సాహిత్యప్రేమికుల మధ్య

53

ఈ వారాంతం సాహిత్యప్రేమికుల మధ్యా, పుస్తకప్రియులమధ్యా గడిచింది.

1.

శుక్రవారం సాయంకాలం భాస్కరరెడ్డిగారిని చూడటానికి నెల్లూరులో ఆగితే,ఆయన నా మాటలు వినడం కోసం కొందరు మిత్రులూ, పిల్లలూ ఎదురుచూస్తున్నారని దగ్గర్లో ఉన్న డిగ్రీ కాలేజి గ్రౌండ్సు లో చిన్న సమావేశం ఏర్పాటు చేసారు. పెరుగురామకృష్ణ పరిచయవాక్యాలు. అక్కడికి వచ్చినవాళ్ళల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువమంది ఉన్నారు. వాళ్ళతో ఏం మాట్లాడాలి? వాళ్ళేమి వినదలుచుకున్నారు?

ఆ రోజు ప్రయాణంలో నేను చదువుతూ వచ్చిన లూసన్ కథ ‘మద్యశాల మెట్లపైని’ ఇంకా నా మనసులోనే మెదుల్తూ ఉంది. ఈ మధ్యనే చదివిన ఒక చైనీయ కథాసంకలనానికి ముందుమాట రాస్తూ సంపాదకుడు 1924 లో వచ్చిన ఆ కథని దాటి చైనా రచయితలు మానసికంగా ఒక్కడుగు కూడా ముందుకుపోలేదంటాడు. ఆ కథలో లూసున్ ఒక పాత్రతో ఇలా అనిపిస్తాడు:

‘నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఈగలూ, తేనెటీగలూ నా కళ్ళకి విచిత్రంగానూ, దయనీయంగానూ కనిపించేవి. అవి ఎక్కడో ఒకచోట ఆగి, అక్కడ దేనిమీదనో వాలి, మళ్ళా ఇంతలోనే పైకెగిరిపోయేవి. అప్పుడొక చుట్టు తిరిగి మళ్ళా అవి ఎక్కణ్ణుంచి ఎగిరాయో, సరిగ్గా అక్కడికే వచ్చివాలేవి. నేను కూడా ఎక్కడో నాదంటూ ఒక ప్రపంచాన్ని నిర్మించుకుని కూడా మళ్ళా ఇక్కడకి ఎగిరి వస్తానని ఎవరన్నా ఊహించిఉంటారా? నువ్వు కూడా అట్లాగే ఇక్కడికే వచ్చి వాలతావని కూడా ఎవరన్నా ఊహించగలరా? ఇంతకన్నా, కొద్దిగా, కనీసం మరికొద్ది దూరం ఎగరలేకపోయావా?’

ఆ కథ చదువుతూ ఆ మధ్యాహ్నప్రయాణమంతా నేనింతదాకా గడిచిన నా జీవితం గురించే ఆలోచిస్తూ ఉన్నాను. నేను కూడా అట్లానే ఒక ఈగలానో, తేనెటీగలానో ఎంత దూరం ప్రయాణించినా తిరిగి మళ్ళా నా స్వగ్రామానికే మానసికంగా అంటిపెట్టుకుపోయానని నాకు గుర్తొచ్చింది. స్వగ్రామం, స్వజనం, స్వదేశం చాలా సమ్మోహనకరమైన మాటలు. ఆ మాటల ప్రభావం నుంచి లూసన్ లాంటివాడే తప్పించుకోలేకపోతే, నేనెంతటివాణ్ణి!

అందుకని నా ముందున్న పిల్లలతో ఆ మాటే చెప్పాను, మీరు మీ స్వగ్రామాన్నింకా ప్రేమిస్తున్నారా? లేక నగరాన్ని ఇష్టపడుతున్నారా? మీ భవిష్యత్తు, మీరు చేపట్టబోయే జీవితవ్యాపకాలు, మీ జీవనసార్థ్యక్యం ఈ ప్రశ్న చుట్టూతానే తిరగబోతున్నదని వాళ్ళకి చెప్పాను.

వాళ్ళకి మరొక మాట కూడా చెప్పాను. ఒకాయన Geography of Thought అనే పుస్తకం రాసాడు. అందులో, ఆయన ఒక ప్రాచీన గ్రీకు సెలవలొస్తే, కొత్త విద్య నేర్చుకోవడానికి ఇష్టపడేవాడనీ, అదే ఒక ప్రాచీనా చీనీయుడు సెలవు దొరికితే తన స్వగ్రామం వెళ్ళి తన స్వజనాన్ని కలవడానికి ఇష్టపడతాడని. ఈ మట చైనాకేకాదు, ఆసియా, ఆఫ్రికా దేశాలన్నిటికీ వర్తిస్తుందని కూడా చెప్పాను.
.
నా మాటలు ముగించగానే భాస్కరరెడ్డిగారు చెప్పారు, తాము నెల్లూరులో సాధనాపదయాత్ర పేరిట చేపడుతున్న కార్యక్రమంలో పాల్గొని తమ స్వగ్రామాలను సందర్శించడానికి దేశవిదేశాల్లో ఉన్నవారెందరో ఉత్సాహపడుతున్నారని.

2

శనివారం సాయంకాలం తిరుపతిలో నవ్యాంధ్రపుస్తక సంబారాల్లో భాగంగా వాక్ ఫర్ బుక్స్ లో పాల్గొన్నాను. మహతి ఆడిటోరియం నుంచి పుస్తకప్రదర్శనదాకా జరిగిన పాదయాత్ర.

అక్కడ ఎమెస్కో సంస్థ ప్రచురించిన ‘భారతీయం’ పుస్తక ఆవిష్కరణ సభ. కె.అరవిందరావుగారు గత ఏడాదిన్నరగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో వారం వారం రాస్తూ వచ్చిన వ్యాసాల సంపుటి. ఎనభై వ్యాసాలు. అరవిందరావుగారు డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీస్ గా పనిచేసి పదవీవిరమణ చేసారు. ఆ తరువాత ఆయన వేదాంతం, పూర్వమీమాంస, భగవద్గీత లాంటి సనాతన గ్రంథాల్ని సంస్కృతంలో పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వంటి పెద్దల దగ్గర శుశ్రూష చేసి అధ్యయనం చేస్తూ వచ్చారు. మూలగ్రంథాలు సంస్కృతంలో చదవడం వల్ల, ఆయన ఆలోచనలకొక స్పష్టత, వాక్యాలకొక తేటదనం, ప్రయోజన శుద్ధి సమకూరాయి. ఆయన భావాల్ని ఎవరైనా విమర్శించవచ్చు, చర్చించవచ్చు. కానీ, ఆయన తపస్సునీ, స్వాధ్యాయాన్నీ మాత్రం గౌరవించక తప్పదు. ఆ పుస్తకాన్ని పరిచయం చేసే అవకాశం నాకు కలగడం నాకు సంతోషమనిపించింది.

3

ఆదివారం బాపట్ల దగ్గర సూర్యలంక సాగరతీరాన తెలుగు కథకుల శిబిరంలో గడిపాను. చాలా కాలంగా కథలు రాస్తున్న సుప్రసిద్ధులతో పాటు, ఇప్పుడిప్పుడే కథారచనలో అడుగుపెట్టిన కొత్త కథకులదాకా సుమారు ముఫ్ఫై మంది ఏర్పాటు చేసుకున్న వర్క్ షాప్. అందులో భాగంగా నన్ను కూడా నా ఆలోచనలు పంచుకొమ్మని ఖదీర్ బాబు ఆహ్వానించేడు. ప్రస్తుతం ప్రపంచంలో కథ ఎటు ప్రయాణిస్తున్నది, సమకాలిక ప్రపంచ కథకులు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ సాధననుంచి తెలుగు కథకులు నేర్చుకోవలసిందేమైనా ఉందా ‘పాఠం’ చెప్పమని అడిగాడు.

అట్లా అడిగేవాళ్ళ కోసమే కదా నేను వెతుక్కునేది, ఎదురుచూసేది. అందుకని అడిగిందే తడవుగా రెక్కలు కట్టుకు వాలాను. రెండు ‘పాఠాలు’ చెప్పాను.

మొదటిది, ఒక ప్రక్రియగా కథారచనలో ఉండవలసిన ప్రయోగశీలత్వం గురించి. కళకి, కథారచన కూడా ఒక కళే కాబట్టి, కథకి కూడా రెండు ధర్మాలున్నాయి. ఒకటి, తన కాలం నాటి విలువల్ని, వ్యవస్థని నిలబెట్టడం, లేదా, రెండోది, ఆ విలువల్నీ, వ్యవస్థనీ ప్రశ్నించడం. అట్లా ప్రశ్నించే బాధ్యతని పైకెత్తుకున్న కథలు వస్తువులో మాత్రమే విప్లవాత్మకతను చూపిస్తూ, శిల్పంలో మాత్రం సంప్రదాయ విలువల్నే పాటించడం ఎంతవరకు సమంజసమని అడిగాను. అందుకని, కథకుడు ఒక రెబెల్ కావాలనుకుంటే, ముందతడు గతానుగతికమైన కథాశిల్పాన్ని ధ్వంసం చెయ్యవలసి ఉంటుందని చెప్పాను. అందుకు, కథకుడు నిత్యప్రయోగశీలుడిగా ఉండవలసి ఉంటుందని చెప్తూ, ఉదాహరణగా అమెరికన్ పోస్ట్ మాడర్న్ కథకుడు డొనాల్డ్ బార్తెల్మి రాసిన ‘At the Tolstoy Museum ‘ అనే కథను చదివించాను. కథ చదివేక చాలా ఆలోచనాత్మకమైన చర్చ నడిచింది. ఆ కథమీద ఇంటర్నెట్ లో లభ్యమవుతున్నదానికన్నా విలువైన పరిశీలనలు ఆ కథకులు ఆ కొద్దిసేపట్లోనే ప్రతిపాదించేరు.

రెండవ సెషన్ లో సమకాలిక రియలిజం గురించి చెప్పాను. ఆధునిక కథ ఎడ్గార్ అలెన్ పో తో మొదలైనదనుకుంటే, డార్క్ రొమాంటిసిజం, నాచురలిజం, రియలిజం, ఇంప్రెషనిజం, మాడర్నిజం, క్రిటికల్ రియలిజం, ఎక్స్ ప్రెషనిజం, సర్రియలిజం, అబ్సర్డిజం, మాజికల్ రియలిజం, పోస్ట్ మాడర్నిజం లను దాటి మళ్ళా ప్రపంచ కథ రియలిజం వైపే మొగ్గు చూపిస్తున్నదని చెప్పాను.అయితే, ఇది పందొమ్మిదో శతాబ్ది రియలిజం వంటిది కాదు. పాత రియలిజం బాహ్యయథార్థాన్ని చిత్రించడం ద్వారా, వస్తుగత సత్యాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించింది. అది exteriorization of the reality. కాని ఈ కొత్త రియలిజం దృష్టి interiorization of reality మీద ఉంటుంది. అందుకు ఉదాహరణగా ఆస్ట్రేలియన్ రచయిత డేవిడ్ మలాఫ్ రాసిన The Only Speaker of His Tongue ను పరిచయం చేసాను. ఆ కథ మీద కూడా ఎంతో ఆసక్తి కరమైన చర్చ జరిగింది.

అంత మంచి కథకులు, లబ్ధప్రతిష్టులు తరగతిగదిలో విద్యార్థుల్లానే నా పాఠాలకి ప్రతిస్పందించేరు.

ఎప్పటిలానే, ఈ సమావేశాల వల్ల నేను మరింత రీఛార్జి అయ్యి తిరిగివచ్చేను.

24-10-2016

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s