మరోసారి ఇల్లు మారాం

75

మరోసారి ఇల్లు మారాం. భారతీయ రచయితల్లో ప్రేమ్ చంద్ తర్వాత ఎక్కువ ఇళ్ళు మారింది నేనేనని రాళ్ళబండి కవితాప్రసాద్ అన్నాడు.రాజధాని మారిపోయే వేళ మళ్ళా ఇల్లు మారడమేమిటన్నారు కొందరు. కానీ మారక తప్పింది కాదు. ఎన్నాళ్ళు ఉంటామో కాని, ఇంటి చుట్టూ ఉన్న కొద్దిపాటి ఖాళీస్థలంలోనూ ఒక అందమైన పూలతోట పెంచుకోవచ్చన్న కోరిక నన్నూరించింది. ఇంట్లో సామాన్లు సర్దుకోవడం కన్నా ముందు పూలమొక్కలు తెచ్చి చిన్న తోటలాంటిదానికొక రూపకల్పన చేసాను. ఇక తేనెటీగలూ, సీతాకోకచిలుకలూ రావడమే ఆలస్యం. ఈ ఇంటిముందొక చిన్న అరుగు కూడా ఉంది. పూలమధ్య కవితలు వినాలనుకున్నవాళ్ళూ, వినిపించాలనుకున్నవాళ్ళకీ ఇదే నా ఆహ్వానం.

అడవినుంచి వచ్చినవాడు అద్దె ఇంట్లో జీవించవలసి రావడమే ఒక వైరుధ్యం. కానీ ఆనందం బయటలేదు, అంతరంగంలోనే ఉన్నదని పెద్దవాళ్ళు చెప్పినమాట ఇట్లానే కదా అనుభవం లోకి వచ్చేది.

అందుకనే ఇట్లాంటి అద్దె ఇళ్ళ జీవితం మీద ‘పునర్యానం’ లో రాసుకున్న కవిత ఒకటి గుర్తోస్తోంది. మీలో చాలా మంది ఆ కవిత చదివిఉండరు కాబట్టి, ఇక్కడ ఇదిగో, మరో మారు:

అద్దెకుంటున్న ఈ ఇంటిని నేనిష్టపడతాను, అందంగా
ఉంచుకోవడానికి కష్టపడతాను, శుభ్రంగా నిలుపుకుంటాను
కాని మర్చిపోను, ఖాళీ చెయ్యాల్సిందే ఎప్పటికో ఒకప్పటికని.

మొదట్లో బాధించాయి దీని పరిమితులు, అసౌకర్యాలు
ఉండగా, ఉండగా గ్రహించాను అంతర్లీనంగా ఉన్న సదుపాయాలు
దీన్ని నిర్మించిన మృత్తిక నాది కాదు,
ఏ యుగాలమీంచో ఆకాశం నుంచి పాతాళందాకా
సమస్తశక్తులమీంచి తెచ్చుకున్న మట్టితో నిర్మించిందిది.

కొన్నాళ్ళు భయంతో మూసుకుని ఉంచుకునేవాణ్ణి తలుపులు
ఆత్మీయులెవరన్నా ప్రవేశిస్తే బాగుణ్ణనుకునేవాణ్ణి
అయినా మర్చేవాణ్ణి, గుమ్మానికడ్డంగా నేనే నిల్చున్నానని.
ఇప్పుడు బార్లా తెరిచిపెడుతున్నాను ద్వారాలు, కిటికీలు
నిండిపోతున్నదీ సూక్ష్మ ఆకాశం సుగంధాలతో, సుస్వరాలతో.

ప్రతి పండక్కీ పచ్చతోరణం కట్టుకుంటాను, గడపకి
పసుపు రాసుకుంటాను, పిలుస్తానొకరినో, ఇద్దరినో
మిత్రుల్నో, పరిచితుల్నో, అపరిచితుల్నో
కొన్ని క్షణాలక్కడ గడిపేక వాళ్ళు
‘ప్రశాంతం నీ గృహం, ఒక చెట్టునీడన సేదదీరినట్టుందం’ టారు

4-11-2014

Leave a Reply

%d bloggers like this: