డిసెంబర్ చివరి రోజులంతా ఏదో ఒక పారవశ్యంతో గడుస్తాయి. క్రిస్మస్ నుంచి కొత్త సంవత్సరం వచ్చేదాకా ప్రతిరోజూ వెలుతురు వైపు ప్రయాణంలాగా ఉంటుంది.
బైరాగి అన్నట్లుగా-
శైశిర ప్రాతఃపథాన
తుహిన స్నాతావనిపై రవికిరణావలోకనముల
శతసహస్ర శక్రచాప వితతుల అగణిత మణిమయ
జ్యోతులుద్భవిల్లు నేడు; లోకమంత నిశ్శోకం
శాంతి, శాంతి భూతలిపై, శుభైషణలు జనావళికి!
ఈ రోజుల్ని సంగీతమయం చేసినవి ఆంధ్రక్రైస్తవ గీతాలు.
సముద్రతీరప్రాంతాల్లో ధనుర్మాసం తెచ్చే కొత్త కాంతిని వాళ్ళు తమ పాటల్లోకి పిండివడగట్టుకున్నారు.
నలభయ్యేళ్ళ కిందట నేను తాడికొండ గురుకులపాఠశాలలో చదువుకుంటున్నప్పుడు మాకు సాయంకాల ప్రార్థనాసమావేశాలు జరిగేవి. నరసింగరావుగారనే ఒక ఋషితుల్యుడైన ఉపాధ్యాయుడు నడిపించిన సమావేశాలు, అ ప్రార్థనావేళల్ల్లో అన్ని మతాల ప్రార్థనలూ సాగేవి. ఎవరైనా వారికి నచ్చిన భక్తిగీతాలు పాడేవారు. అట్లాంటి ఒక సాయంకాలం వేంకటరత్నమనే పిల్లవాడు ఎలుగెత్తి ఒక కొత్త గీతం ఆలపించాడు:
నడిపించు నా నావా
నడిసంద్రమున ఓ దేవా
నవజీవన మార్గమున
నా జన్మ తరియింప..
ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ పంక్తులు గుర్తుకు రాగానే ఆరువందలమంది పిల్లలు ఎలుగెత్తి పాడుతున్న ఆ గానం, సంతోషంతో వర్షించే మంచు, క్రిస్మస్ తారాకాంతులు, కొత్తసంవత్సరం శుభాకాంక్షలు అన్నీ నన్ను ముంచెత్తుతున్నాయి.
నా జీవిత తీరమున
నా అపజయభారమున
నలిగిన నా హృదయమును
నడిపించుము లోతునకు
నా ఆత్మ విరబూయ
నా దీక్ష ఫలియింప
నా నావలొ కాలిడుము
నా సేవ చేకొనుము
నాలుగైదు రోజుల కింద ‘సాక్షి’ పత్రికలో మాసిలామణిగారి మీద ఒక వ్యాసం చదివాను. అందులో ఆయన ఈ గీతాన్ని 1972 లో రాసారని చదివి ఆశ్చర్యపోయాను. 72 లో ఆయన ఆ పాట రాస్తే 73 కల్లా తాడికొండలో మేమా పాట పాడుతున్నాం. గొప్ప కవిత్వం సంపెంగ పూలతావిలాగా పూసినచోటకే అంటిపెట్టుకుని ఉండిపోదు కదా.
ఆత్మార్పణచేయకయే
ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే
అరసితి ప్రభు నీ కలిమి
పన్నెండేళ్ళ వయసులో ఏమీ అర్థం కాకుండానే ఎంతో సంతోషంగా పాడుకున్న ఈ పంక్తులు యాభై ఏళ్ళ ఈ వయసులో కళ్ళనీళ్ళు తెప్పిస్తున్నాయి. నలభయ్యేళ్ళకిందట నా హృదయంలో నాటిన చందనతరువు ఇప్పుడు సుగంధం పరిమళిస్తున్నట్టుంది.
ఆ తరువాత నా హృదయాన్నట్లా లోబరుచుకున్న గీతాలు ‘రారాజచంద్రుడు’ గీతాలు.
92-93 లో ఉట్నూరులో ఉన్నప్పుడు కాంతారావనే ఉపాధ్యాయుడు నాకు ఆ పాటల కాసెట్టిచ్చాడు. అదొక ప్రైవేటు ఆల్బం. బోస్ అనే రచయిత రాసిన పాటలకి ఎం.ఎం.కీరవాణి సంగీతం కూర్చాడు. అప్పటికింకా కీరవాణి సినిమాల్లో ప్రవేశించలేదుకాబట్టి ఆ పేరెవరికీ తెలీదు.
కాని ఆ పాటలు మమ్మల్నందర్నీ ఎట్లా లొబరచుకున్నాయని!
ఆ తరువాత ఊళ్ళుమారడంలో ఇళ్ళు మారడంలో ఆ కాసెట్టు ఎక్కడో పోగొట్టుకున్నాను. మళ్ళా ఆ పాటలు వినగలనన్న ఊహకూడా లేదు. అట్లాంటిది అక్క మొన్న ఫోన్ చేసి ‘రారాజచంద్రుడు’ పాటలు యూట్యూబ్ లో ఉన్నాయి తెలుసా అంది !
ఆ పాటలు యూట్యూబ్ లో వినవచ్చన్న ఊహ నాకెందుకు రాలేదు!
ఈ సారి మార్కులన్నీ మా అక్కకే.
‘ఆ పాటలే వింటున్నాను, మళ్ళీ మళ్ళీ.. ‘ఎంతో ప్రేమ దేవునికి..’ అంటో ఫోన్ లోనే హమ్ చేస్తోంది అక్క.
ఉండబట్టలేక నిన్న ఆదివారం యూట్యూబ్ తెరిచాను.
హృదయ గగనసీమలో
తారకాళి వీథిలో
నడచి వచ్చుచుండెను
రారాజ చంద్రుడు
మన ఏసుదేవుడు
మొదటి పాట వింటూనే మనసు తేలిపోయింది. ఇరవయ్యేళ్ళకిందటి ఆ డిసెంబరులన్నీ మళ్ళా దోసెడు డిసెంబరాల్ని నా మీద జల్లి మరీ చుట్టూ తిష్టవేసాయి.
జీవితం ఎంత గొప్పది! నువ్వెంత ఎగుడు దిగుడుదారుల్లోనైనా నడిచి ఉండవచ్చుగాక, ఎంత అస్వస్థతకైనా లోనైఉండవచ్చుగాక, నిన్ను నువ్వెంతైనా కోల్పోయి ఉండవచ్చుగాక,
కాని ఒక్క పాట, ఒక్క కవిత, ఎప్పటివాడో నీ చిన్ననాటి స్నేహితుడి ఒక్క పలకరింత-ఒక్కటి చాలు.
నీ ‘వ్యథ ఒక కథ’ గా మారిపోతుంది.
నువ్వొకప్పుడు సంతోషంగా గడిపిన కాలాన్ని ఆ పాట పట్టురుమాల్లో చుట్టి తెచ్చి నీకు మళ్ళా కానుక చేస్తుంది. దాన్ని తెరవగానే పన్నిటి పరిమళం గుప్పున సోకుతుంది.
ఎట్లాంటి పాటలు! గీతాంజలి విన్నట్టే ఉంటుంది ఈ పంక్తులు వింటుంటే!
ఈ కుహూతమూ నిశీథి
శూన్య హృదయగగన వీథి
రాకరాక దయచేసిన
రాకాపూర్ణ కళానిధి
ఎవరోయీ ఎవరోయీ
ఎవరోయీ ప్రసంగీ
చీకటి ముసిరిన వాకిట
ఒక వెన్నెల వేకువలా
నెరవారిన ఎదముంగిట
మరుమల్లెల తొలకరిలా
తరగలెత్తి నాలో ఒక
తరుణారుణ రాగజలధి
ఎవరోయీ ఎవరోయీ
ఎవరోయీ ప్రసంగీ
ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు
ఎదముంగిట తలవాకిట
మౌక్తికముల రంగవల్లి
మరకతమణి తోరణాళి
అంతరంగమంతా ఒక
చింతామణి దీధితి
ఎవరోయీ ఎవరోయీ
ఎవరోయీ ప్రసంగీ
తొలిభవముల అందమైన
అనుభవముల కద్దములా
తలపులింకిపోయిన ఈ
తనువునకొక అర్థములా
ప్రభువేనా ఏసేనా
చరమాశా పరమావధి
ఎవరోయీ ఎవరోయీ
ఎవరోయీ ప్రసంగీ.
ఇన్నాళ్ళ తరువాత కూడా ఒక్క పంక్తికూడా మర్చిపోకుండా నా నెత్తురులో ఇంకిపోయిందీ పాట!
‘అంతరంగమంతా ఒక
చింతామణి దీధితి…’
ఆ బోస్ ఎవరో, ఆయన పాదాలకు నా ప్రణామాలు.
నిన్న సాయంకాలం, రాత్రి, నా హృదయం నవనీత మృదులమైపోయింది.
నన్ను చుట్టుముట్టిన దుఃఖాలన్నీ దూదిపింజల్లా తేలిపోయాయి, ఆ కవిలానే నేను కూడా-
‘ధన్య అనీ
ఈ దీనను
ఎప్పుడు పిలుతువు
ప్రభువా ‘
అని పదేపదే పాడుకుంటూ ఉండిపోయాను.
28-12-2017
Painting: Tsuguharu Foujita
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు