మంగాదేవి మా అమ్మ

7

మనుషులు చేసుకున్న పుణ్యం క్షీణించగానే భూమ్మీద పడతారని ఒక నానుడి. కానీ, ఈ భూమ్మీద కూడా కొందరు స్వర్గాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మన మన జీవితాల్లో ఏ లేశమో ఏ మంచిపనిచేసినందుకో స్వర్గంలాంటి ఆ తావుల్లో కొంతసేపేనా గడిపే కొన్ని క్షణాలేనా దొరుకుతాయి.

నిన్న అట్లాంటి కొన్ని క్షణాలు గడిపేను. భూమ్మీద స్వర్గాన్ని నిర్మించిన అట్లాంటి తావు, గుంటూరు దగ్గర చోడవరం గ్రామంలో డా.మంగాదేవి గారు వికసింపచేసిన చేతన పాఠశాల.

ఆరేడేళ్ళయిందనుకుంటాను, నా ‘కొన్ని కలలు-కొన్నిమెలకువలు’ పుస్తకాన్ని ఎవరో మంగాదేవిగారికి పరిచయం చేసి. ఆ పుస్తకానికి ఆమె డా.నన్నపనేని మంగాదేవి బాలసాహిత్య పురస్కారం ప్రకటించినప్పుడు మొదటిసారి ఆ పాఠశాలకు వెళ్ళాను. అది పాఠశాల మాత్రమే కాదు. ఒక అనాథాశ్రమం కూడా. కాని ‘అనాథ’, ‘అనాథశరణాలయం’ లాంటి క్రూరమైన పదాలకి ఆమె దగ్గర చోటు లేదు. సమాజంలో చోటు దొరకని ఆ పిల్లలు, జీవితం ముగిసిపోయిందనుకున్న ఘట్టంలో ఆమె దగ్గర అడుగుపెడతారు. అప్పుడే వాళ్ళ జీవితం మళ్ళా కొత్తగా మొదలవుతుంది. అక్కడ వాళ్ళలాంటి అక్కలూ, తల్లులూ కూడా ఉంటారు. ప్రాపంచికార్థంలో ఎవరికీ ఏమీ కాని ఆ తల్లులూ పిల్లలూ కలుసుకుని తమకోసం ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకోవడం మొదలుపెడతారు. ఆ ప్రపంచం పచ్చటి ప్రపంచం. పూలూ, పిట్టలూ, రంగులూ, రేఖలూ కలిసి అల్లుకున్న ప్రపంచం. అదొక పాఠశాల, ఒక అందమైన తోట, ఒక చిత్రశాల, అన్నీ కలిసి ఒక సంతోష చంద్రశాల.

గరిగె ప్రభావతి (1925-1995), డా,మంగాదేవి (1937-) కలిసి 1965 లో ఒకే ఒక్క విద్యార్థితో గుంటూరులో బ్రాడీపేటలో మొదలుపెట్టిన బాలకుటీర్ కు ఇప్పుడూ శ్యామలానగర్ లో మరొక బాలకుటీర్ తోడయ్యింది. ఆ తరువాత కొండవీడు దగ్గర 1986 లో బాలకార్మిక పాఠశాల గా ప్రారంభించిన ఈ పాఠశాల ఇప్పుడు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ (హీల్ ) గా పూర్తి పరిణామం చెందింది. సుమారు 600 మంది గ్రామీణ బాలబాలికల కోసం నడుస్తున్న ఇటువంటి పాఠశాలను నేను దేశంలో మరెక్కడా చూడలేదు.

ఈ ఆరేడేళ్ళ కాలంలోనూ ఈ పాఠశాలకు అయిదారు సార్లేనా వచ్చి ఉంటాను. వచ్చిన ప్రతిసారీ నాలో కొత్త ఉత్సాహం పరవళ్ళు తొక్కుతుంది. నేను వెళ్ళినప్పుడల్లా అ పిల్లలకేదైనా చెప్పమంటారామె. ఆ పిల్లల్ని చూస్తేనే ఎంతో సంతోషమనిపిస్తుంది. ఈ దేశంలో మాంటిస్సోరి పేరు చెప్పుకుని బతికే పాఠశాలలు కోకొల్లలు. కాని మాంటిస్సోరిని మంగాదేవిగారు అర్థం చేసుకున్నట్లుగా మరెవరూ అర్థం చేసుకోలేదనే అనాలి. పిల్లల చిట్టి ప్రపంచం ఏ బుల్లి బుల్లి కలలపోగుల్తో నేసుకోవాలో, పిచికలు అల్లుకున్న గూడులాగా ఒక బడి ఎట్లా అల్లుకోవాలో ఆ వికాసరహస్యం మంగాదేవిగారికి మటుకే తెలుసనిపిస్తుంది.

1965 లో మొదలైన బాలకుటీర్ ఒక ఉద్యమంగా యాభై ఏళ్ళు పూర్తిచేసుకుంది. ఆ యాభై ఏళ్ళ ప్రయాణానికి గుర్తుగా హరి కిరణ్ వడ్లమాని అనే పూర్వవిద్యార్థి ఒక అపూర్వ జ్ఞాపికను రూపొందించాడు. డా.మంగాదేవి గారి చేతి వేళ్ళు అయిదింటినీ నమూనాగా అక్కడొక స్మారక చిహ్నంగా నెలకొల్పాడు. ఆ అంగుళిముద్రలమీద పూర్వవిద్యార్థులు 5500 మంది పేర్లు చెక్కారు. 5500 పూలమొక్కలు నాటారు. యాభై ఏళ్ళ ప్రయాణానికి గుర్తుగా యాభై మెట్లు. ఆ స్వర్ణోత్సవానికి ముఖ్య అతిథిగా డా. కలాం మార్చి 15 న అక్కడ అడుగుపెట్టి ఆ జ్ఞాపికను ఆవిష్కరించారని తెలిసినప్పణ్ణుంచీ అక్కడకు వెళ్ళాలనీ ఆ జ్ఞాపిక చూడాలనీ అనుకుంటూనే ఉన్నాను.

శరత్కాలపు పూలతావిలో మళ్ళా చెట్లనీడన పిల్లలతో మాట్లాడేను. నేను మొదటిసారి ఆ పాఠశాలకు వెళ్ళినప్పుడు గోడమీద వాళ్ళు ‘చినవీరభద్రుడు మామయ్యకు స్వాగతం’ అని రాసారు. ఎన్నో సమావేశాల్లో ఎక్కడెక్కడో ఆ విషయం చెప్పాను. ఆ స్వాగతం నేనెప్పటికీ మరవలేను. నాకేమీ కాని ఆ పిల్లలు. కాని వాళ్ళంతా నా పిల్లలే.

మంగాదేవి మా అమ్మ.

5-12-2015

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d