1967-71 ప్రాంతాల్లో శ్రీకాకుళం గిరిజనప్రాంతాల్లో తలెత్తిన తిరుగుబాటు, అలజడీ పార్వతీపురం గిరిజన ప్రాంతాల్లోనే ప్రధానంగా సంభవించేయి. ఆ తర్వాత ఇరవయ్యేళ్ళకి, అంటే, 1987 లో నేను జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా ఉద్యోగంలో చేరినప్పుడు పార్వతీపురం గిరిజనప్రాంతాల్లోనే ట్రైనింగూ, మొదటి పోస్టింగూ కూడా. అక్కణ్ణుంచి అనూహ్యపరిస్థితుల్లో 1990 లో ఆ జిల్లా వదిలిపెట్టి వచ్చేసినదాకా, ఆ అడవుల్లో నేను తిరగని చోటులేదు, ఎక్కని కొండలేదు. ఆ తర్వాత కొన్నిసార్లు ఉద్యోగరీత్యా పార్వతీపురం దాకా వెళ్ళగలిగానుకాని, మళ్ళా ఆ మారుమూల ప్రాంతాలు చూసే అవకాశం దొరకలేదు. మళ్ళా ఇన్నాళ్ళకి, వారంరోజుల పాటు పార్వతీపురం, సీతంపేట గిరిజనప్రాంతాల్లో కొన్ని మారుమూల ప్రాంతాలు పర్యటించే అవకాశం లభించింది. ఆ ప్రాంతాల్లో పాఠశాలలు ఎట్లా పనిచేస్తున్నాయో, వాటి పనితీరు మెరుగుపర్చడానికి ఎటువంటి సూచనలు చెయ్యవచ్చో చూడటానికి ఆ ప్రాంతాలు మరోసారి తిరిగాను. నిండుగా పూసిన మామిడిచెట్ల అడవుల్లో, జీడిమామిడి తోటల మధ్య సాగిన నా ప్రయాణం నాకూ, ఆ అడవులకీ మధ్య దాదాపు మూడు దశాబ్దాల దూరం ఏర్పడిందన్న విషయాన్ని మరిపించింది.
2
విజయనగరం జిల్లాలో పాచిపెంట మారుమూల మండలం. 1984 లో మొదటిసారి గణపతి అచ్యుతరామరాజు నన్నక్కడికి తీసుకువెళ్ళారు. కళింగాంధ్ర సాహిత్యం గురించి మాట్లాడటానికి. అప్పట్లో పి.వి.ఎస్ పాత్రో అనే ఒక రచయిత ఉండేవారక్కడ. ఆ తర్వాత నా ట్రైనింగులో భాగంగా నెల్లాళ్ళపాటు ఆ ఊళ్ళో గడిపాను కూడా. ఆ మండలంలో వేటగాని వలస ఒక మారుమూల గిరిజన గ్రామం. ఆ గ్రామం దాటగానే కొండలూ, దట్టమైన అడవులూను. నా ట్రైనింగురోజుల్లో ఒక రాత్రి ఆ పాఠశాలలో గడిపాను. మట్టిబాటవెంబడి కొంతదూరం ప్రయాణించాక, కాలినడకన పెద్ద ఏరుదాటి కొండ ఎక్కి, రెండు పాడుపడ్డ గదులతోనూ, నలుగురైదుగురు పిల్లలతోనూ ఉన్న ఒక పాత ఇంట్లో గడిపిన జ్ఞాపకం. ముప్పై ఏళ్ళ తరువాత నేను చూసిన దృశ్యం నన్ను నివ్వెరపరిచింది. ఈసారి కారు నేరుగా పాఠశాల ముందు ఆగింది. పెద్దపెద్ద భవనాలు. బిలబిల్లాడుతూ పదిహేనుమంది ఉపాధ్యాయులు నాకు స్వాగతం చెప్పారు. అక్కడ గ్రౌండులో కనీసం వందమంది విద్యార్థులు వాలీబాల్, ఫుట్ బాల్ లాంటి ఆటాలడుకుంటున్నారు. ఆ ఉపాధ్యాయులతో గంటకు పైగానే మాట్లాడాను. వాళ్ళంతా గిరిజనయువతీయువకులు. ఒకప్పుడు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఉపాధ్యాయులు దొరక్క, పదవతరగతి ఫెయిలైనా కూడా ప్రభుత్వం వాళ్ళకి ఉద్యోగాలిచ్చింది. కాని ఇప్పుడో, వాళ్ళల్లో తెలుగు పండితులున్నారు, హిందీ పండితులున్నారు, సైన్సు, లెక్కలు, ఇంగ్లీషు చెప్పడానికి అర్హతలు సాధించిన గిరిజనులు ఉన్నారక్కడ. అదంతా చూసాక నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను.
3
గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి ఏం జరిగింది? ప్రభుత్వం ఏం చేసింది లాంటి ప్రశ్నలు తరచూ వింటూ ఉంటాం. యాభై ఏళ్ళ కింద గిరిజనులు సాయుధంగా తిరగబడ్డ ఆ ప్రాంతాల్లో, ముఫ్ఫై ఏళ్ళకింద ఆ ప్రాంతాలు ఎంత వెనకబడి ఉండేవో కళ్ళారా చూసి, ఆ సమస్యల్తో శాయశక్తులా తలపడ్డ నాకు, ఈ రోజు అక్కడ కనిపిస్తున్న అభివృద్ధి నమ్మశక్యం కానంతగా కనిపించింది. ఈసారి వేటగాని వలస పాఠశాల నేను చూసిన మొదటి పాఠశాల. ఆ ఒక్క విజిట్ చాలు. వెనక్కి వచ్చెయ్యనిపించింది. ఆ తర్వాత సుమారు ఇరవై పాఠశాలలదాకా చూసాను. అందులో ఒకటిరెండు తప్ప మిగతావన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్టే ఉన్నాయి. ఒకవేళ వాటిల్లోంచి ఉత్తమపాఠశాలనొకదాన్ని ఎంపికచెయ్యమంటే, ఏ ఒక్కదాన్నో ఎంచడం నాకు కష్టమే. అట్లాంటి మరొక రెండు మూడు పాఠశాలల గురించి రాయాలని ఉంది.
4
కురుకుట్టి సాలూరుమండలంలో మారుమూల గ్రామం. ఆ ఊరు దాటాక ఒక ఏరు. ఆ ఏరుదాటాక ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుగా నిలబడే మహా పర్వతపంక్తీ, మహారణ్యాలూను. అక్కడొక ఆశ్రమ పాఠశాల ఉంది. నేనున్నప్పుడు ప్రాథమిక పాఠశాల, ఇప్పుడు ఉన్నతపాఠశాల. అక్కడ పదవతరగతి పిల్లల్తో మాట్లాడుతున్నప్పుడు గమనించాను. వాళ్ళల్లో సగం మంది, ఆ కొండలమీద ‘చోర’, ‘కొదమ’ లాంటి గ్రామాలకు చెందినవాళ్ళని. సుమారు ఇరవై, ముఫ్ఫై కిలోమీటర్లు కాలినడకన కొండలు దిగి అక్కడకు రావాలి వాళ్ళు. వాళ్ళంతా జాతాపు తెగకి చెందినవాళ్ళు. ఇంకా వాళ్ళ మాతృభాష ‘కుయి’ సజీవంగానే ఉంది. కాని ఆ పిల్లలు అన్ని అవరోధాల్నీ దాటి పదవతరగతిదాకా చేరగలిగారు. చూడముచ్చటగా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతూండగా గోడమీద హిందీ రచయితల గురించి హిందీలో రాసిన పోస్టర్లు కనిపించాయి. అదేమిటో చదవగలవా అనడిగాను ఒకమ్మాయిని. ‘సుమిత్రానందన్ పంత్’ అందామె. అక్కడితో ఆగక పంత్ జీ కవితావాక్యాలు వినిపించడం మొదలుపెట్టింది. నా వళ్ళు ఝుల్లుమంది. ఎక్కడో హిమాలయసానువుల్లో జన్మించిన సుమిత్రానందులు ఎక్కడ! ఈ సాలూరు దుర్గమారణ్యాల్లో పుట్టిన ఈ కొండతెగల పిల్లలు ఎక్కడ! మీకు ఇదెవరు నేర్పించారని అడిగాను. మా హిందీ టీచర్ అన్నారు. ఆ టీచర్ ని నువ్వెక్కడ చదువుకున్నావు అని అడిగాను. పార్వతీపురంలో మంచిపల్లి శ్రీరాములుగారి విద్యార్థిని అని చెప్పింది. ఆ ప్రధానోపాధ్యాయుడు గురుమూర్తి తన జీవితమంతా ఆ పాఠశాలలకే అంకితం చేసాడు. అతడి అలమారులో నేను రాసిన పుస్తకాలు చూపించి ‘ఇవే సార్ నాకు స్ఫూర్తి’ అన్నాడు. ఆ మారుమూల ఆ గురుపరంపర ఎట్లాంటి నిశ్శబ్ద విప్లవాన్ని సుసాధ్యం చేస్తున్నారో కళ్ళారా చూసాక నేను చలించకుండా ఉండలేకపోయాను.
5
గుమ్మలక్ష్మీపురం మండలంలో రేగిడి నా కన్నకూతురు లాంటి పాఠశాల. ఆ స్కూలు కోసం మేం కన్న కలలు, చేసిన ప్రయత్నాలు నా ‘కొన్ని కలలు-కొన్ని మెలకువలు’ లో వివరంగా రాసేను కాబట్టి అవన్నీ మళ్ళా ఇక్కడ ఏకరువు పెట్టను. కాని 27 ఏళ్ళ తర్వాత ఆ పాఠశాలలో మళ్ళా అడుగుపెట్టినప్పుడు, మేమొకప్పుడు నాటిన మొక్క ఇప్పుడు గొప్ప ఫలవృక్షంగా సాక్షాత్కరించింది. అన్నివిధాలా ఆ పాఠశాల ఆదర్శపాఠశాలగా రూపొందుతూ ఉంది. ఆ పిల్లల్ని చూస్తుంటే ఆ పాఠశాల తెల్లకలువల్తో నిండిపోయిన సరసులాగా అనిపించింది. ఒకవైపు క్లాసులు జరుగుతున్నా, ఆ పిల్లలు నాకోసం పాటలు పాడాలనీ, నాట్యం చేయాలనీ అనుకున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడి పాటలో పాడారు, ఆడారు. ఆ క్షణాలంతటా నేనొక చెప్పలేని అద్వితీయ ఆనందాన్ని అనుభూతి చెందాను. నేను జీవించిన కొద్దిపాటి జీవితమూ సార్థకమయిందనిపించింది.
6
కాని ప్రత్యేకంగా చెప్పవలసిన రెండు పాఠశాలున్నాయి. ఒకటి శ్రీకాకుళం జిల్లాలో మెలియాపుట్టి మండలంలో పెద్దమడి అనే చోట పనిచేస్తున్న గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల. ఆ ఊరు వెళ్ళాలంటే మేం కొంతదూరం ఒరిస్సాలో ప్రయాణించి పర్లాకిమిడి వెళ్ళి అక్కణ్ణుంచి మళ్ళా ఆంధ్రప్రాంతంలో ప్రయాణించాలి. మలియసవరలు అత్యధికంగా నివసించే ప్రాంతం. 1892-1920 ప్రాంతాల్లో గిడుగురామ్మూర్తిగారు పర్లాకిమిడి కేంద్రంగా ఆ సవరపిల్లలకోసమే గొప్ప కృషి చేసారు. ‘ఆ పిల్లల అమూల్యమైన కాలాన్ని వృథాచేసి ఆరునెలలపాటు ఎందుకూ కొరగాని ఆరు ఒరియా అక్షరాలు నేర్పడం కన్నా ఆరునితీకథలు బోధిస్తే ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది’ అని ఆయన 1892 లో అప్పటి మద్రాసు గవర్నరుకు విజ్ఞప్తి సమర్పించారు. ఆయనట్లా ధర్మాగ్రహం ప్రకటించిన శతాబ్ద కాలం తర్వాత ఆ ప్రాంతాల్లో ఆ పెద్దమడి పాఠశాలలో సవరబాలికలతో నేను మాట్లాడుతున్నంతసేపూ నేను గొప్ప ఉద్వేగానికి లోనయ్యాను. హిమాలయ పర్వత శిఖరాల్ని చూసిన సాధకులు తమ జీవితబంధాలన్నీ వదిలిపెట్టి, ఆ పర్వతసానువుల చెంతనే ఎట్లా ఉండిపోవాలనుకుంటారో, ఆ పాఠశాల ప్రాంగణంలో కూడా నేనట్లానే అనుకున్నాను. అక్కడొక తరగతి గదిలో పిల్లలు సి.సి.ఇ మెథడ్ కింద తాము రాసిన, చేసిన ప్రాజెక్టు వర్కు నాకు చూపిస్తూ ఉన్నారు. అందులో సంక్రాంతి సెలవుల్లో తమ ఇంటిదగ్గర గడిపిన అనుభవాల్ని వారు రోజువారీ నమోదు చేసారు. ఆ పుస్తకాలన్నీ, ప్రతి ఒక్కరి అనుభవాలూ అట్లానే చదువుతూ ఉండిపోవాలనిపించింది. ప్రజలు ఎట్లా జీవిస్తున్నారో, పిల్లలెట్లా ఆలోచిస్తున్నారో, వాళ్ళ ఆకాంక్షలేమిటో మన గొప్ప రచయితలు కూడా చెప్పలేనిది ఆ పిల్లల ప్రాజెక్టు వర్కు చెప్తున్నది. మాటల మధ్యలో మీరు దంగల్ సినిమా చూసారా అని అడిగాను. చూసామన్నారు అందరూ ఏకకంఠంతో. వాళ్ళ ఉపాధ్యాయుడు చూపించేడట. మీకు నచ్చిందా అనడిగాను. నచ్చిందన్నారు. కన్నీళ్ళు వచ్చాయా అన్నాను. ధారాపాతంగా వచ్చాయన్నారు.’కానీ కొందరు విమర్శిస్తున్నారే, ఆ తండ్రి తన జీవితాశయం నెరవేర్చుకోడానికి ఆ పిల్లల జీవితాలతో ప్రయోగం చేసాడని, మీరేమంటారు’ అనడిగాను. ఒప్పుకోం అన్నారు వాళ్ళు. ఎందుకన్నాను. అ తర్వాత ఇరవైనిమిషాలపాటు మామధ్య జరిగిన డిబేటులాంటిది ఒక పబ్లిక్ స్కూల్లోనో, కార్పొరేటు స్కూల్లోనో ఊహించలేనిది. ఏ టైం మెషీన్ అయినా ఎక్కి రామ్మూర్తిగారూ, ఒక్కసారి మీరు పెద్దమడి రాకూడదూ!
7
ఇక సీతంపేట మండలం హడ్డుబంగి నేను చూసిన పాఠశాలలన్నిటిలోనూ సర్వతోముఖంగా వికసించిన పాఠశాల. నిజానికి, మార్కులు వెయ్యవలసివస్తే, పెద్దమడికి వెయ్యాలా, హడ్డుబంగికి వెయ్యాలా తేల్చుకోవడం కష్టం. నాతోపాటు ఆ స్కూళ్ళు చూస్తున్న ఐ.టి.డి.ఏ విద్యాధికారులు రామ్మోహన్, శ్రీనివాస్ నాతో చాలాసేపే ఆ విషయం గురించి చర్చిస్తూ ఉన్నారు. కాని, రెండు అంశాల్లో హడ్డుబంగి నా మదిని తోచుకుంది. మొదటిది, ఆ పాఠశాల తోట. అది నిజంగానే కూరగాయలపెంపకం కేంద్రంలాగా ఉంది. ఎర్రబెండ, కాబేజి, నూల్కోలు, టమాటా లాంటి కూరగాయలు నిండుగా పండుతున్న ఆ తోట, మామిడి, జీడిమామిడి పూలతీపిగాలి నా మనసుని పూర్తిగా లోబరుచుకున్నాయి. ఇక రెండవది, అన్నిటికన్నా ముఖ్యమైంది, ఆ ప్రధానోపాధ్యాయిని లిల్లీరాణి, ఆ రోజు పాఠశాలలో ఏర్పాటు చేసిన తల్లిదండ్రుల సమావేశం. అది మేం వస్తామని చేసిన షో కాదు. అసలు వాళ్ళకి నేను ఆ స్కూలు చూస్తాననే తెలియదు. ఆ స్కూల్లో 89 మంది బాలికలు పదవతరగతి పరీక్షకు వెళ్తున్నారు. ఆమె వాళ్ళ తల్లిదండ్రుల్ని పిలిపించింది. అయిదవతరగతిలో ఆ తల్లిదండ్రుల్ని ఆ పిల్లల్ని తమకు అప్పగించేరనీ, ఈ అయిదారేళ్ళుగా తాము ఆ పిల్లలకోసం ఏమి చేసారో వివరించి, పదవతరగతిలో ఆ పిల్లల ప్రోగ్రెస్ సబ్జెక్టువారీగా వాళ్ళకి వివరించింది. ఇట్లా పదవతరగతి పరీక్ష కు వెళ్ళే పిల్లల తల్లిదండ్రుల్ని పిలిచి వారికిట్లా వివరించవచ్చని నాకే ఇప్పటిదాకా తట్టలేదు. ఆ ఒక్క అంశానికే నేనా పాఠశాలకి నా మనసులో ఈశమెట్రిక్యులేషన్ స్కూలుకన్నా కూడా ఎక్కువ మార్కులు వేసేసుకున్నాను.
8
అలాగని అంతా చక్కగా ఉందని నేననుకోవడం లేదు, చెప్పబోవడం లేదు, అహ్లాదకరమైన కళ్ళద్దాలతో నేనా పాఠశాలలని చూడలేదు. అక్కడింకా నా మనసుని కష్టపెట్టే అంశాలు చాలానే ఉన్నాయి. కాని, వాటన్నిటినీ అధిగమించడం ఏమంత కష్టం కాదనుకుంటున్నాను. హడ్డుబంగి పాఠశాలలో జరిగిన తల్లిదండ్రుల సమావేశంలో ఒక గ్రాడ్యుయేటు గిరిజనుడు కూడా ఉన్నాడు. అతడు గిరిజన విద్యార్థి నాయకుడు కూడా. ఈ పాఠశాలకు ఎన్ని మార్కులు వేస్తావు అనడిగాను అతణ్ణి. 95 అన్నాడు. ఎందుకని అనడిగాను. ‘ఈ స్కూల్లో మా అన్న కూతురు చదువుకుంటోంది. మా అన్న ఈ మీటింగుకి రాలేక నన్ను పంపాడు. నేనో సంగతి చెప్పాలి. కొన్ని రోజుల కిందట మా అన్న కూతురు నన్ను చిన్నాన్నా, మన ప్రాంతంలో బాంకులు ఎక్కడున్నాయి, ఏ బాంకులున్నాయని అడిగింది. నీకు బాంకులతో పనేమిటని అడిగాను. మా స్కూల్లో నాకు ప్రాజెక్టు వర్కు ఇచ్చారు, బాంకుల గురించీ,బాంకుల వల్ల మన గిరిజనులకు లభించే సదుపాయాల గురించీ రాయాలి అందుకని అంది. సార్, నేను కూడా ఈ స్కూళ్ళల్లోనే చదువుకున్నాను. కాని ఇట్లాంటి చదువు నేను ఊహించలేను. ఎంత దూరం ప్రయాణించేయి ఈ పాఠశాలు’ అన్నాడు.
9
నిజమే, చాల చాలా దూరం ప్రయాణించారు ప్రభుత్వమూ, ప్రజలూ, పిల్లలూ కూడా. ఊహించలేనంత దూరం. పదేళ్ళకిందట నన్నొక ఇంటర్నేషనల్ స్కూల్ కి తీసుకువెళ్ళాడొక విద్యావేత్త. ‘మీ స్కూలు ప్రత్యేకత ఏమిటి?’ అనడిగాను వాళ్ళని.’ప్రాజెక్టు వర్కు’ అన్నారు. వాళ్ళ పిల్లలు చేసిన ప్రాజెక్టు వర్కు చూపించారు. పదేళ్ళు పట్టింది, గిరిజనపాఠశాలలు కూడా ఆ స్థాయికి చేరుకోడానికి. కేవలం పదవతరగతి పాసుకావడం కాక, బయట మార్కెట్లో తక్కిన వర్గాల పిల్లల్తో పోటీపడి ఉన్నతవిద్య, ఉద్యోగాలూ పొందే నేర్పురావడానికి ఈ పిల్లలూ, ఈ పాఠశాలలూ మరెంతో దూరం, చాలా చాలా దూరం ప్రయాణించాలి, తప్పదు. కాని, వాళ్ళు ఇప్పటిదాకా ఎంతదూరం ప్రయాణించేరో కళ్ళారా చూసిన నాకు అది అసాధ్యం కాదనే అనిపిస్తున్నది.
10
మంగళవారం సాయంకాలం పార్వతీపురంలో కవులూ, రచయితలూ నాతో ఇష్టాగోష్టికి కూచున్నప్పుడూ, శుక్రవారం సాయంకాలం విశాఖ పౌర గ్రంథాలయంలో వరహాలశెట్టిగారు ఏర్పాటు చేసిన ఒక స్మారక ప్రసంగంలో మాట్లాడినప్పుడూ, శనివారం కాకినాడలో పడాల చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఉత్తమ ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని సత్కరిస్తూ నన్ను కూడా మాట్లాడమన్నప్పుడూ నేనీ మాటలే ఎంతో నమ్మకంతోనూ, సంతోషంగానూ పదేపదే చెప్పాను.
14-2-2017