జెండా కొండ

Reading Time: 2 minutes

61

ఆదివాసులకి కొండ ఒక అఖండ జీవపదార్థమని నా మిత్రుడూ, గిరిజన సాహిత్యవేత్తా డా.శివరామకృష్ణ రాసాడు. ‘పండితారాధ్య చరిత్ర’ లో ‘పర్వత ప్రకరణం’లో శ్రీశైలం గురించి రాస్తూ, ‘అకృతాత్ములకు శిలా నికరమై తోచు/సుకృతాత్ములకు లింగ నికరమై తోచు’ అన్నాడు పాల్కురికి సోమన. కాని ఆ మాటలు వినకముందే నా చిన్నప్పుడే, మా ఊళ్ళో జెండా కొండ మాకట్లానే కనిపించేది. ఊహతెలిసిన ఏ తొలివేళ ఆ కొండని చూసానో గాని, అది నా కుటుంబంలోనూ, చైతన్యంలోనూ కూడా విడదీయరాని భాగమై పోయింది.

‘గిరివనప్రియుడై’న రాముడిగురించీ, గిరిధరగోపాలుడి గురించీ, అరుణగిరినాథుడిగురించీ తెలియకముందే ఆ కొండమీద అడివిదేవతలుంటారని మా కొండరెడ్ల పల్లెలో ప్రతి ఒక్కరూ నమ్మేవారు. పెద్దపండుగ ఆ గిరిజన గూడెంలో పెద్దల పండగ. ఆ రోజుల్లో పిల్లలు, యువతులూ, యువకులూ,పెద్దలూ కొత్తదుస్తులు ధరించి అంతా ఆ కొండ ఎక్కేవారు. ఏ వైదిక పూర్వయుగాల సంప్రదాయమో అది. పండగనాడు కొండ ఎక్కడం. అక్కడికి వెళ్ళాక ఆ కొండమీద జెండాలు నిలబెట్టేవారు, వైదికక్రతువుల్లో యూపస్తంభాలు నిలబెట్టినట్టు.

కర్రి నాగార్జున శ్రీ ని, ఒక్కసారేకలిసాను, ఇప్పుడు దేవలోకంలో ఉన్నాడు, జీవితానికంతా మరవలేని ఒక మాటన్నాడు. ‘కృష్ణుడు గోవర్ధన పర్వతం ఒక్కవేలితో నిలబెట్టాడంటే అర్థమేమిటో తెలుసా’ అనడిగాడు. ‘మీకు ఇంద్రుడు తప్ప మరో దేవుడు లేడా? అదిగో ఆ కొండ ఇంద్రుడికన్నా గొప్ప దేవుడు కాదంటారా’ అంటో తన వేలితో గోకులానికొక కొండ చూపించేడు. అట్లా వేలితో చూపిస్తూనే, ఆ కొండని వాళ్ళందరి దృష్టిలో elevate చేసేసాడు. అదే కదా గోవర్ధనోద్ధరణమంటే’ అన్నాడు.

నా పసితనంలో ఆ కొండని ఎవరట్లా నా కోసం పైకెత్తి చూపారో గాని, అదిప్పటికీ సర్వోచ్చశిఖరమే. ప్రతి చైత్రమాసంలోనూ మా ఊళ్ళో కొండరెడ్లు అడవిరాజుల పండగ చేసేవారు. నా చిన్నతనంలో చాలామంది చేతుల్లో విల్లంబులు చూస్తూనే వుండేవాణ్ణి. వసంతకాలం రాగానే వెన్నెలరాత్రుల్లో ఊరంతా పాటలు పాడేవారు, బాజాలు మోగేవి, చిన్నపిల్లలం, నేనూ మా అన్నయ్యా వీథరుగు మీద పడుకున్నప్పుడు ‘అదిగో, వాళ్ళు అడవిరాజుల కోసం కొండకి వెళ్తున్నారు’ అనేవాడు. తెల్లవారగానే మా నాన్నగారి కళ్ళు కప్పి వాళ్ళతో అడివికి పోయేవాడు.

వాడట్లా వాళ్ళతో తిరుగుతూ, తింటూ, మాంసం కూడా తింటున్నాడేమోనని మా నాన్నగారికి అనుమానమొచ్చింది. ఒక రాత్రి వాడు ఇంటికి రాగానే పట్టుకు చితకబాదారు.’నన్ను కొట్టకండి, కొట్టకండి’ అంటో వాడు ఏడ్చాడు. నేను భయంతో ముడుచుకుపోయేను. కాని ఏళ్ళ తరువాత చినువ అచెబె నవలలు చదివినప్పుడు ఆ రోజు మా అన్నయ్య ఏడ్చినదాని కన్నా నేనెక్కువ రోదించాను. ఆ రోజు వాడితో పాటు నేను కూడా ఆ అడివిదేవతల పండగకి ఎందుకు పోలేకపోయానా అని. ఈ రోజు ఆ దేవతలెక్కడ? ఆ పండగలెక్కడ?

నేనా కొండల కి దూరమయ్యాక మళ్ళా కవిత్వంలో వాటిని వెతుక్కున్నాను. ‘ఆకొండ’ రాసినందుకు చావలి బంగారమ్మా, ‘ఆడదన్నా, కొండలన్నా obsession’ అన్నందుకు ఇస్మాయిల్ నాకెంతో ఇష్టులు. ‘కొండవీటి పొగమబ్బులు’ చూసిన విశ్వనాథ, ‘మచ్చుపిచ్చు’ శిఖరాగ్రాల్ని కీర్తించిన నెరూదా కూడా, నా వరకూ, కొండజాతివాళ్ళే. నాగరికులు కొండని మాత్రమే చూస్తారు. కాని కవులు ఆ బండల్లో ఒక తడి చూస్తారు. ‘కొండల నడుమా కోనొకటున్నది/కోనకి నడుమా కొలనొకటున్నది’. అట్లాంటి కొలనుగట్టున కోవెల లోపల దేవతను చూసాడు మహాకవి. అన్నమయ్యను ఇంగ్లీషులోకి అనువదించిన పండితులు Songs of The Lord of The Hills అని పేరుపెట్టారు. కానీ, అన్నమయ్య చూసింది, గానం చేసిందీ కొండల రాయుడి గురించి కాదు, కొండల్లో నెలకొన్న కోనేటి రాయుడి గురించి.

కొండగాలి ఎట్లాంటిదో, literal గానూ, metaphorical గానూ తెలిసిన వాడు కాబట్టే భూషణంగారికీ, నాకూ మధ్య అంత అనుబంధం బలపడిందనుకుంటాను. కొండల్నీ, లోయల్నీ చిత్రిస్తారు కాబట్టే నాకు ప్రాచీన చీనా కవులూ, చిత్రకారులూ ఎంతో ఆత్మీయులనిపిస్తారు, అట్లానే రోరిక్, సంజీవ్ దేవ్ లు కూడా.

ఈ పొద్దున్నే ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, చాలా ఏళ్ళ తరువాత నిన్నమళ్ళా జెండా కొండ ఎక్కాను. పిల్లల్తో.

నా ‘మోహనరాగం’ ప్రసంగాల్లో జెండా కొండ గురించి మాట్లాడింది, తాను టాంజానియాలో కిలిమంజారో దగ్గర విన్నానని ఉపేంద్రనాథ్ చోరగుడి చెప్పినప్పణ్ణుంచీ, ఆయనకు ఈ కొండ చూపించాలని ఉంది. అట్లానే ఆ ప్రసంగాల మరో నిత్యశ్రోత సుధీర్ గారికి కూడా.

2-6-2016

Leave a Reply

%d bloggers like this: