మొన్న భద్రాచలం నుంచి చింతూరు వస్త్తుండగా, మా ప్రాజెక్టు అధికారి నన్ను శ్రీరామగిరి అనే ఊరికి తీసుకువెళ్ళాడు.గోదావరి ఒడ్డున ఉన్న చిన్ని కొండగ్రామం, అక్కడ కొండ మీదనే రామదాసుకి శ్రీరాముడు ప్రత్యక్షమయ్యాడనీ, ఆ విగ్రహాన్నే రామదాసు భద్రాచలంలో ప్రతిష్టించి గుడికట్టించేడనీ చెప్పాడు.
నేనిప్పటిదాకా ఎప్పుడూ వినిఉండని ఆ గ్రామం గోదావరి ఒడ్డునే ఉంది. ఆ చిన్న కొండమీద ఒక రామాలయం. అక్కడ మా పేరున అర్చన చేసిన తర్వాత అర్చకుడు, అక్కడున్న రాముడు ‘యోగరాముడు’ అని చెప్పాడు.
యోగరాముడు!
సరిగానే విన్నానా అని మళ్ళా అడిగాను. ఆ అర్చామూర్తి యోగముద్రలతో ఉన్నాడు. గుళ్ళో నుంచి బయటకు అడుగుపెట్టగానే మా ముందు పావనగోదావరి ప్రత్యక్షమయ్యింది. గబగబా మెట్లు దిగి, ఊళ్ళో అడుగుపెట్టి అక్కణ్ణుంచి మళ్ళా కిందకు మెట్లు దిగి గోదావరి చెంతకు వెళ్ళి నిల్చున్నాను.
అంత నిర్మలంగా, అంత సుందరంగా గోదావరిని నేనెన్నడూ చూసి ఉండలేదు. రావణసంహారం తర్వాత పుష్పకం మీద అయోధ్యకి తిరిగి వస్తూండగా రాముడు సీతకు గోదావరిని చూపిస్తూ ‘ఏషా గోదావరీ రమ్యా ప్రసన్న సలిలా శివా’ అని చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఆయన గోదావరిని వర్ణించడానికి వాడిన మూడు విశేషణాలూ ఇక్కడి గోదావరినే చూపించి చెప్పాడా అన్నట్టుగా ఉంది.
చాలా సేపు ఆ గోదావరినే అట్లా విభ్రాంతంగా చూస్తూ ఉండిపోయేను. త్ర్యంబకం నుంచి అంతర్వేదిదాకా గోదావరిని చూసినవాణ్ణి. జీవితమంతా గోదావరితో పెనవైచుకున్నవాణ్ణి. ఎన్నో రోజులు, సాయంసంధ్యలు, రాత్రులు, ప్రభాతాలు గోదావరి ఒడ్డునే గడిపినవాణ్ణి. కాని, నారచీర కట్టుకున్న సీతమ్మలాగా ఉన్న ఈ రూపంలో గోదావరిని చూడటం ఇదే మొదటిసారి.
అక్కణ్ణుంచి బయలుదేరి ఆ అడవిదారుల్లో ఆ రోజంతా ప్రయాణిస్తూనే ఉన్నానుగాని, నా మనసు అక్కడే ఉండిపోయింది. ఆ అర్చకుడు చెప్పినట్టుగా, రాముడు ఆ కొండమీద తపసుచేసాడని నమ్మడంలో ఒక నిర్మలత్వం ఉంది. అలాకాక, రాముడు కల్పన, రామాయణం వట్టి కథ అనుకుందాం. అయినా కూడా, అక్కడ ఆ కొండమీంచి చూస్తే గోదావరి మన మనసుని కట్టిపడేస్తుందని మొదటిసారి ఏ మానవుడు గ్రహించాడో ఆ మానవుడు రామసమానుడే కదా.
అసలు కొండల్నీ, నదుల్నీ, వనాల్నీ ప్రేమించిన ప్రతివాడూ నా దృష్టిలో రాముడే.
చింతూరు నుంచి మారేడుమిల్లి మీద రంపచోడవరం అడవిదారిన ప్రయాణిస్తున్నానేగాని నా మనసంతా రాముడే నిండిపోయి ఉన్నాడు. ఏ రాముణ్ణి వాల్మీకి ‘గిరివన ప్రియుడు’ అని అభివర్ణించాడో ఆ రాముడు. అసలు, రాముడికీ, అడవికీ మధ్య ఉన్న అనుబంధం గురించే ఆలోచిస్తూ ఉండిపోయేను.
వాల్మీకి రాముణ్ణి గిరివన ప్రియుడని ఎందుకన్నాడు? రాముడు అడవుల్లో పుట్టిపెరిగినవాడు కాడే. వనవాసం కూడా తప్పనిసరి పరిస్థితుల్లో చెయ్యవలసివచ్చినవాడు. అటువంటిది, గంగానదిదాటి సీతాలక్ష్మణులతో చిత్రకూటంలో అడుగుపెడుతూనే వాల్మీకి ‘దీర్ఘకాలోషితస్తస్మిన్ గిరౌ గిరివన ప్రియ/ వైదేహ్యాః ప్రియమాకాంక్షన్ స్వంచ చిత్తం విలోభయన్’ (అయో. 94:1) అంటాడు.
రాముడికి అడవులూ, కొండలూ ఎందుకిష్టమయ్యాయి? రాముడి ఇష్టాల్ని వాల్మీకి చాలాసార్లు ఇట్లానే అకస్మాత్తుగా పరిచయం చేస్తాడు. ఒకచోట లక్ష్మణుడు రాముడితో ‘నీకు చాలా ఇష్టమైన హేమంత ఋతువు వచ్చింది చూడు’ అంటాడు. రాముడికి హేమంతమంటే ఇష్టమని కవి మొదటిసారీ, చివరిసారీ అక్కడే చెప్తాడు. ఇంతకీ ఆ ఇష్టం ఎవరిది? రాముడిదా? కవిదా? ఇంతకీ గిరివనప్రియుడెవరు? రాముడా? వాల్మీకినా?
కాని, చిత్రకూటంలో అడుగుపెట్టినప్పటినుంచీ, రాముడు నిజంగానే గిరివనప్రియుడిగా కనిపిస్తాడు. రామాయణంలోని ఋతువర్ణనలు, శిశిరం, వసంతం, వర్షం, శరత్తు, హేమంతం- అడవిని వర్ణించినవే. ప్రపంచసాహిత్యంలోనే అట్లాంటి ఋతువర్ణనలకు సాటిరాగలిగేవి లేవు. తర్వాత వచ్చిన భారతీయ కవులందరికీ, కాళిదాసునుంచి కృష్ణశాస్త్రిదాకా, ఆ వర్ణనలే దీపికలు. ఆ వర్ణనల్లో ప్రతి ఒక్కటీ అడవిని వివిధ సమయాల్లో, వివిధ కాంతుల్లో చూపించేవే. గొప్ప చిత్రకారులు వస్తువుల్ని కాక, వస్తువుల మీద వెలుగునీడల్ని చిత్రించేటట్టు, కవి కూడా అడవిని కాక, అడవిమీద ఋతువులు పరిచే వెలుగునీడల్ని చిత్రిస్తాడు ఆ వర్ణనల్లో. అడవిలో ఎన్నో ఏళ్ళు ఆరాధనాపూర్వకంగా గడిపినవాడుగానీ, తన్మయీ భావంతో జీవించినవాడుగానీ అట్లాంటి వర్ణనలు చెయ్యలేడు.
వనవాసం మొదలుపెడుతూ, యమునా నది దాటగానే చిత్రకూటం వైపు నడుస్తూ, రాముడు సీతతో చెప్పిన మొదటి మాటలే చూడండి:
ఆదీప్తానివ వైదేహి! సర్వతః పుష్పితాన్ నగాన్
స్వైః పుష్పైః కింశుకాన్, పశ్య, మాలినశిశిరాత్యయేః (అయో.56:6)
(వైదేహీ, దీపాలతో ధగధగలాడుతున్నట్టు పూలు పూసిన ఈ కొండలు చూడు. తమ పూలను తామే మాలలుగా ధరించిన మోదుగచెట్లని చూడు, సమీపిస్తున్న శిశిరఋతువుని చూడు.)
పశ్య, భల్లాతకాన్, ఫుల్లాన్ నరైరనుపసేవితాన్
ఫలపత్రైరవనతాన్, నూనం శక్ష్యామి జీవితుమ్ (అయో.56:7)
(విరగపండిన నల్లజీడిచెట్లు చూడు, పండిన బరువుతో కిందకు వంగిన కొమ్మలు, ఏరుకోడానికి మనుషులు లేని ఈ అడవిలో జీవించడం సాధ్యమనే నమ్ముతున్నాను.)
ఈ రెండు శ్లోకాలతో ఆయన మాఘఫాల్గుణాల అడవి ఎలా ఉంటుందో కళ్ళకి కట్టినట్టు చూపించాడు. ఫణికుమార్ గోదావరి గాథలకు పరిచయం రాస్తూ సి.వి.కృష్ణారావుగారు, రంపచోడవరంలో అడుగుపెట్టేముందు ఫోక్సుపేటకు చేరుకోగానే ఏసి ఎక్స్ ప్రెస్ కోచ్ లో అడుగుపెట్టినట్టుంటుంది అని రాసారు. అడవిలో అడుగుపెట్టిన తొలిక్షణమే అడవిగాలి, కొండగాలీ గుప్పున ముఖానవీచినట్టు ఈ శ్లోకాలు రాసిన కవి వంట్లో రక్తంకాక, కొండగాలి ప్రవహిస్తూ ఉండాలి కదా.
‘శక్ష్యామి జీవితుమ్!’ ఆ మాటలో ఉందంతా. ‘ఈ అడవిలో సంతోషంగా బతికెయ్యగలను’ అనడమన్నమాట. అడవి వానలో ఎలా ఉంటుందో, వెన్నెల్లో ఎలా ఉంటుందో, మధ్యాహ్నాలు ఎలా ఉంటుందో, రాత్రి ఎలా ఉంటుందో-వాల్మీకి చిత్రించినట్టు ఇంతదాకా ఏ కవీ చిత్రించలేకపోయాడు.
విభూతి భూషణుడి ‘వనవాసి’లో సత్యచరణ్ ముంగేర్ వెళ్ళిన చాలారోజులకి గాని అడవి ఆవహించడం ఎట్లా ఉంటుందో తెలుసుకోలేకపోయాడు. కాని, విశ్వామిత్రుడికూడా యాగసంరక్షణకు అడవికి వెళ్ళిన రాముడు మిథిలకు వెళ్ళే ముందు రాత్రి శోణనదీతీరంలో ‘సమృద్ధవనశోభితమైన’ అడవిలో ఒక రాత్రి గడిపినప్పుడు, అడవిలో రాత్రి ఎలా ఉంటుందో కవి వర్ణిస్తాడు. వాల్మీకి వర్ణనల్ని వ్యాసుడి వర్ణనల్తో పోల్చవలసి వచ్చినప్పుడు అరవిందులకి స్ఫురించింది ఈ వర్ణనే:
నిస్పందాః తరవః సర్వే నిలీనా మృగపక్షినః
నైశేన తమసా వ్యాప్తా దిశశ్చ రఘునందన
శనైర్వియుజ్యతే సంధ్యా నభో నేత్రైరివామృతామ్
నక్షత్రతారాగగనం జ్యోతిర్భివభాసతే
ఉత్తిష్టతి చ శీతాంశుః శశీలోకతమోనుదః
హ్లాదయన్ ప్రాణినామ్‌లోకే మనాంసి ప్రభయా విభో. (బా: 34:15-17)
అని మాత్రమే ఆగకుండా
నైశాని సర్వభూతాని ప్రచరంతి తతస్తతః
యక్షరాక్షస సంఘాశ్చ రౌద్రాశ్చ పిశితాశినాః (బా: 34:18)
అని కూడా అంటాడు.
అడవి గురించి రాముడిలో ఒక దైదీభావం ఉందని నాకు నెమ్మదిగా అర్థమయింది. ఆ దైదీభావం వాల్మీకిదే. రాముడికి అడవంటే చాలా చాలా ఇష్టం. కానీ ఆయన అడవిలో సంతోషంగానూ, ప్రశాంతంగానూ గడిపిన క్షణాలు చాలా తక్కువ. అడవి ఆయన్ని తన సౌందర్యంతోనూ, శత్రువులతోనూ కూడా ఎప్పటికప్పుడు ఆయన్ని కలవరపరుస్తూనే వచ్చింది. తన బాధ్యతనుంచి విరామాన్నివ్వవలసిన అడవి ఎప్పటికప్పుడు మరింత కఠినబాధ్యత ఆయన మీద మోపుతూనే వచ్చింది.
అసలు చిన్నపిల్లవాడిగా తండ్రి పంచన తల్లుల ఒడిలో గడపవలసిన కాలంలోనే ఆయన యాగసంరక్షణ కోసం అడవిలో అడుగుపెట్టాడు. అయోధ్య దాటి మొదటిసారి అడుగుపెట్టిన అడవి, మలదకరూశ దేశాల అడవి, ఆ అడవిని చూడగానే రాముడు పలికిన మొదటిమాటలు:
అహో వనమిదం దుర్గమ్ ఝిల్లికాగణ నాదితమ్
భైరవైః శ్వాపదైఃపూర్ణం శకుంతర్దారుణారుతైః (బా:24:13)
(అయ్యో, ఇదేమి అడవి! చొరలేకుండా ఉన్నది, కీచురాళ్ళతో రొదపెడుతున్నది, జంతువుల అరుపులతో, దారుణమైన పక్షికూతలతో మోతపెడుతున్నది)
ఎందుకంటే, ఆ అడవి తాటకి వనం. చిత్రకూటం నుంచి ఋష్యమూకం దాకా రాముడి సమస్య ఇదే. అద్భుతమైన, అందమైన, మనోహరమైన ఆ అడవిలోనే అడుగడుగునా, శత్రువులు (లోపలి శత్రువులూ, బయటి శత్రువులూ కూడా) ఆయన్ని తామేనా వెతుక్కుంటూ వచ్చారు, లేదా తానే శత్రువుల్ని వెతుక్కుంటూ వెళ్ళాడు.
చూడగా, చూడగా వాల్మీకి రాముడికి అడవిని ఒక మెటఫర్ గా చూపిస్తున్నాడా అనిపిస్తుంది, ఒడెస్యూస్ కి సముద్రం లాగా. రాముడిలో సౌందర్య దృష్టి ఒక వైపూ, తలకెత్తుకున్న బాధ్యతలు మరొకవైపూ ఆ వనవాసకాలమంతా పెనగులాడుతూనే ఉన్నాయనిపిస్తుంది. చివరికి ‘అతడు అడవిని జయించిన’ తర్వాతనే శత్రునగరానికి సేతువు కట్టగలిగాడు.
నా ముత్తాత అడవికి వెళ్ళాడుగానీ, అడవిలో ఉండలేక వెనక్కి వెళ్ళిపోయాడు. మా తాతగారు అడవిలో అడుగుపెట్టడానికే ఇష్టపడలేదు. కాని నా తండ్రి రాముడిలానే చిన్నవయసులోనే అడవికి పోక తప్పకపోగా, జీవితమంతా అడవిలోనే గడిపాడు, చివరిరోజుల్లో మళ్ళా ఆ అడవిగాలికోసం కొట్టుమిట్టాడిపోయి, ఆ అడవిగ్రామానికి వెళ్ళి మూడురోజులు తిరక్కుండానే ఆ కొండగాలిలో కలిసిపోయాడు. ఆయనకీ,అడవికీ మధ్య ఉన్న బాంధవ్యంలో రాముడికీ, అడవికీమధ్య ఉన్న అనుబంధమే కనిపిస్తుంది. రాముడిలానే ఆయన కూడా అడవిని ప్రశాంతంగా ఆస్వాదించిన క్ష్ణణాలు చాలా తక్కువ. అడవిలో ఉన్నంతకాలం అడవివాసుల తరఫున అడవిని ఆక్రమించిన వారితో పోరాడుతూనే ఉన్నాడు. ఎన్ని రకాలు కష్టాలు, అవమానాలు, క్లేశాలు అనుభవించవలసి ఉందో అన్నీ అనుభవించాడు.
ఆయన్నుంచి నా అక్కచెల్లెళ్ళు, నా సోదరులూ ఏ వారసత్వం పొందారో గాని, నాకు ఆ అడవీ, ఆ అలజడీ వారసత్వంగా దక్కాయని చెప్పుకోవాలి.
అందుకే, అక్కడ శ్రీరామగిరి మీద యోగరాముణ్ణి చూడగానే నాకు కలిగిన అలజడి ఇంతా అంతా కాదు.
రాముడు నడిచిన దారిపొడుగునా, యోగరాముణ్ణి యాగరాముడెప్పుడూ పక్కకునెట్టేస్తూనే వచ్చాడు. బహుశా, ఇది indian protaganist లు అందరి వేదనా కూడా నేమో. ప్రకృతి సన్నిధిలో ఉండాలనుకుంటారు, ప్రేమైక జీవులుగా ఉంటారు, సమస్తం వదులుకోవాలనుకుంటారు, కణ్వాశ్రమంలో దుష్యంతుడిలాగా ఏ పక్షికూనని చూసినా ప్రేమలో పడకుండా ఉండలేరు. కాని, ఏదో ఒక ధర్మం, ఏదో ఒక బాధ్యత (చాలా సార్లు తమకి తాము నెత్తికెత్తుకున్నవే) గుర్తురాగానే, ఆ అడవినీ, ఆ అందాన్నీ మర్చిపోతారు.
అడవి ఎదట రాముడు అనుభవించిన సంఘర్షణ ఇదే: అడవి ఆయన్ని ఒకవైపు ఆయనకే చేరువగా తీసుకుపోతున్నది, మరొకవైపు లోకంవైపుకు తీసుకుపోతున్నది.
కిష్కింధదగ్గర ప్రస్రవణగిరి మీద కూచుని వర్షఋతు మేఘాల్ని చూస్తూ రాముడు చెప్పిన మాటలు చూడండి:
శక్యం అంబరమారుహ్య మేఘసోపానపంక్తిభిః
కుటజార్జునమాలాభిః అలంకర్తుం దివాకరమ్. (కి:28:4)
(కొండగోగు పూలు మాలకట్టి, ఆ మేఘాల మెట్లమీద, ఆకాశాన్ని అధిరోహించి సూర్యుడి మెడలో వెయ్యాలని ఉంది)
మేఘోదర వినిర్ముక్తాః కలహార సుఖశీతలాః
శక్యం అంజలిభిః పాతుమ్ వాతాః కేతకి గంధినః (కి:28:8)
(కలువ పూల చల్లదానాన్ని పీల్చుకుని, మొగలిపూల సుగంధాల్ని నింపుకుని మేఘగర్భంలోంచి వీస్తున్న ఈ చల్లగాలుల్ని దోసిళ్ళతో తాగాలని ఉంది)
బహుశా ప్రస్రవణగిరి మీద కూచున్నప్పటికీ, రాముడు, ఇక్కడ శ్రీరామగిరిమీద కూచున్నప్పటి ప్రశాంతిలోంచే ఆ మాటలు చెప్పి ఉంటాడనుకోవచ్చుకదా.
26-11-2016