త్యాగరాజస్వామి (1767-2017) వారి 250 వ జన్మదినోత్సవ సందర్భంగా నిన్న’ద హిందూ’ పత్రిక ఒక ప్రత్యేక అనుబంధం తీసుకొచ్చింది. సుమారు 15 వ్యాసాలతోనూ, కేశవవెంకట రాఘవన్ సులలితమైన నీటిరంగుల చిత్రాలతోనూ ఆ అనుబంధ పత్రిక త్యాగరాజ ఆరాధకులకీ, సంగీత ప్రేమికులకీ విలువైన జ్ఞాపికగా మిగిలిపోతుంది.
కాని ఆ వ్యాసాలన్నీ దాదాపుగా సంగీతవేత్తలూ, నృత్యకళాకారులూ రాసినవే.
అన్నిటికన్నా ముందు త్యాగయ్య కవి. ఆయనకి సమకాలికులుగా ఇంగ్లాండ్ లో రొమాంటిసిస్టు కవులు వర్డ్స్ వర్త్, కాలరిడ్జ్, బైరన్, కీట్స్, షెల్లీ, రష్యాలో పుష్కిన్, జర్మనీలో గొథే, అమెరికాలో పో, జపాన్ లో బూసన్, ఇస్సాలు కవిత్వం చెప్తున్నారు.
భారతదేశంలో ఆయనకు ప్రసిద్ధ శాక్త వాగ్గేయకారుడు రామ ప్రసాద్ సమకాలికుడు, సింధ్ లో బుల్లే షా, తెలుగులో రామదాసు కొద్దిగా ముందుగానూ, తమిళంలో రామలింగస్వామి కొద్దిగా వెనగ్గానూ అద్భుతమైన కవిత్వం చెప్తూ ఉన్నారు.
కాని త్యాగయ్యను సాహిత్యసందర్భంలోనూ, తెలుగు సాహిత్య పరిణామంలోనూ పోల్చుకుని చదివే పని మనం దాదాపుగా మర్చిపోయాం. అటువంటి ప్రయత్నం నాకు తెలిసి చిట్టచివరగా చేసింది ఇద్దరే. ఒకరు, త్యాగరాజస్వామి కీర్తనల్ని ‘త్యాగరాజు ఆత్మ విచారం’ పేరిట గొప్ప వచనంగా తీసుకొచ్చిన భమిడిపాటి కామేశ్వరరావుగారు. మరొకరు, సాహిత్య అకాదెమీ కోసం ‘తెలుగు కావ్యమాల’ ను సంకలనం చేసిన కాటూరి వెంకటేశ్వరరావుగారు.
సుమారు ఇరవయ్యేళ్ళ కింద అనుకుంటాను, విశాలాంధ్ర పత్రికలో (అవును, విశాలాంధ్రలోనే) ఒక భావుకుడు పంచరత్నకృతుల్ని వ్యాఖ్యానిస్తూ అద్భుతమైన వ్యాసమొకటి రాసాడు. ఆ వ్యాసం మళ్ళీ చదవగలిగితే బాగుణ్ణని ఎన్ని సార్లు అనుకున్నానో. నిన్న సాయంకాలం ఇంటికి రాగానే ఆ ప్రత్యేక సంచిక చేతుల్లోకి తీసుకున్నప్పుడు నాకు తెలియకుండానే నేను అటువంటి సాహిత్య విశ్లేషణలకోసం వెతుకుతున్నాను.
కాని, ఇంకా పేజీలు తిప్పకముందే, మా అమృత ‘ఇది చదువు’ అంటో ఒక వ్యాసం చూపించింది. అది ఎన్.విజయ శివ అనే ఆయన రాసిన వ్యాసం. త్యాగరాజ కీర్తనలకి స్ఫూర్తి సుందరకాండం లో ఉందని చెప్తూ రాసిన వ్యాసమది. చాలా అద్భుతంగా ఉంది. ఆ రచయిత సంగీత, సాహిత్య సారాంశం తెలిసినవాడే కాక, తన విశ్లేషణలో గొప్ప సంస్కారం, సౌకుమార్యం కనపరిచాడు. త్యాగయ్యను ఇష్టపడేవాళ్ళు చదవవలసిన వ్యాసమది. ఆయన తన రచన ముగిస్తూ ‘త్యాగయ్యకు నిజమైన స్ఫూర్తి ఏది? సుందరకాండమా, రాగభావమా లేక రాగనామమా? ఈ చర్చ ఎప్పటికీ తెగదనుకుంటాను’ అని రాసాడు.
ఉదాహరణకి, సుప్రసిద్ధ త్యాగరాయ కృతి, పంచరత్న కీర్తనల్లో ఒకటైన ‘ఎందరో మహానుభావులు’ కి స్ఫూర్తి సుందరకాండలో (26:50) సీతాదేవి పలికిన ఈ శ్లోకంలో ఉందంటాడాయన:
ప్రియాన్న సంభవేద్దుఃఖమప్రియాదధికమ్ భయమ్
తాభ్యామ్ హి యే వియుజ్యంతే నమస్తేషామ్ మహాత్మానామ్
(ప్రియమైనది దొరకలేదనే దుఃఖంగాని, అప్రియం నుండి గొప్ప భయం కాని ఉండని ఆ మహాత్ములెవరో, ప్రియాప్రియాలు రెండింటికీ దూరంగా ఉండేవారెవరో ఆ మహాత్ములకు నమస్కారం).
సాక్షాత్తూ అమ్మవారి వాక్యాలనుండి పొందిన స్ఫూర్తితో పలికిన కీర్తన కాబట్టి దీన్ని శ్రీరాగంలో కూర్చడం సమంజసమే కదా అంటాడు వ్యాసకర్త. ఇట్లానే మరెన్నో కీర్తనల స్ఫూర్తి విషయమై ఆయన చేసిన ఊహాగానం చదువుతుంటే, ఒక సహృదయుడితో రసప్లావితమైన చక్కటి సంభాషణ చేసినట్టుంది.
రమా కౌశల్య అనే ఆమె రాసిన వ్యాసంలో త్యాగరాజస్వామి తన కీర్తనల్లో సత్పుత్ర భావాన్ని ప్రకటించారనీ, రాముడికన్నా సీతమ్మ చరణాల్నే ఎక్కువ నమ్ముకున్నారనీ రాసింది కూడా ఆసక్తికరంగా ఉంది. లక్ష్మీ విశ్వనాథన్ రాసిన వ్యాసం త్యాగరాయ కృతుల్ని నాట్యాభినయానికి అనువర్తింపచేయడంలోని అనుభవాల వివరణ. ఒక్కొక్కప్పుడు త్యాగరాయ కీర్తనల్లోని, ఒక్క వాక్యం, ఒక్కొక్క పదప్రయోగం చాలు, నాట్యాభినయానికి స్ఫూర్తిపొందడానికని రాసిందామె.
సంగీతబేహారులు గత నూట యాభై ఏళ్ళుగా త్యాగరాజుకి దైవత్వాన్ని ఆరోపించి ఆయన్ను ఒక పౌరాణిక పాత్రగా మార్చేసారు. ఆయన సమకాలికులైన పాశ్చాత్య సంగీతవిద్వాంసులు బీతోవెన్, షూబర్ట్ లకు అట్లాంటి పరిస్థితి లేదు. వాళ్ళని ప్రపంచం మనుషులుగానే గుర్తుపెట్టుకుంది. త్యాగరాజులోని మానుషత్వాన్ని పట్టుకోకపోతే, ఆ కవిత్వంలోని వేదన, సంతోషం, ఆశ్చర్య, అద్భుతానుభూతుల్ని మనం చూసుకోకుండానే దాటిపోతాం.
త్యాగరాజులోని మానవీయ కోణాల్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసిన వ్యాసాలు ఈ సంచికలో రెండున్నాయి.
ఒకటి, టి.ఎం.కృష్ణ రాసింది. ఆయన త్యాగరాజు కృత్రిమ రాగాలు రూపొందించాడనే ఆరోపణతో పాటు, ఆయన కీర్తనల్లో కనిపించే సాంఘికస్పృహ మీద కూడా కొంత విమర్శ చేసాడు. మొత్తం మీద ఆ వ్యాసం నన్నేమంతగా ఆకట్టుకోకపోయినా, అన్నిటికన్నా ముందు త్యాగరాజు ఒక మనిషి అని గుర్తు చేసే వ్యాసమది. అంతకన్నా కూడా విశాఖ హరి అనే గాయని రాసిన వ్యాసం మరింత విలువైందిగా అనిపించింది. అందులో ఆమె తన గురువు లాల్ గుడి జయరామన్ గారు తరచు ఒక విషయం చెప్పేవారని చెప్తూ ఇట్లా రాసింది:
‘స్వామి తన సంగీత వైదుష్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం ఊరికినే సంగతులు ఎప్పుడూ వెయ్యలేదని ఆయన (జయరామన్) చెప్పేవారు. త్యాగయ్య దృష్టిలో సంగతి తన ఇష్టదైవంతో ఒక సంభాషణ, ఒక నివేదన. బ్రోవ భారమా (బహుదారి) అనే కీర్తన తీసుకోండి. ఆ కీర్తన ప్రారంభంలో అది ఒక అభిప్రాయప్రకటన మాత్రమే. ‘బ్రోవభారమా రఘురామ భువనమెల్ల నీవై నన్నొకని’ అంతే. అప్పుడాయన తన ప్రార్థనను కొనసాగిస్తూ రెండవ సంగతి వేస్తారు. ఆ తర్వాత మూడవసంగతిలో ఆ ప్రార్థన మరింత ప్రగాఢమవుతుంది. వేదన, నిస్సహాయతా నాలుగవ సంగతిలో ప్రస్ఫుటమవుతూ, మళ్ళా పల్లవి ఎత్తుకునేటప్పటికి అయిదవ సంగతిలో, తాను పూర్తిగా ఆశ కోల్పోయిన పరిస్థితి ని వర్ణిస్తాడు.’
ఇటువంటిదే మరొక పరిశీలన, పి.కె.దొరైస్వామి రాసిన వ్యాసంలో త్యాగరాజు తన కృతులు ఎక్కువగా మధ్యమకాలంలోనే ఎందుకు కూర్చాడనేదాని గురించి. అందులోనే ఆయన ఒక త్యాగరాయ కీర్తన నుంచి టాగోర్ స్ఫూర్తి పొంది ఒక పాట రాసిన విషయం కూడా ప్రస్తావించారు.
సంగీతప్రియులు రాసిన ఈ వ్యాసాలు సాహిత్యప్రియుల్ని కూడా ఆలరింప చేస్తాయి గాని, అన్నిటికన్నా ముందు త్యాగయ్య ఒక కవి అని సాహిత్య ప్రేమికులు కూడా గుర్తుచేసుకోవలసి ఉంటుందని ఈ ప్రత్యేక సంచిక మరీ మరీ హెచ్చరిస్తోంది.
5-5-2017