ఇక్కడ ఆకాశం మరీ పొద్దున్నే తెరుచుకుంటుంది. రాత్రంతా చినుకుతూనే ఉన్నా, ఆకాశమంతా కరిగిపోయి ఉన్నా కూడా, తడిసిపోయిన తెరవెనకనుంచి వెలుతురు ఆవరిస్తూనే ఉంది. పొలాలమీద, తాటిచెట్లమీదా వంగిన ముసురుమబ్బు.
జీవితంలో తెరుచుకుంటున్న కొత్త పుటల్లో పాతలిపిని, ఒకప్పుడు నేర్చుకున్న అక్షరాల్నీ గుర్తుపట్టే ప్రయత్నం చేస్తున్నాను.
మనందరి జీవితాల్లో కొత్త దశ సాధారణంగా వానాకాలమే మొదలవుతుంది. తొలకరి చినుకులు పడుతూండగానే మన ఊళ్ళల్లో బళ్ళు తెరుస్తారు. ఆ చిరుజల్లుల్లో తడుస్తూనే కొత్తలాగూ చొక్కా తొడుక్కుని, కొత్త పలకా బలపంతో మనల్ని మన నాన్ననో, అమ్మనో చేయిపట్టుకు తీసుకువెళ్ళి బళ్ళో వేస్తారు. ఒకప్పుడు పల్లెల్లో పుట్టినతేదీలు రాసుకోవడం తెలియని చాలా కుటుంబాల్లో పిల్లల పుట్టిన రోజు దాదాపుగా జూన్ 12 లేదా, 30 వతేదీలోగా ఎప్పుడు బళ్ళో వేస్తే ఆ రోజే.
నాకిప్పటికీ, ఎప్పటికీ గుర్తే. 1972 ఆగష్టులో నన్ను తాడికొండ స్కూల్లో జాయిన్ చేసారు. ఆ ఊరెక్కడుందో,ఎలా వెళ్ళాలో ఎవరికీ తెలీదు. మా నాన్నగారికి బహుశా గుంటూరుదాకా తెలుసు.అక్కణ్ణుంచి వెళ్ళడమెలానో తెలీదు.అంతదూరం పిల్లవాణ్ణి ఎందుకు పంపుతావు, పంపొద్దని మా నాన్నగారిని దూరపు బంధువులు, దగ్గరి బంధువులూ అందరూ మందలించారు, హితవు చెప్పారు.అసలు అంతదూరం వెళ్ళడానికి ఎంత ఖర్చవుతుందో తెలియదు. అంత డబ్బు ఎక్కణ్ణుంచి తేవాలో కూడా తెలియదు. ఆ రోజుల్లో పల్లెల్లో తినడానికి గింజలయితే ఉండేవిగాని, ఎవరి చేతుల్లోనూ చిల్లి గవ్వ కూడా ఉండేది కాదు. నాకా బాధలేవీ తెలియవు, అర్థమయ్యే వయసు కూడా కాదు. మా నాన్న నన్ను అక్కడికి వెళ్ళి చదువుకోవడం నీకిష్టమేనా అని కూడా అడిగినట్టు గుర్తు లేదు.
సమితి స్థాయిలోనూ, జిల్లా స్థాయిలోనూ రెండంచెల్లో జరిగిన పరీక్ష. తొమ్మిది జిల్లాల్లో 30 మందిని ఎంపిక చేస్తే అందులో నేనూ ఒకణ్ణి. ఎక్కడో స్కూల్లో చేరడానికి పరీక్ష పాసయ్యాను, అక్కడ చేరాలి, చదువుకోవాలి-ఇంతే నాకు తెలిసింది.
ఆ పరీక్ష జిల్లా స్థాయిలో రాయడానికి మా అన్నయ్య నన్ను కాకినాడ తీసుకువెళ్ళాడు. ఆ పరీక్ష ఎక్కడ రాసానో, ఏం రాసానో గుర్తు లేదు, కాని గుర్తున్నదల్లా, పరీక్ష అయిన సాయంకాలం నన్ను మా అన్నయ్య కల్పన థియేటర్లో (ఇప్పుడా థియేటర్ అదృశ్యమైపోయింది) పాతాళభైరవి సినిమాకి తీసుకువెళ్ళాడు. సన్నని జల్లుల మధ్య సినిమాహాల్లో అడుగుపెట్టేముందు వేడి వేడి మొక్కజొన్న పొత్తులు కొన్నాడు. ఆ సినిమా చూసి రాత్రి మేమిద్దరమే పి.ఆర్. గవర్న్మెంటు కాలేజి ప్రాంగణం లోంచి మా బంధువుల ఇంటికి వెళ్తుంటే, ప్రతి చీకటి పొదలోంచీ ‘జై పాతాళభైరవీ’ అన్న పిలుపు వినిపించడం, నేను భయంతో వణికిపోతుంటే మా అన్నయ్య నన్ను ఎత్తుకోవడం కూడా నాకు గుర్తే.
నన్ను స్కూలో జాయిన్ చేయడానికి ముందు ఎంత చర్చ జరిగిందో, ఎంత మథన పడ్డారో నాకు గుర్తులేదు గానీ, ఒక దృశ్యం ఇప్పటికీ గుర్తుంది. మా ఊళ్ళో ఒక కంసాలి కుటుంబముండేది. ఎవరికైనా అప్పు కావాలంటే వాళ్ళే దిక్కు. ఆ కుటుంబపెద్ద వీర్రాజు అనే ఆమె. ఆమె మా ఇంటికొచ్చిందొక రోజు. ఆమె వీథరుగు మీద కూచుంది. మా బామ్మగారూ, మా నాన్నగారూ, మా అమ్మా ఇంకా ఎవరెవరో ఉన్నారు, మా బామ్మగారి వెండిచెంబు ఒకటి ఆమె ముందు పెట్టారు, బహుశా అది మా బామ్మగారి తండ్రి ఆమెకి ఇచ్చి ఉంటాడు. ఆమె తన జీవితమంతా ఆ గుర్తుని భద్రంగా దాచుకోవాలనుకుని ఉంటారు. దాన్ని బయటికి తీయవలసిన అవసరం వస్తుందని కూడా ఆమె ఊహించి ఉండరు. కాని ఆ రోజు తన మనవడి చదువుకోసం ఆమె దాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధపడ్డారు. ఆ వడ్డీవ్యాపారి దాన్ని బెరుగ్గా చేతుల్లోకి తీసుకుని తడిమి చూడడం నాకు గుర్తుంది. తాను కరణంగారికి అప్పివ్వడానికి వచ్చినా, తాను అప్పిస్తున్నది కరణంగారికన్న బెదురు ఆమెలో స్పష్టంగా కనబడింది. ఆ వెండి చెంబు ఆమె తీసుకువెళ్ళడం గుర్తుంది. కాని మళ్ళా ఆ చెంబు మా ఇంటికి తిరిగిరాలేదనే అనుకుంటాను.
ఏళ్ళ తరువాత, కలాం ఆత్మకథలో తాను ఇంజనీరింగ్ లో చేరడానికి తన సోదరి జొహరా తన జవాహరీ అమ్మిపెట్టిందని కళ్ళనీళ్ళ పర్యంతం కృతజ్ఞతతో రాసింది చదివినప్పుడు, దాన్ని తెలుగు చేస్తున్నప్పుడు నా చిన్నప్పటి ఆ సంఘటన కూడా నాకు గుర్తొచ్చింది. నన్ను నేను కలాంతో పోల్చుకోలేనుగానీ, ఆ సోదరి త్యాగం ఎంత విలువైనదో మా బామ్మగారి త్యాగం కూడా అంతే మరవలేనిదనిపించింది.తన జీవితమంతా ఆ సోదరికి తానేమి చెయ్యగలననే కలాం తపించాడు. ఆ సోదరి ఋణం ఎప్పటికీ తీర్చగలిగేది కాదు గానీ, ఆ సోదరి ఇంట్లో వివాహానికి కలాం వెళ్ళలేని పరిస్థితి ఎదురయినప్పుడు భగవంతుడు అద్భుతం చేసి మరీ కలాం ని ఆ పెళ్ళికి తీసుకువెళ్ళిన సంగతి మనకి తెలుసు.
నేను మా బామ్మగారికి ఋణపడ్డాను. ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి దేవుడు నాకే అవకాశమూ ఇవ్వలేదు. బహుశా ఆ ఋణగ్రస్తత కోసమైనా నేను మరో జన్మ ఎత్తవలసి ఉంటుందేమో. కాని మా బామ్మగారికి నేను పడ్డ మరో ఋణం మరో విధంగా తీర్చుకున్నాను.
ఆమె నాకు కవిత్వం పరిచయం చేసిన తొలిగురువు. నా పసితనంలో ఆమె ఆ కొండపల్లెలో పోతనగారి భాగవతంనుంచి ‘గజేంద్ర మోక్షం’, ‘రుక్మిణీ కల్యాణం’ నాతో వల్లెవేయించారు. ‘కమలాక్షునర్చించు కరములు కరములు’, ‘ఏనీ గుణములు కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపోవు’, ‘కలుగడే నా పాలి కలిమి సందేహింప కలిమి లేములు లేక కలుగువాడు’- ఎంత పుణ్యం చేసుకుంటే ఈ ద్వారంగుండా సాహిత్య ప్రపంచంలోకి ప్రవేశించడం సాధ్యపడుతుంది!
నా మొదటి కవితాసంపుటి ‘నిర్వికల్ప సంగీతం’ (1986) వెలువరించినప్పుడు ఆ పుస్తకం ఆమె చేతులమీదుగానే ఆవిష్కారం కావాలని కోరుకున్నాను. ఒకవైపు మల్లంపల్లి శరభయ్యగారు, మరొకవైపు ఆర్.ఎస్.సుదర్శనంగారు కూర్చుని ఉండగా ఆమె నన్ను లోకానికి ఒక కవిగా పరిచయం చేసిన ఆ దృశ్యం నా మనసులో ఎప్పటికీ చెక్కు చెదరదు.
మబ్బు పట్టిన ఈ జూన్ ఆకాశాన్ని చూడగానే ఈ తలపులన్నీ తోసుకొస్తున్నాయి. కట్టుకోవడానికి రెండు జతలు కూడా లేని ఆ పేద పసి జీవితంలో ప్రయాణానికి ఉతికిన జతలు ఆరకపోతే, ఆ తడిగుడ్డల్ని అట్లానే నీళ్ళపొయ్యిదగ్గర వెచ్చబెడుతున్న మా అమ్మకూడా నా కళ్ళముందు కనబడుతున్నది…
ఏమి సాధించాను ఈ జీవితంలో? వాళ్ళ ఋణం ఎప్పటికి తీర్చగలుగుతాను? అసలు తీర్చుకోగలనా?
29-6-2016