సింప్లీ షూబర్ట్

38

ఆ మహానగరమంతా మినుకుమంటున్న చలనంలాగా ఉంది, పక్కనుంచి చూస్తున్న స్పైరల్ గెలాక్సీలాగా ఉంది…

గణాంకాలలా ఉంచి- నాకు తెలుసు, అక్కడ ఇప్పుడెవరో ఏ గదిలోనో షూబర్ట్ ను వినిపిస్తున్నారు, ఎవరికో ఈ క్షణాన అన్నిటికన్నా కూడా ఆ స్వరాలే అత్యంత యథార్థం..

-తోమాస్ ట్రాన్స్ ట్రోమర్ (షూబర్టియానా)
___________________

స్వీడిష్ మహాకవి న్యూయార్క్ ని చూస్తూ ఈ మాటలు రాసినా, నిన్న సాయంకాలం హైదరాబాద్ కి కూడా ఈ మాటలు వర్తిస్తాయనిపించింది.

బేగంపేట హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో The Bangalore Men సమర్పించిన Simply Schubert వింటున్నంతసేపూ అక్కడ కిక్కిరిసిపోయిన ఆడిటోరియంలో ప్రతి ఒక్కరికీ, ఆ క్షణాన, ఆ పదొమ్మిదో శతాబ్ది స్వరాలే అత్యంత ముఖ్యంగానూ, యథార్థంగానూ అనిపించాయి.

ఫ్రాంజ్ షూబర్ట్ (1797-1828) పాశ్చాత్యసంగీతంలో సంప్రదాయ శకం ముగిసి రొమాంటిక్ శకం తలెత్తిన కాలానికి చెందిన సంగీతకారుల్లో అగ్రశ్రేణికి చెందిన వాడు. రొమాంటిక్ యుగానికి చెందిన ఎందరో కవుల్లానూ, కళాకారుల్లానూ అల్పాయుష్కుడే అయినప్పటికీ, 31 ఏళ్ళే జీవించినప్పటికీ, కవిత్వ ప్రపంచంలో కీట్స్ లాగా, సంగీతపిపాసుల హృదయాల్లో వార్థక్యమూ, మృతీ లేని స్థానాన్ని సంపాదించుకున్నాడు.

పాశ్చాత్య సంగీతం చర్చి బృందగానాలనుంచి ప్రభవించింది. దాన్ని ఆ పారలౌకిక స్ఫూర్తినుంచి ఈ భూమీదకు దింపుతూ, అదే సమయంలో దానిద్వారా ఒక అలౌకిక స్ఫూర్తిని కలిగించడంకోసమే సంప్రదాయ, రొమాంటిక్ సంగీతకారులు అన్వేషించారు.

ఒకవైపు ఫ్యూడలిజంనుంచి ఆర్థికవ్యవస్థని విడుదలచేస్తున్న పారిశ్రామికీకరణ, మరొకవైపు, మతవిశ్వాసదాస్యం నుంచి విడుదల చేయడానికి ఎన్లైటెన్ మెంట్ తత్త్వవేత్తలూ పెనగులాడుతున్నప్పుడు, ఐరోపీయ కవులూ,సంగీతకారులూ మరింత సూక్ష్మ పోరాటం చెయ్యవలసివచ్చింది.. వారొకవైపు పాత ప్రపంచంతోనూ, మరొకవైపు పారిశ్రామికీకరణ చెందుతున్న నవీన ప్రపంచంతోనూ కూడా పోరాడవలసి వచ్చింది. తాము కోరుకుంటున్న లోకం పరలోకం కాదు, నిజమే, అలాగని అది అంగడితోనూ, పెట్టుబడిదారులతోనూ, దోపిడీతోనూ, పేదరికంతోనూ కూడుకున్న దైనందిన ప్రపంచం కూడా కాదు. సౌందర్యం, హృదయోద్వేగాలూ, భావావేశాలూ వికసించి మనిషి మనిషి గా జీవించే ఒక నిర్మల ప్రపంచం. అటువంటి కల ఒక కాల్పనిక ప్రపంచానికే దారితీసి ఉండవచ్చుగాక, కాని, ఆ కాల్పనిక ప్రపంచం, ఆ కవిత్వం చదివే వారికి, ఆ స్వరాలు వినేవారికి, ట్రాన్స్ ట్రోమర్ అన్నట్లుగా యథార్థాల్లో కెల్లా యథార్థం.

అటువంటి కాల్పనిక, స్వాప్నిక సంగీతాన్ని సృష్టించినవాడు షూబర్ట్. తక్కిన సంగీతకారుల్లాగా సింఫనీలు రచించడమే కాక, 18, 19 శతాబ్దాలకు చెందిన జర్మన్ భావకవుల గీతాలకి కూడా, సుమారు 600 గీతాలకు, అతడు సంగీత స్వరకల్పన చేసాడు. సాహిత్యానికీ, సంగీతానికీ మధ్య అంత విస్తారమైన సమన్వయానికి కృషి చేసిన మరొక కంపోజర్ మనకి పాశ్చాత్య సంగీతంలో కనబడడు.

గాయకకంఠాలకీ, పియానోకీ అనుగుణంగా స్వరకల్పన చేసిన అటువంటి లలితసంగీతకృతుల్లో (జర్మన్ సంగీతంలొ వాటిని lieder అంటారు) 17 కృతుల్ని బెంగుళూరు బృందం ఆలాపించింది. ఆ కృతుల్లో గొథే, షిల్లర్, హీన్రిఖ్ హీన్ వంటి సుప్రసిద్ధ జర్మన్ భావకవుల గీతాల్తో పాటు, బైబిల్లోని 23 వ సామగీతం, వాల్టర్ స్కాట్ రచనకు చేసిన జర్మన్ అనువాదం నుండి ఒక గీతంతో పాటు మరికొందరు జర్మన్ కవుల గీతాలు కూడా ఉన్నాయి. గొథే సుప్రసిద్ధ విషాద గీతిక Erlking తో పాటు, తాను ఒకప్పుడు మృత్యువు అంచులదాకా వెళ్ళి బయట పడినప్పుడు షూబర్ట్ స్వయంగా రచించిన Death and the Maiden అనే గీతం కూడా ఉంది.

నేను షూబర్ట్ ని ఒక కచేరీలో వినడం ఇదే మొదటిసారి. నాతో పాటు విజ్జీ, పిల్లలూ. గంగారెడ్డి, ఆదిత్య కూడా వచ్చారు. అందరి అనుభూతి ఒక్కలానే ఉంది. ఆ సంగీతం నిజంగానే ఒక వెన్నెలరాత్రి ఆరుబయట ఒక ప్రేమికుడు పాడుకున్న పాటలానూ, నది ఒడ్డున పడవలకి తాకి విరిగిపడే చిన్న చిన్న అలలు చేసే చప్పుడులానూ, ఒక రోజంతా కాలినడకన సుదీర్ఘ ప్రయాణం చేసాక,మనం వెళ్ళవలసిన గ్రామంలో దీపాలు దూరంనుంచీ మినుకుమినుకుమంటూ వెలుగుతున్నట్టుగానూ ఉంది. నీళ్ళల్లో కదలాడుతున్న చెట్లనీడల్నీ, పొలాలమీద వాలుతూ, ఎగురుతూ, మళ్ళా వాలుతున్న కొంగలబారుల్నీ చూస్తూ ఒక పంటకాలువ వెంబడి గూటిపడవలో ప్రయాణించినట్టుంది. దైవాంకితమైన భక్తిసంగీతంలోనో, శాస్త్రీయ సంగీతంలోనో ఉండే దివ్యత్వ స్ఫురణ కాదు, ఇద్దరు ప్రేమికులు ఒకరి చేతుల్లో ఒకరు చేయి వేసుకుని, మసకసంజవేళ సాయంకాలపు నడకకు వెళ్ళినప్పటి ఒక అనుభూతి, ఈ ప్రపంచమూ, మరో ప్రపంచమూ కూడా మనదగ్గరే సంగమిస్తున్న సంవేదన.

ఆ కచేరీ నిర్వహణ కూడా ఎంతో హుందాగా ఉంది. అనవసరమైన ప్రసంగాలు లేవు. చిన్న పరిచయం. తమది పురుషగాయక బృందమనీ, షూబర్ట్ lieder లో దాదాపు 140 కృతులదాకా పురుషగాయక కంఠాలకోసమే స్వరకల్పన చేసాడనీ, అందుకే తాము షూబర్ట్ ని ఎంచుకున్నామనీ చెప్పారు.

బృంద నిర్వాహకుడు జోనస్ ఓల్సన్ స్వీడన్ లో సంగీత శాస్త్రం అభ్యసించి ప్రస్తుతం బెంగుళూరులో నే నివసిస్తున్నాడు. ఎనిమిది మంది గాయకులతో పాటు, తార స్థాయి స్వరగాయిక (సొప్రానో) పాయల్ జాన్ కూడా వివిధ కృతులు ఆలపించారు. బెలారస్ లో పుట్టి, బెంగుళూరులో నివసిస్తున్న నటాలియా కపిలోవా పియానో సహకారం అందించింది.

బృందగానం మొదలుకావడానికి ముందు షూబర్ట్ వివరాలు, సంగీత బృంద వివరాలు తెలిపే బ్రోచర్ తో పాటు, ఆ జర్మన్ గీతాల్ని వాటి ఇంగ్లీషు అనువాదాలతో శ్రోతలకి అందించారు. ఆ విధంగా అదొక సంగీత సభగానే కాక, కవితాగానసభగా కూడా మారింది.

కచేరీ ముగిసిన తర్వాత కూడా చాలాసేపు శ్రోతలు అక్కణ్ణుంచి లేవలేకపోయారు. కొందరు వేదిక దాకా వెళ్ళి వాళ్ళని అభినందించారు, కాని చాలామంది ఆ సంగీతం తమలో రేపిన అంతరంగ సౌకుమార్యమేదో తమని పట్టి ఆపేస్తున్నట్టుగా అట్లానే కుర్చీల్లో కూచుండిపోయారు.

తిరిగి ఇంటికి వచ్చాక, రాత్రంతా కూడా ఆ సెరెనేడ్ లు, ఆ ఆలాపనలు, పియానో మెట్లమీంచి ముత్యాల్లాగా కిందకి రాలుతున్న ఆ చిన్ని చిన్ని స్వరాలు నా మనసంతా కదలాడుతూనే ఉన్నాయి. నాకు రాత్రంతా నిద్రపట్టలేదు.

షూబర్ట్ ని వినడం ఒక అనుభవమనుకుంటే, దాన్ని సంగీత పరిభాషలో అర్థం చేసుకోవడానికీ, వివరించడానికీ నేను సంగీత నిరక్షరాస్యుణ్ణి. కాని, సాహిత్యాన్ని సంగీతంగా మార్చడమే షూబర్ట్ తపస్సు కాబట్టి, బహుశా,ఆ అనుభూతిని, ఆ కవిత్వశబ్దాలతోనే వివరించవచ్చేమో.

ఆ గీతాల్ని నా తెలుగులోకి మార్చుకోవడం ద్వారా-

1

‘చంద్రతారకలు పరిభ్రమిస్తూ నర్తిస్తున్నవేళ ఇంకా ఈ ప్రాపంచిక విషయాల్ని పట్టుకు వేలాడేదెవరు?అన్ని అవరోధాల్నీ దాటుకుని, నా చిన్ని పడవా, నువ్వీ సముద్రపు ఒడిలో, వెన్నెల వెలుగులో సాగిపో. అర్థరాత్రి అయినట్టు చర్చిస్తంభం దగ్గర గంటలు వినిపిస్తున్నాయి. అంతా నిదురిస్తున్నారు, పడవవాడొక్కడే మేలుకుని ఉన్నాడు.’

2

‘సుందరా, ప్రకృతి సంతోషమా, నీకు స్వాగతం, నీ పూలసెజ్జతో ఈ మైదానానికి స్వాగతం,ఓ, మళ్ళా వచ్చావు నువ్వు, నీ అందం, నువ్వంటే నాకెంతో ఇష్టం, నీకు హృదయపూర్వక స్వాగతం..’

3

‘ఓ శుభరాత్రీ,నువ్వు అస్తమిస్తున్నావు, నీ వెన్నెలవెలుగులానే, మనుషుల నిశ్శబ్ద హృదయాల్లోంచి స్వప్నాలు కూడా కదిలిపోతున్నాయి, తిరిగి వేవెలుగు పరుచుకుంటూనే అవి సంతోషంతో చెవి ఒగ్గి ఆలకిస్తున్నాయి, శుభరాత్రీ, మరలిరా, సుందర స్వప్నమా, మరలిరా!’

4

‘ఓ పవిత్ర సంగీతమా, రుజాగ్రస్తమైన వేళల్లో, నా ఆదిమ కాంక్షావలయంలోకి రాలిపడ్డ నా హృదయాన్ని తిరిగి ప్రేమతో వెచ్చబరిచి మరింత మెరుగైన లోకంలోకి తీసుకుపోయావు, నీ వీణమీంచి అప్పుడప్పుడొక దీర్ఘనిశ్వాసం, శుభప్రపూరిత, సంతోషపూర్ణ తంత్రీనాదం, స్వర్గం నుంచి తొణికిసలాడే సముజ్జ్వల భావియుగాల క్షణమాత్ర సందర్శనం, ఓ పవిత్ర కళాకుసుమమా, నీకు జేజేలు.’

5

‘వెండి జలతారు సెలయేరుని ప్రేమ వేగిరపరుస్తున్నది, మృదువుగా ప్రవహించమని పారాడుతున్నది, ఏటి గుండెలో ప్రేమని నిక్షిప్తపరుస్తున్నది, చాతకమా, ప్రకృతి మంత్రగానాన్ని ప్రేమ గుసగుసగానే వినిపిస్తున్నది..’

6

‘గాఢనిశీధి నిశ్చల క్షణాన మేము తడబడుతూనే ప్రియమందిర ద్వారం దగ్గర నిలబడి మృదువుగా వంచిన మా అంగుళుల్తో, సుతారంగా తలుపు తడుతున్నాం. నెమ్మదిగా ఉప్పొంగుతూ, ఉప్పొంగుతూ, ఏకకంఠమై వికసిస్తూ మా ధైర్యం కూడగట్టుకుని గట్టిగా పిలుస్తున్నాం. ప్రేమకంఠం వినిపిస్తున్నాక, ఇక నిద్రపోవద్దు. ఒకప్పుడొక సాధువు చేత లాంతరెత్తి నిజమైన మనుషులకోసం లోకమంతా గాలించాడు. మనం నిజంగా ఇష్టపడేవాళ్ళు, ప్రేమించదగ్గవాళ్ళు బంగారం కన్నా అపురూపం కాదా, కాబట్టి, నేస్తమా, స్నేహం, ప్రేమ పిలుస్తున్నప్పుడు, నా మిత్రమా, నా ప్రాణమా, నిద్రపోకు! కాని నిద్రకన్నా విలువైన సంపద ఏముంటుంది? కాబట్టి, ఇప్పుడు మాటలకన్నా, బహుమతుల మూటలకన్నా నీకు కావల్సింది నిద్ర-మాకు తెలుసు-అందుకే, ఒక్క మాట, ఒకే ఒక్క శుభాశంస, ఇక మా సంతోష గీతం పూర్తయిపోతుంది, నిశ్శబ్దంగా, నిశ్శబ్దంగా, మేమిక్కణ్ణుంచి తప్పుకుంటాం, అవును, పక్కకు తొలగిపోతాం..’

28-8-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: