దృక్పథం ఒకరిస్తే ఏర్పడేది కాదు

Reading Time: 3 minutes

18

వారం పదిరోజుల కిందట నాకో యువకుడు పోన్ చేసాడు. ‘మీకు నేను ఏడెనిమిదేళ్ళ బట్టీ ఫోన్ చెయ్యాలనుకుంటున్నాను. ధైర్యం చాలింది కాదు. ఈ నంబరు నా దగ్గర చాలా ఏళ్ళుగా ఉంది. కాని ఇప్పటికి మీతో మాట్లాడ గలుగు తున్నాను’ అన్నాడు. నేను రాసిన ఒక పుస్తకం, ఆ పుస్తకం పేరు అతడికి గుర్తు లేదు, అది దేనిగురించో కూడా గుర్తు లేదు. కాని అందులో ఒక ఘట్టం గురించి ప్రస్తావించేడు. అతడేమి చెప్పాలనుకుంటున్నాడో, ఎందుకు ఫోన్ చేసాడో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. అప్పుడు, బాగా పొద్దు పోయిన ఆ రాత్రి, అతడు ధైర్యమంతా కూడదీసుకుని సూటిగా ఒకే ఒక ప్రశ్న వేసాడు. ‘సార్, నాకొక దృక్పథం కావాలి. అవును, ఒక దృక్పథం’ అన్నాడు.

అతడి ప్రశ్నలో ఎంతో నిజాయితీ, చెప్పలేనంత ఆర్తి ఉన్నాయి. ఆ రోజునుంచీ ఆ ప్రశ్న గురించే ఆలోచిస్తూ ఉన్నాను.

నేను ఇంటర్మీడియెట్ పూర్తిచేసాక, నా హైస్కూలు మిత్రుడు పి.వి.ఎస్.ఎస్. రాజేంద్ర నాకో ఉత్తరం రాసాడు. ఒక పదిహేడేళ్ళ యువకుడు మరో పదిహేడేళ్ళ యువకుడికి రాసిన ఉత్తరం. ‘నేనెవరిని?’ అని ప్రశ్నించుకుంటూ, ‘ఇమ్రాన్ ఖాన్ నా, అమితాబ్ బచ్చన్ నా, ఎవరిని నేను?’ అని అడిగాడు.

నేనప్పుడే గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర నవల చదివిన రోజులు. ఆ నవలని గోపీచంద్ తన తండ్రి త్రిపురనేని రామస్వామి గారికి అంకితం చేస్తూ ‘నాన్నగారికి , ఎందుకు అన్న ప్రశ్న నేర్పినందుకు’ అని రాసుకున్నాడు. ఆయన అట్లా ఎందుకు రాసుకున్నాడో సమగ్రంగా వివరిస్తూ సుదర్శనంగారు రాసిన ముందు మాట కూడా ఉంది ఆ పుస్తకంలో.

బహుశా ఎనభైల్లో జ్ఞానదంతాలు వికసించిన మా తరం ఈ ప్రశ్నలతో చాలానే సతమతమయ్యాం. నేనెవరిని?నా జీవితానికి అర్థం ఏమిటి? నా జీవితప్రయోజనమేమిటి? బహుశా ఈ ప్రశ్నల వల్లనే సాహిత్యానికి అంత చేరువగా రాగలిగేం. ఈ ప్రశ్నలవల్లనే తత్త్వశాస్త్రం చదువుకోవాలని పరితపించేన్నేను.

కాని ఎనభైలతర్వాత యువతీయువకులు ఈ ప్రశ్నలతో అంతగా సతమతమయినట్టుగా కనిపించదు. గత ముఫ్ఫై ఏళ్ళుగా యువతీయువకుల ప్రస్థానం రెండు విధాలుగా సాగుతున్నదనిపిస్తోంది. వాళ్ళల్లో కొద్దిమంది తమ శారీరిక, సామాజిక అస్తిత్వాలే తమ identity గా భావిస్తూ ‘మేమిదీ’ అని చెప్పుకుంటున్నారు.

మిగిలిన వాళ్ళు, అత్యధికభాగం, మీడియా, మార్కెటు తమ ముందు చూపిస్తున్న రోల్ మోడల్స్ నే తమ జీవితాదర్శాలుగా భావిస్తూ, తాముకూడా అట్లా మారాలని పరితపిస్తూ ఉన్నారు.

తమ సామాజిక అస్తిత్వమొక్కటే తాముకాదనీ, మీడియా చూపిస్తున్న రోల్ మోడల్స్ భ్రాంతిమయ కల్పనలు మాత్రమేననీ భావించి, తానెవరో, తన యథార్థ స్వరూపమేమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాసువుల్ని నా ముందున్న యువతీయువకుల్లో నేనింకా చూడవలసే ఉంది.

ఒకప్పుడు మతాలు పోషించిన పాత్రలాంటిది ఆధునికకాలంలో దృక్పథాలు పోషిస్తూ వచ్చాయి. ఒక మనిషి తానెట్లా భావించాలో, జీవించాలో తెలుసుకోవడంకోసం దృక్పథాలవైపు చూస్తూ వచ్చాడు. కాని మతాలన్నిటిలన్నిటికీ రెండు పార్శ్వాలున్నాయి. ఒక పార్శ్వంలో అవి స్థిరీకరించబడి కాలంతో పాటు మార్పు చెందకుండా ఉండిపోయాయి. మతాల పేరిట జరిగే హింసకీ, అణచివేతకీ ఆ స్థిరరూపాలే కారణం. మరో పార్శ్వంలో మతాలు నిత్యసత్యాన్వేషణ చేస్తూనే ఉన్నాయి. ఆ పార్శ్వాన్నే మనం అధ్యాత్మికత అనీ , మిస్టిసిజమనీ వ్యవహరిస్తున్నాం. అట్లాంటి ఆధ్యాత్మిక సత్యాన్వేషకులు అన్నిటికన్నా ముందు తాము ఏ మత సంప్రదాయాల్లో పుట్టిపెరిగారో ఆ మతాలతోటే తలపడవలసి వచ్చింది.

ఇప్పుడు దృక్పథాలకు కూడా ఈ మాటే వర్తిస్తుంది. మతాలకి విశ్వాసం ప్రధానం కాగా, దృక్పథాలకి ఆలోచన (reason) ప్రధానం. కాని తొందరలోనే దృక్పథాలు కూడా మతాల్లాగా మారిపోయేయి. పిడివాదాలు (dogma)గా తయారయ్యేయి. ఆ దృక్పథ సంప్రదాయంనుంచి పుట్టిన వివేచనా పరులు అన్నిటికన్నా ముందు తమ దృక్పథసంప్రదాయాలతోటే తలపడవలసి రావడం మనం చూస్తూనే ఉన్నాం.

అందువల్ల ఆ రాత్రి ఆ యువకుడు ‘నాకో దృక్పథం కావాలి’ అని అడిగినప్పుడు నాకేమనాలో తోచలేదు.

19-24 ఏళ్ళ మధ్యకాలంలో నేను రాజమండ్రిలో ఉన్నాను. అప్పుడు నేను కూడా ఇట్లాంటిదే ఏదో వెతుకుతూ ఉన్నాను. అప్పట్లో నేనొక్కణ్ణీ ఒక రూములో ఉండేవాణ్ణి. కొందరు రాడికల్స్ యువకులు (వాళ్ళ వివరాలేవీ నాకు తెలియవు,కనీసం వాళ్ళ పేర్లు కూడా) నా రూంలో తలదాచుకునే వారు. నేను ఆఫీసుకి పోతూ వీథి తలుపు తాళం వేసి వెళ్ళిపోయేవాణ్ణి. పెరటి తలుపు తాళం వాళ్ళకిచ్చేవాణ్ణి. ఒకరోజు కాదు, రెండురోజులు కాదు, ఎన్నో నెలలపాటు వాళ్ళట్లా వచ్చి తలదాచుకుని పోతూండేవారు. మరొకవైపు, ఒక స్వయం సేవకుడు నా మిత్రుడుండేవాడు. గొప్ప క్రమశిక్షణ కలిగినవాడు. అతడు నన్నొక స్వయంసేవకుడిగా మార్చాలని ప్రయత్నిస్తూండేవాడు. కాని నేనటు రాడికల్ గానూ మారలేకపోయాను, ఇటు స్వయం సేవకుణ్ణీ కాలేదు.

మరొక సంగతేమిటంటే, ఆ స్వయంసేవకుడు ‘జాగృతి’ పత్రిక రాగానే పరుగు పరుగున వచ్చి నాకు అందించేవాడు. ఆ రాడికల్స్ ‘అరుణతార’ పత్రిక తెచ్చి నా గదిలో పెట్టి పోయేవారు. ఆ పుస్తకాలు నేను చదవడం కన్నా ముందే వాళ్ళే చదువుకునేవారు. రాడికల్ విద్యార్థి నా గదిలోకి రాగానే ‘జాగృతి వచ్చిందా’ అనడిగేవాడు. స్వయంసేవకుడు ఫలానా నెల అరుణతార మీ దగ్గరుందా చూడండనేవాడు.

నేనా పుస్తకాలకన్నా, ఆ దృక్పథాలకు దారితీసిన మూల గ్రంథాలు చడవడం మీద దృష్టిపెట్టేవాణ్ణి. మార్క్స్, ఎంగెల్స్ రచనలు చదవడం కోసమే నేను ఎమ్మే ఫిలాసఫీలో మార్క్సిజాన్ని స్పెషల్ పేపర్ గా తీసుకున్నాను. మరొకవైపు ఉపనిషత్తులు, భగవద్గీత, రాధాకృష్ణన్ A Hindu View of Life కూలంకషంగా చదువుకున్నాను.

నా యవ్వనోదయ కాలంలో నా ముందు ఎన్నో రోల్ మోడల్స్ ఉండేవి. సివిల్ సర్వెంట్, నక్సలైటు, జర్నలిస్టు, సన్న్యాసి, ఉద్యమకారుడు.. కాని ఏ ఒక్క పంథానీ నేనెంచుకోలేకపోయాను. అంతకన్నా కూడా, అవేవీ కాకుండా ఉండటం గురించే శతవిధాల ప్రయత్నించేను. నా చిన్నప్పటి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు నా గురించి ఒక మాట చెప్పాడు. ‘వాడికి అన్నిటికన్నా స్వతంత్రం గా ఉండటమంటే ఎక్కువ ఇష్టంరా, వాణ్ణట్లా వదిలెయ్యండి’ అని.

నా చుట్టూ ఉన్న సమాజంలో యువకులు ఎప్పటికప్పుడు కొత్త దృక్పథాలకోసం వెతుకుతూనే ఉన్నారు. నలభయ్యేళ్ళ కిందట గోడల మీద ‘మార్క్సిస్టు-లెనినిస్టు మావో ఆలోచనా విధానం వర్ధిల్లాలి’ అనే ఎర్రటి రాతలు ప్రముఖంగా కనిపించేవి. మొన్నా మధ్య జూబిలీ హిల్స్ మీంచి కె.బి.ఆర్ పార్కు వైపు మలుపు తిరగ్గానే గోడమీద ఎర్రటి అక్షరాల్లో ‘పవనిజం వర్ధిల్లాలి’ అని కనిపించింది.

ఆ యువకుడు నాకు మళ్ళా పోన్ చెయ్యలేదు. కాని అతడు మళ్ళా అంతే ఉద్వేగంతో నన్ను ప్రశ్నిస్తే నేనొక మాట చెప్పాలనుకుంటున్నాను: ‘మిత్రమా, దృక్పథం ఒకరిస్తే ఏర్పడేది కాదు, లేదా ఒక సమష్టిగా పదిమందీ కలిస్తే ఏర్పడేదీ కాదు, అది ఒక్కసారి ఏర్పడేక స్థిరంగా, మార్పు లేకుండా నిలబడిపోయేదీ కాదు. అది ఎప్పటికప్పుడు రూపుదిద్దుకుంటూ ఉండవలసిన ఒక అన్వేషణ. ఎవరికివారుగా చేపట్టవలసిన ప్రయత్నం. నీకంటూ ఒక దృక్పథం ఏర్పడుతున్నప్పుడు, నీలాంటి భావజాలం కలిగిన వాళ్ళని వెతుక్కుంటో వాళ్ళతో కలిసి ప్రయత్నం చెయ్యడం వేరు. కాని పదిమందిని ముందు కూడగట్టుకుని, వాళ్ళందరినీ కలిపే ఉమ్మడి అంశాల్ని దృక్పథంగా చెప్పుకోవడం వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే, నువ్వెంతమేరకు స్వతంత్రంగా ఉండగలవో అంతమేరకు మాత్రమే నీదైన ఒక దృక్పథం కూడా నీకు ఏర్పడుతుంది’ అని.

15-5-2016

arrow

Painting: Joan Miro (1893-1983)
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: