తెలంగాణా టూరిజం వారు హైదరాబాదు మెట్రొపొలిస్ సందర్భంగా వారం రోజులపాటు చిత్రలేఖన శిబిరం నిర్వహిస్తున్నారు. తారామతి-బారాదరిలో సుమారు 90 మంది తెలంగాణా చిత్రకారులు రెండు విడతలుగా పాల్గొన్న ఈ శిబిరానికి రెండుసార్లు వెళ్ళాను. అంతమంది చిత్రకారులు ఒక్కచోట చేరి వర్ణచిత్రాలు గియ్యడంలో ఏదో గొప్ప శక్తి ఉత్పత్తి అవుతున్నట్టనిపించింది.
గత ముఫ్ఫై నలభయ్యేళ్ళలో మరీ ముఖ్యంగా గత పది పదిహేనేళ్ళుగా తెలంగాణాలో చిత్రలేఖనం పునరుజ్జీవనం పొందుతున్నట్టనిపిస్తున్నది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కూడా కొందరు చిత్రలేఖకులు నాకు తెలుసుగానీ, ఇంత సామూహికంగానూ, ఇంత స్ఫుటంగానూ అక్కడ చిత్రలేఖనం కనిపించడం లేదు. 1950 తరువాత ఆంధ్రప్రాంతంలో ఒక్క చిత్రలేఖనమేమిటి, అన్ని కళలూ చలనచిత్రరంగానికి తమను తాము అమ్మేసుకున్నాయి. కాని ఇక్కడ తెలంగాణాలో చిత్రలేఖనం ఇంకా సజీవంగా ఉండటమే కాకుండా ప్రతి ఏడూ కొత్త స్ఫూర్తితో వికసిస్తూ ఉండానికి కారణమేమైఉండవచ్చు?
ఇందుకు రెండు కారణాలు తోస్తున్నాయి. మొదటిది, తెలంగాణా పల్లెలకీ, హైదరాబాదుకీ మధ్య ఉన్న వైరుధ్యం చాలా ప్రస్ఫుటం గా ఉండటం. ఆలేరునుంచో, అదిలాబాదునుంచో, సిద్ధిపేటనుంచో హైదరాబాదు వచ్చిన యువతీయువకులకీ తమ పల్లెలకీ, నగరానికీమధ్య ఒక్కసారిగా కొట్టొచ్చినట్టు కనబడే జీవనశైలీ వైరుధ్యం చాలాసార్లు అర్థం చేసుకోవడానికీ, అరిగింగించుకోవడానికీ కష్టంగా ఉండటం. అందుకని ఆ యువతీ యువకులు అయితే తమ తమ పల్లెజీవితాన్ని అంతే పచ్చగానూ, అంతే ప్రాకృతికంగానైనా చిత్రిస్తున్నారు, లేదా నగరజీవితాన్ని అంత డిస్టార్షన్ తోనూ, అంత యాబ్ స్ట్రాక్ట్ గానూ చిత్రిస్తున్నారు. ఆంధ్రప్రాంతంలో పూర్తిగా నగరీకరణచెందిన నగరమేదీ లేదు. అక్కడి పట్టణాలింకా పెద్దగ్రామాల్లానే కనిపిస్తున్నాయి. అక్కడి పల్లెలనుంచి పట్టణాలకు వచ్చే యువతకి చెప్పుకోదగ్గ culture shock ఏదీ అనుభవానికి వస్తుందనుకోను.
ఇక రెండవ కారణం గురించి మాట్లాడాలంటే ప్రపంచవ్యాప్తంగా నేడు చిత్రలేఖనం పరిస్థితి గురించి కొంత ఆలోచించవలసి ఉంటుంది. ప్రస్తుత ప్రపంచంలో చిత్రకళ పరిస్థితి గురించి సాకల్యంగా సమీక్షించిన టోనీ గాడ్ ఫ్రై తన Painting Today (ఫైడాన్, 2009) కి రాసుకున్న ముందుమాటలో చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు.
ఇరవయ్యవ శతాబ్ది ప్రారంభంలో నీషే దేవుడు మరణించాడని అన్నమాట మనకు తెలుసు. 1950 లో శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యతాపత్రం ఇస్తూ చలంగారు కవిత్వపు కాలం అంతమయింది అని రాసారు. 1960 ల తరువాత డెరిడా తత్త్వశాస్త్రం మరణించిందని రాసాడు. ఆ దారిలోనే సుప్రసిద్ధ కళావిమర్శకులు కూడా చిత్రకళ మరణించిందని రాసారని చెప్తాడు గాడ్ ప్రై.
బోరిస్ గ్రోయ్స్ అనే ఒక కళావిమర్శకుడు 1998 లో ఇలా రాసాడట:
‘పందొమ్మిదో శతాబ్దంలో చిత్రకళ నిర్వహించగలిగిన పాత్రలాంటిది నిర్వహించే పరిస్థితిలో సమకాలిక చిత్రకళ ఇంకెంతమాత్రం లేదు. అంటే అది ప్రపంచం గురించి ఎటువంటి భావవ్యక్తీకరణా చెయ్యగలిగే స్థితిలో లేదు. అంతర్ముఖంగానూ, స్వీయవిధ్వంసకరంగానూ వికసించిన కళా ఉద్యమాలన్నీ చివరికి తమ వస్తుగత వాస్తవికతకీ (thingness), తమ నిర్మాణాలకే పరిమితమైపోయాయి తప్ప ప్రపంచాన్ని చిత్రీకరించగలిగే సామర్థ్యాన్ని చూపించలేకపోయాయి.’
చిత్రకళ మరణించిందని చెప్పేవాళ్ళు దాదాపుగా 1968 ని మరణసంవత్సరంగా నిర్ధారిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డ కాలం, వియత్నాంలో అమెరికా ఓడిపోయిన సంవత్సరం, మార్టిన్ లూథర్ కింగ్ హత్యకు గురికాబడ్డ సమయం, రష్యా చెకొస్లవేకియామీద దండెత్తిన సంవత్సరం. ఆ ఏడాది సిగ్మర్ పొల్కె అనే చిత్రకారుడు Durer’s Hare అనే చిత్రాన్ని చిత్రించాడు. ఆల్బెర్ట్ డ్యూరర్ అనే రినైజాన్సు కాలం నాటి చిత్రకారుడు చిత్రించిన కుందేలు బొమ్మ (1502) కి అనుకరణ అది. (రెండు బొమ్మలూ కింద చూడవచ్చు).
దాని గురించి గాడ్ ఫ్రై ఇలా రాస్తున్నాడు (పే.8-9):
‘మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలో ఒక సౌందర్య స్పృహ: డ్యూరర్ నీటిరంగుల్లో చిత్రించిన కుందేలు పిల్ల బొమ్మని చూసినప్పుడు మనకి కలిగే భావన ఇది. ఆ కుందేలు ఒంటిమీది ప్రతి రోమాన్నీ అతడెంత నిశితంగా చిత్రించాడో చూసి మనం ఆశ్చర్యానికీ ఆనందానికీ లోనుకాకుండా ఉండలేం. రాఫేల్ చిత్రాల్నీ, మాటిస్సే చిత్రాల్నీ చూసినప్పుడు కూడా మనకు కలిగేదిదే. జీవనవిలాససంతోషం. వాటిని చూస్తేనే మనసంతా సంతృప్తితో నిండిపోతుంది. కారవగ్గియోనో, వాన్ గోనో చూసినప్పుడు కలిగేది కూడా ఇదే. మనం జీవిస్తున్న ఈ ప్రపంచంలోనే వాళ్ళు కూడా జీవించారనీ, ఈ ప్రపంచాన్ని ఎంతో పట్టించుకున్నారనిన్నీ. ఈ ప్రపంచాన్ని మనమెట్లా చూస్తున్నామో దాన్నే డ్యూరర్ వ్యక్తీకరిస్తున్నాడు. అతడి సాంకేతిక ప్రజ్ఞకీ, దర్శనానికీ ముగ్ధులమై మనం అతణ్ణి అంగీకరించకుండా ఉండలేకపోతున్నాం.’
‘కాని మన కాలంలో రూపొందుతున్న చిత్రాల్ని చూడండి. సరిగ్గా ఈ సంతోషాన్నే వాటినుంచి మనం పొందలేకపోతున్నాం. ఉదాహరణకి జర్మన్ చిత్రకారుడు పోల్కె చిత్రించిన కుందేలు బొమ్మ చూడండి. అందులో అతడు డ్యూరర్ కుందేలునీ, డ్యూరర్ సంతకాన్నీ కాపీ చేసాడు. మిల్లు మీద తయారైన కాన్వాసు గుడ్డమీద కొంత తెల్లరంగు పులిమి ఆ రంగు మీద అతడా గీతలు గీసాడు. అంటే ఇక్కడ మూడు రకాల ముద్రలు కనిపిస్తున్నాయి: ఒక అత్యుత్తమ జర్మన్ కళాకారుడి చిత్రలేఖనం, సంతకాల నకలు, ఆ కాలం నాటి అత్యున్నత చిత్రకళా ఉద్యమమైన యాబ్ స్ట్రాక్ట్ ఎక్ష్ప్రెషనిజం ని తలపించే విధంగా కొన్ని గీతలు, కన్స్యుమరిజానికీ, పాప్ ఆర్ట్ కీ ప్రతీకగా మారిన 60 ల నాటి వినియోగదార సంస్కృతిని ప్రతిబింబించే మిల్లుగుడ్డ. కాబట్టి ఆ కాలం నాటి చిత్రకారుడికి అందుబాటులో ఉన్న నాలుగు ప్రత్యామ్నాయాల్లో పొల్కె చిత్రం మూడు ప్రత్యామ్నాయాలనీ స్ఫురింపచేస్తూ ఉన్నది: పాప్, యాబ్ స్ట్రాక్షన్, రూపలేఖనసంప్రదాయానికి నివాళి.’
‘అయితే పొల్కే ఈ ప్రత్యామ్నాయాల్ని నిజంగా పరిగణిస్తున్నాడా లేకపోతే వేళాకోళమాడుతున్నాడా? ఏమో బహుశా అతడా గుడ్డను ఇష్టంతోనే స్వీకరించిఉండవచ్చు. ఆ గీతలు కూడా నిజాయితీగా గీసినవే అయిఉండవచ్చు. బహుశా డ్యురర్ బొమ్మను అతడు తిరిగి చిత్రించడంలో గతించిపోయిన ఒక మహాసంప్రదాయం పట్ల ఒక శ్రద్ధాంజలి ఉండివుండవచ్చు. అయితే ఈ వివిధాంశాల్ని మనమెట్లా అర్థం చేసుకోవాలన్నదానిపట్ల మనకేమీ సూచనలు లేవు. ఇదెట్లా ఉందంటే మనకొక వంటల పుస్తకం దొరికి అందులో వివిధ పదార్థాల గురించి మాత్రమే రాసి వాటితో ఎట్లా వంటచెయ్యాలో చెప్పకుండా వదిలిపెట్టేసినట్టుంది. ఒక్కమాటలో చెప్పాలంటే డ్యూరర్ చిత్రించిన బొమ్మలాగా కాకుండా పొల్కె చిత్రించిన ఒక భావప్రకటనగా కాక ఒక ప్రశ్నగా నిలబడుతున్నది: చిత్రలేఖనమంటే ఏమిటి? మిల్లులో తయారయ్యే వస్తువుల పట్ల మనమెట్లా స్పందించాలి? యాబ్ స్ట్రాక్ట్ చిత్రాలకు భావావేశాలు ఉంటాయా? మరొక చిత్రకారుడి ముద్రను దొంగిలించడమో లేదా కైవసం చేసుకోవచ్చునా? .. ‘
‘డ్యూరర్ చిత్రంలో కనవచ్చే దర్శనం కానీ, సాంకేతిక ప్రజ్ఞ కానీ పొల్కే చిత్రంలో పూర్తిగా మృగ్యం. కానీ ఈ చిత్రాన్నే కనుక వేలంపాటలో పెడితే నేడు మిలియన్ డాలర్లకు పైన విలువ చేస్తుంది. సమకాలిక చిత్రాల్ని కొనుగోలు చేసే ఏ మ్యూజియమైనా ఈ బొమ్మను సొంతం చేసుకోవడమంటే ఎగిరి గెంతేస్తుంది. ఒకవేళ ఈ చిత్రాన్నే కనుక మనం ఉత్తమ చిత్రం అనవలసి వస్తే, అప్పుడు మనం డ్యూరర్ చిత్రాల్ని ఏ ప్రమాణాలతో కొలుస్తున్నామో ఆ ప్రమాణాలకు విరుద్ధమైన ప్రమాణాలను అనుసరిస్తున్నామన్నమాట. మరీ విపరీతంగా చెప్పాలంటే ఈ చిత్రం అసలు చిత్రకళ మొత్తం దివాలాతీసినదానికి గుర్తుగా నిలబడుతుందనాలి. లేదా చిత్రకారుడికి నేడు లభ్యంగా ఉన్న నాలుగవ ప్రత్యామ్నాయానికి ఈ చిత్రం ఒక సందర్భాన్నిచ్చిందనాలి. అదేమంటే చిత్రలేఖనాన్ని కాలం చెల్లిన ఒక కళగా వదిలిపెట్టి చిత్రకారుడు conceptual artist గా మారడం.’
గాడ్ ఫ్రై రాసిన పై వాక్యాల్ని అంత సుదీర్ఘంగా ఎందుకు ఉల్లేఖించకుండా ఉండలేకపోయానంటే, సమకాలిక చిత్రకళని అర్థం చేసుకోవడానికి ఆ వాక్యాలొక మెలకువనిస్తున్నాయి.
తత్త్వశాస్త్రం మరణించిందనేది పాక్షిక సత్యం మాత్రమేననీ, ఒక సమాధానంగా అది మరణించినప్పటికీ, ఒక ప్రశ్నగా బతికే ఉందనీ డెరిడా చెప్పిన వాక్యాలు గుర్తొస్తున్నాయి. నేడు చిత్రకళ ప్రపంచాన్ని పునఃప్రతిఫలించే representational art గా విఫలమయ్యింది. కంటికి కనిపించే వాస్తవాన్ని ఉన్నదున్నట్టుగా చిత్రీకరించడంలో, ఫొటోగ్రఫీ, వీడియో ఇతర మాధ్యమాల ముందు చిత్రలేఖనం ఓడిపోయింది. ఆ విధంగా చిత్రలేఖనం మరణించింది, సందేహం లేదు, కాని సరిగ్గా అప్పుడే, బహుశా, 1968 లోనే చిత్రలేఖనం మళ్ళా కొత్తగా ప్రభవించింది. దీన్నే గాడ్ ఫ్రై తన ముందుమాట ముగిస్తూ ఇలా రాసాడు:
‘1968 లో చిత్రలేఖనం మరణించిందనడం సరికాదు, నిజానికి అప్పుడు జరిగిందల్లా ఒక సుదీర్ఘసంప్రదాయానికి దారిమూసుకుపోవడమే. ఆ సంప్రదాయం స్థానంలో ఇతరసంప్రదాయాలు, ఇతర ప్రత్యామ్నాయాలు ముందుకొచ్చాయనాలి. 1968 సంక్షోభాల సంవత్సరం. చీనా భాషలో సంక్షోభానికి అవకాశమనే అర్థం కూడా ఉంది. కాబట్టి 1968 కొత్త అవకాశాల సంవత్సరం కూడా.’
వివిధ సమకాలిక చిత్రకళారీతుల్ని సమీక్షిస్తూ గాడ్ ఫ్రై చెప్పినదేమిటంటే 1968 దాకా చిత్రకళ అంటే రినైజాన్సుతో మొదలైన ఐరోపీయ చిత్రకళని మాత్రమే గుర్తించారనీ, అది రేఖీయమార్గంలో పురోగమిస్తూ వచ్చినట్టుగా అర్థం చేసుకున్నారనీ, కాని ఇప్పుడు చిత్రకళ అంటే ఒక దేశానికో, ఒక జాతికో మాత్రమే పరిమితమైన వ్యవహారం కాదనీ, అనేకమంది వ్యక్తులు తాము విడివిడిగా చూస్తున్న తమ తమ వ్యక్తిగత ప్రపంచాల దర్శనమనీ. చిత్రలేఖనమంటే ప్రపంచాన్ని తిరిగి చిత్రించడమే కాదు, తమదైన ఒక ప్రపంచాన్ని సృష్టించడం కూడా. ప్రాతినిథ్యం వహించడమే కాదు, పునర్నిర్మించడం కూడా.
తెలంగాణా చిత్రకారుల శిబిరాన్ని చూస్తే నాకు అనిపించిందిదే. హైదరాబాదు రాగానే వారి ప్రపంచం కూలిపోయిన అనుభవానికి లోనవుతున్నారు. ఆ కూలిపోయిన తమ స్వీయప్రపంచ శకలాల్ని మళ్ళా అతికి మనముందొక వ్యక్తిగత ప్రపంచాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఆ రకంగా వారు సామూహికంగా ఒక తెలంగాణాకి ప్రాతినిథ్యం వహించడమే కాదు, ప్రతి ఒక్కరూ తమదైన తెలంగాణాని విడివిడిగా దర్శిస్తున్నారు, మనతో దర్శింపచేస్తున్నారు కూడా.
5-10-2014
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు