బాలాంత్రపు రజనీకాంతరావు

35

నిన్నసాయంకాలం గుంటూరులో వైశ్య హాస్టల్లో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ తరఫున బాలాంత్రపు రజనీకాంతరావుగారికి విశిష్ట సేవా పురస్కారం అందించారు. ఆ సత్కార సభలో రజనీకాంతరావుగారితో వేదిక పంచుకోవడమే కాక, ఆయన గురించి మాట్లాడే అవకాశం కూడా నాకు కలిగింది. మరీ ముఖ్యంగా శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ వారు రజనీకాంతరావుగారిమీద ప్రచురించిన విశేష సంచిక ‘రజని’ నీ అవిష్కరించే అదృష్టం కూడ కలిగింది.

ఆ సభలో వేంకట పార్వతీశ్వర కవుల ‘ఏకాంతసేవ’ (1922) నీ, ఆ కావ్యం మీద ఇంతదాకా వచ్చిన వివిధ వ్యాసాలతో మోదుగుల రవికృష్ణ సంకలనం చేసిన పుస్తకాన్ని రజనీకాంతరావు ఆవిష్కరించేరు. ఆ అపూరుపమైన కావ్యానికి శతాబ్ద కాలంలో ఇది తొమ్మిదవ పునర్ముద్రణ. ఆ కావ్యానికి నేను రాసిన ఒక విశ్లేషణ కూడా ఆ పుస్తకంలో చోటు చేసుకోవడం కూదా నాకు సంతోషాన్నిచ్చింది.

బాలాంత్రపు రజనీకాంతరావుగారు వేంకటపార్వతీశ్వర కవుల్లో ఒకరైన బాలాంత్రపు వెంకట రావు గారి కుమారుడు. ఆ జంటకవుల్లో మరొకరైన ఓలేటి పార్వతీశ్వరం గారి మనుమడు ఓలేటి పార్వతీశంగారు, ఆకాశవాణిలో విశిష్ట సేవలందించిన శ్రీమతి ముంజులూరి కృష్ణకుమారిగారు, సాహిత్య, సంగీతాలు రెండింటిలోనూ ప్రశస్తిపొందిన డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు గారు కూడా ఆ సభలో పాల్గొన్నారు. రజనీకాంతరావుగారి సాహిత్య, సంగీతప్రపంచాల గురించిన ఎన్నో విశేషాలను వారు శ్రోతలతో పంచుకున్నారు.

సభలో ప్రారంభ ప్రసంగం నాదేగాని, మైకు ముందు నిలుచున్నంతసేపూ, మూర్తీభవించిన ఒక శతాబ్దం సన్నిధిలో ఉన్నానన్న ఒక మధురప్రకంపన నన్ను వణికిస్తూనే ఉంది. ఏ సన్నిధిలో నిలబడి ఎవరిగురించి మాట్లాడుతున్నాను!

ఆయన కళ్ళు తెరిచేటప్పటికి (1920) అప్పుడే మొదటిప్రపంచ యుద్ధం ముగిసింది, భారతజాతీయోద్యమంలో గాంధీజీ శకం మొదలయ్యింది. ఆధునిక తెలుగుకవిత్వంలో గురజాడ జీవితం ముగిసి ఆయన శకం మొదలయ్యింది. మరొక వైపు రాయప్రోలు, ఇంకొకవైపు వేంకట పార్వతీశ్వరకవుల కవిత్వంతో తెలుగునాట ఒక మధూత్సవం మొదలయ్యింది. ఆయన యవ్వనంలోకి అడుగుపెట్టేటప్పటికే ఆయన మొదటి రేడియో సంగీత రూపకం ‘చండీదాసు ‘(1941) తెలుగుసంగీతంలోనూ, ఆకాశవాణిలోనూ కూడా కొత్తయుగానికి తలుపులు తెరిచింది. కొన్నాళ్లు సినిమా రంగంలో ఆయన స్పృశించిందల్లా గాంధర్వమైంది. 1947 లో దేశం స్వాతంత్ర్యం పొందిన అర్థరాత్రి భారత ప్రధాని సుప్రసిద్ధ ప్రసంగం పూర్తవగానే రజనీ రచించి, స్వరపరచిన ‘మాదీ స్వతంత్రదేశం, మాదీ స్వతంత్ర జాతి’ టంగుటూరి సూర్యకుమారి గానంతో ఆసేతుశీతనగం ప్రతిధ్వనించింది. ఆ తర్వాత అర్థశతాబ్దం పైగా ఆయన తెలుగునాట లలితసంగీతమనే ఒక నూతనగానసంప్రదాయాన్ని నిర్మించి, పెంపొందించి, తానొక వాగ్గేయకారుడిగా అవతరించడమే కాక, మరెందరో వాగ్గేయకారుల్ని రూపొందిస్తూ ఉన్నాడు.

భారతీయ భాషల్లో తెలుగు గొప్ప సంగీతాత్మక భాష. అందుకనే మహనీయులైన వాగ్గేయకారులెందరో తెలుగులో ప్రభవించారు. కానీ, ప్రాచీన కాలంలో తెలుగు పద్యం, ఆధునిక కాలంలో తెలుగు గేయం, వచనకవితవల్ల తెలుగు వాగ్గేయకారులు సంగీతప్రపంచానికి చెందినవారుగానే ఎక్కువ పరిగణన పొందారు తప్ప సాహిత్యప్రపంచంలోనూ స్ఫూర్తిప్రదాతలుగా గుర్తింపు పొందలేదు.

రజనీకాంతరావుగారి విషయంలోనూ ఇదే జరిగింది. ఒకవైపు సంగీతకారులు ఆయన్ని తమ మనిషిగా భావించడమేకాక, అందుకు గర్విస్తూ, ఆయనకివ్వవలసిన అగ్రస్థానాన్ని నిష్కపటంగా ఇస్తూనే వచ్చారు. శతపత్రసుందరి కావ్యం ద్వితీయభాగానికి పరిచయం రాస్తూ బాలమురళి రాసిన ఈ వాక్యాలు చూడండి:

‘శ్రీ రజని మహావాగ్గేయకారుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి..రజనిసాహిత్యం, రజని సంగీతం, రజని యక్షగానాలు, రజనిసంగీత రూపకాలు మొదలైనవాటిలో నేను పాల్గొని వారికి తృప్తి కలిగించేటట్టు పాడగలిగినందుకు గర్వపడుతూ ఉంటాను. అప్పటి ఆ పునాదియే నన్ను వాగ్గేయకారకుని చేసింది. ఇది అతిశయోక్తికాదు, అందువలననే నా వాగ్గేయాలు ఒక ప్రత్యేకమైనవిగాను, అపూర్వమైనవిగాను బుధజనులు గ్రహించినారు.’

కాని మరొకవైపు సాహిత్యచరిత్రకారులు మాత్రం ఆధునిక తెలుగు కవిత్వచరిత్రలో ఆయనకు ఇవ్వవలసిన స్థానాన్ని ఇవ్వకుండా తప్పించుకున్నారు. అయితే, అట్లాంటి తప్పిదాల్ని ఎట్లా సవరించాలో కాలానికి తెలుసు. ఆధునిక తెలుగు కవుల్లో మహనీయుడైన బైరాగిని ఆయన జీవితకాలంలో తెలుగు విమర్శకులు మొదటిశ్రేణి కవిగా గుర్తించనే లేదు. కాని ఎనభైల్లో కవిత్వం రాయడం మొదలుపెట్టిన ఎందరో యువకవులు బైరాగిని తమ స్ఫూర్తిప్రదాతల్లో అగ్రేసరుడిగా పేర్కొంటూ వచ్చారు. రజనీకాంతరావుగారి సాహిత్యానికి సంబంధించి అటువంటి course correction ఇప్పుడు మొదలవుతున్నదనుకుంటాను.

అసలు ఇటువంటి విస్మృతి ఆయన తండ్రిగారికే తప్పలేదు. వేంకట పార్వతీశ్వరకవులు 20 వ శతాబ్ది మొదటిరోజుల్లో తెలుగు సాహిత్యాన్ని ఆధునీకరించడమేకాకుండా, తెలుగు రొమాంటిసిజానికి తలుపులు తెరిచినా సాహిత్యచరిత్రలో వారికి లభించవలసిన స్థానం లభించలేదని ఆరుద్ర వంటివాడే వాపోయాడు. అందుకనే కృష్ణశాస్త్రిగారు, ఆధునిక తెలుగు సాహిత్యంలో వేంకట పార్వతీశ్వరయుగమంటూ ఒకటుండేదని ప్రజలకు గుర్తు చేయవలసి వచ్చింది.

సంగీతంలో సరే, సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో రజనీ కూడా ఒక నూతన శకపురుషుడే. కాని ఆ శకమేమిటో, ఆయన తెలుగు కవిత్వంలో తెచ్చిన మార్పేమిటో మనమింతదాకా నిజంగా ఆలోచించనే లేదు.

ప్రపంచమంతటా, అన్ని భాషల్లోనూ కూడా, శిల్పరీత్యా కవిత్వం రెండింటి మీద ఆధారపడుతూ వచ్చింది. ఒకటి, music, రెండోది, metaphor. ప్రాచీన లాక్షణికులు వీటిని శబ్దాలంకారాలు, అర్థాలంకారాలు అన్నారు. శ్రీశ్రీ మొదటిదాన్ని poetry that is sung అనీ, రెండోదాన్ని, poetry that is spoken అనీ అన్నాడు. జాతులూ, భాషలూ విడివిడిగా మనేటప్పుడు కవిత్వం సంగీతం మీద ఆధారపడుతుంది. జాతులకీ, భాషలకీ హద్దులు చెరిగిపోయేటప్పుడు కవిత్వం మెటఫర్ మీద ఆధారపడుతుంది. కారణం స్పష్టం. ఒక గీతంలోని సంగీతాన్ని మరొక భాషలోకి అనువదించడం కష్టం. అదే మెటఫర్ అయితే ఎన్ని సముద్రాలైనా దాటి ప్రయాణించగలుగుతుంది.

తెలుగులో ఆధునిక కవిత్వం వికసించే క్రమంలో, పద్యం నుంచి గేయానికీ, గేయం నుంచి వచనానికీ ప్రయాణించే క్రమంలో పాటకి రెండవస్థానమే లభించింది. కాని అది విద్యావంతుల అభిరుచిలో మాత్రమే. కాని ప్రజాహృదయాల్ని చూరగొనాలంటే, కవిత్వానికి సంగీతం తప్పనిసరి. అందుకనే 50 ల తర్వాత కవిత్వం ఒకవైపు మరింత వచనకవిత్వం వైపు ప్రయాణిస్తూండగా, మరొకవైపు సినిమా పాటలరూపంలోనూ, విప్లవకవుల, ప్రజాకవుల ప్రజాగీతాలరూపంలోనూ మరొక ప్రయాణం చేస్తూ వచ్చింది. ఈ రెండు ధోరణుల్లోనూ, మొదట్లో లయాత్మకంగా ఉండే వచనకవిత రానురానూ తన musicality నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తూండగా, పాట తన సాహిత్యపరిమితిని దాటి సంగీతానికి మరింత చేరువకావడానికి ప్రయత్నిస్తూంది.

ఇందులో 50 ల తర్వాత సినిమా పాటగానూ, రేడియో, ఇప్పుడు టివి మాధ్యమాల్లో లలితసంగీత రూపంలోనూ ప్రచలితమవుతున్న పాటకి ఒక ప్రత్యేక శిల్పముంది. పాటకి ఆ ప్రత్యేకతను సంతరించడంలోనే రజనీకాంతరావు తెలుగు కవిత్వానికిచ్చిన మహత్తర ఉపాదానమున్నదన్నదే నిన్న సాయంకాలం నేను పదేపదే చెప్పిన మాట.

రజని తెలుగుపాటకి సంతరించిన ఆ ప్రత్యేకత ఏమిటో, బాలమురళినే, తన ముందుమాటలో, ఇట్లా వివరించాడు:

‘సాహిత్యానికి వలయు సంగీతము యొక్క పరిమితి, స్వరూపం, అటులనే సంగీతానికి వలయు సాహిత్యం యొక్క పరిమితి స్వరూపం తెలిసి కూర్చబడిన పాటకు లలిత సంగీతం అనవచ్చు. ఇది యొక వినూత్న శైలి, బహుశ: దీనికి ఆంధ్రసంగీతమనే నామకరణం సరైనదని నా అభిప్రాయం.’

50 లముందు జాతీయోద్యమగీతాలు ‘మాకొద్దీ తెల్లదొరతనమూ’, ‘పాడవే రాట్నమా’, ‘వీరగంధము తెచ్చినారము’ వంటి గేయాల్లోనూ, గురజాడ, రాయప్రోలు, అబ్బూరి, బసవరాజు, నండూరి సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి వంటి వారి గీతాల్లోనూ భాషాభారం తక్కువగా ఉన్నప్పటికీ, వారెవ్వరూ స్వయంగా స్వరకర్తలు కారు కాబట్టి, వాటి సంగీతవైశిష్ట్యమేమిటో వారికీ తెలియదు, మనకీ తెలియదు. (రాగనిర్దేశంతో గురజాడ రాసిన నీలగిరి పాటలు మినహాయిస్తే.)

కాని రజని రాసిన పాటలు ఆయన సంగీతప్రతిభవల్ల సుమధుర గీతాలయ్యాయి:

‘గాలివాన రేయి! నిన్నీ
కానలోన నెటులు కాంతునోయీ’

‘హాయిలో నేల ఎదకింత హింస
తీయపాటలో బాధేల వంశీ’

;ఓ మలయపవనమా, నిలు నిలు నిలుమా
ఓ మలయపవనమా’

‘స్వప్న జగతిలో ఛాయావీణా
సమదశ్రుతులెవో సాగునవే’

‘ఓ విభావరీ! ఓహో విభావరీ!
నీహార హీర నీలాంబర ధారిణీ, మనోహారిణీ!’

కృష్ణశాస్త్రి కవిత్వ ప్రభావంలోంచే రజని పాటలు రాయడం మొదలుపెట్టాడని మనకి తెలుసు, కాని, కృష్ణశాస్త్రి సినిమాపాటలు రజని ప్రభావంలోంచి రాసినవని మనం గమనించనే లేదు.

‘ప్రళయకాలోదగ్ర భయదజీమూతోరు
గళఘోర గంభీర ఫెళఫెళార్భటులలో
మెరపేలా’

నుంచి

‘ప్రతీ రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైరగాలి
బతుకంతా ప్రతినిముషం పాటలాగా సాగాలి’

దాకా కృష్ణ శాస్త్రి ప్రయాణించడం వెనక రజని ఉన్నాడు.

కవిత్వంలో కృష్ణశాస్త్రిని అనుసరించిన శ్రీశ్రీ సినిమాపాటల్లో కూడా సినిమాపాటల కృష్ణశాస్త్రినే అనుసరించాడు.

‘మనసున మనసై బతుకున బతుకై
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము
ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో, ఆవేదనలో,
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.’

లాంటి సులలిత గీతం వెనక పరోక్షంగా రజని ఉన్నాడనే మనం అనుకోవలసి ఉంటుంది.

సంగీతభారం వల్ల సాహిత్యం తూలిపోకుండానూ, సాహిత్యభారం వల్ల సంగీతం సోలిపోకుండానూ తీరిదిద్దగలిగితేనే ఒక గేయం లలితగీతమవుతుంది.

ఇరవయ్యవ శతాబ్ది భారతీయ వాగ్గేయకారుల్లో ఈ రహస్యం బాగా తెలిసినవాడు టాగోర్. అందుకనే అతడి సాహిత్యం, సంగీతం ఒక్కటయ్యాయని Rabindranath Tagore : The Singer and His Song (పెంగ్విన్, 2009) అనే తన రచనలో రెబా సోమ్ అనే పరిశోధకురాలు ఎంతో వివరంగా చెప్పుకొచ్చింది.

టాగోర్ తర్వాత వరసలో నిలబడగల రజని గురించి అటువంటి పరిశోధన తెలుగులో ఇంకా రావలసే ఉంది.

4-12-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading