లాండ్ స్కేప్ లాంటి సంగీతకృతి

Reading Time: 3 minutes

41

రెండు మూడేళ్ళ కిందట రావెల సోమయ్యగారి అబ్బాయి మనోహర్ నాకోసం మెండెల్ సన్ సంగీతాన్ని కానుకగా తెచ్చారు. ఆ సిడిలో, Midsummer Night’s Dream, పూర్తి కచేరీతో పాటు The Fairy tale of Beautiful Melusine, Calm sea and prosperous voyage లు ఓవర్ ట్యూర్లు కూడా ఉన్నాయి. ఆ సంగీతం విన్నాను, ఆ స్ఫూర్తితో మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్ కూడా చదివాను. కానీ, అప్పటికి మెండల్ సన్ గురించి నాకు తెలియకపోవడంతో ఆ కానుక ఎంత విలువైనదో నేను అర్థం చేసుకోలేకపోయాను.

చాలాసార్లిట్లానే జరుగుతుంది, కవులూ, కృతులూ, ప్రేమికులూ మన జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు మనకి తెలియదు, వాళ్ళు వారితో పాటు ఎంత సమ్మోహనీయ ప్రపంచాల్ని వెంటతెస్తున్నారో.

ఫెలిక్స్ మెండల్ సన్ (1809-1847) రొమాంటిక్ యుగానికి చెందిన జర్మన్ సంగీతకారుడు. 37 ఏళ్ళకే అతడీ లోకాన్ని విడిచిపెట్టేటప్పటికే అజరమామరమైన సంగీతసృష్టి చేసి వెళ్ళిపోయాడు. పన్నెండేళ్ళ వయసులోనే గొథే ప్రేమ చవిచూసాడు. ఆయన గీతాలకి స్వరకల్పనచేసాడు. అప్పటికి తన డెభ్భయ్యో పడిలో ఉన్న గొథే మెండల్ సన్ ని చూసి సంగీతం అధ్యయనం చేయడం మొదలుపెట్టాడంటేనే ఊహించవచ్చు, ఆ బాలుడు ఎంత ప్రతిభావంతుడో. తర్వాత రోజుల్లో హెగెల్ దగ్గర చదువుకున్నాడు. 14 ఏళ్ళ వయసులో, అతడు తన మొదటి ఒపేరా The Uncle from Boston కూర్చగానే, అతడి గురువు జెల్టర్ అన్నాడట: ‘ఈ రోజునుంచీ నువ్వింక విద్యార్థివి కావు, మహాసంగీతకారుల సరసన చేరిపోయావు. మొజార్ట్, హేడెన్, బాక్ ల తో సమానంగా నీకంటూ ఒక స్థానం సంపాదించుకున్నావు’ అని. ఆ గురువు మాటలు నిజం చేస్తూ, మెండెల్ సన్ తనకొక స్థానం సంపాదించు కోవడమే కాదు, పూర్వసంగీతకారుల సంగీతాన్ని పునరుద్ధరించడానికి కూడ శాయశక్తులా కృషి చేసాడు. బాక్ సంగీతరచనల్ని,ముఖ్యంగా సుప్రసిద్ధమైన St Matthew Passion నీ, హేండెల్ కృతుల్తో పాటు, బీతోవెన్ నాలుగవ, తొమ్మిదవ సింఫనీల్ని మళ్ళా ప్రజల మధ్యకు తీసుకువచ్చాడు.

రొమాంటిక్ యుగానికి చెందిన కళాకారుల్తో మెండెల్ సన్ కి పోలిక అల్పాయుష్కుడు కావడంలోనూ, అపారమైన భావనాశక్తిలోనూ మటుకే. కాని వాళ్ళల్లో ఉన్న చీకటికోణాలు, నిరాశ, నిస్పృహలు, విషాదమయ జీవనానుభవాలు అతడికి లేవు. సంపన్న కుటుంబంలో పుట్టాడు. తల్లిదండ్రుల, సోదరి ప్రేమ పుష్కలంగా చవిచూసాడు. నాలుగు జతల దుస్తులు, జేబులో గొథే పద్యాలతో యూరోప్ అంతా కలయతిరిగాడు. కోరుకున్న అమ్మాయిని పెళ్ళిచేసుకున్నాడు. తన జీవితం అర్థాంతరంగా ముగిసేటప్పటికి, జర్మనీకీ, ఇంగ్లాండ్ కీ కూడా అత్యంత ప్రీతిపాత్రుడైపోయాడు.

సంగీతకారుల్లో చిత్రకారులు అరుదు. కాని మెండెల్ సన్ చక్కటి చిత్రకారుడు కూడా. అతడి సంగీతం మనకి లభ్యం కాకపోయినా, ఆ చిత్రాలు మటుకే దొరికినా, అతణ్ణి గొప్ప నీటిరంగుల చిత్రకారుడిలో ఒకడిగా గుర్తుపెట్టుకుని ఉండేవాళ్ళం.

మెండెల్ సన్ సంగీతం విశిష్టమైందే గాని,అతడు కంపోజ్ చేసిన overtures వాటికవే అత్యున్నతస్థాయి కళాకృతులుగా నిలబడిపోయాయి. తర్వార్త రోజుల్లో వాటిని symphonic poems అన్నారు. ఓవెర్ ట్యూర్ అంటే ఒక సుదీర్ఘమైన సంగీత కృతి, లేదా ఒక సంగీతనాటకానికి ముందు వినిపించే ప్రస్తావన లాంటిది. ప్రారంభభూమిక. మెండల్ సన్ స్వరపరిచిన ఓవెర్ ట్యూర్లు, ఒక విమర్శకుడి మాటల్లో చెప్పాలంటే, ‘వేసవి మలయమారుతాల్లాంటివి, వాటిల్లో స్పానిష్ రాజాస్థానాల వైభవం , లేదా తుపానులో నురగలుకక్కే ఉత్తుంగ తరంగక్షోభిత సాగరసంచలనం కనిపిస్తాయి’.

సంప్రదాయ సంగీతం ప్రధానంగా చర్చి సంగీతం. పూర్తిగా ఆధ్యాత్మికం. లౌకిక సాహిత్యానికి స్వరకల్పన చెయ్యడం షూబర్ట్ తోనే మొదలయ్యింది. గొథే, హీన్రిక్ హీన్ లాంటి కవుల కవితలూ, జానపదగీతాలూ తీసుకుని వాటికి షూబర్ట్ స్వరకల్పన చేసాడు. వాటిని లీడర్ అంటారు. మెండెల్ సన్ అంతకన్నా ఒక అడుగు ముందుకేసి, షేక్ స్పియర్ నాటకాలకీ, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలకీ కూడా స్వరానువాదం చెయ్యడానికి ప్రయత్నించాడు. ఉదాహరణకి మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్. ఆ నాటకాన్ని మెండల్ సన్ సంగీతంలోకి అనువదించాడంటే దానర్థం ఆ పాత్రల్నీ, ఆ సంఘటనల్నీ సంగీతపరంగా చిత్రించాడని కాదు. ఆ ఉద్దేశ్యంలో అది సంగీతనాటకం కానే కాదు. అతడు చేసింది, ఒక వేసవిరాత్రి ఆరుబయట వెన్నెల్లో ఏ పచ్చికబయలు మీదనో పడుకున్నప్పుడు మన హృదయంలో ఏ స్వప్నలోకం ఆవిష్కృతమవుతుందో, ఆ లోకాన్ని మనకి ప్రత్యక్షం చెయ్యడం. ఎంతో భావనాశక్తి ఉంటే తప్ప సాధ్యం కాని సృజనాత్మకత అది.

అటువంటి ఒక సుప్రసిద్ధమైన ఒక ఓవెర్ ట్యూర్ వినండి. అది స్కాటిష్ ప్రకృతి సీమలో ఒక సముద్రతీరంలో ఉన్న ఒక గుహమీద అల్లిన సంగీతం. ఆ గుహని మెండల్ సన్ మొదటిసారి 1829 లో చూసాడు. అంతకుముందే కీట్స్ ఆ గుహాసౌందర్యానికి విభ్రాంతుడై అద్భుతమైన కవిత చెప్పాడు. అందులో దాన్ని సముద్రం నిర్మించిన గోపురమనీ, మర్త్యమానవుడి కంటపడకుండా కాపాడుతున్న పవిత్రాగ్ని అనీ వర్ణించాడు. మెండల్ సన్ ఆ సముద్రతీర గుహా సౌందర్యాన్ని చూడగానే అక్కడికక్కడే రెండు పంక్తుల సంగీతరచన రాసేసుకున్నాడు. ఆ తర్వాత నాలుగేళ్ళకి అది పూర్తిస్థాయి కృతిగా రూపొందింది.

పాశ్చాత్యసంగీతం ఎట్లా వినాలో, ఎట్లా అర్థం చేసుకోవాలో నాకు చెప్పేవాళ్ళెవ్వరూ లేరు. కాబట్టి, ఒక సంగీత విమర్శకుడు ఈ ప్రస్తావనను వివరిస్తూ రాసిన రచన ఆధారంగా ఆ కృతిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. ఆ విమర్శకుడు రాసిన వివరణ చూడండి:

“ఈ ప్రస్తావనా కృతి, తుత్తారల సహాయం లేకుండా రూపొందించే ఒక సాధారణంగా సంప్రదాయ సంగీత కృతిలాంటిదే అయినప్పటికీ, ఇందులో సుసంపన్నమైన భావనాబలం , సంపూర్ణనాటకీయత ఉన్నాయి. ఇందువల్ల ఇది ఆ కాలం నాటికి గొప్ప సాహసప్రయోగం మాత్రమే కాక, తర్వాత రోజుల్లో ప్రవహించే జలాల్ని సంగీత పరచాలనుకున్నవారెవరూ కూడా ఈ కృతి ప్రభావం నుంచి తప్పించుకోలేకపోయారు. కృతి మొదలుకావడమే ఒక తరంగ చలనాన్ని సూచిస్తూ మొదలవుతుంది. సెల్లోలు,క్లారినెట్లు, బసూన్లతో మొదలైన ఆ సూచన కృతి చివరిదాకా కూడా నిర్విరామంగా ఎగిసిపడుతూనే ఉంటుంది. ఇక తక్కిందంతా మన ఊహకి సంబంధించిందే. మధ్యమధ్యలో గండశిలలమీద కెరటాలు విరిగిపడుతున్న చప్పుణ్ణి స్ఫురింపచేస్తూ ఉండీ ఉండీ డ్రమ్ములు వినిపిస్తుంటాయి. అది ఆ సంగీతకారుడి మాంత్రిక స్పర్శ. ఇక ఇందులో రెండవ ఇతివృత్తం, సముద్రం మీద వీచే గాలుల గమనం. దీన్ని కూడా డి-మేజర్ లో సెల్లోలు, క్లారినెట్లు, బసూన్లతో పైకెగిసే సంగీతంతో వినిపిస్తాడు. ఆ గాలుల ఉద్ధృతి మూడవ ఇతివృత్తం. మొదటి ఇతివృత్తాన్ని మరింత మార్చి డ్-మేజర్ లోనే, బూరాలు, బాకాలతో మరింత బిగ్గరగా వినిపిస్తాడు.”

“నెమ్మదిగా సంగీతవాద్యాల సమ్మేళనంతో ఒక తుపాను మొదలవుతుంది. వాయులీనాల తంత్రులమీద మృదు శబ్దతరంగాల లాలనతో ముందొక ప్రశాంతతరంగం వినిపిస్తుంది. మధ్యలో సముద్రపక్షుల క్రేంకారాల్ని స్ఫురింపచేస్తూ తాళాలు, తప్పెట్లు వినిపిస్తుండగా, ఆ సముద్రవిహంగాల అరుపుల్ని, మధ్యలో ఒక సముద్రసరీసృపం మొరగడం కూడా వింటున్నట్టే ఉంటుంది మనకి. అలాగని ఆ అరుపుల్ని సంగీతవాద్యాలమీద నేరుగా పలికిస్తున్నాడని కాదు. నిర్విరామ శబ్దసంచలనం తోనూ, ఉత్తుంగస్వరసంచారంతోనూ, ఇంతలో తారస్థాయికి చేరుతూ, ఇంతలోనే మంద్రంగా, అతిమంద్రంగా దిగిపోతూ, త్వరితంగానూ, దురితంగానూ సాగే స్వరగమనంతో ఆయన అవన్నీ మనకు స్ఫురింపచేస్తాడు. కృతి మొత్తం అవిశ్రాంతంగా సంచలిస్తూనే ఉంటుంది, నిర్నిరోధంగా ప్రవహిస్తూనే ఉంటుంది, మధ్యలో రాళ్ళ మీద కెరటాలు విరిగిపడుతున్నప్పటి నీటి ఆవిరి, గాలుల గుసగుస, పక్షికూజితాలు కూడా మనకి వినిపిస్తుంటాయి. తుపాను నెమ్మదిగా సముద్రాన్ని చుట్టబెడుతుండగా, సంగీతం కూడా మరింత సాంద్రమవుతూంటుంది. ఇక, ఆ సముద్రతీరం మీద మనతో పాటే, ఆ సంగీతం హఠాత్తుగా సమసిపోతుంది.”

సుప్రసిద్ధ సంగీత కారుడు వాగ్నర్ ఈ కృతి విని మెండల్ సన్ ని first class landscape painter అని కీర్తించాడంటే ఆశ్చర్యమేముంది?

7-7-2017

arrow

Painting: Mendelssohn
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: