డా.నన్నపనేని మంగాదేవి

17

2016 సంవత్సరానికి గాను జమ్నలాల్ బజాజ్ పురస్కారం డా. నన్నపనేని మంగాదేవికి గారికి లభించిందని తెలిసినప్పటినుంచీ ఆమె దగ్గరకి వెళ్ళి శుభాకాంక్షలు చెప్పాలనుకుంటూనే ఉన్నాను. నిన్నటికి ఆ అవకాశం లభించింది.

ఆకాశమంతా కృష్ణమేఘాలు ఆవరించిన కృష్ణాష్టమినాడు చేతన ఆశ్రమంలో అడుగుపెట్టాను. ఏడాది పైనే గడిచిపోయినట్టుంది నేనా పాఠశాలకు వెళ్ళి. అట్లాంటి తావులకి ఎన్నిసార్లు వీలయితే అన్నిసార్లు ఎంత తరచు వెళ్ళి వస్తూ ఉంటే అంతగా ఛార్జ్ అవుతాం. మనకు తెలీకుండానే లోపల అల్లుకునే బూజు చెదిరిపోతుంది. చాలారోజులుగా తెరవని గదిలో అడుగుపెట్టి కిటికీలు బార్లా తెరిచినట్టుగా ఉంటుంది. ఒక్కసారిగా గాలీ, వెలుతురూ ధారాళంగా అంతరంగంలోకి ప్రసరిస్తాయి.

మేం వెళ్ళేటప్పటికే మంగాదేవిగారు మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ‘హీల్’ హాస్టలు దగ్గర పిల్లలు ఈ మామయ్యకు అత్మీయ స్వాగతం పలికారు. వానలు పెద్దగా లేకపోయినా, ప్రాంగణమంతా పచ్చగానే ఉంది.

తమ పాఠశాలకి వచ్చిన అతిథి అన్నిటికన్నా ముందు పిల్లలతో మాట్లాడాలనే మంగాదేవి కోరుకుంటారు. ఆ పెద్ద పెద్ద వేపచెట్ల కింద పిల్లలు నేనేదన్నా చెప్తే వినాలని కూచున్నారు.

ఆ చిన్నారి పిల్లల్ని చూడగానే చిన్ని కృష్ణుడి గురించి మాట్లాడుకోవడం కన్నా గొప్ప విషయమేముంటుంది అనిపించింది. కృష్ణుడి గురించి నేను చిన్నప్పణ్ణుంచీ విన్నవన్నీ, చదివినవన్నీ చెప్పాలనిపించింది. పోతన, మీరా, లీలాశుకుడు, ఆండాళ్, సూర్ దాస్, జయదేవుడు, పెరియాళ్వార్, అయిదు విధాల భక్తిమార్గాలు, బాలకృష్ణుడు, గోపీకృష్ణుడు, గీతాకృష్ణుడు-కాని ఆశ్చర్యంగా ఆ పిల్లలకీ కృష్ణకథావాజ్మయమంతా తెలుసు. నేనే కథ చెప్పబోయినా, నా కన్నా ముందే వాళ్ళా కథ చెప్తూ ఉంటే, నేను అక్కడ మాట్లాడటానికి కాక, వాళ్ళతో కలిసి చదువుకోడానికే ఆ స్కూల్లో అడుగుపెట్టినట్టనిపించింది.

మేం మాట్లాడుకుంటున్నంతసేపూ ఆ చెట్లమీంచి పూలజల్లులు రాలుతూనే ఉన్నాయి. నేను శాంతినికేతన్ గురించి విన్నాను కాని చూడలేదు. కాని బహుశా టాగోర్ నడిపినప్పుడు ఆ పాఠశాల కూడా ఈ పాఠశాలలానే ఉండేదేమో అనిపిస్తుంది.

పిల్లల్తో మాట్లాడేక, మంగాదేవి గారు ఓపిగ్గా ఆ ప్రాగణమంతా తిప్పి మొక్క మొక్కనీ పరిచయం చేస్తూంటే, నేను ఆమె ఆ పాఠశాల ఎప్పుడు ప్రారంభించారు, ఎట్లా ప్రారంభించారు, ఆ వికాసం ఎట్లా సాధ్యపడిందీ-ఆ ప్రశ్నలన్నీ అడుగుతూ ఉన్నాను.

జమ్నాలాల్ బజాజ్ అవార్డులు సాధారణంగా గాంధేయ విలువలకోసం, గాంధేయ చింతనను అనుసరిస్తూ చేసిన కృషిని సత్కరిస్తూ ఇచ్చే పురస్కారాలు. ప్రతి ఏటా నాలుగు రంగాల్లో ఆ పురస్కారాలిస్తారు. ఒక్కొక్క పురస్కారం కింద పదిలక్షల నగదు, ప్రశంసా పత్రం ఇస్తారు. అందులో స్త్రీ, శిశు వికాసంలో మహత్తరమైన కృషి చేసినవాళ్ళకి జానకీ దేవి బజాజ్ పేరు మీద ఇచ్చే పురస్కారం ఈ ఏడాది మంగాదేవిగారికి ప్రకటించారు. ఇప్పటిదాకా తెలుగువాళ్ళల్లో సరస్వతి గోరా, డా.చెన్నుపాటి విద్య గార్లకు మాత్రమే ఈ అవార్డు లభించింది. ‘వాళ్ళు గాంధేయ సిద్ధాంతాల మీద పనిచేసినవాళ్ళు’ అన్నారు మంగాదేవి. కాని నా దృష్టిలో మంగాదేవి కూడా ఒక గాంధేయ కార్యకర్తనే. ముఖ్యంగా, గాంధీజీ విద్య గురించి ఎటువంటి విశ్వాసాలని ఏర్పరచుకున్నారో, ఎటువంటి పాఠశాలలు వికసించాలని కోరుకున్నారో, అటువంటి పాఠశాలని ప్రారంభించి నడుపుతున్న విద్యావేత్త ఆమె. నిజమైన పిల్లల ప్రేమికురాలు.

విద్యాభ్యాసం పూర్తయ్యాక, ఆమె కొన్నాళ్ళు స్త్రీ శిశు సంక్షేమ శాఖలో తొలితరం సోషల్ ఎడుకేషన్ ఆఫీసరుగా పనిచేసి, ఆ ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి, 1965 లో తానే గుంటూరులో ఒక పాఠశాల ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ పేరిట నెలకొల్పిన ఆ పాఠశాల రాష్ట్రంలోనే అత్యున్నతస్థాయి పాఠశాలల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది. 1972 లో మదర్ తెరేసా గుంటూరు వచ్చినప్పుడు, కొందరు తల్లిదండ్రులు డా. మంగాదేవి గురించి విశేషంగా చెప్తూ ఆమెను మదర్ కి పరిచయం చేసినప్పుడు, ‘నీ సేవలు నిజంగా అవసరమైన వారికోసం నువ్వేం చేస్తున్నావు’ అని అడిగిందట ఆమె. ఆ ప్రశ్న తనకి ముల్లులాగా గుచ్చుకుందంటారు మంగాదేవి. తానప్పటికే ఒక పాఠశాల రెండు శాఖల్తో నడుపుతున్నప్పటికీ, ఆ పిల్లలు భద్రలోకానికి చెందినవాళ్ళు. అట్లాకాక, జీవితంలో ఏ భద్రతకీ నోచుకోని పిల్లలకోసం ఏదైనా చెయ్యాలని ఆమె ఆ రోజే సంకల్పించుకున్నారు.

అయితే, ఆ సంకల్పం 1992 కి గానీ సాకారం కాలేదు. గుంటూరు-ఒంగోలు రహదారి మీద ఉన్న చౌడవరం అనే గ్రామం శివార్లలో తెరిచిన ఒక శరణాలయం-పాఠశాల ఇప్పుడు ఒక నందనవనంగా మారింది.

మంగాదేవి స్త్రీ శిశు సంక్షేమంలో సుశిక్షితురాలైన తొలి తరం కార్యకర్త. మాంటిస్సోరి బోధనావిధానంలో శిక్షణ పొందిన తొలితరం ఉపాధ్యాయిని. ‘ఎర్లీ ఛైల్డ్ హుడ్ ఎడుకేషన్’ మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన విద్యావేత్త.

బహుముఖ ప్రజ్ఞావంతురాలు అని మనం అనవలసింది డా. మంగాదేవివంటివారినే. ఆమె రష్యన్ భాషా బోధనలో డిప్లొమా చేసారు. డెన్మార్క్ లో జరిగిన శాంతి సభలకు భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు. మొక్కల పెంపకంలో, ముఖ్యంగా బొన్సాయిలో అత్యంత అరుదైన నిపుణుల్లో ఆమె పేరు కూడా వినిపిస్తుంది.

‘ఈ ప్రాంగణంలో ఉన్న మొక్కలమీద ఒక పుస్తకం రాయాలని మొదలుపెట్టాను. ఆ మొక్క గురించి నేను మొదటిసారి ఎప్పుడు విన్నాను, ఎప్పుడు చూసాను, ఎక్కణ్ణుంచి తెచ్చుకున్నాను లాంటి విశేషాలన్నిటితో ఇక్కడున్న మొక్కలన్నిటి మీదా రాయాలని. ఆ పుస్తకం పూర్తయితే చాలు, నాకు మరే కోరికా లేదు’ అన్నారామె.

ఎప్పట్లానే తాటిచెట్టు కుటీరంలో మా మధ్యాహ్న భోజనం. మేం అన్నం తింటున్నంతసేపూ ఆమె తన తల్లిదండ్రుల్ని తలుచుకుంటూనే ఉన్నారు. ‘అవాళ తెలియలేదు నాకు, వాళ్ళ సంస్కారం ఎటువంటిదో, వాళ్ళ సంస్కార బలం వల్లనే, వాళ్ళ నిశ్శబ్ద ఆమోదం వల్లనే నేనింతదూరం ప్రయాణించగలిగాను’ అన్నారామె.

తమ ప్రాంగణంలో ఆమె ఒక కళాకేంద్రం కూడా తెరిచారు. నరికేసిన కొమ్మలు, వానలకీ, వరదలకీ చెట్లు కూలిపోయినప్పుడు నేలని పెళ్ళగించుకుని పైకి వచ్చిన చెట్ల వేర్లు, ఎండిపోయిన కాయలు, పారేసిన చేటలు, పనికిరాని ఇనుపసామాన్లతో చేసిన కళాకృతుల గాలరీ అది. వాటిని రూపొందించిన కళాకారుల్లో పిల్లలతో పాటు పనివాళ్ళు కూడా ఉన్నారు. ఆ కళాకృతుల మధ్య, సంజీవదేవ్ చిత్రించిన ప్రకృతి దృశ్యం కూడా ఒకటి ఉంది. ఆ కళాకారుల మధ్య తన చిత్రానికి కూడా చోటు దొరికినందుకు, అందరికన్నా ముందు, సంజీవ్ దేవ్ గారే ఎక్కువ సంతోషపడతారనిపించింది.

మేం వచ్చేసే ముందు,ఆమె తాను కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఓషధీవనం లోకి తీసుకువెళ్ళి ప్రతి ఒక్క మూలికనీ పరిచయం చేసారు. తనకి లభిస్తున్న పురస్కారం నుంచి వచ్చే ధనంతో, వృద్ధులకోసం, అక్కడొక ఆశ్రమాన్ని నిర్మించాలనుకుంటున్నట్టు చెప్పారు.

మబ్బులు కొద్దిగా విచ్చుకుని కిటికీలు తెరుచుకున్నట్టు దిక్కులు తెరుచుకున్నాయి. తెల్లటి వెలుగు మెత్తగా లోకమంతా ఆవరించింది. నిస్వార్థపరురాలైన ఒక మనిషి మరొక నిస్వార్థపరురాల్ని అడిగిన ఒక్క ప్రశ్న స్వర్గాన్ని నేలకి దింపింది కదా అనిపించింది.

25-8-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: