ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018

30

ప్రపంచబాంకు ప్రతి ఏటా వెలువరించే ప్రపంచ అభివృద్ధి నివేదిక 2018 వ సంవత్సరానికి వెలువడింది. 1978 నుంచీ వెలువరిస్తున్న ఈ నివేదికల పరంపరలో బాంకు విద్య గురించి మొదటిసారిగా వెలువరించిన నివేదిక ఇది.

మారుతున్న ప్రపంచ సామాజిక-ఆర్థిక గతిని ఎప్పటికప్పుడు ఎంతో నిశితంగానూ, లోతుగానూ పట్టుకోవడమే కాక, ప్రపంచదేశాలకూ, రాజకీయ విధాననిర్ణయవేత్తలకూ మార్గదర్శకంగా ఉండే ప్రపంచబాంకు తన వార్షిక అభివృద్ధి నివేదికల్లో ఇంతదాకా విద్య గురించి మాట్లాడవలసినంతగా మాట్లాడకపోవడమే ఒక ఆశ్చర్యం. కొత్త శతాబ్దం మొదలయిన తరువాత, ఇప్పటికాలానికీ, రేపటికీ అవసరమైన విద్య ఎలా ఉండాలన్నదానిమీద ఇప్పటికే ఎన్నో సంస్థలు, ఎందరో నిపుణులు విస్త్రతంగా మాట్లాడుతూ వచ్చాక గానీ ప్రపంచబాంకు తన అవగాహనను స్పష్టపరుచుకోలేకపోయింది.

21 వ శతాబ్దం మొదలై దాదాపు రెండు దశాబ్దాలు కావొస్తూంది. ఒక విధంగా చూస్తే ప్రపంచబాంకు కాలంకన్నా వెనకబడ్డట్టే అనిపిస్తుంది. కాని, ఇంతదాకా బాంకు అనుసరిస్తూ వచ్చిన వ్యూహాలూ, వివిధ దేశాలకు అందిస్తూ వచ్చిన సలహాలు, చేపట్టిన ప్రాజెక్టుల నేపథ్యంలో, తనని తాను కూలంకషంగా పునర్విమర్శించుకుంటే తప్ప, ఇటువంటి నివేదికను వెలువరించడం సాధ్యం కాదు. ఎంతో వివేకంతోనూ, ఆంతర్విమర్శతోనూ బాంకు ఇటువంటి ప్రయత్నం చెయ్యడం నిజంగా స్వాగతించదగ్గ విషయం.

ఇంతకుముందు 98-99 వార్షికనివేదికను ‘అభివృద్ధికోసం పరిజ్ఞానం’ అనే ఇతివృత్తం మీదా, 1999-2000 నివేదికను ‘కొత్త శతాబ్దం’ అనే ఇతివృత్తం మీదా వెలువరించినప్పుడు, బాంకు, ఇంతదాకా పరిచితమైన విద్యావిధానాలకన్నా భిన్నమైన విధానాలకు అవసరమైన కాలంలోకి అడుగుపెడుతున్నామని గుర్తించకపోలేదు. కాని ఈ కొత్తకాలానికి అవసరమైన విద్య ఎలా ఉండాలి, అందుకు తగ్గట్టుగా పాలనావిధానాలు ఎలా ఉండాలి అన్నదానిమీద బాంకు ఇప్పటిదాకా ఒక స్పష్టతకు రాలేకపోయింది.

అందుకు ఒక కారణం ఉంది.

గత శతాబ్దంలో మూడవప్రపంచదేశాల్లో విద్య మీద ప్రభుత్వాలు సరైన దృష్టి పెట్టనందువల్లా, ప్రాథమిక విద్యారంగం మీద పెట్టవలసినంతగా పెట్టుబడులు పెట్టనందువల్లా, ప్రపంచబాంకు ఇప్పటిదాకా, ప్రధానంగా schooling గురించి మాట్లాడుతూ వచ్చింది. మన దేశంలో కూడా జిల్లా ప్రాథమిక విద్యా ప్రాజెక్టులు (డి.పి.ఇ.పి) ప్రపంచబాంకు సహాయంతోనే మొదలయ్యాయి. ఆ ప్రయోగాల అనుభవంతో దేశవ్యాప్తంగా సర్వశిక్షా అభియాన్ కార్యక్రమం దేశీయ నిధులతో మొదలయ్యింది. పిల్లలు ఉండవలసింది బళ్ళో అనే లక్ష్యంతో, ‘అందరికీ విద్య’ ఆశయంగా మొదలైన కార్యక్రమం. ముందు పిల్లల్ని బళ్ళో చేర్పించండి, వాళ్ళు కనీసం అయిదేళ్ళయినా బళ్ళో గడిపితే చాలు అనే ప్రపంచబాంకు 95-2000 మధ్యకాలమంతా మాట్లాడుతూ వచ్చింది. ఇప్పటికీ, ప్రపంచంలో 26 కోట్లమంది పిల్లలు బడికి నోచుకోలేదంటే, ఈ సమస్య ఎంత తీవ్రమైనదో మనం అర్థం చేసుకోవచ్చు.

కానీ, మారుతున్న కాలానికి ఈ వ్యూహం సరిపోదని అందరికన్నా ముందు యునెస్కో గుర్తించింది. 21 వ శతాబ్దిలో విద్య ఎలా ఉండాలన్నదానిమీద చర్చించడానికి జాకె డెలోర్స్ అధ్యక్షతన ఒక అంతర్జాతీయ కమిషన్ ను నియమించింది. ఆ కమిషన్ 1996 లో సమర్పించిన తన నివేదికకు Learning: The Treasure Within అనే పేరుపెట్టింది. ఒకవైపు ప్రపంచబాంకు schooling గురించి మాట్లాడుతూండగా, యునెస్కో learning గురించి చర్చ మొదలుపెట్టింది. అసలు విద్యని ఒక పాలనా ప్రాధాన్యతగానే భావించని ప్రభుత్వాలకు, ఈ రెండు ప్రాధాన్యతల్లో ఏది తక్షణ అవసరమో ఒకపట్టాన అర్థం కాలేదు. ఇంకా పిల్లల్ని బడిలో వెయ్యడమే ఒక ప్రాధాన్యత కావలసిన తరుణంలో అభ్యసనం గురించి మాట్లాడటం మరీ అత్యాశగా ఆ రోజు చాలామంది భావించారు.

కాని, ఆ నివేదిక వెలువడిన ఇరవయ్యేళ్ళ తరువాత, ప్రపంచబాంకు వెలువరించిన ఈ నివేదికలో మొదటి వాక్యమే ఇలా ఉంది:

Schooling is not the same as learning.

అయిదేళ్ళు దాటిన పిల్లలు కనీసం అయిదేళ్ళు ప్రాథమిక పాఠశాలలో గడిపినా కూడా అది ఆ పిల్లలకీ, వాళ్ళ కుటుంబాలకీ, జాతీయ ఆర్థికవ్యవస్థలకీ కూడా ఎంతో శ్రేయోదాయకంగా ఉండగలదని ప్రపంచబాంకు లెక్కలుగట్టి మరీ చెప్తూ వచ్చింది, ప్రభుత్వాల్ని ఒప్పిస్తూ వచ్చింది. కాని, రెండు దశాబ్దాల తర్వాత బాంకు గమనించిందేమంటే, పిల్లలు బడికి వెళ్ళినా, అక్కడ సార్థకమైన అభ్యసనం లేకపోతే, ఆ కాలం, ఆ పెట్టుబడి, ఆ వనరులు పూర్తిగా వృథాకావడం తప్ప మరేమీ కాదని. ‘అభ్యసనమే ముఖ్యమని అనుకుంటే ఏ దేశమైనా అద్భుతంగా పనిచేయగలదు. కాని ఆచరణకు వచ్చేటప్పటికి, విద్యావ్యవస్థలు పిల్లలు నేర్చుకోడానికి వ్యతిరేకంగా కుట్రపన్నుతాయనిపిస్తోంది’ అని రాసింది బాంకు తన నివేదికకు ముందుమాటలో.

ఇప్పుడు ప్రపంచం ఒకేఒక ఆర్థికసీమగా మారిపోయిన తరువాత, ఏ దేశమైనా తన పాఠశాలల ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా ఉండేటట్టుచూసుకోకపోతే ఆ మొత్తం దేశమే వెనకబడిపోయే ప్రమాదం దాపురించింది. ఇంతదాకా మనం ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాలూ, వెనకబడ్డ దేశాలూ అనే వర్గీకరణకే అలవాటు పడుతూ వచ్చాం. కాని అభివృద్ధి చెందిన దేశాల్లోని బాలబాలికల విద్యాప్రమాణాల్లో సాధించిన అభివృద్ధితో వెనకబడ్డ దేశాల పిల్లల విద్యాప్రమాణాల్ని పోల్చి చూస్తే భరించలేనంత నిస్పృహ కలుగుతుంది. ఉదాహరణకి, ప్రపంచబాంకు నివేదిక ప్రకారం, అభివృద్ధి చెందిన దేశాల్లో మూడవతరగతి పిల్లలు చూపించే సామర్థ్యం సాధించాలంటే వెనకబడ్డ దేశాల పిల్లలకి మరొక 260 ఏళ్ళు పడుతుంది!

దీన్ని బాంకు learning crisis అంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలకి విద్యావకాశాలు దూరంకావడానికి చెప్పదగ్గ మూడుకారణాల్లో, పేదరికం, యుద్ధాలు మొదటి రెండు కారణాలూ కాగా, అభ్యసనసంక్షోభం మూడవకారణం. కాని, మొదటి రెండు కారణాలకన్నా మరింత తీవ్రమైనదీ, ప్రమాదకరమైనదీ అని బాంకు ఈ నివేదికద్వారా ప్రపంచాన్ని హెచ్చరిస్తున్నది.

మన దేశంలో రాజకీయ శక్తులు, ఉద్యమకారులు ఇంకా పందొమ్మిదో శతాబ్ది భావజాలంలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఆర్థికవ్యవస్థలోని అసమానతలకు వర్గం, వర్ణం,లింగం కారణాలని వాదించుకుంటూ, అభ్యుదయశక్తులు తమలో తాము కలహించుకుంటూ ఉన్నారు. కాని, కొత్త ప్రపంచంలో అసమానతలు కేవలం భూమి, కులం, జెండర్ ల మీద ఆధారపడినవి కావు. ఇవి పిల్లల అభ్యసన సామర్థ్యాల్లోని అసమానతలమీద ఆధారపడినవి. వర్గం,వర్ణం, కులం, లింగం వంటి పరిమితులవల్ల ఈ అసమానతలు మరింత అసమానంగా మారుతున్నాయి, నిజమే, కాని, వర్ణం, లింగం, ప్రాంతం వంటి ప్రాతిపదికలమీద ఆధారపడ్డ వివక్షతోనూ, అసమానతలతోనూ ఇప్పుడు మనం చేయవలసిన పోరాటం, ఆ పరిమితుల్ని దాటి పిల్లల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందింపచేయడమెట్లా అన్నదాని గురించి కావాలి. కాని, చూడండి, ఈ దశాబ్దంలో వచ్చిన ఏ ఒక్క రాజకీయ పార్టీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఈ learning crisis ప్రస్తావన మనకి కనిపించదు. ఈ నివేదిక వెలువడి వారంరోజులు కావొస్తున్నా, మన పత్రికాసంపాదకులు ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సినిమాతారల గాసిప్ లో మైమరిచిపోయిన మన నిరక్షరాస్య టెలివిజన్ ఛానెళ్ళు ఇప్పట్లో మేల్కొంటాయన్న ఆశ నాకే కోశానా లేదు.

బాంకు నివేదికలోని సారాంశం గురించి మళ్ళా రాస్తాను. కాని సమాజం దృష్టిని అభ్యసనం మీదకు మళ్ళించడానికీ, ఈ సంక్షోభాన్ని ఎదుర్కోడానికీ, బాంకు మూడు అంశాల గురించి మాట్లాడుతున్నదని స్థూలంగా చెప్పనివ్వండి. అవి:

• పిల్లల అభ్యసనం గురించీ, పాఠశాలల ప్రమాణాల గురించీ వీలైనంత సమాచారం, సాధించిన ప్రగతిని ఎప్పటి కప్పుడు మదింపు వేసుకోవడం.

• ఈ ఉమ్మడి లక్ష్యంతో, వివిధ సామాజిక-రాజకీయ శక్తులు అనుసంధానం కావడం.

• కొత్త కొత్త ప్రయోగాలకు స్వాగతం పలకడం, మరింత చొరవ చూపించడం.

9-1-2018

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: