నిన్న తాడికొండ గురుకుల పాఠశాలకి వెళ్ళాను, పిల్లల్ని తీసుకుని. 78 లో ఆ స్కూలు వదిలిపెట్టిన తరువాత, ఇది మూడవ సారి వెళ్ళడం.
మొదటిసారి 98లోనో, 99 లోనో వెళ్ళాను. అప్పటికే, ఆ పాఠశాల తన పూర్వ వైభవంతా కోల్పోయి ఒక జిల్లా స్థాయి గురుకుల పాఠశాలగా నడుస్తూ ఉంది. కొత్తగా ఏ సదుపాయాలూ ఏర్పడక పోగా, పాత సదుపాయాలు కూడా చాలని పరిస్థితి. అప్పుడు ప్రిన్సిపాలుగా ఉన్నామె, ఆమె పేరు గుర్తులేదు, మా విజ్జితో అన్నదట: ‘ఈ స్కూలుకి వచ్చే ఓల్డ్ స్టూడెంట్లకి ఈ స్కూలు తో ఉండే అనుబంధం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మొన్నటికి, ఒకాయన అమెరికానుంచి వచ్చాడు, భార్యతో. ప్రిన్సిపాలు రూం లో ఉన్న honor roll తో తన పేరు చూడగానే వెక్కి వెక్కి ఏడ్చేసాడు’ అని. ఆ రోజు, అక్కడి హానర్ లిస్ట్ లో నా పేరు కూడా చూసుకున్నాను గాని, బిగ్గరగా ఏడ్వలేదన్నమాటే తప్ప ఆ రాత్రంతా చెప్పలేని వేదన అనుభవించాను. ఆ స్కూలుకి అప్రోచ్ రోడ్ కూడా లేదన్న విషయం నన్ను పదే పదే భాధించింది. ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు. ఆ స్కూలు కన్న పిల్లల్లో నా అంత undeserving son మరొకడు ఉండడు అనిపించింది. నేనొక ఐ ఏ ఎస్ ఆఫీసరునో, లేదా ఒక రాజకీయ నాయకుణ్ణో కానందుకు మొదటిసారి చాలా చాలా చింతించాను..
ఆ తర్వాత, నాలాగే ఒక గురుకుల పాఠశాల విద్యార్థి, కొడిగెన హళ్ళిలో చదువుకున్న కె.రామకృష్ణారావు గుంటూరు కలెక్టరుగా వెళ్ళాడు. ఆయనకి నా మీద ఉన్న అభిమానమో, గురుకుల పాఠశాలల్తో ఉన్న పేగుబంధమో, ఆ స్కూలుని అభివృద్ధి పరచడానికి ఎంతోకొంత చేయగలిగాడు. అదొక ఊరట నాకు.
ఆ తర్వాత, మళ్ళా 2001 లో అనుకుంటాను, పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన రజతోత్సవ వేడుకలకి వెళ్ళాను. ఆరోజు, విద్వాన్ గోగినేని కనకయ్యగారు ఉన్నారు. మా పాఠశాల మొదటి బాచ్ పదవ తరగతి విద్యార్థి, మధ్య ప్రదేశ్ కాడర్ కి చెందిన ఐ.ఏ.ఎస్ అధికారి ధర్మారావు , మా జూనియర్, ఇప్పుడు గుంటూరు జిల్లా కలెక్టరుగా ఉన్న కాంతిలాల్ దండే కూడా ఆ రోజు వేడుకల్లో పాలుపంచుకున్నారు. అందరికన్నా, ముఖ్యంగా, మొదటి బాచ్ విద్యార్థులు (72-73) పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వాళ్ళని చూస్తే, ఆ ముందు రోజే మేం కలుసుకున్నంత దగ్గరా అనిపించారు.కాలం వాళ్ళ వదనాల్లో తెచ్చిన మార్పులు నా కళ్ళకి ఆనలేదు.వాళ్ళు ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు ఎలా కనిపించేవారో, మళ్ళా అలానే కనిపించారు.
ఆ రోజు పూర్వవిద్యార్థులు తమకి పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుల్ని, వంట వండిపెట్టిన వంటమనుషుల్నీ, ఆవరణ ఊడ్చిన పనిమనుషుల్నీ ప్రతి ఒక్కరినీ ఘనంగా సన్మానించుకున్నారు. అ పాఠశాలకు పూర్వవైభవం తీసుకురావడానికి చాలా తీర్మానాలే చేసారు. ఆ వేడుక,అ ఉత్సాహం చూసిన తరువాత, నాకు అంతకు ముందు కలిగిన విచారం కొంత ఉపశమించింది కానీ, నేనొక అప్రయోజకుడిగా ఉండిపోయానన్న బాధ మాత్రం తగ్గలేదు. ఏమి చేసి నేను నా పాఠశాల ఋణం తీర్చుకోగలను? అదే ప్రశ్న నాకు నిద్రపట్టకుండా వేధిస్తూనే ఉండేది.
2004-05 మధ్యకాలంలో మిత్రుడు ఎమెస్కో విజయకుమార్ ప్రోత్సాహం వల్ల నేను సార్వత్రిక విద్యతో నా అనుభవాల్ని రాయడం మొదలుపెట్టాను. సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమంలో గొప్ప కృషి చేసిన విద్యావేత్త, ప్రస్తుతం శాసనమండలి సభ్యుడిగా ఉన్న విటపు బాలసుబ్రహ్మణ్యం, ఆయన మిత్రులు, నేను రాసిన అనుభవాలు, ఆ టైపు ప్రతులు ఎప్పటికప్పుడు చదివి ఎన్నో విలువైన సూచనలిచ్చేవారు. ఒకరకంగా, వాళ్ళు కూడా ఆ పుస్తకానికి, సహరచయితల పాత్ర పోషించారనాలి. ఆ పుస్తకం పూర్తి చెయ్యగానే, ‘కొన్ని కలలు-కొన్ని మెలకువలు’ అని పేరుపెట్టాను. ఆ రచనని తాడికొండ గురుకుల పాఠశాలకి అంకితమిచ్చాను.’ అమ్మా, నీ కొడుకు నీకు సదుపాయాలు చెయ్యలేని నిరుపేద. వాడు నీకివ్వగలిగిందల్లా, ఇదిగో, ఈ పుస్తకమే’ అని చెప్పుకున్నాను.
ఆ పుస్తకం తీసుకువెళ్ళి పెద్ద ఎత్తున అంకిత మహోత్సవం చేయిద్దామని విజయకుమార్ అన్నాడు. వీలు కాలేదు. కాని, నా పూజ్యమిత్రులు, తాడికొండ కి ఇంటల్లుడు, మా రావెల సోమయ్యగారు, ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళి ఆ పాఠశాల చేతుల్లో పెట్టారు. (సోమయ్యగారూ, ఆ పుస్తకం ఇప్పటికీ ఆ పాఠశాల గ్రంథాలయంలో ఉంది. ఆ పుస్తకం తాను ఆమూలాగ్రం చదివానని, ఇప్పటి ప్రిన్సిపాలు గారు తన ప్రసంగంలో చెప్పారు కూడా.)
ఆ తర్వాత, అంటే, దాదాపు 15 సంవత్సరాల తర్వాత, మళ్ళా ఆ పాఠశాలలో అడుగుపెట్టాను. అందుకు కారణం కూడా ఉంది. రెండు మూడు వారాల కిందట, పాఠశాల పూర్వవిద్యార్హిసంఘంలో అత్యంత క్రియాశీలక కార్యకర్త రమణ, స్కూలు ప్రిన్సిపాలుగారిని వెంటపెట్టుకుని మా ఆఫీసుకి వచ్చాడు. ప్రభుత్వం ఈ మధ్యనే, తాడికొండను, Regional Center of Excellence గా గుర్తించిందనీ, దానికి అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు కలిగించడానికి తామొక మాస్టర్ ప్లాన్ రూపొందించామనీ చెప్పాడు. గూగుల్ మాప్ మీద ఇంపోజ్ చేసిన ఒక మాస్టర్ ప్లాన్ నాకు చూపించాడు. అందుకు నేను కూడా తోడ్పాటు ఇవ్వాలని అడిగాడు. కొత్త సచివాలయానికి 20 కి.మీ దూరంలో ఉన్న ఈ పాఠశాలను ఆ స్థాయిలో అభివృద్ధి పరచడానికి ఏ ప్రభుత్వం ముందుకు రాదు కనుక!
అప్పుడే, స్కూలు ప్రిన్సిపాల్ ప్రభాకర్ గారు నన్ను పాఠశాలకి రమ్మని ఆహ్వానించేరు. ఆగస్టు 15 న వస్తానంటే, ‘సంతోషం, మా పిల్లలు కోలాటమాడతారు, చూద్దురుగాని’ అన్నారు.
నిన్న, ఆ పాఠశాల ప్రాంగణంలో అడుగుపెట్టగానే, సహజంగానే, నేను నా పూర్వస్మృతుల్ని వెతుక్కుంటూ పోయేను. మొదట్లో,’ఎ’, ‘బి’, ‘సి’ డార్మిటరీలుగానూ, తర్వాత రోజుల్లో, అశోక, టాగోర్, కృష్ణదేవరాయ డార్మెటరీలుగానూ పిలవబడే వసతిగృహం, మా తరగతి గదులు, డైనింగ్ హాలు, లాబరేటరీలు, పార్కు (ఇప్పుడక్కడ ఒక్క చిన్న మొక్క కూడా లేదు), అసెంబ్లీ ప్రాంగణం, నేను ఎన్నో వందల సార్లు ఏకపాత్రాభినయం చేసిన స్టేజి-ప్రతి ఒక్కటీ కలయతిరిగాను. కాని ఇప్పుడవన్నీ పాడుపడిపోయి ఉన్నాయి. ఆ గదులు స్టోర్ రూములుగా వాడుతున్నారు. ఇప్పటి పిల్లలకోసం కొత్త భవంతులు, కొత్త డైనింగ్ హాలు, కొత్త క్రీడా మైదానం ఉన్నాయి. ఒకప్పుడు అప్రోచ్ రోడ్డు లేదని నేను బాధపడ్డ చోట, ఇప్పుడు సిమెంటు కాంక్రీటు రోడ్డు వచ్చింది.
అక్కడ, ఆ పాఠశాల ఆవరణలో, రావి, బొగడ, నిద్రగన్నేరు చెట్ల మధ్య పిల్లలు కోలాటమాడేరు. మా పూర్వవిద్యార్థి సంఘం నాయకుడు రమణ పిల్లలు యోగవిన్యాసాలు చేసారు. ఒకమ్మాయి ‘అదివో, అల్లదివో’ అంటూ కూచిపూడిలో అభినయించింది. ఆ తర్వాత నేను మాట్లాడేను. ఎవరేనా ఒక పిల్లవాణ్ణి ముందుకు వచ్చి మాట్లాడమంటే, వినుకొండ దగ్గర ఒక తాండాకి చెందిన గిరిజన విద్యార్థి, తొమ్మిదో తరగతిలో ‘ప్రేరణ’ పేరిట ఉన్న కలాం జీవితఘట్టం నేను అనువాదం చేసిందేననీ, అది చదివి తనకెంతో ప్రేరణ కలిగిందనీ చెప్పాడు.
తాడికొండ గురుకుల పాఠశాలకి ఇప్పుడు 46 ఏళ్ళు. మధ్యలో ఎన్నో ఎగుడు దిగుళ్ళు చూసింది.కాని, ఆ పాఠశాలకి ఒక వ్యక్తిత్వం ఏర్పడిపోయింది. బహుశా, ఆ మట్టిలోనే ఆ గుణముందనుకుంటాను. అక్కడ గురుకుల పాఠశాల పెట్టకముందు బేసిక్ ట్రయినింగ్ స్కూల్ ఉండేది. గాంధీజీ రూపకల్పన చేసిన నయీ తాలీం కోసం ఏరపాటు చేసిన పాఠశాల అది. ఆ రోజు, అంటే బహుశా ఇప్పటికి 70-80 ఏళ్ళ కిందట కట్టిన ఆ భవనాలు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. బేసిక్ ట్రయినింగ్ స్కూలు కి చాలా మంచి గ్రంథాలయముండేది. గురుకుల పాఠశాల ఏర్పడగానే ఆ గ్రంథాలయం వారసత్వంగా దక్కింది. అది ఎంత మంచి గ్రంథాలయమంటే, 1971-72 లో నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు ప్రచురించిన నవలలు, తారాశంకర్ బంధోపాధ్యాయ ‘కవి’, కురతులైన హైదర్ ‘అగ్నిధార’, మాస్తి వెంకటేశ అయ్యంగార్ ‘చిక్కవీరరాజేంద్ర’, వ్యంకటేశ మ్యాడ్గూళ్కర్ ‘బనగర్ వాడి’వంటివి 72 కల్లా అక్కడ మా కోసం సిద్ధంగా ఉన్నాయి.
ఆ స్ఫూర్తి ఆ మట్టిలో, ఆ గాలిలో అలానే ఉందనుకుంటాను. సదుపాయాల కల్పనలో ఎగుడుదిగుళ్ళు ఉండవచ్చుగాక, కాని స్ఫూర్తిప్రసారంలో, తాడికొండ ఇప్పటికీ అంతే నవచైతన్యంతో కనిపించడం నాకెంతో సంతోషాన్నిచ్చింది. అందుకే, ఆ పిల్లలు అడగ్గానే, ఎన్నో ఏళ్ళ తరువాత, మళ్ళా, వాళ్ళ ముందు అశోకుడి ఏకపాత్రాభినయం చెయ్యకుండా ఉండలేకపోయాను.
15-8-2016