రెండువారాల పాటు మా ఊళ్ళల్లో

Reading Time: 5 minutes

60

చాలా కాలం తర్వాత రెండువారాల పాటు మా ఊళ్ళల్లో తిరుగాడేను. నేను పుట్టిన ఊరితోనూ, ఆ ప్రాంతంతోనూ నేను మానసికంగా ఎంతగా అతుక్కుపోయేనంటే, నేను మరేదీ కోరుకోలేకపోయాను. విద్యలోనూ, ఉద్యోగంలోనూ బహుశా ఏదైనా సాధించిగలిగి ఉండేవాణ్ణేమోగాని, ఎప్పటికప్పుడు నా హోం సిక్ నెస్ నన్ను వెనక్కి లాగేస్తూనే వచ్చింది. నగరంలో ఉన్నా కూడా నా మనసెప్పుడూ ఈ కొండలచుట్టూ, ఈ అడవులచుట్టూతానే తిరుగుతూ ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే, నా ఊరితో నాకేర్పడ్డ బాల్యానుబంధం నా జీవితంలోని అన్ని యాంబిషన్సునీ నిర్మూలించేసింది. మిగిలిన ఒకే ఒక్క యాంబిషను ఆ ఊళ్ళను తలుచుకుంటూ కవితలు రాయడం, ఆ ఊళ్ళ చుట్టూ తిరుగుతూ బొమ్మలు గియ్యడం.

2

ప్రాచీన చీనాచిత్రకారులు సాధనచేసిన చిత్రకళా రీతుల్లో, ‘కొండలూ-నీళ్ళూ’ ( షాన్-షుయి) చిత్రించడం ఒక ప్రత్యేకమైన శాఖగా వృద్ధిచెందింది. ఒక చీనా చిత్రకారుడి సమాధి మీద ‘కొండల్లో హృదయముంది-నీళ్ళల్లో వివేకముంది’ అని రాసిఉండేదట. వాళ్ళ దృష్టిలో, భూమికీ, ఆకాశానికీ మధ్య ‘కీ’ అనే ఒక దివ్యశక్తి ప్రవహిస్తూ ఉంటుంది. చిత్రకారుడు చెయ్యవలసిందల్లా తెల్లకాగితం ముందు కూచుని, ఇంకులో కుంచె నింపి, ఆ ప్రాణశక్తిని తనలోకి ఆవాహన చేసుకోవడం. అప్పుడు బొమ్మగీసినా,కవిత రాసినా ఒక చీనా కవి రాసిన ఈ కవితలా ఉంటుంది:

అస్పష్ట తరుసముదాయం వెనక
కెరటాల మధ్య నల్లటి చుక్కల్లాగా
దూరప్రవాహం
అప్పుడే పూర్తి చేసిన బొమ్మలోలాగా
ఇంకా ఆరని ఇంకుతడి.

3

రోజూ పొద్దున్నో, సాయంకాలమో వానపడుతూ ఉంటుంది. ఋతుసంధ్యవేళ. వసంతం ముగిసి గ్రీష్మం అడుగుపెడుతున్న సమయం. అడవి చిక్కటి ఆకుపచ్చకి రంగు తిరుగుతోంది. రోజూ మధ్యాహ్నం ఏదో ఒక గ్రామానికి వెళ్తూ వచ్చాం. ఒక రోజు ఋతుపవన మేఘం అడవుల్నీ, కొండల్నీ చుట్టబెడుతున్న దృశ్యం స్వయంగా చూడాలని ఆ వానలోనే ప్రయాణించాం. ఈ మార్చి-ఏప్రిల్ లలో ఎండలకి మాడిపోయిన మనస్సు ఆ వానకి మళ్ళా పసరు పోసుకుంది. ఆ వానలో ముడుచుకుపోయిన ఆ గ్రామాలు నా చిన్నప్పుడెలా ఉన్నాయో ఇప్పుడూ అలానే ఉన్నాయి. ఆ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? రోజువారీ అవసరాలు తీరడంకన్నా మించిన కలలేమన్నా ఉన్నాయావాళ్ళకి? తాటాకు ఇళ్ళ కప్పుల మీంచి వాన ధారలు కారుతుంటే, వెచ్చని పొయ్యి దగ్గర ముడుచుకు కూచుని ముద్ద ముద్దగా పలకరించుకునే ఆ మనుషుల్లో నేనూ ఒకడిగా ఉండి పోవాలనే కదా నా జీవితంతా కోరుకున్నాను! కాని, నిజంగా నేనట్లా ఉండిపోగలనా? మళ్ళా ఆ అనుభవాన్ని పంచుకోవడానికీ, చెప్పుకోవడానికీ ఒక సహృదయ భావుకప్రపంచం కావాలనిపించదా?

4.

ఇదే ఆశ్చర్యం. పరివ్రాజకులూ, నిజంగా నిస్సంగులూ అయిన చీనా, జపాన్ కవుల్లో కూడా ఇట్లాంటి వైరుధ్యమే కనిపిస్తుంది. ప్రాచీన చీనా కవి హాన్ షాన్ నే చూడండి. అంత నిస్సంగత్వాన్ని సాధించేక కూడా అంత కవిత్వం మనతో ఎందుకు పంచుకున్నాడు? మహనీయుడైన జపాన్ కవి బషొ జీవితమంతా ఈ పోరాటంలోనే నలిగిపోయాడు. తన ముందు జీవించిన మరొక మహనీయ కవీంద్రుడు సైగ్యొ లాగా తాను కూడా ఈ ప్రపంచానికి దూరంగా జరగాలని అతడి ఆరాటం. ప్రాచీన చీనా తాత్వికుడు సున్-జింగ్ లాగా తన తలుపు మూసేసుకోవాలనీ, మరొక తాత్వికుడు దు-ఉలాంగ్ లాగా తన గుమ్మానికి తాళం వేసేసుకోవాలనీ కోరుకున్నాడు. కానీ, మళ్ళా ఇట్లా రాయకుండానూ ఉండలేకపోయాడు:

‘ఈ ముసలాడు మరీ సోమరి. సాధారణంగా నన్ను చూడవచ్చే మనుషుల్ని భరించడం చాలా కష్టం. అందుకనే ఎప్పటికప్పుడు ‘ఇకనుంచి వాళ్ళను నే కలవను’ , ‘వాళ్ళని ఇంటికి ఆహ్వానించను’ అని ఒట్టుపెట్టుకుంటుంటాను. కానీ రాత్రుళ్ళు చంద్రుడు ప్రవేశిస్తుంటాడు. పొద్దుటిపూట మంచు రాలుతుంటుంది. దాంతో మళ్ళా స్నేహితులకోసం ఆరాటపడుతుంటాను. అలా ఆరాటపడకుండా ఉండలేను..’

5

రాజవొమ్మంగిలో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఒక్కరోజు బ్రాడ్ బాండ్ పనిచేసింది. ఇంతలో ఒక సాయంకాలం పిడుగు పడింది. ఇక బయటిప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కరెంటు ఒక రోజంతా వెలిగేక, ఎక్కడో అడవిలో చెట్లు పడిపోతాయి. కరెంటు వాళ్ళు నెమ్మదిగా లైను వెతుక్కుంటూ బయలుదేరతారు. రెండుమూడు రోజులకి లైను పునరుద్ధరించేక, మళ్ళా వాన పడుతుంది, మళ్ళా చెట్లు పడిపోతాయి. కాని అక్కడ చూడవలసిన అందాలు టెలివిజన్, కంప్యూటర్లలో చూసేవి కావు, అక్క్కడ మన హృదయాన్ని లోబరుచుకునేవి: వాన కురిసిన వెలిసిన సాయంకాలం ఆకాశమంతా అల్లుకునే నారింజరంగు కాంతీ, టాగూరు బొమ్మల్లో కనిపించే శుభ్రనీలఛాయా, యూకలిప్టస్ చెట్లమధ్యనుంచి ప్రవాహంలాగా అల్లుకునే రాత్రిచీకటీ, అంతా మాటుమణిగేక, ఆకాశంలో తేనెరంగుకి తిరిగి మసగ్గా కరిగిపొయ్యే చంద్రరేఖా, ఉండీ, ఉండీ ఆకాశానికి చక్కిలిగింతలు పెట్టే కోకిలకూతా.

6

మధ్యలో ఒకసారి మారేడుమిల్లి, చింతూరు మీదుగా మోతుగూడెం, డొంకరాయి, అప్పర్ సీలేరు వెళ్ళివచ్చాం. కొన్నాళ్ళు ట్రైబల్ పవర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరక్టరుగా పనిచేసినందుకు, అక్కడ పవర్ జనరేషన్ ప్రాజెక్టులు చూడమని మిత్రులు ఆహ్వానించేరు. జోలాపుట్, మాచ్ ఖండ్ ఇంతకు ముందే చూసాను కాబట్టి, ఈ పర్యటనతో సీలేరు పరీవాహక ప్రాంతమంతా పూర్తిగా చూసినట్టయింది.

కాని మారేడుమిల్లి మీంచి మోతుగూడెం దాకానూ,సీలేరు మీంచి గూడెం కొత్తవీధి, రొంపుల, కె.డి.పేట దాకానూ 400 కిలోమిటర్ల పైగా ఆ అడవిలో చేసిన ప్రయాణం మాత్రం మరవలేనిది. ఆ ఆకుపచ్చదనాన్ని నా నేత్రాలు పరిపూర్ణంగా పీల్చుకున్నాయి. వాల్మీకి మాటల్లో ‘శైలాత్ శైలం, వనాత్ వనం’ (కొండనుంచి కొండకీ, అడవినుంచి అడవికీ ) మేం చేసిన ఆ ప్రయాణానుభవాన్ని వర్ణించడానికి నాకు భాష చాలదు.

7

అసలు, భారతీయ సాహిత్యంలోనూ, కవిత్వంలోనూ కూడా అటవీసౌదర్యాన్ని వాల్మీకి తప్ప మరెవరూ పట్టుకోలేకపోయారనిపిస్తుంది. మహాభారతంలో కూడా పాండవులు పన్నెండేళ్ళు వనవాసం చేసినా, ఒక సౌగంధిక పర్వంలో తప్ప గొప్ప వనవర్ణన కనిపించదు. కానీ, వాల్మీకిలో రాముడు అయోధ్య వదిలిపెట్టినక్షణం నుంచే అడవి మనల్ని ఆవహించడం మొదలుపెడుతుంది.

అసలు రాముడే ఒక గిరివన ప్రియుడు. అతడికీ, సీతకీ ఉన్న గొప్ప కోరిక అడవిలో బతకాలన్నదే. తన కోసం జీవితకాలం నిరీక్షిస్తున్న శబరిని కలుసుకున్నప్పుడు రాముడు నేరేడు పళ్ళు కాదు కోరుకున్నది, మేఘంలాగా ఉన్న మతంగవనమంతా చూపించమని అడిగాడట. చిత్రకూటం, ఋష్యమూకం, ప్రస్రవణగిరి, గంధమాదనం, మతంగవనం లాంటి కొండలగురించీ, అక్కడి అడవులగురించీ వర్ణిస్తున్నప్పుడు వాల్మీకి ప్రాచీన చీనా చీత్రకారులకన్నా నిశితమైన రేఖల తోనూ, బ్రిటిష్ లాండ్ స్కేప్ చిత్రకారులకన్నా లలిత మైన రంగుల తోనూ కనిపిస్తాడు. రామాయణంలోని ఋతువర్ణనల్లో చైత్రం, గ్రీష్మం, వర్షం, హేమంతం- నాలుగు వర్ణనలూ అడివిలోనే కనిపిస్తాయి.

మేమా ప్రయాణం చేస్తున్నంతసేపూ ఆ అడవిని పోల్చుకోవడానికి వాల్మీకినే తలుచుకుంటూ ఉన్నాను.

ఆ కొండలు:

కేచిత్రజత సంకాశాః కేచిత్ క్షతజ సన్నిభాః
పీతమాంజిష్ట వర్ణాశ్చ కేచిన్మణివరప్రభాః
పుష్యార్క కేతకాభాశ్చ కేచిజ్జ్యోతీరసప్రభాః
విరాజంతే అచలేంద్రస్య దేశా ధాతువిభూషితాః

(కొన్ని రాళ్ళు వెండిలాగా ఉన్నాయి, కొన్ని రక్తంలాగా. కొన్ని పచ్చగా, కొన్ని మణుల్లగా, పుష్య్రాగాల్లాగా, కొన్ని స్ఫటికాల్లాగా, కొన్ని మొగలిపూవుల్లాగా, నక్షత్రాల్లాగా, కొన్ని పాదరసంలాగా మెరుస్తున్నాయి.)

అంత విస్తారమైన అడవిని చూసినప్పుడు కొన్ని చోట్ల ఎండ, కొన్ని చోట్ల నీడ, కొన్ని చోట్ల మంచు, కొన్ని చోట్ల చీకటి- ఆ అవస్థ కూడా వాల్మీకినే వర్ణించగలడు:

సర్వకాల ఫలా యత్ర పాదపా మధురస్రవాః
సర్వే చ ఋతవస్తత్ర వనే చైత్ర రథే యథా

(ఆ అడవుల్లో చెట్లు అన్ని కాలాల్లోనూ పండ్లనిస్తాయి. మధురమైన రసాలిస్తాయి. చైత్రరథంలోలాగా ఆ అడవిలో అన్ని ఋతువులూ ఒక్కవేళనే కనిపిస్తాయి.)

అక్కడి నీరు వాల్మీకి మాటల్లో ‘పద్మగంధి శివమ్’, ‘సుఖశీతమనామయమ్’, ‘సతతాక్లిష్టమ్’, ‘రౌప్యస్ఫాటికసన్నిభం’.

ఇప్పుడిక్కడ, మెహిదిపట్నంలో ఈ సాయంకాలం ఈ మాటలు రాస్తున్నప్పుడు కూడా నాకింకా ఆ ‘రమ్యనిర్ఝర కాననాల్లో’, ఆ ‘రమ్యపుష్పిత కాననాల్లో’, ‘ ఆ శుభదర్శన కాననాల్లో’ తిరుగుతున్నట్టే ఉంది.

నా చుట్టూ మిగలముగ్గిన పనసపళ్ళ వాసన.

8

అడవిని వర్ణించేటప్పుడంతా వాల్మీకి మేఘంలాగా ఉందంటాడు. ఆయన ఉపమానాలు చాలా భావగర్భితంగా ఉంటాయి. మొదటిసారి సముద్రాన్ని చూపిస్తూ లోకానికి ప్రతిబింబంలాగా ఉందంటాడు. కాని, నిజంగా మేఘాలతో పోల్చదగ్గవి జలాశయాలు. ఆ అడవుల్లో, కొండలమధ్య చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు ఎక్కడ చూసినా నేలమీద నీలితరగలు పరిచినట్టే ఉన్నాయి.మరీ ముఖ్యంగా డొంకరాయి జలాశయం. యేలేరు, మడేరు, తడికజలపాతం (దానికెవరో టైగ్రిస్ జలపాతం అని పేరుపెట్టారు), పింజరికొండ జలపాతం- వేసవి ముగుస్తున్న వేళ కూడా ఆ జలాశయాల్లో, జలపాతాల్లో నీళ్ళు ప్రవహిస్తూనే ఉన్నాయి. ఏడాది పొడుగునా కురిసినవానల్లోంచి ఏ జలధారల్ని ఆ కొండకోనలు తమని తాము దొన్నెలుగా చేసుకుని దాచుకున్నాయో. చీనాకవులు నిజంగా ప్రకృతిని అర్థం చేసుకున్నారు. కొండలు ఎంత అందంగానైనా ఉండనీ, కానీ ఆ లోయలో ఒక చెరువో, జలపాతమో ఉంటేనే అక్కడ సంగీతం ప్రభవిస్తుంది. ఒకసారి ఆ దృశ్యాన్ని చూసిన మనిషిని ఆ సంగీతం జీవితమంతా వెన్నాడుతూనే ఉంటుంది.

9

వసంత ఋతువు రాగానే మా పల్లెల్లో కొండరెడ్లు గంగాలమ్మ పండగ చేస్తారు. గిరిజన ప్రాంతాల్లో తొలివానలు చైత్రమాసానికే వచ్చేస్తాయి. ఆ వానల్ని స్వాగతించే పండగ అది. ఆ పండగ ముగుస్తూనే భూదేవి పండగ మొదలవుతుంది. విత్తనాలు చల్లే పండగ. గంగాదేవి పండగ పూర్తిగా చూసి ఎన్నో ఏళ్ళయ్యింది.ఏ వేసవిలో వచ్చినా ఆ పండగకి అటూ ఇటూగానే వస్తున్నాను. ఆ అడివిదేవతల కోసం, ఆ అడివిరాజుల వేటకోసం బెంగపెట్టుకున్న నాకు, ఇప్పుడెక్కడ చూసినా ఉద్యమంలాగా విస్తరిస్తున్న చర్చిలే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రామకోవెలలు, ఆ తర్వాతా సీతారామరాజు విగ్రహాలు, నిన్నటిదాకా చర్చిలు, ఇప్పుడు సాయిబాబా కూడా ఈ దారుల్లో ప్రయాణం మొదలుపెట్టాడు. కాని, ఒక సాయంకాలం, తొలివాన ఆకాశాన్నీ, భూమినీ చుట్టబెడుతున్న వేళ, మా ఊరినుంచి రాజవొమ్మంగి వస్తూండగా, కొండపల్లి దగ్గర అకస్మాత్తుగా ఎదురయ్యింది గంగాలమ్మ. ఆ వానలోనే మోగుతున్న బాజాలమధ్య కొందరు యువకులూ, పెద్దలూ, స్త్రీలూ ఆమెని ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. వానలో ఒక ఐరేణి కడవ మీద దీపం వెలిగించుకుని అట్లా బాజాల మధ్య ఊరేగుతున్న గంగాలమ్మను చూడగానే నాకు చెప్పలేనంత పులకింత కలిగింది. అన్ని గ్రామాల్లోనూ పండగ అయిపోయిందనీ, రెండు ఊళ్ళల్లో మాత్రమే మిగిలిందనీ అక్కడొక యువకుడు నాతో చెప్పాడు. నాకోసమే ఆ పండగ ఆలస్యమయిందనీ, గంగాలమ్మ నాకోసమే అక్కడ ప్రత్యక్షమయిందనీ అనిపించింది నాకు.

అడివిదేవతల కోసం ఎన్నాళ్ళుగానో వేచి ఉన్న నాకు ఆమె ఆ వానలో, ఆ సాయంసంధ్యలో నా తండ్రికి ఎంతో ఇష్టమైన ఆ కొండపల్లెలో ఎదురుకావడం, చెప్పొద్దూ, నాకూ, ఆ దేవీదేవతలకీ మధ్య సంభాషణ నడుస్తూనే ఉందనీ, నా భాగ్యానికి హద్దులేదనీ అనిపించింది.

కానీ, నా బాల్యానికీ, ఇప్పటికీ వచ్చిన తేడా అయితే ప్రస్ఫుటంగానే ఉంది. ఆ ఊరేగింపు ఫొటోలు తీసుకుంటుంటే, అందులో మొదట్లో బాజా వాయిస్తున్న ఒక యువకుడు చాలా ఇబ్బంది పడ్డాడు. తనకీ ఆ పండగకీ ఏమీ సంబంధం లేదనీ ఏదో అందరిలాగా తాను కూడా బాజా వాయిస్తున్నాననీ అన్నాడు. అతడు ఆ గ్రామ సర్పంచ్ అట. 19 పంచాయతీల్లో అతడొక్కడే ఏకగ్రీవంగా సర్పంచ్ అయ్యాడట. తానట్లా రోడ్డున పడి ఆ గ్రామదేవత పండగలో బాజాలు వాయిస్తుంటే, తన ముందున్న నాగరీక మానవుడు తన గురించి ఎక్కడ తక్కువగా భావిస్తాడోనని అతడొకటే ఆదుర్దా పడిపోయాడు. కాని అతడి తండ్రి నాకు బాగా తెలుసు. కొండదొర. అతడు మా నియోజకవర్గంలోనే మొదటి బి.యె. అతణ్ణంతా బి.యే తమ్మన్నదొర అనేవారు. నేను పెద్దాపురంలో డిగ్రీలో చేరినప్పుడు మాకు హిస్టరీ బోధించిన లెక్చెరర్ అతడి క్లాస్ మేట్. తమ్మన్నదొర కావాలనుకుంటే ఐఏ ఎస్ అయిఉండేవాడు అన్నాడాయన. కనీసం ఎమ్మెల్యే కావడం మీద కూడా తమ్మన్నదొరకి ఆసక్తి లేదు. అతడు అట్లా ఆ గ్రామాల్లో ఉండిపోడాన్నే ఎక్కువ ఇష్టపడ్డాడు.

నా ముందు గంగాలమ్మ పండగలో బాజా వాయిస్తున్నందుకు సిగ్గుపడుతున్న ఆ యువకుణ్ణి చూస్తూ అతడి తండ్రిని గుర్తుచేసుకుంటే, ‘అమృతసంతానం’ లో సరుబుసావొతా, దివుడుసావొతాలు గుర్తొచ్చారు. నా కళ్ళముందే ఒక తరం ముగిసి కొత్త తరం ప్రత్యక్షమైందని అర్థమైంది.

10.

కంటిముందు కనిపిస్తున్న దృశ్యాన్ని బొమ్మగా గియ్యడంలో అద్వితీయమైన సంతోషమేదో ఉంది. అది మనిషికి తన బాహ్యప్రపంచం మీద ఒక సాధికారికతను ఇస్తున్నదంటామా లేక తాను జీవించిన క్షణాలకొక అమరత్వాన్ని సమకూరుస్తున్నదంటామా? కాని చూసిన దృశ్యాన్ని చూసినట్టుగా సవివరంగా ఎప్పటికీ చిత్రించలేం. 500 ఏళ్ళ ఐరోపా చిత్రకళ మొదట్లో ఫార్మ్ మీదా, తరువాత టోన్ మీదా, తరువాత రంగుమీదా, ఇప్పుడు షేప్ మీదా దృష్టిపెడుతున్నది. కానీ ఆ చిత్రకారుడికి ఎప్పటికీ మిగిలేది అసంతృప్తినే. చీనా చిత్రకారుడికి ఈ సంగతి తెలుసు. అందుకని అతడు తాను చూస్తున్న దృశ్యాన్ని బాహ్యవివరాలతో చిత్రించడం మీద కన్నా దాని ఆత్మను పట్టుకోవడం మీదనే ఎక్కువ దృష్టిపెట్టాడు. నేనూ నా కళ్ళ ముందు సముద్రంలాగా విప్పారుతున్న ఆ వనసౌందర్యాన్ని, జలసౌందర్యాన్ని, ఆ వెలుగుని, ఆ ఛాయల్ని బొమ్మలుగా గియ్యాలని ప్రయత్నించేను. అక్కడికక్కడే plein air లో చిత్రించాలని. ప్రతి ప్రయత్నమూ గొప్ప అసంతృప్తినే మిగిల్చినప్పటికీ. ప్రతి ప్రయత్నమూ కొత్త ఆశని కూడ రేకెత్తిస్తూ వచ్చింది.

14-6-2016 & 15-6-2016

 

Leave a Reply

%d bloggers like this: