చీమకుర్తివెళ్ళినప్పుడే మరొక రెండు అద్భుతమైన ప్రయత్నాలు కూడా చూసాను.
డా. జవహర్ గారు చీమకుర్తిలో పేరు పొందిన వైద్యుడు. వారి కుటుంబ సభ్యులంతా కూడా వైద్యులే. ఆయన ఇల్లు, ఆసుపత్రి ఒక్క ప్రాంగణంలోనే ఉన్నాయి. పాతకాలపు ఇళ్ళల్లోని ధారాళమైన గాలి,నలుగురికోసం తెరిచిన ముంగిలి, లంకంత పెరడు. ఆ ప్రాంగణంలోనే ఒక పక్క, ఆయన 20 మంది అంధబాలబాలికలకోసం నడుపుతున్న హాష్టలు. నా అన్నవాళ్ళెవ్వరూ లేని ఆ పిల్లల్ని వాళ్ళ చిన్నప్పుడే తెచ్చి తమదగ్గర పెట్టుకున్నామనీ, గత పది పదిహేనేళ్ళుగా ఆ పిల్లలు తమ దగ్గరే పెరిగి, చదువుకుని, పై చదువులకి వెళ్తూ ఉన్నారనీ జవహర్ చెప్పారు. ఆ పిల్లల ఆలనా, పాలనా తామెవ్వరికీ అప్పగించలేదనీ, తమ కుటుంబమే చూసుకుంటూ ఉంటూందనీ, ప్రభుత్వం నుంచి కనీసం మాట సాయం కూడా తీసుకోలేదనీ చెప్పారు.
‘ఇప్పుడంటే ఇక్కడ గ్రానైట్ పడి చీమకుర్తి ఇట్లా కనబడుతోందిగానీ, ఇదంతా చాలా చాలా వెనకబడినప్రాంతమే కదా. ఈ వైకల్యానికి చాలావరకూ మేనరికాలే కారణం’ అన్నారాయన.
‘ఇటునుంచి ఎటు వెళ్ళినా ఫ్లోరైడ్ నీళ్ళు. మెడలు తిప్పలేరు. కీళ్ళు పనిచెయ్యవు. చిన్నవయసులోనే వృద్ధాప్యం ముంచుకొస్తుంది’ అని కూడా అన్నారాయన.
డా.జవహర్ చేస్తున్న మరొక గొప్ప ప్రయత్నం, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనం అమలు చెయ్యడం. బహుశా దేశంలోనే కళాశాల స్థాయిలో మధ్యాహ్న భోజనం అమలు చేస్తున్న చోటు అదేననుకుంటాను. దాంతో 40 మంది మాత్రమే పిల్లలుండి మూసేస్తారనుకున్న కాలేజి ఇప్పుడు 250 మంది పిల్లలతో కలకల్లాడుతూందన్నారు. బియ్యంకాక, తక్కిన ఖర్చుల మీద నెలకి 60-70 వేలదాకా అవుతుందనీ, అదంతా అయిదారుగురు మిత్రులు భరిస్తూ ఉన్నారనీ చెప్పారు.
ఆ పిల్లలతో మాట్లాడుతూండగా మాఘ చంద్రుడు ఉదయిస్తూన్నాడు. అంతదాకా చీకటి పొరకమ్మినప్రాంగణం మీద వెండి రాలడం మొదలయ్యింది.
‘మా పిల్లలు పాటలు పాడతారు, వింటారా’ అన్నారు జవహర్. ఆ హాస్టలు పైకప్పుమీంచి రాలుతున్న వెన్నెల్లో ఒక పిల్లవాడు ‘అమ్మా నను కన్నందుకు వందనాలు..’ అంటో పాడటం మొదలుపెట్టాడు. నా హృదయం చలించిపోయింది. ఆ తల్లి, ఆమె ఎక్కడ ఉందోగాని, ఈపాట వింటే కళ్ళనీళ్ళ పర్యంతమైపోతుందికదా అనిపించింది.
అక్కణ్ణుంచి మేమా రాత్రి పడమటి నాయుడి పాలేనికి వెళ్ళాం. మంచికంటి వెంకటేశ్వర రెడ్డి గ్రామీణబాలబాలికల్తో విద్యారంగంలో చేపట్టిన అద్భుతమైన ప్రయోగ శాల.
గత శతాబ్దంలో యూరోప్ లో, మొదటి ప్రపంచ యుద్ధం సంభవించినప్పుడూ, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతా కూడా చాలా మంది విద్యావేత్తలు గొప్ప ప్రయోగాలు చేపట్టారు. యుద్ధం వల్ల మానసికంగా గాయపడ్డ చిన్నారులకోసం పాఠశాలలు తెరిచి విద్య నేర్పడంలో ఎన్నో కొత్త పోకడలు పోయారు. అలాగే, రష్యాలో టాల్ స్టాయి, మకరెంకో, లూనాషార్కీ, భారతదేశంలో టాగోర్, గాంధీ, కృష్ణమూర్తి, ఆఫ్రికాలో జోమోకెన్యెట్టా, లాటిన్ అమెరికాలో జోస్ మార్టివంటివారుకూడా చాలా ప్రయోగాలు చేసారు. ఆ ప్రయోగాలగురించి వినడం, చదవడం దానికదే గొప్ప విద్య. తెలుగు నేలమీద కూడా అటువంటి ప్రయోగాలుచేస్తున్నవారు లేకపోలేదు. కాని వారి ప్రయోగాల గురించి మనకే తెలియదు, ఇక తక్కినప్రపంచానికి తెలిసే అవకాశమెక్కడిది?
‘అరుగులన్నిటిలోను ఏ అరుగు మేలు’ అని అడిగితే ‘పండితులు కూర్చుండు మా అరుగు మేలు’ అన్నట్టు, పోరాటాలన్నిటిలోనూ, ఏ పోరాటం గొప్పదని అడిగితే, విద్యకి సంబంధించిన పోరాటాలూ, ప్రయత్నాలే సర్వోన్నతమైనవని నమ్ముతాను నేను. ఎందుకనో తెలుగు నేల ఇంకా రాజకీయ పోరాటాలే ఎక్కువ ఫలప్రదాలని నమ్ముతూ ఉంది. ప్రతి రాజకీయ పోరాటమూ, దాని వెనక ఒక విద్యా సంస్కరణ లేకపోతే, అంతిమంగా దారుణవైఫల్యాన్ని చవిచూస్తుందని నేను స్పష్టంగా తెలుసుకున్నాను.
1857 లో దేశమంతా మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో తలమున్కలై ఉంటే, ఈశ్వర చంద్ర విద్యాసాగర్ భుజాన ఒక సంచీ తగిలించుకుని బర్డ్వాన్, మిడ్నపూర్, చిట్టగాంగుల్లో బాలికల కోసం పాఠశాలలు తెరవడంలో నిమగ్నుడైపోయాడు. భారత జాతీయ కాంగ్రెస్ విప్లవాత్మక జాతీయ పోరాటాన్ని నడుపుతుంటే, స్వామి వివేకానందులు మాస్ ఎడ్యుకేషన్ గురించి దిక్కులు పిక్కటిల్లేలా ఘోషిస్తూ ఉన్నారు. దండకారణ్యమంతా గిరిజన తిరుగుబాట్లతో రక్తసిక్తమవుతుంటే, గిడుగు సవరభాషలో వాచకాలు రాసి, గిరిజన భాషమాధ్యమంలో ప్రపంచంలోనే తొలిసారి పాఠాలు చెప్తూ ఉన్నాడు. వారు నిజమైన విప్లవకారులు. వారు నిజమైన వైతాళికులు. ఆ సంగతి తెలిసినవాడు కనుకనే గాంధీజీ కూడా తన జీవిత చరమాంకంలో ‘నయీ తాలీం’ కి అంకురార్పణ చేసాడు.
ఇప్పుడు మన సమాజంలో, ముఖ్యంగా మన గ్రామాల్లో నెలకొన్న వాతావరణం యుద్ధవాతావరణంలాంటిదే. ఒక విధంగా చెప్పాలంటే అంతకన్నా తీవ్రమైనదీ,దారుణమైనదీనూ. ధనికులు మరింత ధనికులుగా,పేదలు మరింత నిస్సహాయులుగా మారుతున్న ఈ కాలం భారతదేశాన్ని ఈస్టిండియా కంపెనీ దోచుకున్న కాలంకన్నా భీకరమైనకాలం. ఈ పరిస్థితిని ఎత్తి చూపడానికి, ధిక్కరించడానికీ, మార్చడానికి ఎందరో ఉన్నారు, రాజకీయనాయకులు, పాత్రికేయులు, విప్లవకారులు,కవులు, రచయితలు- కాని కనబడనిదల్లా, ఒక విద్యాసాగర్,ఒక గిడుగు, ఒక గిజుభాయి మాత్రమే.
అందుకనే, ఎవరు విద్యారంగంలో మౌలిక ప్రయోగాలు చేస్తుంటే వాళ్ళనే నా అభిమాన హీరోలుగా భావిస్తున్నాను. వాళ్ళెక్కడున్నా పోయి పరిచయం చేసుకోవాలనీ, వారి ప్రయోగాల్నీ, ప్రయత్నాల్నీ స్వయంగా పరిశీలించాలనీ, నిశితంగా నిగ్గు తేల్చుకోవాలనీ అనుకుంటాను.
ఇప్పుడు చీమకుర్తి మండలంలో పడమటి నాయుడిపాలేని కి కూడా అందుకే వెళ్ళాను. అక్కడ మంచికంటి వెంకటేశ్వరరెడ్డి అనే ఒక ఉపాధ్యాయుడు ఎట్లాంటి ప్రయోగాలు చేస్తూ ఉన్నాడో తెలుసుకోవాలనుకున్నవాళ్ళు మంచికంటిరాసిన ‘శాంతివనం: పిల్లలు, అనుభవాలు, ప్రయోగాలు’ (2014) అనే పుస్తకం చదవాలి.
అతడి ప్రయత్నాల వెనక డాక్టర్ కొర్రపాటి సుధాకర్ అనే ఒక ఇ.ఎన్.టి సర్జన్ ఉన్నారు. (ఆయన మా కొర్రపాటి ఆదిత్యకి బాబాయి అని తెలిసినప్పుడు నాకెంత సంతోషమనిపించిందో).
అక్కడ ఉన్నంతసేపూ, అతడి ఇంట్లో అతడితోపాటే ఉంటున్నపిల్లల్తో గడిపేను. వాళ్ళు వేసిన బొమ్మలు, రాసిన కవితలు చూసాను, విన్నాను, ఒళ్ళంతా ఉత్సాహం చిమ్ముతున్న దీపకళికలు వాళ్ళు. ఆ కాంతిని తక్కిన ప్రపంచం చూడటానికి ఎన్ని కాంతిసంవత్సరాలు పడుతుందో!
24-2-2016