మోండ్రియన్ పూల బొమ్మలు

Reading Time: 3 minutes

312

ఇప్పటి మన చిత్రకారులెవ్వరూ పూలబొమ్మలు గియ్యరు. ప్రసిద్ధ ఆధునిక తెలుగు చిత్రకారులు గీసిన పూలబొమ్మలేవీ నేను చూడలేదు. పూలబొమ్మలు గియ్యడం కూడా figurative art కిందకే వస్తుందనీ, అది చాలా తక్కువస్థాయి చిత్రకళ అనీ ఆధునిక చిత్రకారులు భావిస్తూండవచ్చు. ఆకృతిని నిరాకరించి, నైరూప్యం వైపు ప్రయాణం మొదలయ్యాక, తమ మనోసీమలో ఘూర్ణిల్లే రకరకాల విరూపాకృతులకి వ్యక్తీకరణనివ్వడమే తమ సాధనగా, తమ కళాసాఫల్యంగా భావిస్తున్నారు మన చిత్రకారులు.

కానీ, నిజమేనా?

ఆధునిక చిత్రకళా ఉద్యమాలకు పుట్టినిల్లైన యూరోప్ లో పరిస్థితి ఇందుకు భిన్నం. ఈ మధ్య నా చేతుల్లోకి వచ్చిన పుస్తకం Looking at Paintings: Flowers (హైపీరియన్ బుక్స్, న్యూయార్క్,1993) కూడా ఈ మాటే చెప్తోంది. ఆ పుస్తకాన్ని సంకలనం చేసిన పెగ్గీ రోవాల్ఫ్ చిత్రకారిణి, గ్రాఫిక్ డిజైనర్ కూడా.

ఆధునిక ఐరోపీయ చిత్రకారులు ముఖ్యంగా ఇంప్రెషనిష్టులు, పోస్ట్ ఇంప్రెషనిజానికి చెందిన వాన్ గో, మేటిస్సె వంటివారు,నోల్డె వంటి ఎక్స్ప్రెషనిస్టులూ కూడా పూలబొమ్మలు విరివిగానే గీసారని నాకు తెలుసుగానీ, పాల్ క్లీ తో సహా యాబ్ స్ట్రాక్ట్ ఎక్స్ప్రెషనిస్టులు కూడా పూల బొమ్మల పట్ల అంత మోహపడ్డారని రోవాల్ఫ్ చెప్తేనే మొదటిసారి తెలిసింది నాకు.

కాని ఆశ్చర్యాతి ఆశ్చర్యమేమిటంటే ఐరోపీయ చిత్రకారుల్ని పూలవైపు తిప్పింది తూర్పుదేశాల చిత్రకారులే.

16-17 శతాబ్దాల్లో డచ్చివాళ్ళు తూర్పుదేశాలతో వ్యాపారం మొదలుపెట్టి, వలసలు ఏర్పరచుకున్నాక, తూర్పు దేశాల పూలతో, పూలబొమ్మల్తో యూరోప్ కి పరిచయమేర్పడింది. డచ్ మాట్లాడే బెల్జియం నగరం ఫ్లాండర్స్ లో వికసించిన ఫ్లెమిష్ చిత్రకారులు స్టిల్ లైఫ్ ని చిత్రించడం ఒక అద్భుతమైన కళగా సాధనచేసారు. యూరోప్ చిత్రకళకి ప్రాణం పోసిన ఇటలీ వంటి దక్షిణాదిప్రాంతాల్లో అట్లాంటి చిత్రకళని అంతదాకా dead nature అనేవారు. ఆ నిర్జీవపదబంధంస్థానంలో still life అనే అందమైన పేరు ప్రాచుర్యంలోకి తెచ్చింది ఫ్లెమిష్ చిత్రకారులే. ( స్టిల్ లైఫ్ అనే పదానికి స్థిరజీవన దృశ్యమనే మరింత సమ్మోహనీయమైన పదం వాడుకలోకి తెచ్చింది సంజీవదేవ్ ).

కాని 1853 లో అమెరికా నౌకలు టోక్యో సాగరజలాల్లో ప్రవేశించి, అమెరికాతో వ్యాపారానికి జపాన్ తలుపులు తెరవక తప్పని స్థితి ఏర్పడ్డాక, జపాన్ చరిత్రలోనూ, ప్రపంచచరిత్రలోనూ ఏమేమి జరిగిందోగాని, యూరోప్ చిత్రకారులు మాత్రం పూలబానిసలైపోయారు.

అప్పణ్ణుంచీ యూరోపీయ చిత్రకారుడి తపస్సు ఒక్కటే, అంతదాకా వస్తుశరీరాన్ని మాత్రమే చిత్రించడంలో ఆరితేరిన తనకి, వస్తువునికాక, ఒక జపాన్ చిత్రకారుడిలాగా వస్తుసారాంశాన్ని, ఆత్మని ఎట్లా చిత్రించాలన్నదే. రినైజాన్స్ తరువాత యూరోప్ చిత్రకళని మరొక గొప్ప మలుపు తిప్పిన ఇంప్రెషనిజం వెనక ప్రధాన చోదక శక్తి జపనీయ చిత్రకళనే అని నేడు మనకి స్పష్టంగా బోధపడుతున్నది.

20 వ శతాబ్దంలో యూరోప్ చిత్రకళ, రూపంనుంచి విరూపానికి,అరూపానికి ప్రయాణించిన తరువాత కూడా, నైరూప్య చిత్రలేఖనానికి ప్రవక్తల్లాగా పేరుపొందిన చిత్రకారులు కూడా తమ వ్యక్తిగత ఆనందం కోసమో, తమ అస్పష్ట మానవీయవేదనకు ఆకృతినివ్వడం కోసమో పూలబొమ్మలు గీస్తూనే ఉన్నారని తెలుసుకోవడం లో ఒక సంతోషం ఉంది.

ఉదాహరణకి పియెట్ మోండ్రియెన్ (1872-1944). డచ్చి చిత్రకళలో రెంబ్రాంట్, వాన్ గో ల తరువాత అంత సమున్నతుడైన చిత్రకారుడిగా ప్రసిద్ధి చెందిన మోండ్రియన్ మొదట్లో అమ్ స్టర్ డాం కాలువలచుట్టూ ఉండే ప్రకృతి దృశ్యాల్ని చిత్రించడంతోటే తన ప్రయాణం మొదలుపెట్టాడు. నెమ్మదిగా రూపం వెనక ఉండే జామెట్రీని కనుగొనడానికి ప్రయత్నించాడు. చివరికి తన చిత్రాల్లో వక్రరేఖల్ని పూర్తిగా పరిహరించి, దృగ్విషయమంతటినీ, నిలువురేఖలు, అడ్డగీతలుగా మాత్రమే చూడటంలోనూ, చిత్రించడంలోనూ ఆరితేరాడు. దృశ్యవైవిధ్యాన్ని స్థలకాల పరిమితులనుంచి విడదీసి, లేదా, వడగట్టి, ఒక సార్వత్రిక అధ్యాత్మిక సత్యంగా చిత్రించే తపస్సు చేసాడు. ఆ క్రమంలో పూటగడవడం కష్టమైనా పెళ్ళి చేసుకోవడం మానేసాడుగానీ, తన సాధన వదులుకోలేదు. ఈ రోజు ఆధునిక నైరూప్య చిత్రలేఖనానికి అగ్రశ్రేణి ఉదాహరణగా నిలబడ్డాడు.

కాని బయటప్రపంచానికి నైరూప్య చిత్రలేఖనాన్ని పరిచయం చేస్తున్న కాలంలోనే అతడు తనకోసం రహస్యంగా పూలబొమ్మలు గీసుకుంటూ ఉన్నాడు. జీవికకోసం ఒకటీ అరా నీటిరంగుల పూలచిత్రాలు గీసిఉండటం కాదు, తన కోసమే, తన ఏకాంతాన్ని, తన ఉత్సాహాన్ని తనతో తాను పంచుకోవడం కోసమే అతడు పూలబొమ్మలు గీసుకుంటూ ఉన్నాడని ఇప్పుడు బయటపడుతున్నది.

మోండ్రియన్ పూల బొమ్మలు ఎందుకు గీసాడు? ఈ ప్రశ్న కన్నా పూలబొమ్మలు ఎందుకు గియ్యకుండా ఉండలేకపోయాడని ప్రశ్నించుకోవాలి మనం.

1991 లొ అమెరికాలో మోండ్రియన్ పూలబొమ్మల ప్రదర్శనను సమీక్షిస్తూ ఒక భావుకుడిట్లా రాసాడు:

‘ఒకకారణమేమంటే, అతడు తన యాబ్ స్ట్రాక్ట్ చిత్రలేఖనాల్లో ఏ వైరుధ్యాలమీద దృష్టిపెట్టాడో, ఆ వైరుధ్యాలు పుష్పాకృతుల్లో కూడా కనిపిస్తాయి కాబట్టి. అవి ఏకకాలంలో దృఢంగానూ, దుర్బలంగానూ కనిపిస్తాయి, సగర్వంగా శిరసెత్తుకుని వికసిస్తాయి, ఇంతలోనే దీనంగా తలవాల్చుకుంటాయి కూడా. ఏకకాలంలో యవ్వనాన్నీ, వార్థక్యాన్నీ కూడా స్ఫురింపచేస్తాయి. తమ ఏకాంతాన్ని చూస్తుంటే మనకు ఆత్మవిశ్వాసమూ స్ఫురిస్తుంది, అపారమైన నిస్పృహ కూడా ద్యోతకమవుతుంది కనుక..’

మోండ్రియన్ నైరూప్య చిత్రలేఖనాల్లో, నిలువు గీతల్లో పురుష ప్రకృతినీ, అడ్డగీతల్లో స్త్రీ ప్రకృతినీ పట్టుకోవడానికి చూసాడంటారు. ఆ మాట గుర్తు చేస్తూ డేవిడ్ షపీరో అనే కవి ఇట్లా రాసాడు:

‘మోండ్రియన్ జీవితకాలం పాటు చిత్రించిన చిత్రాల్లో నిజమైన నగ్నచిత్రాలంటూ (న్యూడ్స్) అంటూ ఉంటే అవి అతడి పూలబొమ్మలే’

అయితే ఆ చిత్రాల్లోని సౌకుమార్యం వల్ల స్త్రీనగ్న చిత్రాలా, లేక ఆ పూల తలలచిత్రణకిచ్చిన ప్రాధాన్యతవల్ల, పురుష నగ్న చిత్రాలా, లేక, సాంప్రదాయిక స్త్రీపురుష వైరుధ్యాలకు అతీతంగా వికసించిన నగ్న చిత్రాలా చెప్పడం కష్టమని మరొక భావుకుడు పేర్కొన్నాడు.

24-8-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: