్య, విశాఖపట్టణం, విజయవాడ రేడియో స్టేషన్లనుంచి వినిపించే సినిమాపాటలే నేను విన్న తొలిసంగీతం. ఘంటసాల, సుశీల-ఈ రెండు పేర్లే నేను విన్న తొలిగాంధర్వం.

పాట వింటూనే పాడినవాళ్ళ పేరు చెప్పగలిగే వాళ్ళని చూస్తే చాలా కాలం పాటు నాకెంతో ఆశ్చర్యం. నాకు తెలియని గొప్ప విద్య ఏదో వాళ్ళకి చాతనవునని ఈసుగా కూడా ఉండేది. గళానికీ, గళానికీ మధ్య స్వరతంత్రుల తేడా పట్టలేని ఆ వయసులో రేడియోలో వినబడే ప్రతి ‘అతడూ’ ఘంటసాల, ప్రతి ‘ఆమె ‘ సుశీల.’

ఇన్నాళ్ళయ్యాక అప్పుడు విన్న పాటల్లో ఏవి సుశీలపాడినవి, ఏవి తక్కినవాళ్ళు పాడినవి విడదీసి చూస్తే, ఓహో! చాలా కాలందాకా, జీవితపు ప్రతి మలుపులోనూ నా మనసుకి చుట్టుకున్న పాటలు సుశీల పాడినవే!

‘సుందరాంగ మరువగలేనోయ్ రావేలా,నా అందచందములు దాచితి నీకై రావేలా’..ఈ పాటకీ, నా చిన్ననాటి సమష్టి కుటుంబ జీవితానికీ ఏదో దగ్గర లంకె. ఈ పాట వినగానే మా సీతత్తయ్య గుర్తొస్తుంది. పండిన వరిచేలు, సంక్రాంతి పండగ, మా ఇంట్లో పనిచేసిన నౌకరు బోడిగాడు గుర్తొస్తారు. బహుశా అతడా పాట పాడుతూ ఏ పండగ రోజైనా మా ఇంటిముంగిట డాన్సు చేసాడా? మద్రాసునుంచి మా తాళ్ళపాలెందాకా ఆ పాట అంతతొందరగా ఎలా ప్రయాణించింది?

‘పచ్చబొట్టూ చెరిగిపోదూలే నా రాజా. పసుపుజంట చెదిరిపోదూలే నా రాజా ..’ బహుశా 71 ఎన్నికల ప్రచారం కావచ్చు. కార్లల్లో, జీపుల్లో ఎవరెవరో మా ఊరికి వచ్చి ప్రచారకరపత్రాలు వెదజల్లిపోయేవారు. ఆ కార్లు ఊళ్ళో అడుగుపెట్టి మా ఊరు దాటిపోయేంతదాకా ‘గాంధి పుట్టిన దేశమా ఇది/నెహ్రు కోరిన సంఘమా ఇది’-ఆ పాటే పదే పదే మోగేది. ఆ మధ్యలో తెలియని బెంగతో వినిపించే పాట ‘పచ్చబొట్టూ చెరిగిపోదూలే నా రాజా..’

ఒకప్పుడు ఫణికుమార్ ఒకమాటన్నారు: 60 లతో భారతదేశంలో అమాయికత్వం అంతరించిపోయిందని. ఆ age of innocence తాలూకు చివరి పాటలవి. చాలా ఆశ్చర్యంగా వంశీ ‘మా పసలపూడి కథలు’ లో కూడా ఆ పాటలే గుర్తు చేసుకున్నాడు.

తూర్పు గోదావరి జిల్లాలో అర్బనైజేషన్ 70 లతో ఒక మలుపు తిరిగింది. అంతకు ముందుదాకా, పల్లెల్లో, మా కొండపల్లెలో కూడా అదొక నిర్మలప్రపంచం. ‘యూరియా’, ‘గ్రోమోర్’, ‘నిరోధ్’ లాంటి పదాలు ఇంకా గ్రామాల్లోకి ప్రవేశించని కాలం. రాత్రి చివరిబస్సు కూడా వచ్చేసాక, నక్షత్రాలు వెలిగించిన ఆకాశం కింద, చెట్లూ, కొండలూ, ఊరిసరిహద్దులో ఏరూ చెవులప్పగించి వినేటట్టు రేడియో పాడిన పాటలు:

వగల రాణివి నీవే..’

‘ఊహలు గుసగుసలాడే..’

‘అదే అదే నాకు అంతు తెలియకున్నది..’

‘వసంతగాలికి..’

‘తెలిసిందిలే తెలిసిందిలే..’

‘పదే పదే కన్నులివే..’

‘ముత్యాల జల్లు కురిసె, రతనాల మెరుపు మెరిసె..’

జీవితం నాటకీయంగా ఉండని ఆ కాలంలో ఏ చిన్నసంఘటన జరిగినా అది ముచ్చటే, ఊళ్ళోకి వచ్చిన ప్రతి కొత్త వ్యక్తీ దైవసందేశాన్ని తెచ్చేవాడే. ఎప్పుడైనా మా నాన్నగారు కాకినాడనో, రాజమండ్రినో, కనీసం ఏలేశ్వరం, నర్సీపట్నం వెళ్ళి వచ్చినా చాలా రోజులదాకా ఆ ముచ్చట్లే.

అట్లాంటి ఒక ముచ్చట, ఆయన రాజమండ్రిలో మూగమనసులు షూటింగ్ చూడటం.

‘గోదారీ గట్టుందీ/ గట్టుమీదా చెట్టుందీ
చెట్టుకొమ్మన పిట్టుందీ/ పిట్టమనసులో ఏముందీ ‘

ఈ నాలుగు పంక్తులూ మా ఇంటికీ, మా ఊరికీ ఒక కొత్త కిటికీ తెరిచిపెట్టాయి. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళకు మూగమనసులు సినిమా చూసానుగానీ, ఆ పాట కాదు నా చిన్నప్పుడు నేను విన్నపాట..

కోడి కూసే జాముదాకా/తోడురారా చందురూడా
కోడెకారు కొత్త కోర్కెలు/రగులుతున్నవి అందగాడా’

ఈ పాటలోని కవోష్ణమాధుర్యం వేరు. కాని ఈ పాట వినగానే నామనసంతా బెంగగా అయిపోతుంది. ఎందుకని? ఎందుకంటే, సెలవులైపోయాక, ఇంటినుంచి హాస్టలుకి వెళ్ళేటప్పుడు, నన్ను తాడికొండ తీసుకువెళ్ళినాయన  నాకీ సినిమా చూపించాడు. సెకండ్ షో. ఆ పాటలో దూరంగా అస్పష్టంగా రాలుతున్నట్టుండే ఆ వెన్నెల నా స్వగ్రామం మీద కుండపోతగా కురిసే వెన్నెలని గుర్తు చేసింది కనుక. ఇన్నాళ్ళైనా, ఆ పాట వినబడితే, అమ్మగురించి, ఇంటిగురించి బెంగతో కళ్ళు మసకలు కమ్ముతాయి.

చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలీ..’

ఈ అష్టపది ఎందరు పాడగా విన్నాను. కానీ తెనాలిరామకృష్ణలో వినిపించినంత మధురంగా మరెవ్వరి గొంతులోనూ వినలేకపోయాను. ఆ మాధుర్యం సుశీల స్వరానిదా? లేకపోతే, ఒక రాత్రి రాజవొమ్మంగిలో మొదటి ఆట సినిమా చూసి ఇంటికి వెళ్ళడానికి ఏదన్నా లారీ దొరుకుతుందేమోనని రోడ్డు మీదనే గంటల తరబడి వేచివున్నప్పుడు, బయట ఎడ్లబళ్ళ మీద రాలుతున్న వెన్నెల, ఆ ఎడ్ల మెడలో గంటల చప్పుడు, బళ్ళల్లో పరిచిన, ఎడ్లకు మేతవేసిన ఎండుగడ్డిమీద మంచురాలుతున్న మెత్తని తీపిసువాసన-అవన్నీ కలగలిసిపోయిన మాధుర్యమా?

మీరజాలగలడా నా యానతి/వ్రత విధాన మహిమన్ సత్యాపతి ‘

గుర్తుందా, కాకరపాడులో శ్రీకృష్ణతులాభారం నాటకం చూడటానికి బండికట్టించుకుని ఆ వెన్నెల రాత్రి అడవిదారిన పయనించిన జ్ఞాపకం. బండి బోయపాడు మలుపు తిరగ్గానే ఆ కొండలన్నీ కలిసిపాడినట్టు వినిపించిన నాటకపద్యాలు, హార్మోనియం రాగాలు. తెలుగువాళ్ళ మనసుల్లో మృదుమధురసంవేదనలు రేకెత్తించగల ఈ పాట, హృదయాన్ని సరసశృంగారమయం చేయగల ఈ పాట, నా మటుకు నాకు,వింటూనే, కాకరపాడు తీర్థం, కొత్తమాస తిరణాల, రంగులు, బూరాలు, చెమ్కీదండలే గుర్తొస్తాయి.

చూస్తూండగానే 60 లు ముగిసిపోయి, 70 లు కూడా ముగిసిపోయే వేళకి, అప్పటికి, నా బాల్యం అంతమై, నవయవ్వనపు అలజడి మొదలయిన ఆ వ్యాకులవేళలు కూడా సుశీల పాటలే.

‘ఏ తీగ పూవునో, ఏ కొమ్మతేటినో..’

‘చిన్నమాటా, ఒక చిన్నమాటా..’

ఆ మధ్యలో మా ఊరు వెళ్ళినప్పుడల్లా, మళ్ళా ఆ అడవి, ఆ కొండలు, కథగా, కలగా మారిపోయిన ఆ ప్రశాంతకాలం గుండెని లలితంగా రాపాడినప్పుడల్లా

మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
ఆనందంతో, అనురాగంతో..’

‘అదిగో నవలోకం,వెలసే మనకోసం.’

80 లు మొదలయ్యాయి. ఒక రోజు గోదావరి ఒడ్డున, మిత్రగోష్టిలో ఒకామె పాడిన పాట.

‘వెన్నెలలోని వికాసమే వెలిగించెద నీ కనుల
వేదన మరిచి ప్రశాంతిగా నిదురించుము ఈ రేయి..’

ఆ పాట శ్రీశ్రీ రాసాడని తెలియడం గొప్ప ఆశ్చర్యం. మళ్ళా వెన్నెల, కాని ఈ సారి అడివిగాచిన వెన్నెల కాదు, గోదావరిమీద ఒరిగిపోయిన పాలపుంత.

‘అయినదేమో అయినది, ఇక గానమేదే ప్రేయసి..’

భమిడిపాటి జగన్నాథ రావుగారు తెచ్చిన టేప్ రికార్డర్లో విన్నపాట.

ఏమి అయిపోయింది? అయినదేమో అయినదని ఎందుకంటున్నాడు?

తెలుగుపాటల్లో అంత గొప్ప ఎత్తుగడతో ఉన్న పాట అదొక్కటేనేమో! నిజమైన కథా కావ్యం. Song as a narrative.

‘జోరుమీదున్నావు తుమ్మెదా..’

‘ఆకులో ఆకునై..’

‘ఓ బంగరు రంగుల చిలకా..’

ఇవన్నీ మరోలోకానికి చెందిన పాటలు.

కొత్తగళాలు, కొత్తసంగీతాలు, కొత్త స్నేహాలు, తొలిప్రేమలు మొదలైన కాలం.

కాని, ఆ పాటలన్నిటినీ మరిపించే పాట, బాల్యాన్నీ, యవ్వనాన్నీ దాటి, జీవితకాల ప్రతీక్షను ఒక్కసారే అనుభవానికి తెచ్చే పాట..

‘బతుకంతా ఎదురుచూచు పట్టున రానే రావు
ఎదురరయని వేళవచ్చి ఇట్టే మాయమవుతావు.
ముందు తెలిసెనా ప్రభూ, ఈ మందిరమిటులుంచేనా
మందమతిని, నీవు వచ్చు మధురక్షణమేదో కాస్త..

సుశీల బహుశా అద్వితీయ గాయని కాకపోవచ్చు. కాని నా చిన్నప్పటి జీవితంలో, ఆ fabric లో భాగమైపోయిన, మా పిన్నిలానో, మా మేనత్తల్లానో, ఆమె లేని ఆ కాలాన్ని నేనూహించలేను.

3-4-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: