మార్క్ ఫోలీ

64

ఇప్పుడు నీటిరంగుల్తో ప్రయోగాలు చేస్తున్న వాళ్ళల్లో అగ్రగణ్యుడైన ఫ్రెంచి చిత్రకారుడు మొరెల్లిని నేను అభిమానిస్తున్నానని చెప్పానుకదా, మరి మొరెల్లి అభిమానిస్తున్న చిత్రకారులెవరు?

అతడు అమెరికన్ గ్రాఫిక్ డిజైనర్ మిల్టన్ గ్లాసర్ నుంచి స్ఫూర్తి పొందానని చెప్పుకున్నాడు. కాని ఇటీవలి కాలంలో అతడు పదే పదే మాట్లాడుతున్న చిత్రకారుడు తన కన్నా ఇరవయ్యేళ్ళు చిన్నవాడైన మార్క్ ఫోలీ. (ఆ మాటకొస్తే మార్క్ ఫోలీ నాకన్నా కూడా చిన్నవాడే).

మార్క్ ఫోలీ మరొక ఫ్రెంచి చిత్రకారుడు. అతడూ, మొరెల్లీ కలిసి సంయుక్తంగా తమ చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. 2012 లో ఫ్రెంచి పట్టణం రీమ్స్ లో వారిద్దరూ ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసినప్పుడు, ఒక పత్రిక వారిని ఇంటర్వ్యూ చేసింది. ఇంటర్వ్యూ చేసిందనడం కన్నా వారిద్దరిమధ్యా సాగిన ఒక సంభాషణ ను రికార్డు చేసింది. ఆ సంభాషణ ఇద్దరు సమకాలిక నీటిరంగుల చిత్రకారుల మధ్య సంభాషణనే అయినప్పటికీ, రెండు తరాల దృక్పథాల మధ్య సంభాషణ కూడా. వయసులో పెద్దవాడూ, ప్రయోగశీలీ అయిన మొరెల్లి తన భావాల్లో యువకుడిగానూ, సాహసికుడిగానూ కనిపిస్తే, యువకుడూ, వర్ధిష్ణువూ అయిన ఫోలీ ఎంతో జాగ్రత్తపరుడూ, సంప్రదాయాన్నీ పునరన్వేషించేవాడిగానూ కనిపించడం నన్ను ఆశ్చర్య పరిచింది.

వాళ్ళు సంభాషణ మొదలుపెడుతూనే ఒక మాట చెప్పుకున్నారు. మామూలుగా ఏ ఇద్దరు చిత్రకారులూ తమ కళ గురించి బాహాటంగా చర్చించుకోరు, ఎందుకంటే ఇద్దరిలోనూ కొంత స్పర్థాశీలత ఉంటుంది కాబట్టి నలుగురూ వినేలా వాళ్ళు తమ కళగురించి చర్చించుకోరని. కాని తామిద్దరూ, చిత్రకళని కేవలం ఒక కళగా మాత్రమే కాక ఒక వారసత్వంగా, ఒక సాంస్కృతిక సంప్రదాయంగా కూడా చూస్తున్నారు కాబట్టి తమకి అట్లా మాట్లాడుకోవడం ఇబ్బందిగా లేదన్నారు.

65

మార్క్ ఫోలీ కూడా మొదట్లో మొరెల్లి చూపించిన దారిలోనే, ఆ తేమబాటలోనే ప్రయాణం మొదలుపెట్టాడు. ఇక్కడ పొందుపరిచిన బొమ్మ, ప్రాతఃకాల కాంతిలో కపిలవర్ణ శోభితమైన ద్రాక్షపళ్ళ గుత్తి, వెట్-ఇన్-వెట్ పద్ధతిలో చిత్రించిన బొమ్మ. దాన్ని ప్రతిష్టాత్మకమైన ‘ఆర్ట్ ఆఫ్ వాటర్ కలర్’ పత్రిక ముఖచిత్రంగా ముద్రించిందంటేనే ఆ చిత్రం ప్రశస్తి మనకి తెలుస్తున్నది. కాని, దానిలో మొరెల్లిలో కనిపించే ప్రవాహశీలత, చలనశీలత లేకపోవడం గమనించాలి.

అలాగే, మొదటి బొమ్మ నైపుణ్యంలో మరింత సిద్ధహస్తాన్ని కనపరుస్తోంది. తెల్లటి వస్త్రం మీద గులాబీల ఊదారంగునీడలు. కుంచె మీదా, రంగులమీదా, దృశ్యం మీదా అసాధారణమైన పట్టు సాధించినవాడు మాత్రమే ఇట్లాంటి చిత్రం చిత్రించగలడు.

కాని ఇందులో కూడా మొరెల్లిలో కనిపించే గతిశీలత లేదు. ఎందుకని?

ఆ రోజు వాళ్ళిద్దరి మధ్యా జరిగిన సంభాషణ మొత్తం ఈ అంశం చుట్టూతానే తిరిగింది. తాను మొదట్లో వెట్-ఇన్-వెట్ పద్ధతి పట్ల ఆకర్షితుడైనప్పటికీ, అది తన స్వభావానికి సరిపోదనీ, అందువల్ల వదిలేసాననీ మార్క్ చెప్పాడు. అతడిట్లా అంటున్నాడు:

‘నా తేమ దశ (wet period) ఏడాదిన్నర పాటుమాత్రమే నడిచింది. తేమ కి సంబంధించిన అన్ని అంశాలూ నాకు సరిపోవని నేను గ్రహించాను. దానిలో ఒక నిర్మాణం లేదు, నరాల తీవ్రత లేదు. నీరు దాదాపుగా ప్రతి ఒక్కదాన్నీ, చివరికి చిన్నపాటి జాగాలు వదలకుండా అన్నీ ఆక్రమించేస్తుంది. నీరు నియంతలాంటిది. అక్కడ రాతల మధ్య వైవిధ్యానికి చోటులేదు. ఇక ఆ తేమవల్ల అన్నిరకాల సంజ్ఞలూ అణగిపోయ్యే ప్రమాదమెలానూ ఉంది. చివరికి కుంచె గీతల ఆనవాళ్ళు కూడా మిగలకుండా నీరు ముంచెత్తుంది…’

ఇది నీటిరంగుల చిత్రకారుడు మాట్లాడుతున్న మాటల్లా లేవు. ఒక పోస్ట్ మాడర్న్ తత్త్వవేత్త, అన్ని రకాల signs నీ అణచివేసే hegemony గురించి మాట్లాడుతున్నట్టుంది.

ఈ స్థితినుంచి బయటపడటానికి మార్క్ ఎంచుకున్న మార్గమేమిటి? మరింత ప్రయోగశీలత్వమా? కాదు. సాంప్రదాయిక చిత్రకారులు తమనీ, తమ కళనీ కాపాడుకోడానికి ఏ తోవన నడిచారో అదే తోవ.

అది మూడు దశల ప్రయాణం. మొదటిదశలో, విస్పష్టమైన రేఖా చిత్రం (drawing). అప్పుడు, కంటిముందున్న దృశ్యాన్ని విస్పష్టమైన వెలుగునీడల్లో (values) కి అనువదించుకోవడం. ఆ వెలుగునీడల్ని రంగుల్లోకి మార్చుకోవడం చివరి దశ.

చూపరులకి రంగులు అద్భుతంగా కనిపిస్తాయిగాని, నిజానికి అదంతా values చేసే ఇంద్రజాలమనేది చిత్రకళలో ఉండే నానుడి. వాల్యూస్ (వాల్యూ అంటే విలువ అని అర్థం కాదు, అది చిత్రకళాపరిభాషలో వెలుగునీడల సాంద్రతని సూచించే పదం) లేకపోతే రెండుకొలతల తలం ఎప్పటికీ చిత్రంగా మారదు. డావిన్సీ నుంచి మొరెల్లీ దాకా వాల్యూ లేకపోతే చిత్రకారుడే లేడు. ఇప్పుడు కొత్తగా మార్క్ వాల్యూస్ గురించి చెప్తున్నదేమిటి?

అతడు చెప్తున్నది రంగు కన్నా రేఖకీ, వాల్యూకి తాను ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాడనే. ఇది స్పష్టంగా సాంప్రదాయిక దృక్పథం. సాహిత్య పరిభాషలో చెప్పాలంటే, కథనం కన్నా కథకి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్టు.

ఒక యువకుడిట్లా మాట్లాడటం నన్ను ఆశ్చర్యపరిచింది. కాని బహుశా ఇప్పుడు యూరోప్ ఈ దిశగా ప్రయాణం మొదలుపెట్టింది కావచ్చు. కాని అతడి మాటలకి మొరెల్లి ఇచ్చిన జవాబు నాకు గగుర్పాటు కలిగించింది.

నీరు తనని ముంచేస్తుందనే భయాన్ని మార్క్ ప్రకటించినప్పుడు మొరెల్లి అతడితో, ఆ భయం నీటిలోని అపారమైన ఆకర్షణ వల్ల పుట్టే భయమని చెప్తూ యులిసెస్ కథని గుర్తు చేస్తాడు. యులిసెస్ సముద్రం మీద తిరిగి గృహోన్ముఖ యాత్ర చేస్తున్నప్పుడు ఒకచోట అతడు సాగరకన్యల గానాన్ని వినవలసివస్తుంది. ఆ గానం ఎంత ప్రలోభపూరితంగా ఉంటుందంటే, ఆ దారినపొయ్యే నావికులు ఆ గానపాశానికి లోబడి ఓడమీంచి సముద్రంలోకి దూకేస్తుంటారు. అందుకని యులిసెస్ ముందు జాగ్రత్త చర్యగా,తన నావికులందరి చెవుల్లోనూ మైనం నింపుతాడు. తనని మాత్రం ఓడ తెరచాపకొయ్యకి ఇనపగొలుసుల్తో బంధించమంటాడు. తానెంత వేడుకున్నా ఆ గొలుసులు విప్పవద్దంటాడు. అతణ్ణట్లానే కట్టేస్తారు. ఓడ ఆ దారినరాగానే మహామోహపూరితమైన ఆ సాగరకన్యల సంగీతం అతడి చెవులపడుతూనే అతడా కట్టుబాట్లనుంచి విడివడాలని శతధా ప్రయత్నిస్తాడు. కాని తక్కిన నావికులకి, చెవుల్లో మైనం వల్ల ఆ గానం వినబడదు కాబట్టి, వాళ్ళు యులిసెస్ ని మరింత గట్టిగా బంధిస్తారు. చివరికి ఓడ ఆ విపత్కర సంగీత ఛాయనుంచి తప్పించుకున్నాక యులిసెస్ ని విడుదల చేస్తారు.

మొరెల్లి యులిసెస్ గురించి చెప్పడంలో మనం చూడవలసిందేమిటంటే, యులిసెస్ కూడా తన నావికుల్లానే తాను కూడా చెవుల్లో మైనం పెట్టుకోవచ్చు కదా, అంత హింస పడటం దేనికి? ఎందుకంటే, యులిసెస్ ఆ సంగీతం వినాలనుకున్నాడు. దాని ఆకర్షణ ఏమిటో తేల్చుకోవాలనుకున్నాడు. కాని అది తనని ముంచెత్తకుండా తనని తాను బంధించుకున్నాడు.

ఒక్క నీటి రంగుల చిత్రకారుడికే కాదు, ఏ కళాకారుడికైనా ఇది వర్తిస్తుంది, ఆ మాటకొస్తే, జీవితానందాన్ని రుచిచూడాలనుకున్న ప్రతి పిపాసికీ ఇది వర్తిస్తుంది. నీ కళలోకి నువ్వు దూకాలి, కాని మునిగిపోకూడదు. కొన్ని కట్టుబాట్లతో నిన్ను నువ్వు బంధించుకునే ఉండాలి.

మొరెల్లి మాటల్ని మార్క్ పూర్తిగా అనుసరించగలడని చెప్పలేం. ఎందుకంటే అతడి స్వభావం వేరు. మార్క్ లో తన otherness ని తాను చూస్తున్నాననీ, అందుకనే అతడి చిత్రాల్ని తానిష్టపడుతున్నానంటాడు మొరెల్లి.

24-2-2016

arrow

Paintings:  Marc Folly

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s