సమగ్రంగా వికసించిన పాఠశాల

12

ఆదివారం చీమకుర్తి పబ్లిక్ స్కూల్లో సైన్స్ వేడుకల ముగింపు సమావేశానికి రమ్మని సి.ఏ.ప్రసాద్ గారు రమ్మంటే వెళ్ళాను. ప్రసాద్ గారు తెలుగు నేల మీద నడయాడుతున్న ఒక అద్భుతమైన, అద్వితీయుడైన వ్యక్తి. పాఠశాలలకి వెళ్ళడమూ, పిల్లలతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో మాట్లాడటమూ జీవితంగా మార్చుకున్న వ్యక్తి.

చీమకుర్తి ఒంగోలునుంచి మార్కాపురం వెళ్ళే దారిలో ఉంది. అక్కడ కొత్తగా బయటపడ్డ గెలాక్సీ గ్రానైట్ వల్ల కొందరు వ్యక్తులూ, కొన్ని కుటుంబాలూ సంపన్నులై ఉండవచ్చుగాక, కానీ ఆ ఊరూ, ఆ వెనక ఉన్న పృష్టభూమీ చాలా పేదవి. అక్కణ్ణుంచి మార్కాపురం, ఆ పైన నల్లమల అడవులూ నేనెన్నో ఏళ్ళు తిరుగాడినవి.

అట్లాంటి బీదభూమిలో ఎన్.ఎస్. ప్రకాశ్ అనే ఒక అభ్యుదయవాది స్థాపించిన పాఠశాల అది. దాదాపు పాతికేళ్ళ ముందు ఈ పాఠశాల స్థాపించడం కన్నా ముందు ఆయన మార్క్సిస్టు పార్టీలో క్రియాశీలక కార్యకర్త. కళాకారుడు. ప్రజానాట్యమండలి లో ఎన్నో నాటకాలకు దర్శకత్వం వహించి ఊరూరా తిరిగి ప్రదర్శనలిచ్చినవాడు. ఆయన స్థాపించిన పాఠశాల వెనక ఆయన్ను తీర్చిదిద్దిన కుటుంబం, పార్టీ, సంస్థ, సిద్ధాంతాల విలువలు సజీవంగానూ, బలంగానూ ఉండటం నేను ఆ రోజంతా గమనిస్తూనే ఉన్నాను.

తెలుగులో అభ్యుదయ సాహిత్యోద్యమం బలంగా ఉన్న రోజుల్లో కవులు, రచయితలు ఈ దేశప్రగతి వైజ్ఞానికంగా పురోభివృద్ధితోనే ముడిపడి ఉందని నమ్మారు. శ్రీశ్రీలోనూ, కొడవటిగంటి కుటుంబరావులోనూ ఈ విశ్వాసం చాలా బలంగా కనిపిస్తుంది. బాల్యంనుంచే పిల్లల్లో తల్లిదండ్రులూ, పాఠశాలలూ సైంటిఫిక్ టెంపర్ ని ప్రేరేపించాలని, అది వాళ్ళను మూడవిశ్వాసాలనుంచి బయటపడవెయ్యడమేకాక, వాళ్ళని చైతన్యవంతం చేస్తుందనీ అభ్యుదయ వాదులు నమ్మారు. వాళ్ళ దృష్టిలో మార్క్సిజం కూడా ఒక రాజకీయ కార్యాచరణ కన్నా ముందు ఒక శాస్త్రీయ దృక్పథం.

అటువంటి సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చిన ప్రకాశ్ గారు ప్రతి ఏటా తన పాఠశాలలో రెండు రోజుల పాటు వైజ్ఞానిక వేడుక నిర్వహించడంలో ఆశ్చర్యమేముంది! నేను ఆ ప్రదర్శనలో ప్రతి విభాగంలోనూ, ప్రతి ఎగ్జిబిట్ నూ చూసి, ప్రతి బాలికతోనూ, బాలుడితోనూ సంభాషించేను. ముఖ్యంగా గణిత శాస్త్రవిభాగంలో , పిల్లలు గణిత సూత్రాల్ని అర్థం చేసుకున్నతీరూ, వాటిని రకరకాల లోకాస్ట్, నోకాస్ట్ పరికరాలతో వివరించిన తీరూ నన్నెంతో ముగ్ధుణ్ణి చేసాయి.

కాని కేవలం సైన్స్ ప్రదర్శన ఒక్కట్టే అయిఉంటే, నేనీ నాలుగు వాక్యాలూ రాయడానికి ఉత్సాహపడిఉండే వాణ్ణి కాను.అన్నింటికన్నా ముందు ప్రకాశ్ గారు ఒక చిత్రకారుడూ, కళాకారుడూ కూడా. అక్కడ ప్రాథమిక పాఠశాలవిభాగంలో తెలుగు, ఇంగ్లీషు,హిందీ భాషల కు సంబంధించిన బృందాలు పప్పెట్రీ షోలు చేస్తూ ఉన్నాయి. మామూలుగా మనం స్పైరల్ బైండింగ్ కి వాడే అట్టల్తో పిల్లలు కీలుబొమ్మలు తయారు చేసారు. పారేసిన కొబ్బరికాయలు, సీసాలు వంటివాటితో బొమ్మలు తయారు చేసారు. అక్కడ తెరవెనుక నిలబడి ఆ పిల్లలు పాఠ్యపుస్తకాల్లో కథల్ని నాటకీకరణ చేసి ప్రదర్శిస్తుంటే, అది చూస్తున్న పిల్లల్లో నేనూ ఒక పిల్లవాణ్ణైపోయాను.

ఆ మధ్యాహ్నం ఆ పాఠశాల ఆవరణలో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత ఎంపిక చేసిన కొందరు పిల్లలకి ఒక శాస్త్రవేత్తతో ముఖాముఖి మాట్లాడే ఒక సెషన్ ఏర్పాటు చేసారు. ఇస్రో నుంచి వచ్చిన ఒక సీనియర్ సైంటిస్టు అంతరిక్ష పరిశోధనమీద, రాకెట్లతయారీమీద, చంద్రయాన్, కుజయాన్ గురించీ చక్కని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు.

సాయంకాలం సమావేశానికి ముందు బాలికలు కోలాటమాడేరు. గంటేడ గౌరునాయుడు రాసిన అజరామరమైన గీతం ‘పాడుదమా స్వేచ్ఛాగీతం’ వాళ్ళట్లా కోలాటంతో పాడుతుంటే అక్కడున్న ప్రతి ఒక్కరికీ ఒళ్ళంతా పులకిస్తూనే ఉంది.

పాఠశాల సమగ్రంగా వికసించడమంటే అది. చక్కటి పాఠశాల సైన్సు గురించి మాత్రమే మాట్లాడదు. నా చిన్నతనంలో, 1969 లో మనిషి చంద్రుడిమీద అడుగుపెట్టినప్పుడు, చందమామ ప్రత్యేక సంచిక వెలువరించింది. అందులో ‘నవీనచంద్రుడు’, ‘పురాణచంద్రుడు’ అని రెండు కథనాలు ప్రచురించింది.(బహుశా అది కొ.కు ఆలోచనే అయి ఉండవచ్చు.) నవీన చంద్రుడు ఒక ఉపగ్రహం. దాని ధ్రువాల దగ్గర మంచు పొర తప్ప, తక్కిందంతా ఒక నిర్జలక్షేత్రం. దాని గురించి తెలుసుకోవలసిందే. కాని పురాణ చంద్రుడు క్షీరసాగర మథనంలో సముద్రంనుంచి లక్ష్మీదేవితో పాటు ప్రభవించినవాడు. మనందరి బాల్యంలోనూ అతడు కొండలమీంచి మనకోసం గోగుపూలు తెచ్చే జాబిల్లి. మనమామయ్య. అప్పుడప్పుడే కళ్ళుతెరుస్తున్న ఆ పసివయసులో చందమామ పత్రిక నాకేమి చెప్పిందంటే, ఆ ఇద్దరు చంద్రుళ్ళూ కూడా నిజమేనని. ఒకరికొకరు విరుద్ధం కారని. నవీన చంద్రుడు నా బుద్ధిని ఆకర్షిస్తాడు. పురాణ చంద్రుడు నా మనసుని దోచేసుకున్నాడు.

స్వయంగా శాస్త్రాన్నీ, కళనీ ఆరాధించిన, అనుష్టించిన వాడు నడుపుతున్న పాఠశాల కాబట్టి అక్కడ వట్టి vertical growth కాక horizontal growth కనబడటం సమంజసమే కదా.

22-2-2016

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: