‘నిండుగా పూసిన మామిడిచెట్టు ఎదట
ఏ ఒక్కరూ ఒంటరి కారు ‘
ఎప్పుడో రాసుకున్న ఈ కవితావాక్యాల్ని వారందినాల కింద ఒక మిత్రురాలు మళ్ళా నా స్మృతికి తెచ్చారు. ఆమెకి నా వందనాలు.
అవును, ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు, మహనీయ జపనీయ కవీశ్వరుడు ఇస్సా రాసుకున్న ఈ హైకూ నా మనసులో మెదుల్తూంది.
‘చెర్రీ తరువులకింద
ఎవరూ
అపరిచితులుకారు’
కాని ఆ మూడుపాదాలు నా మనసుమీద శాశ్వతంగా ముద్రించిన మనోహర స్ఫురణ వెనక, నేనెన్నడో చదువుకున్న ఒక ప్రాకృత కవిత కూడా ఉంది.
వజ్జాలగ్గంలో (66:2) కవిత.
‘పరిధూసరాపి సహకారమంజరీ వహతు మంజరీ నామ.’
(దుమ్ముపడ్డా కూడా మామిడిపూల గుత్తి మామిడిపూల గుత్తినే)
ముందు మామిడిపువ్వు , మామిడి చిగుర్లు ఆ వెనక. ఇదొక వ్యత్యస్తాలంకారం. కాని పూర్వకవులు, ముఖ్యంగా సంస్కృతకవులు ఈ సున్నితమైన భేదాన్ని పట్టించుకున్నట్టు లేదు. వాళ్ళ దృష్టిలో మామిడిపూత వసంతకాల చిహ్నమే. కాని ఇంకా మంకెనలు కూడా పూయకముందే మామిడిపూస్తుంది. కొన్నిచోట్ల, కొన్నిసార్లు మార్గశిరం చివరిదినాలకే మామిడి మొగ్గలు తలెత్తడం కనిపిస్తుంది. సూర్యుడి రథం ఉత్తరం వైపు తిరగ్గానే ఆ రథధూళి రేగినట్టుగా మామిడిచెట్లనిండా అలౌకిక కాంతి పరచుకుంటుంది. అది పుప్పొడినో, దుమ్మునో తేల్చుకోడం కష్టం. అందుకనే ప్రాకృతకవి, దుమ్ము పడ్డా కూడా మామిడిపూల గుత్తిని పూలగుత్తి అనే అంటారన్నాడు.
మామిడి చిగురించడం, కోకిల ప్రవేశించి గొంతెత్తడం సంస్కృత సాహిత్యంలో ఒక కవిసమయంగా స్థిరపడిపోయాక,ఆ సౌందర్యంలో మామిడిపూతకి చోటులేకుండా పోయింది. చెట్టంతా పువ్వుగా మారి, పూసిన పూతంతా ఒక పరాగంలాగా, పచ్చని పొగలాగా అల్లుకునే పూతమామిడి సౌందర్యానికి ఆ కవిత్వంలో చోటులేదు.
పూసినమామిడిచెట్టుకోసం కాళిదాసు ఒక అపురూపమైన శ్లోకాన్ని కేటాయించకపోలేదు. కాని ఈ అద్భుతమైన శ్లోకం ‘ఋతుసంహారం’ లో వసంతవర్ణన (6:26) లో కలిసిపోయింది.
నేత్రే నిమీలియతి రోదితి యాతి శోకమ్
ఘ్రాణం కరేణ విరుణద్ధి విరౌతి చోచ్చైః
కాంతావియోగపరిఖేదితచిత్తవృత్తి
దృష్ట్వాధ్వగః కుసుమిత సహకారవృక్షాన్
(ప్రవాసి అయిన బాటసారి ఒకడు దారిపక్క నిండుగా పూసిన మామిడిచెట్టుని చూడగానే తన కాంత దగ్గర లేదన్న చింత మనసుని ఆవహించి కళ్ళు మూసుకున్నాడు, బాధపడ్డాడు, ఏడ్చాడు, చేతులు నాసికకు అడ్డుపెట్టుకుని ఎలుగెత్తి విలపించాడు)
నిండుగా పూసిన మామిడిచెట్టు కలిగించగల వ్యథ మామూలు పరితాపం కాదు, కాని అది రేకెత్తించగల ఆత్మీయతకూడా సామాన్యమైనది కాదు.
మామిడిచెట్టు ఏడాదిలో ఆరునెలలు నిద్రపోతుంది. ఆరునెలలు పరిపూర్ణంగా జీవిస్తుంది. పూర్తి ఉత్సాహంతో, మహావైభవంతో జీవిస్తుంది. మాఘమాసంలో పూత, ఫాల్గుణంలో పిందె, వైశాఖంలో రసాలూరే ఫలాలు-ఇంత త్వరత్వరగా పుష్పించి, ఫలించే ఈ వైనం ఒక సంస్కృతకవికి ప్రేమవ్యవహారంలాగా అనిపించింది. ‘సదుక్తికర్ణామృతం’ అనే ఒక అరుదైన సంకలనంలోని ఈ అందమైన శ్లోకం ఒక బ్లాగులో నా కంటపడింది:
అంకురితే పల్లవితే కోరకితే వికసితే చ సహకారే
అంకురితః పల్లవితః కోరకితో వికసితశ్చ మదనాసౌ
(మామిడిపువ్వు తలెత్తి, చిగురు తొడిగి, మొగ్గతొడిగి, వికసించినట్టుగా
ప్రేమ కూడా అంకురించింది, పల్లవించింది, మొగ్గతొడిగింది, వికసించింది.)
ఒకప్పుడు శ్రీ శ్రీ తనకి అత్యంత స్ఫూర్తిదాయకమైన వాక్యంగా Stalingrad at War అనే న్యూస్ హెడ్ లైన్ ని తలుచుకున్నాడు. నాజీసైన్యాల్ని సోవియెట్ సేనలు స్టాలిన గ్రాడ్ దగ్గర నిలవరించిన యుద్ధం గురించిన వార్త అది. కాని, నాజీ సైన్యాలమీద విజయం సాధించిన సోవియెట్ సేనలు పోలండ్ లో అడుగుపెట్టాక ఏమి చేసాయో తెలిసిన తర్వాత నాకా వాక్యం ఇంకెంతమాత్రం స్ఫూర్తిదాయకం కాలేకపోయింది.
కాని ఎప్పటికీ నాకు స్ఫూర్తిదాయకమైన వాక్యమేదో చెప్పమంటే నేనీ వాక్యాన్నే తలుచుకుంటాను.
‘మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే..’
శ్రీ శ్రీ ఈ మాట వింటే గింజుకుంటాడని నాకు తెలుసు. కాని శ్రీ శ్రీ యుద్ధం గురించి రాసాడు తప్ప యుద్ధం చేయలేదు. దాశరథి యుద్ధం చేసాడు, అంగారాన్ని దోసిట పట్టుకున్నాడు కాబట్టే బంగారంలాంటి ఈ వాక్యం రాయగలిగాడు.
మామిడికొమ్మ మళ్ళీ మళ్ళీ పూయునులే
మాటలు రానికోయిలమ్మ పాడునులే
ఆనందంతో..అనురాగంతో
నా మది ఆడునులే.
29-1-2018