పూలాజీ బాబా సన్నిధిలో

73

గురువారం పొద్దున్నే ఫూలాజీబాబాని చూడాలని పట్నాపూర్ వెళ్ళాం. ఉట్నూరునుంచి ఆసిఫాబాదువెళ్ళే దారిలో లోపలకీ ఉండే ఒక గిరిజన కుగ్రామం. పత్తిచేలమధ్య, సోయాపొలాలమధ్యనుంచి ప్రయాణం. ఇరవయ్యేళ్ళకిందట మొదటిసారి ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు ఎవరో నాతో ఇక్కడొక సిద్ధపురుషుడున్నాడని చెప్తే ఆయన్ను చూడటానికి వెళ్ళాను. సద్గురు ఫూలాజీ బాబా ఆంథ్ తెగకు చెందిన గిరిజన రైతు. నేను వెళ్ళేటప్పటికి ఆయన తన జొన్నచేలో కంచె కట్టుకుంటున్నాడు. నాతో చాలా ఆదరంగా మాట్లాడేడు.

ఎప్పుడో ఏ సిద్ధపురుషుడినుంచో ఆయనకేదో ఉపదేశం దొరికింది. అది ఆయన్నొక తపస్విగా మార్చేసింది.ఈ ఇరవయ్యేళ్ళ కాలంలో ఆయన మహారాష్ట్రమొదలుకుని నిజామాబాద్, అదిలాబాద్ ప్రాంతమంతటా గొప్ప ఆధ్యాత్మిక శక్తిగా మారాడనీ, గిరిజనులమీదా, గిరిజనేతరులమీదా కూడా సమానంగా గొప్ప ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాడనీ మట్టిమనుషుల్ని మాణిక్యాలుగా మారుస్తున్నాడనీ విన్నాను.

రెండుదశాబ్దాల తరువాత కూడా ఆ గ్రామంలో మార్పేమీ లేదు కాని, ఆయన ఆశ్రమం ఒక సద్గురు సంస్థానంగా మారికనిపించింది. అలాగని ఆడంబరంగా లేదు.

అక్కడొక విశాలమైన మందిరం. మేమక్కడకు పోగానే ఆయన తన ఇంట్లోమంచి మా దగ్గరకు వచాడు. తానొక కుర్చీలో కూచుని మమ్మల్ని కూడా పక్కన సోఫాలో కూచోమన్నాడు. మాతో వచ్చినవాళ్ళతో పాటు నెమ్మదిగా గ్రామీణులు, రైతులు, గృహిణులు కూడా అక్కడ పోగవడం మొదలుపెట్టారు.

అక్కడ ఆశ్రమపాఠశాలలో పనిచేస్తున్న తుకారాం అనే ఉపాధ్యాయుడు బాబాకి సన్నిహిత శిష్యుడు. అతడు నా తెలుగుని బాబాకి మరాఠీలోనూ, ఆయన మరాఠీని నాకు తెలుగులోనూ వివరించడం కోసం నిల్చున్నాడు. ఆయన నన్ను బాబాకి పరిచయం చేస్తూ, ఇరవయ్యేళ్ళకిందట బాబా దగ్గర ఉండటానికి వీలుగా తనని అక్కడకు నేనే బదిలీ చేసానని గుర్తు చేసాడు. ఆ ఒక్క మాటతో బాబా కళ్ళు మెరిసాయి. ఆ సాధారణమైన పనికి ఆయన ఇప్పటికీ నా పట్ల కృతజ్ఞుడిగా ఉన్నట్టు తలూపాడు.

నేనన్నాను: ‘ఇరవయ్యేళ్ళ తరువాత ఇక్కడికి వచ్చాను. జీవితంలో ఎవరినీ ఏమీ అడగని బాబా, సర్వసంగ పరిత్యాగి, నేను మొదటిసారి కలిసినప్పుడు, నన్నో కోరిక కోరారు. ఇక్కడొక ఆశ్రమపాఠశాల తెరవగలమా అనడిగారు. కొత్త పాఠశాల మంజూరు ప్రభుత్వం మాత్రమే చెయ్యగలదు. అయినా బాబా అడిగారు కాబట్టి మా స్థాయిలో మేమే ఏదో సర్దుబాటు చేసి పాఠశాల తెరిచాం. ఇదంతా నా ‘కొన్ని కలలు-కొన్ని మెలకువలు’ లో రాసాను’

తుకారాం అదంతా బాబాకి చెప్పాడు. ఆయన నేత్రాల్లో మెరుపు. ‘తన కోసం కోరుకున్నది సంతోషంకాదు. ఎదటివాళ్ళకోసం కోరుకున్నదే సంతోషం’ అన్నారాయన.

ఆ మాట వినగానే చిరకాలంగా నాలో రగుల్తున్న సమస్యకేదో సమాధానం దొరికినట్టనిపించింది. ‘నేను బాబానొక ప్రశ్న అడుగుదామా వద్దా అనుకుంటున్నాను. కాని నేనడక్కుండానే ఆయనే జవాబిచ్చారు’ అన్నాను. ‘అయితే, ఒక సందేహం. బాబా ఈ మాట స్కూలు గురించి అని ఉండవచ్చు. ఎదటివాళ్ళ సంతోషం అంటున్నప్పుడు ఆయన సమాజం గురించి మాట్లాడుతున్నారు. ఈ మాట వ్యక్తుల గురించి కూడా అనుకోవచ్చునా’ అనడిగాను.

ఆ మాటకి బాబా వెంటనే జవాబిచ్చారు:’వ్యక్తి వేరు, సమాజం వేరు కాదు, రెండూ ఒకటే, వ్యక్తికి సహాయం చేస్తే, సమాజానికి చేసినట్టే, సమాజానికి చేస్తే, వ్యక్తికి చేసినట్టే.’

అయినా నా సందేహాలకి అంతం లేదు, వెంటనే మరొక ప్రశ్న:’ అలాగని ఎవరు ఏమి కోరితే అది చేసేయ్యాలా?’

బాబాకి విసుగు లేదు. ‘ఎవరు ఏమడిగినా ఇవ్వాలి, చెయ్యాలి, కాని అందుకోవడం వాళ్ళ యోగ్యతనిబట్టి, పాత్రతనిబట్టి.’

కొన్ని క్షణాల నిశ్శబ్దం. మేమక్కడ కూర్చున్నప్పుడే బాబా మా చేతిలో చక్కెరగుళికలు పెట్టారు. మేం తీసుకువెళ్ళిన అరటిపళ్ళల్లో ఒక పండు నా చేతిలో పెట్టారు. నాకా పండు తినాలనిపించింది. దాని రెండుముక్కలు చేసి పెద్దముక్క బాబా చేతిలో పెట్టాను. ఆయన దాన్నందుకున్నారు. దాన్నిమళ్ళా కొద్దికొద్దిగా తుంచి అక్కడున్నవాళ్ళకు పంచారు. ఒక చిన్న తునక తననోట్లో వేసుకుని తినడం మొదలుపెట్టారు.

అలౌకికమైన నిశ్శబ్దం. మా ఊళ్ళో చిన్నప్పుడు కమ్మరికొలిమిదగ్గర, చాకలిబానదగ్గర, కంసాలి అరుగుమీద, మా ఇంట్లో మా నాన్నగారు పనిచేసుకుంటున్నప్పుడు కనవచ్చిన నిశ్శబ్దం లాంటిది. నేనన్నాను: ‘ఇక్కడ బాబాని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఈ అడివిలో, పొలాలమధ్య, ఈ పల్లెలో, ఈ గ్రామీణులమధ్య, స్త్రీలమధ్య ఇట్లా ఆత్మానందం అనుభవిస్తున్న ఈ మనిషిని చూస్తుంటే మనసుకెంతో తృప్తిగా ఉంది. నాకూ ఇట్లాంటి కోరికే. నాకు నగరంలో ఉండాలని లేదు. మా ఊళ్ళో రైతులమధ్య, పిల్లలమధ్య జీవించాలని ఉంది, బాబా లాగా ఆధ్యాత్మికంగా కాదు, ఏదో, నాకు చాతనయింది చేస్తూ, వాళ్ళ కష్టసుఖాల్లో వాళ్ళకి తోడుగా ఉంటూ’ అన్నాను.

నేను చెప్పిందంతా తుకారాం మరాఠీలో మళ్ళా చెప్పాడు. బాబా ముఖంలో గొప్ప ఉత్సాహం.

‘ఇదే, ఇదే, నేను కోరుకునేది. నువ్వు చెప్పు ఆయనకి. ఈ మాట ఈశ్వరుడు విన్నాడు. మళ్ళా మైకు పెట్టి చెప్పవలసిన అవసరం లేదు. హృదయం నుంచి సూటిగా పిలిచే ఈ పిలుపు నేరుగా ఈశ్వరుడికి వినబడుతుంది. మనిషి కోరుకోవలసిన కోరిక ఇదే. ఇదే ఆనందం. నేను దీన్నే అనుభవిస్తున్నాను’ అంటూ తుకారాం కవితనొకటి వినిపించారు. ‘ఎవరు బీదసాదలతో జీవించడానికి ఇష్టపడతాడో, అతడితో కలిసి జీవించడానికి దేవుడు ఇష్టపడతాడు’ లాంటి అర్థం వచ్చే కవిత.

ఒక్కసారిగా నా హృదయంలో ఆనందం వెల్లివిరిసింది. కాని వెంటనే నిరాశ ఆవరించింది. ‘తుకారాం, బాబాకి చెప్పు, నాకు కోరికైతే ఉందిగాని, ఆ కోరికకి తగ్గట్టు జీవించలేకపోతున్నాను. అదెట్లా సాధ్యమో అడుగు’ అన్నాను.

‘అందుకు అన్నిటికన్నా ముందు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండాలి, పూర్వజన్మల్లో మంచిపనులు చేసిఉండాలి. గురువుల అనుగ్రహముండాలి. అన్నిటికన్నా ముఖ్యం, అటువంటి స్థితినిసాధించడంకోసం అనుక్షణం ప్రయత్నిస్తుండాలి’  అన్నారు బాబా.

ఒక క్షణం ఆగి ఆయన తుకారాంతో ఇలా అన్నారు: ‘ఆయన్ని రాయమను. తన అనుభవాలు రాస్తూండమను. నలుగురితో పంచుకోమను. అవి చదివి చాలామంది స్ఫూర్తి పొందుతారు. ఇదిగో, నా సంగతే చూడు’ అంటూ జేబులోంచి చిన్న పుస్తకమొకటి బయటకు తీసారు. బ్రహ్మానంద అనే సాధువు రాసిన సంకీర్తనలపుస్తకం. దాన్ని తెరిచిపట్టుకుని చూపిస్తూ ‘బ్రహ్మానంద అన్నాడు కదా: ఒక దేవత నా హృదయాన్ని దొంగిలించింది. నేను భ్రమావరణం నుంచి బయటపడ్డాను’ అని. ఆయన ఆ మాట రాస్తే నేనదిచదివి భ్రమనుంచి బయటపడ్డాను కదా. అలాగే ఈయన రాసింది చదివి కూడా నలుగురూ స్ఫూర్తి పొందుతారు’ అన్నారాయన.

నా హృదయమొక్కసారి లయతప్పినట్టనిపించింది. ఆయన చెప్తున్నదానివెనక మాటల్లో పెట్టకుండా చెప్తున్నదేదో ఉందనిపించింది. అదేదో రహస్యం నాకు మాత్రమే అర్థమయ్యేలా బహిరంగంగా చెప్తున్నారనిపించింది.

ఇక నాకు అడగడానికేమీ మిగల్లేదుకాబట్టి ఆయనకు చెప్పవలసిందేమీ లేదనిపించింది. మా ఎదట కూచున్న రైతుల్నీ, నిరక్షరాస్య గృహిణుల్నీ చూసాను. అంతదాకా మేమిద్దరమే అక్కడున్నట్టూ, మేమిద్దరమే మాటలాడుకుంటున్నట్టూ అనిపించింది. వెళ్ళొస్తానన్నాను. పాదాభివందనం చేసాను. ఆయన నా శిరసు తడిమారు. మరునిమిషంలో నేనెవరో తనకి తెలియదన్నట్టే తన దారిన తాను లేచివెళ్ళిపోయారు.

తిరిగి ఉట్నూరుకి. దారంతా శరత్కాలపు ఎండ. గాలి నిండా పచ్చగా పెరుగుతున్న పొలాలసంతోషం . నేను బాబాతో జరిగిన సంభాషణ గుర్తుచేసుకుంటూ ఉన్నాను. హఠాత్తుగా తట్టింది. ఆయన నాతో మాటాడుతున్నంతసేపూ, నేనానందపడటం సరే, నా కన్నా తానే ఎక్కువ ఆనందపడుతున్నట్టు కనిపించారని తోచింది. నిజమైన మహాత్ముడు, నాయకుడు, మానవుడు తోటిమనిషితో ప్రవర్తించే తీరు అదేకదా.

1-11-2013

Leave a Reply

%d bloggers like this: