గురూజీ గురించి తలుచుకోవలసింది, ఆయన చెప్పిన మాటల్ని మళ్ళా మళ్ళా మననం చేసుకోవలసిందీ చాలా ఉంది. కొన్ని కొన్ని మాటలమీద కొన్నేళ్ళ పాటు చర్చించుకోవలసి ఉంటుంది.
దలైలామా సహచరుడైన రింగ్ పోచే కళాశ్రమాన్ని చూసి ‘మీరు గాంధీజీ హింద్ స్వరాజ్ పుస్తకంలో ఏమి రాసారో అచ్చం అలానే జీవిస్తున్నారు’ అని అన్నాడట.
‘నేనా పుస్తకం చదవలేదు. ఏముంది సార్’ అందులో అని అడిగారు గురూజీ నన్నొకసారి.
‘నేనా పుస్తకం క్షుణ్ణంగా చదివాను. కాని ఇప్పుడే ఆ పుస్తకం సారాంశం ఒక్కసారిగా తెలిసొచ్చింది’ అన్నాన్నేను.
గురూజీ మీద త్వరలో రానున్న ‘జీవనశిల్పి’ పుస్తకాన్నీ, నేను ఎప్పటికి పూర్తి చేస్తానో తెలియని నా రచననీ అలా ఉంచితే ఆయన మాటలు వెంటనే వినాలనుకున్నవాళ్ళు యూట్యూబ్ లో ఆయన ప్రసంగాల్ని వినవచ్చు. ఇప్పటికే హిందీలో ఆయన గురించి ఒకటిరెండు పుస్తకాలు వచ్చాయి. అయినా కొన్ని మాటలు నేనాయన ముఖతః విన్నవి మీకోసమిట్లా గుర్తుచేసుకుంటున్నాను. (కాని ఆ అదిలాబాదు యాసలో కాదు. ఆ యాసలో ఆయన మాటలెట్లా ఉంటాయో రుచి చూడాలనుకున్నవాళ్ళు సామలసదాశివ ‘యాది’ లో రవీంద్రశర్మ గారి గురించి రాసిన ముచ్చట్లు చదువుకోవాలి.)
1
మనకి ఒకటి ఉంటే ఎక్కువ ఉన్నట్టు అనిపించకూడదు. ఒకటి లేకపోతే తక్కువయినట్టనిపించకూడదు. చెట్టుని చూడండి. ఆకులు రాల్చినా అందంగా ఉంటుంది. చిగిరించినా అందంగా ఉంటుంది. చిగిరించిన శాఖోపశాఖల్తో పూలు పూసినా అందంగా ఉంటుంది. ఆ పూలకొమ్మ మీద ఒక పక్షి వచ్చి వాలిందా మరింత శోభాయమానంగా ఉంటుంది. పక్షి ఎగిరిపోయిందా అయినా ఆ తరువు అందానికేమీ లోటు రాదు. పూలు పూసినా అందమే. పుయ్యకపోయినా అందమే. పక్షి వచ్చినా అందమే. రాకపోయినా అందమే.
2
భారతీయ సభ్యత ఇట్లాంటిది. ఇది మనకి అడుగడుగునా గోచరిస్తుంది. నేనొక్కప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళాను. అక్కడ కొందరు మహాపండితులతో సదస్సు జరిగింది. వాళ్ళంతా పంచెలతో, మామూలు నూలు చొక్కాలతో, ఉత్తరీయాలతో వచ్చారు. సదస్సు అయిపోగానే సత్రానికి వచ్చి అక్కడే నేలమీద ఉత్తరీయాలు పరుచుకుని నడుం వాల్చారు. ఎంతటి మహాపండితులు! కాని ఎంత సాధారణమైన, సరళమైన జీవితం జీవిస్తున్నారు!
3
భారతీయ సభ్యత లోని ఈ అందాన్ని ప్రతి ఒక్కచోటా చూడవచ్చు. ఉదాహరణకి ఇళ్ళసంగతే చూడండి. మన గ్రామాల్లో తాటియాకుల ఇళ్ళు చూడండి. ఆ మట్టి అరుగులు చూడండి. ఆ అరుగులమీద మీరు చాపలు పరిచినా సరే, తివాసీలు పరిచినా సరే, మంచాలు వాల్చినా సరే, అవేవీ లేకపోయినా ఆ అరుగుల నిండుతనానికి లోటేమీ రాదు. ఆ వట్టి అరుగుల మీద కూర్చోడానికి మనకేమీ న్యూనత అనిపించదు. అదే పాశ్చాత్య పద్ధతిలో మనం కట్టుకుంటున్న ఈ సిమెంటు కొంపలు, ఈ డాబాలు, ఈ అపార్ట్ మెంటులు చూడండి. అక్కడ ముందుగదిలో సోఫాలు, కుర్చీలు వెయ్యలేదనుకోండి. మీరు కూర్చోగలరా?
4
ఇల్లు ఆర్థిక భద్రతనివ్వాలి. కాని ఈ మన ఇళ్ళు ఆర్థికంగా మనిషిని డొల్లచేస్తాయి. మన ఇళ్ళల్లో ముందుగదినే తీసుకోండి. ఆ గది మనని సోఫాలు తెమ్మంటుంది. సోఫాలు తెచ్చాక టీపాయి పెట్టమంటుంది. టీపాయ్ పెట్టాక యాష్ ట్రే తెమ్మంటుంది. వెనక గోడమీద ఒక పెయింటింగ్ పెట్టమంటుంది. కిటికీలకు పరదాలు కట్టమంటుంది. మూలన ఒక ఇండోర్ ప్లాంటు పెట్టమంటుంది. టివి, కంప్యూటర్.. ఒకదానివెనక ఒకటి కొత్తవస్తువు ని తెమ్మంటూనే ఉంటుంది. కాని పూర్వకాలపు ఇళ్ళు, లేదా మన గ్రామాల్లో రైతుల ఇళ్ళల్లో ఇట్లాంటి భ్రమ కనిపిస్తుందా?
5
ఇల్లు ఆరోగ్యానికి తావు కావాలి. ఆరోగ్యమంటే ఏమిటి? తల చల్లగా ఉండాలి. పాదాలు వెచ్చగా ఉండాలి. పూర్వకాలపు మట్టి ఇళ్ళల్లో ఇది చాలా సహజంగా సాధ్యపడేది. కాని ఇప్పటి మన ఇళ్ళు? ఇందుకు విరుద్ధం. ఈ ఇళ్ళల్లో మన తల వేడెక్కుతుంది. పాదాలు చల్లబడతాయి.
6
ఒకటి ఉంటే ఎక్కువ ఉన్నట్టుండకూడదు. లేకపోతే లేనట్టుండకూడదు అని నేను చెప్పే మాట నా మాట కాదు. ఉపనిషత్తుల మాట. ‘పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణమేవావశిష్యతే’ అన్న మాట మీరు వినే ఉంటారు. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేస్తే పూర్ణమే మిగులుతుందని కదూ. ఒకరోజు నేను మా ఆశ్రమం నుంచి పాలిటెక్నిక్ కాలేజి వైపు నడుస్తూండగా కొంతదూరంలో ఒక పిల్లవాడు సైకిల్ మీద వస్తూ కిందపడ్డాడు. దెబ్బలు తగిలాయి. రక్తం కారడం మొదలయ్యింది. ఆ పాలిటెక్నిక్ కాలేజి పిల్లలందరూ ఆ పిల్లవాడి చుట్టూ మూగేరు. ఒకటే నిట్టూరుస్తున్నారు. పదండి, రండి, చూడండి అంటున్నారే గాని ఎవరికేం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఆ నెత్తురు కారకుండా ఆపడానికి వాళ్ళ దగ్గర జేబురుమాళ్ళు తప్ప మరేమీ లేదు. ఇంతలో ఆ దారిన గొర్రెలు కాచుకోడానికి పోతున్న మనిషి ఒకడు ఆ దృశ్యం చూసాడు. పరుగు పరుగున ఆ కుర్రవాడి దగ్గరకి వెళ్ళాడు. తన బుజాన ఉన్న తువ్వాలు సర్రున సగం చింపి ఆ కుర్రాడికి కట్టు కట్టాడు. ఆ మిగిలిన సగం తువ్వాలు మళ్ళా బుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. చూసారా! పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసేసినా పూర్ణమే మిగులుతుంది.
7
భారతీయ సభ్యతకి చెందిన ఈ సూత్రం మన వేషధారణలో కూడా కనిపిస్తుంది. పల్లెల్లో రైతు వేషం చూడండి. బాగా కలిగిఉంటే, పంటలు బాగా పండితే పంచె కడతాడు, పూర్తి చేతుల చొక్కా తొడుగుతాడు. కండువా వేస్తాడు. తలపాగా చుడతాడు. కొత్త తోలుచెప్పులు తొడుగుతాడు. పంటలు పండకపోతే ముందు తలపాగా, ఆ తర్వాత కండువా, పూర్తి చేతుల చొక్కా, చివరికి చెప్పులు కూడా ఒక్కొక్కటీ జారిపోతాయి. ఇంక పొలం పనిచేసుకునేటప్పుడు పంచె కూడ వదిలిపెట్టి గోచీ కడతాడు. కాని ఆ రూపసౌష్టవం ఎక్కడన్నా చెక్కు చెదురుతుందా? ఆ వంటిమీద ఒకటి మాత్రమే ఉండి రెండు లేకపోయినందుకేమన్నా న్యూనతగా అనిపిస్తుందా? కాని మన నగరాల్లో సూట్లు తొడిగేవాళ్ళని చూడండి. మొత్తం సూటు, టై అన్నీ కట్టి బూట్లు లేకపోతే ఆ వేషం ఎట్లా ఉంటుందో ఊహించండి.
8
భారతదేశానిది ఆత్మీయతతో వ్యవహారం. పాశ్చాత్య సభ్యతది వ్యవహారం కోసం ఆత్మీయత. నేనొక్కప్పుడు ఒక గ్రామానికి వెళ్ళాను. అక్కడొక గృహిణి ఇంటిముందుకొక బాటసారి వచ్చాడు. అతడి కూడా అతడి కొడుకు చిన్నపిల్లవాడు కూడా ఉన్నాడు. ఆ గృహిణి ఆ ముందురాత్రి అతడికి అన్నం పెట్టింది. ఆ పాంథులిద్దరూ విశ్రమించడానికి నీడ నిచ్చింది. ఆమె ఏమంత కలిగింది కాదు. పేద మహిళ. అయినా సరే, పొద్దున్నే వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఇంత అన్నం మూటగట్టి ఆ అన్నానికి దిష్టి తగలకుండా అందులో రెండు బొగ్గులు వేసి ‘పద బిడ్డా, ఎంద దూరం పొవ్వాలో ఏమో, కూడా పిల్లగాడున్నాడు. ఈ బువ్వ తీసుకుపో ‘ అంది. ఆ దృశ్యం నేను నా జీవితమంతా మరవలేను. ఎవరామె? వాళ్ళామెకు ఏమవుతారు? భారతీయ సభ్యత అంటే ఏమిటో నాకా క్షణమే కళ్ళకు కట్టింది. ఈ దేశంలో ఏ వ్యవహారమైనా మనిషి మనిషికి చేరువకావడం కోసమే. కాని దురదృష్టవశాత్తూ ఆధునికసభ్యత ఇలా కాదు. ఇక్కడ మనిషి తన ప్రయోజనం నెరవేర్చుకోవడం కోసమే తోటిమనిషికి చేరువకావాలనుకుంటాడు.
9
నేను శిల్పశాస్త్రం చదువుకుని కూడా ఏ విశ్వవిద్యాలయంలోనో ఉద్యోగం చేసుకోకుండా ఈ అదిలాబాద్ కుమ్మరులకోసం ఇక్కడెందుకిలా ఉండిపోయాయని అందరూ అడుగుతుంటారు. మీకో సంగతి చెప్పాలి. నేను మహారాజా శాయాజీ గయక్వాడ్ కళాశాలలో శిల్పశాస్త్రంలో ఎమ్మే పరీక్షలు రాసిన చివరి రోజు భవిష్యత్తులో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ మా కళాశాల ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు కింద కూచున్నాను. అది శిశిరం ముగిసిపోయి వసంతం ఆవరిస్తున్న కాలం. కొంతసేపటికి నా ఆలోచనల్లోనే తలపైకెత్తి చెట్టు మీదకి చూసాను. ఆ చెట్టు అప్పటికే ఆకులన్నీ రాల్చివేసింది. అక్కడక్కడా కొత్త చిగుర్లు తలెత్తుతున్నాయి. నాకొక్కసారిగా బోధపడింది. నేను చెయ్యాల్సింది కూడా ఇదే కదా. ఉన్నదాన్ని త్యజిస్తేనే కదా, కొత్తది ప్రాప్తిస్తుంది. నేనంతదాకా ఏమి నేర్చుకున్నానో దాన్ని వదిలిపెట్టేసి మళ్ళా కొత్తదేదో నేర్చుకోవాలనుకున్నాను. అంతదాకా శాస్త్రాల్లో బోధించిన శిల్పరహస్యాలు అధ్యయనం చేసాను. ఇక అప్పణ్ణుంచీ ప్రజల మధ్య తిరుగుతూ వాళ్ళ జీవనకళారహస్యాల్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాను.
10
మీరిక్కడేం చేస్తున్నారని చాలామంది అడుగుతారు. వాళ్ళకి నేనో కథ చెప్తుంటాను. ఒకప్పుడు ఈ భూమ్మీద జళప్రళయం వచ్చిందట. అప్పుడు మనువు ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి జీవజాతి విత్తనాన్నీ ఒక పడవలో ఎక్కించుకుని కాపాడుకున్నాడట. ప్రళయం ముగిసిపోయి మళ్ళా నేల బయటపడ్డాక, ఆ జీవజాతి అవశేషాల్తోనే కొత్త సృష్టి మొదలుపెట్టాడట. ఇప్పుడు ప్రపంచాన్నంతటినీ గ్లోబలైజేషన్ అనే ప్రళయం ముంచెత్తూంది. మన సభ్యతకు చెందిన ప్రతి ఒక్క సదాచరణనీ నేనిక్కడ ఈ ప్రళయం నుంచి కాపాడుకుంటున్నాను. ఈ ఆశ్రమం ఒక పడవ. ఈ ప్రళయం ముగిసిపోయాక మళ్ళా కొత్త జీవితం ఇక్కణ్ణుంచే మొదలవుతుందని నాకొక ఆశ.
1-3-2015