పదిరోజుల కిందట గణేశ్వర రావు గారు వాన్ గో చిత్రించిన ‘పొద్దుతిరుగుడు పూలు’ చిత్రాన్ని పరిచయం చేసినప్పుడు, ఒక మిత్రుడు, ఆ చిత్రంలో ప్రపంచ ప్రసిద్ధి చెందేటంత ప్రత్యేకత ఏమున్నదో తెలియడం లేదని రాసాడు. ఆ మాటలకి స్పందించి అక్కడే రెండు వాక్యాలు రాయాలనుకున్నాను, కానీ, నా ఆలోచనలు మరింత వివరంగా రాయాలనిపించింది.
మనం ఒక కవిత చదివినట్టుగా, కథ చదివినట్టుగా, చిత్రలేఖనాన్ని కూడా చదవచ్చు. అయితే, అలా చదవడమెట్లానో మనకి నేర్పే వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ మాటకొస్తే, ఒక కవిత నెట్లా చదవాలో, ఒక కథనెట్లా చదవాలో కూడా మనకి చెప్పేవాళ్ళు చాలా అరుదు.
గత పదేళ్ళుగా చిత్రలేఖనాల్ని, ముఖ్యంగా ఐరోపీయ చిత్రలేఖనాల్ని అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నిస్తూన్నాను. చాలా చదివిన మీదట నాకు అర్థమయిందేమంటే, ఒక చిత్రలేఖన ప్రతిభ, ఆ చిత్రంలోని రేఖల్లో, రంగుల్లో, కంపొజిషన్ లో, దాని చారిత్రిక సందర్భంలో సగం లేదా సగం కన్నా తక్కువ మాత్రమే ఉంటుంది. అనేకమంది మనుషుల మధ్య ఎవరో ఒకరే మనదృష్టిని ఆకర్షిచడానికి అతడి వ్యక్తిత్వం ఎట్లా కారణమో, ఒక మూజియంలో, మనల్ని దగ్గరగా లాక్కునే ఒక చిత్రలేఖనమహిమ , చాలావరకు, ఆ చిత్రకారుడిదే అయిన అద్వితీయ జీవలక్షణంలో ఉంటుంది. మన సంతకంలో మన వ్యక్తిత్వం తాలూకు డి.ఎన్.ఎ ఎట్లా ప్రతిబింబిస్తుందో, గొప్ప చిత్రలేఖనాల్లో, ఆ చిత్రకారుడి వ్యక్తిత్వమట్లా పరిమళిస్తుంది.
ఆ అద్వితీయ లక్షణమేమై ఉండవచ్చునని మనం ఎంతైనా విచారణ చెయ్యవచ్చు. కాని, ఆ ఇంద్రజాలమేదో, అనిర్వచనీయంగా మనకు పట్టు చిక్కకుండా తప్పించుకుంటూనే ఉంటుంది.
ఎన్ని సార్లు చదివినా గురజాడ ఈ వాక్యాలు తమ ‘మాటలనియెడు మంత్ర మహిమ’ తో నన్ను నిశ్చేష్టుణ్ణి చేస్తున్నట్లే-
‘తీపి విరిగిన చెరకు వలె ఆ
నాటి కోర్కెలు నేడు బెండౌ
టెంచి నవ్వితి, బుద్ధి చపలత
కొత్త కోర్కెల తగిలితిన్ ‘
తన హంసగీతి అని చెప్పదగ్గ ‘లంగరెత్తుము’ (1915) కవితలో గురజాడ జీవితకాల సాహిత్య తపఃఫలమంతా ఉందనిపిస్తుంది.
‘పెరిగి విరిగితి, విరిగి పెరిగితి
కష్టసుఖముల పారమెరిగితి ‘
ఇవి చాలా మామూలు తెలుగు మాటలు కదా, కానీ ఈ మామూలు మాటలే ఇట్లా కూర్చగానే అద్వితీయ కవిత్వంగా మారిపోయేయి. ఎంత అద్వితీయమంటే, ఇట్లా రాయగలనా అని జీవితమంతా శ్రీ శ్రీ తనను తాను ప్రశ్నించుకుంటూనే ఉన్నాడు, చివరికి, ఒక విఫల క్షణాన, ‘ఆశయాలకేం అనంతం/అప్పారావంతటివాణ్ణి’ అని చెప్పుకున్నాడు.
ఈ వాక్యాల ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయాడు కాబట్టే, ప్రేమ రహితమైన ‘చరమరాత్రి’ ని వర్ణించేటప్పుడు
‘దేవతలతో జోడు కూడితి
రక్కసులతో కూడీ అడితి
కొత్త మిన్కుల తెలివి పటిమను
మంచిచెడ్డల మార్చితిన్’
అన్న వాక్యాలే గుర్తొచ్చాయతడికి.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎంత ప్రయత్నించినా ‘లంగరెత్తుము’ కవితలో మనల్ని తన వైపు లాక్కునే ఆ మాజిక్ ని మనమెట్లా సంపూర్తిగా వివరించలేమో, వాన్ గో చిత్రించిన పొద్దు తిరుగుడు పూలు చిత్రాల విషయంలోనూ అంతే.
కాని మనం వాటిని అర్థం చేసుకుని, మన ప్రశంస ను మాటల్లో పెట్టకుండా ఉండలేం.
విన్సెంట్ వాన్ గో (1853-1890) డచ్చి చిత్రకారుడు. అతడు చిత్రకళని ఏ గురువుదగ్గరా, కళాశాలలోనూ అభ్యసించలేదు. స్వయంగా తనంతట తనే సాధనచేసి నేర్చుకున్నాడు. అతడి తమ్ముడు థియో ఆర్ట్ డీలర్ గా పారిస్ లో ఉండేవాడు. 1886 లో అతడు తన తమ్ముడిదగ్గరకి వెళ్ళి ఫ్రెంచి చిత్రకళా రీతుల్ని,ముఖ్యంగా ఇంప్రెషనిస్టు చిత్రకళని చాలా దగ్గరగా చూసాడు. మూడేళ్ళ తరువాత 1888 లో దక్షిణ ఫ్రాన్సులో ఆర్లె అనే చోట కు చేరాడు. మధ్యధరా సముద్రతీరానికి దగ్గరలో ఉన్న ఆ ఊళ్ళో అపారమైన సూర్యకాంతీ, రంగులూ, గ్రామసీమలూ అతణ్ణి వివశుణ్ణి చేసాయి. అక్కడతడు తనలాంటి చిత్రకారులతో కలిసి చిత్రలేఖనమే జీవితంగా గడపాలని అనుకున్నాడు. తన దగ్గరకి వచ్చి తనతో పాటు చిత్రకళ సాధన చెయ్యమని పాల్ గాగి అనే ఇంప్రెషనిస్టు చిత్రకారుణ్ణి ఆహ్వానించేడు. అతడు వస్తున్నాడని తెలిసినప్పటినుంచీ గొప్ప ఉద్వేగానికి లోనయ్యాడు. తానుంటున్న యెల్లో హౌస్ గోడల మీద చిత్రలేఖనాల్తో అతడికి స్వాగతం పలకాలనుకున్నాడు. అందుకని కనీసం అరడజను బొమ్మలైనా పొద్దుతిరుగుడుపూల చిత్రాలు గియ్యాలనుకున్నాడు. ఆ కాన్వాసులన్నిటిలోనూ పొద్దుతిరుగుడు పూలు ‘నీలం, పేల ఆకుపచ్చ, రాయల్ బ్లూ రంగుల’ బాక్ గ్రౌండ్ లో ధగధగలాడాలని తాను కోరుకుంటున్నట్టు ఒక మిత్రుడికి 18-4-1888 నాటి ఉత్తరంలో రాసాడు.
కాని ఆ ఏడాది అంతా అతడు పొద్దుతిరుగుడు పూలతో కేవలం నాలుగు కాన్వాసులు మాత్రమే గీయగలిగాడు. అందులో మొదటిది నీలం రంగు బాక్ గ్రౌండ్ మీద మూడు పూలున్న పూలగిన్నె (మొదటిబొమ్మ), రెండవది అయిదు పూల గుత్తి, మూడవది 12 పూల గుత్తి, నాలుగవది 15 పూల గుత్తి (రెండవ బొమ్మ, గణేశ్వరరావు గారు చూపించింది ఈ బొమ్మనే).
అతడు కోరుకున్నట్టు గాగి అక్టోబరులో వచ్చాడు, నవంబరు ఒక్క నెల వాళ్ళు కలిసి బొమ్మలేసుకున్నారు, కలిసి మూజియంల చుట్టూ తిరిగారు. కాని డిసెంబరు చివరికల్లా ఇద్దరి మధ్యా అంతరం ఏర్పడింది. ఒక రాత్రి ఇద్దరూ దెబ్బలాడుకున్నారు, వాన్ గో చెవి తెగిపోయింది. అతడి మనస్తిమితం తప్పిందని అతణ్ణి పిచ్చాసుపత్రిలో నిర్బంధించారు. అక్కడతడు చికిత్స పొందుతూండగానే గాగి అతణ్ణుంచి తప్పించుకుని వెళ్ళిపోయాడు. అతడు మళ్ళా జీవితంలో వాన్ గో ని కలుసుకోనే లేదు.
ఆ తర్వాత, అంటే జనవరి 1889 తర్వాత వాన్ గో మళ్ళా పొద్దుతిరుగుడు పూలతో మూడు కాన్వాసులు గీసాడు. 5వ బొమ్మలో 12 పూలు, ఆరు, ఏడు కాన్వాసులు 15 పూలతోనూ గీసాడు. ఆరవ, ఏడవ కాన్వాసులు రెండూ కూడా నాలుగవ కాన్వాసుకి అనుకరణలే.
అంటే ఏమిటన్నమాట? అతడి మానసిక అస్వస్థత అతడి దర్శనాన్ని ఏమాత్రం భంగపరచలేకపోయిందన్నమాటే కదా.
అంతేకాదు, మే 1889 లో తమ్ముడికి రాసిన ఉత్తరంలో, తాను చిత్రిస్తున్న పూల కాన్వాసులు తాను చిత్రించిన మరొక బొమ్మ La Berceuse (జోలపాట) కి అటూ ఇటూ అలంకరణగా ఉండాలని కోరుకున్నాడు.. ఆ బొమ్మలో అతడొక మహిళను చిత్రించాడు (మూడవ బొమ్మ). అగస్టిన్ రౌలిన్ అనే ఆ మహిళ స్థానిక పోస్ట్ మాస్టర్ భార్య. వాన్ గో ఆమెలో ఒక తల్లిని చూసాడు. తాను అస్వస్థతకి లోనైనప్పుడు తక్కినవాళ్ళంతా తనకి దూరంగా జరిగినా కూడా, ఆమె తనని ఆదరిస్తూ ఉండింది. ఇపుడు పొద్దుతిరుగుడుపూలని చూస్తే ఆమె తన పట్ల చూపిన ఆదరణ మాత్రమే వాన్ గో కి స్ఫురిస్తూ ఉన్నది. ఆ ఋణమెట్లా తీర్చుకోవాలా అన్నదే అతడి ధ్యాస. అందుకని, 19-2-1890 న తమ్ముడికి రాసిన ఉత్తరంలో పొద్దుతిరుగుడు పూలు తనకి కృతజ్ఞతాచిహ్నంగా కనిపిస్తున్నాయని రాసాడు.
ఆ తర్వాత కొద్ది రోజులకే జూలై 1890 లో అతడు తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
మామూలుగా కనిపిస్తున్న అ పూల వెనక ఇంత కథ ఉంది. స్నేహం, వైరుధ్యం,స్పర్థ, ఉన్మాదం, ఘర్షణ, అస్వస్థత ల మీదుగా తిరిగి మళ్ళా ఆదరం, మమకారం, కృతజ్ఞతలదాకా చేసిన ప్రయాణముంది. అదంతా తెలియకపోయినా, గురజాడ కవితా వాక్యాల్ల్లాగా ‘విరిగి పెరిగిన, పెరిగి విరిగిన, కష్టసుఖముల పారమెరిగిన’ మనఃస్థితి ఏదో మనకి ఆ చిత్రాల్లోంచి లీలగా ద్యోతకమవుతూనే ఉంటుంది.
అయితే ఆ కాన్వాసుల్లో వ్యక్తిగతమైన ప్రయాణమే కాదు, ఐరోపీయ చిత్రకళ చేసిన ప్రయాణం కూడా ఉంది. ఒక చిత్రలేఖనానికి, ఆకృతి (ఫార్మ్), వెలుగునీడలు (టోన్), రంగు (కలర్) మూడు ముఖ్యమైన అంశాలు, రినైజాన్సు చిత్రకారులు డావిన్సీ, రాఫేల్ వంటివారు ఆకృతికి ప్రాధాన్యతనిచ్చారు. రూబెన్సు, కారవగ్గియో, రెంబ్రాంట్, వెలాక్వెజ్ లతో సహా సంప్రదాయ చిత్రకారులు వెలుగునీడల పరివర్తనకి (chiaroscuro)అంటే టోన్ కి ప్రాధాన్యత ఇచ్చారు. ఇంప్రెషనిష్టులు ఆ రెండింటి కన్నా రంగుకి అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. వాన్ గో పారిస్ వెళ్ళిన కొత్తలో ఇంప్రెషనిష్టుల వర్ణవిన్యాసానికి సమ్మోహితుడయ్యాడు. కాని అనతికాలంలోనే అతడు తనని తాను ప్రశ్నించుకున్నాడు. కేవలం రంగు వల్లనే చిత్రలేఖనం ఆకర్షణీయమవుతుందా? ఒక చిత్రలేఖనం చిత్రకారుడి హృదయావిష్కరణ చెయ్యాలంటే అన్నిటికన్నా ముఖ్యమైంది ఏది? ఆకృతినా, వెలుగునీడలా లేక వర్ణవైభవమా? వాన్ గో ఆ మూడింటినీ సాధనచేసి చివరికి తేల్చుకున్నదేమంటే, చిత్రకారుడి ఆర్తి, అభివ్యక్తి మాత్రమే చిత్రలేఖనానికి ప్రాణం పోస్తాయని. అతడి energy మాత్రమే చిత్రలేఖనాన్ని energize చేస్తుందని. అందుకనే అతణ్ణి expressionism కి స్ఫూర్తిగా పరిగణిస్తున్నారు.
పొద్దుతిరుగుడు పూల చిత్రాల వరసలో మొదటిబొమ్మ ఇంప్రెషనిస్టుల తరహాలో చిత్రించింది. ఇక్కడ పసుపు నారింజ రంగు పొద్దుతిరుగుడుపూలని నీలం రంగు బాక్ గ్రౌండ్ మీద చిత్రించేడు. నీలమూ-నారింజా పరస్పర పూరకాలు కాబట్టి, ఆ పూలచుట్టూ గొప్ప తళుకు కనిపిస్తూ ఉంది. ఇది ఇంప్రెషనిష్టులు చెప్పిన రహస్యమే. కాని, రెండవ బొమ్మ చూడండి. అక్కడ పసుపు పూలు పసుపు కుండీలో, పసుపు బల్ల మీద, పసుపు బాక్ గ్రౌండ్ లో చిత్రించేడు. ఈ సౌందర్యం ఇంప్రెషనిస్టులు చిత్రించగలిగేది కాదు. లేతరంగు నేపథ్యంలో, లేతరంగు బొమ్మ (light against light) మానె, రెనోయి వంటి ఇంప్రెషనిస్టులు ప్రయత్నించలేకపోలేదుగానీ, ఈ గాఢత, ఈ మార్మికత వారికి సాధ్యం కాలేదు.
ఆ బొమ్మను చిత్రించిన చేతులు నిజంగా మంత్రమయహస్తాలు, లేకపోతే, అన్ని పసుపు ఛాయల్తో జీవన్మరణాల్ని (కొన్ని పూలు వాడిపోయాయి, కొన్ని వికసించాయి, కొన్ని ఎండిపోయాయి) చిత్రించడం సాధ్యమయ్యే పనేనా?
ఒకేలాగ ఉండే రంగుల్ని పక్కపక్కన చిత్రించే harmonious color scheme చూపరులకు మానసిక ప్రశాంతిని కలిగిస్తుందంటారు. కాని నా దృష్టిలో అది సాగర తరంగాల్లాగా, నీలి పర్వతపంక్తుల్లాగా, ఆకుపచ్చని అడవుల్లాగా immensity ని సూచిస్తుందనిపిస్తుంది. తన మిత్రుడు వస్తాడనీ, అతడితో కలిసి తాను కాంతిని వడగట్టి చిత్రలేఖనాలుగా మార్చుకోవచ్చనీ ఉత్సాహపడ్డప్పుడూ, తన మతిచలించి, తిరిగి కొద్దిగా స్వస్థత చేకూరగానే, తనని ఆదరించిన ఒక మాతృమూర్తికి ధన్యవాద సమర్పణ చెయ్యాలనుకున్నప్పుడూ కూడా ఆ చిత్రకారుడి మదిలో ఆ అపారత్వమే ఉన్నదని ఆ పొద్దుతిరుగుడు పూలు సాక్ష్యమివ్వడం లేదూ!
5-10-2016