రెండుపాటలు

 

62

ఇట్లాంటి ఫాల్గుణమాసాన్ని ఎన్నడూ చూడలేదు. ఇట్లా వసంత ఋతువునూ ఎప్పుడూ స్వాగతించి ఉండలేదు. అకాలంగా కాస్తున్న ఈ ఎండ, ‘శిశిరవసంతాల మధ్య సంభవించే మహామధురమైన మార్పు’ ను అనుభూతిచెందటానికి వీల్లేనంత దట్టమైన తెరకప్పేసింది.

ఈ ఎండకి కోకిలలు ఏమైపోయాయో తెలీదు. పచ్చబంగారు వన్నె తిరగవలసిన లేచిగుళ్ళు ఈ ఎండవేడికి ఎంతగా కమిలిపోయాయో తెలీదు. ఏ రోదసిలోనో మూలాలు తగులుకుని భూమ్మీదకు శాఖోపశాఖలుగా పరుచుకున్న కాంతివృక్షాన్ని చూస్తూ బతికే నాలాటివాడికి ఈ అకాలవాతావరణం ఊపిరాడనివ్వదు. అసలు జీవించినట్టే ఉండదు.

ఇట్లాంటి వేళ మరెట్లా నన్ను నేను బతికించుకోవాలో తెలీక టాగోర్ ని ఆశ్రయించాను. తన చుట్టూ ఋతుపరిభ్రమణం కల్పించే గొప్ప నీడల్ని, మహాసమ్మోహభరితమైన వెలుతుర్నీ ఆయనలాగా పట్టుకున్న మరో కవి ఎవ్వరూ ఇంతదాకా నాకు కనబడలేదు.

ఆ పాటల్ని బెంగాలీలో కూడబలుక్కుని చదువుకుంటూ, ఇంగ్లీషు అనువాదాలతో అర్థం చేసుకుంటూ, రవీంద్రసంగీత గాయకుల కంఠాల్లో పోల్చుకుంటూ నాకు నేను ఊపిరులూదుకుంటూన్నాను.

రెండుపాటలు, నన్ను మరీ మరీ కట్టిపడేసిన రెండుపాటల్ని ఊరికే తెలుగువాక్యాల్లో మీతో ఇట్లా పంచుకుంటున్నాను.

ఇదంతా ఒట్టి సోమరి కల

ఇదంతా ఒట్టి సోమరి కల, ఇదంతా మేఘాల ఖేల
హృదయాకాంక్షలు ఒట్టినే గాలికొదిలెయ్యడమే ఇదంతా
ఊరికినే పూలు గుచ్చడం, మాలలు తెంచడం
క్షణమాత్రహాసవిలపాల్ని ఒక పాటలో ముగించడం.

రవికిరణఛాయలో విప్పారిన లేచిగుళ్ళ పొత్తి
తన నీడలో తానే మైమరిచిన పూలగుత్తి
వాసంతసమీరం సాంత్వనపరుస్తున్న నీడలబొత్తి.

ఏ భ్రమాన్వితసీమలోనో దారితప్పినవాణ్ణి
అన్యమనస్కంగా అటూఇటూ తిరుగాడుతున్నవాణ్ణి
ఎవరికో కానుకచేయడానికన్నట్టు ఏరిన పూలు
సంజపడగానే వాడిపోతాయి, అడవిదారిన తేలిపోతాయి.

ఈ ఆటలో నాకు తోడురావడానికెవరున్నారని!
వింటారో, వినరో మర్చిపోయి పాడుకుంటాను, వినక
పోతారా, నాకోసం రాకపోతారా అని కలలుగంటాను.

సగమే అర్థమైన వైనం

ఊరికినే రావడం, పోవడం,
వట్టినే ఏటివాలున పడి కొట్టుకుపోవడం.
చీకటిలో తచ్చాడటం, వెలుతురుకు మైమరవడం,
ఇట్లా స్పృశించుకున్నామో లేదో, అంతలోనే విడిపోవడం,
క్షణమాత్రం చూసుకున్నామో లేదొ, పొరలివస్తున్న కన్నీళ్ళతో
ముందుకు సాగిపోవడం, మరికొన్ని నిష్ఫలస్వప్నాలతో
ఊరికే మరింత దూరం జరిగిపోవడం,
నమ్మకం చిక్కని ఆశల్ని ఊరికే మూటగట్టి వదిలెయ్యడం.

అంతులేని ఆకాంక్షలు, బలహీనాలు, ఎంత ఎంత ఆరాటపడ్డా
ఫలితాలూ బలహీనాలే, భగ్నాలే,
ఏ విరిగిన నావనో పట్టుకు వేలాడటం
కడలి తరగలపైన కొట్టుకుపోవడం,
కన్నీళ్ళకు ఊహలు వెలిసిపోవడం,
ఊసులు తడబడటం.

ఒక హృదయం సగమే అర్థమైన వైనం,
చెప్పాలనుకున్నది సగంలోనే ఆగిపోయిన విషయం,
సిగ్గుతోనో, భయంతోనో, సగమే చిక్కిన నమ్మకంతోనో,
ప్రేమ ఎప్పటికీ సగం సగమే నిజం.

9-4-2016

Leave a Reply

%d bloggers like this: