నా జీవితమంతా ఉపాధ్యాయులతోనే గడిచింది

Reading Time: 2 minutes

6

నా జీవితమంతా ఉపాధ్యాయులతోనే గడిచింది.

ఒక వయసువచ్చేదాకా గొప్ప ఉపాధ్యాయుల ఛత్రఛాయలో గడిపాను. ఆ తరువాత ఉత్తమ ఉపాధ్యాయులతో కలిసిపనిచేస్తూ గడిపాను. ఎక్కడో మారుమూల గిరిజనగ్రామంలో అక్షరప్రపంచానికీ, సమాచారప్రసారసాధనాలకీ దూరంగా మొదలయ్యింది నా జీవితం. అప్పుడు నాకు తారసపడ్డ ప్రతి ఉపాధాయుడూ ఒక కిటికీగా దర్శమిచ్చాడు. ఇన్నాళ్ళ తరువాత వెనక్కి తిరిగిచూసుకుంటే వాళ్ళు నాకు అనుగ్రహించింది అసామాన్యమనిపిస్తోంది. మా ఊళ్ళో పంచాయితీసమితి ప్రాథమికపాఠశాల ఉపాధ్యాయిని వజ్రమ్మగారు, క్రైస్తవురాలు. ఆమె ద్వారానే నేను మహాభారత కథ విన్నాను. అలాగే పాతనిబంధనలోని జోసెఫూ అతడి సోదరుల కథకూడా. ఆమె చెప్పిన ఆ కథతో పోలిస్తే థామస్ మన్ రాసిన ‘జోసెఫ్ అండ్ హిస్ బ్రదర్స్’ నన్నేమీ ఆకర్షించలేకపోయిందనే అనాలి.

తాడికొండలో మా ఆర్టుమాష్టారు వారణాసిరామ్మూర్తిగారే లేకపోయుంటే నా జీవితమిట్లా ఉండిఉండేదే కాదు. నా మొదటికథ ‘నన్నుమరవని రెండుకళ్ళు’ (1979) ఆయన గురించే రాసాను. నాతో ఏకపాత్రాభినయాలు చేయించిన రాళ్ళబండి కృష్ణమూర్తిగారు, చాడ సాంబశివరావుగారు, నాకు యూరప్ చరిత్రా, సోషలిజం గురించి అవగాహన కలగచేసిన నాగళ్ల వెంకటరత్నం గారు, ముఖ్యంగా నా సాహిత్యగురువు హీరాలాల్ మాష్టారు, నన్ను సొంతకొడుకుకన్నా అధికంగా ప్రేమించిన మా ప్రిన్సిపాలు సుగుణమ్మగారూ-ఈ ఉదయాన్నే వారందరినీ తలుచుకోవడమే నా జీవితానికి గొప్పవరం లాగా ఉంది.

పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ నాకు బోధించినవాళ్ళతో పాటు జీవితానికి ఆవశ్యకమైన ప్రతిరంగం గురించీ అంతోఇంతో మొదటి పాఠాలు నేర్పిన మా నాన్నగారితో పాటు, తరగతిగదులకు బయట నాకు గురుత్వం వహించిన నా సాహిత్యాచార్యులు నామీద చూపించిన ప్రభావం విలువకట్టలేను.

మా అక్క నా తొలిసాహిత్యగురువు. ఆ నా పసితనంలో ఆమె రాజమండ్రిలో చదువుకుంటూఉండేది. సెలవులకు ఆమె ఇంటికి వస్తుందంటే నాకోసమొక గంధర్వలోకాన్ని తీసుకువస్తున్నట్టుండేది. మా అన్నయ్య సుందర్రావు నా బాల్యకాలపు హీరో. భమిడిపాటి జగన్నాథరావుగారు నా కథాగురువు. ‘యు షుడ్ ప్రొడ్యూస్ లైక్ ఎ మిల్’ అనేవారాయన. యూనివెర్సిటీలో చదువుకునే అదృష్టానికి నోచుకోలేకపోయిన నాకు రాజమండ్రి, గోదావరి ఒడ్డు, గౌతమీ గ్రంథాలయం, మల్లంపల్లి శరభయ్యగారు, ఆర్.ఎస్.సుదర్శనంగారు ఒక్కొక్కరూ ఒక్కొక్క విశ్వవిద్యాలయంతో సమానం.

కాళీపట్నం రామారావుగారు, ఇస్మాయిల్ గారు, సి.వి.కృష్ణారావుగారు, త్రిపుర, అజంతా, మోహనప్రసాద్ లను కూడా నేను గురువులకోవలో చేర్చుకున్నాను. నా మిత్రులు కవులూరి గోపీచంద్, రామసూరి, డా.యు.ఎ.నరసింహమూర్తి, అడ్లూరి రఘురామరాజులనుంచి నేను నేర్చుకున్నది తక్కువేమీ కాదు.

నా ఉద్యోగజీవితం గిరిజనవిద్యకు సంబంధించింది కావడంతో గత పాతికేళ్ళకు పైగా ఎందరో ఉపాధ్యాయులతో ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో ప్రయోగాలు, ఎన్నో ప్రయత్నాలు చేసే అవకాశం దొరికింది. ఆ నా అనుభవాలన్నీ ‘కొన్ని కలలు, కొన్ని మెలకువలు’ (ఎమెస్కో, 2005) లో వివరంగా రాసాను.

నా ఉద్యోగజీవితంవల్ల పార్వతీపురంలో భూషణంగారు, అదిలాబాదులో గురూజీ రవీంద్రకుమారశర్మగారి స్నేహం లభించింది. విద్య తాలూకు శాస్త్రీయ ప్రాతిపదికని డా.శశిధరరావుగారి ద్వారా తెలుసుకున్నాను. ఢిల్లీలో డా.కె.సుజాతగారు, చీపురుపల్లిలో డా.పి.డి.కె.రావుగారు, గుంటూరులో డా.నన్నపనేని మంగాదేవిగారు, నెల్లూరులో అల్లుభాస్కరరెడ్డిగారు, ఆంధ్రమహిళా సభ లక్ష్మిగారు, అందరికన్నా ముఖ్యంగా రావెలసోమయ్యగారు పరిచయం కావడం కూడా నా జీవితానికి విలువ చేకూర్చింది.

రాష్ట్రమంతటా ఎక్కడెక్కడనుంచో ఎందరో ఉపాధ్యాయులూ, ఉపాధ్యాయినులూ నా పుస్తకాలు చదివో, నా ప్రసంగాలు వినో నన్ను పలకరిస్తుంటారు. అలాంటి పలకరింపు వచ్చిన ప్రతి రోజూ నా జీవితం వృథా కాలేదనిపిస్తుంది. ఇంకా ఏదో మరింత విలువైన పని చెయ్యాలనిపిస్తుంది.

అటువంటి ఉపాధ్యాయులందరికీ పేరుపేరునా నమస్కరిస్తున్నాను.

4-9-2013

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: