జీవనశిల్పి

Reading Time: 3 minutes

14

రెండు రోజుల కిందట అదిలాబాదు నుంచి రవీంద్రకుమార శర్మగారు ఫోన్ చేసి ఢిల్లి లో ఒక యూనివెర్సిటీవాళ్ళు తనకి డి.లిట్ ప్రకటించారని చెప్పారు.

‘డి.లిట్ అంటే ఏమిటి సార్’ అని కూడా అడిగారు.

‘మీ పేరుకి ముందు డాక్టర్ అని రాసుకోవచ్చు’ అన్నాను. మేమంతా ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా పిలుచుకునే గురూజీ అనే పేరు ముందు డాక్టర్ అనే పదం చేరితే ఎంత ఎబ్బెట్టుగా ఉంటుందో ఊహిస్తూ.

‘అట్లనా’ అని మనస్ఫూర్తిగా నవ్వాడాయన. ‘ఇంతకీ నేనేం చేసానని ఇస్తున్నారు సార్ అది?’ అని కూడా అన్నాడాయన.

‘మీరు చేసిన పనేమిటో మీకు తెలియదు. మాకు తెలుసు’ అన్నాన్నేను.

తెలుగురాష్ట్రాలు గుర్తించలేకపోయిన గురూజీని ఎక్కడో ఒక ఉత్తరాది విశ్వవిద్యాలయం గుర్తించడమే నాకు ఎంతో ఊరటగా అనిపించింది. ఆ గుర్తింపు వెనక తీగలు కదిపిన మహనీయులెవరోగాని వారికి అనేక పాదాభివందనాలు.

కొన్నాళ్ళ కిందట తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభా పురస్కారాల ఎంపిక కమిటీలో చిత్రకళ విభాగం కింద పురస్కారానికి గురూజీ పేరు నేను ప్రతిపాదించినప్పుడు కమిటీ లో మరొక సభ్యురాలు ఎంతగా అడ్డుపడిందో గుర్తించింది. ఎక్కా యాదగిరిరావు నాకు మద్దతుగా నిలబడకపోయిఉంటే ఆ రోజు నా ప్రతిపాదన వీగిపోయిఉండేది.

ఆ మధ్య రాం దేవ్ బాబా ఆయన్ని ‘ఆధునిక ఋషి’ అన్నాడట. గురూజీని సదా అంటిపెట్టుకుని కంటికి రెప్పలా కాచుకునే ఆశీష్ ఆ మాట విని ఆయన్ని ‘ఆధునిక ఋషి’ అనికాదు ‘సమకాలిక ఋషి’ అని అనాలి అన్నాడట.

ఆశీష్ బాగానే పట్టుకున్నాడు. గురూజీ ఆధునికుడు కాడు, సంప్రదాయవాదీ కాదు. కాలాన్ని ప్రాచీనం, ఆధునికం అని విడగొట్టడం పాశ్చాత్య సభ్యత వల్ల మనకి అలవడ్డ పదాలు. జీవితమంతా పాశ్చాత్య సభ్యత మీద పోరాటం చేస్తూ వచ్చిన గురూజీని ఆధునికుడనడం పొసగని మాట.

పోయిన ఆదివారమే నేను గురూజీని కలిసాను. అదిలాబాదులో ఆయన కళాశ్రమం ఆవరణలో ఆయనతో ఒక్క గంటసేపు గడిపినా చాలు అది నన్నొక జీవితకాలానికి ఛార్జ్ చేస్తుంది.

గురూజీ విశిష్టత ఏమిటి? ఇప్పటి మనకాలానికి ఆయన ప్రాసంగికత ఏమిటి? ధర్మశాలలో దలైలామా నుంచి కాలికట్ దాకా దేశం నలుమూలలనుండీ ఆయన మాటలు వినడానికి భావుకులు, చింతనాపరులూ, కళాకారులు ఎందుకట్లా ఉవ్విళ్ళూరుతున్నారు. ప్రతీ రోజూ ఆ ఆశ్రమానికి వీడియో కెమేరాల్తో,రికార్డింగ్ పరికరాల్తో జిజ్ఞాసువులు ఎందుకు విరగబడుతున్నారు?

గురూజీతో పరిచయమై ఇరవయ్యేళ్ళు దాటింది. ఫణికుమార్ గోదావరి గాథల్లో ఆయన గురించి మొదటిసారి చదివినప్పటికీ, మా తొలి కలయిక ఏమంత సంతోషప్రదమయింది కాదు. కాని గురూజీ ఆత్మ ఎటువంటిదో ఆ తొలిభేటీ వల్లనే నాకు బోధపడింది.

గత ఇరవయ్యేళ్ళుగా నేనాయన్ని వందసార్లకన్నా ఎక్కువే కలిసి ఉంటాను. కలిసిన ప్రతిసారీ, ఆయనతో మాట్లాడినప్పుడల్లా జీవితానికి సంబంధించిన కొత్తకోణమేదో తెరుచుకుంటూనే ఉంటుంది. కాని అంతకన్నా కూడా ఆ ఆశ్రమం ఆవరణలో, చెట్లకింద, అరుగులమీద అద్వితీయమైన తృప్తి, ప్రశాంతి కలుగుతూ ఉంటాయి. పూర్వకాలపు కుటుంబాల్లో, గ్రామాల్లో, బావిగట్టున, కమ్మరికొలిమి దగ్గర, పొలాల్లో ఊడ్పులూడ్చేటప్పుడు మనకి అనుభవమయ్యే సహజీవనసంతోషమేదో అక్కడ అనుభవానికొస్తూ ఉంటుంది. కొన్నాళ్ళుగా నీళ్ళకి నోచుకోని మొక్క కుదుట్లో కడివెడు నీళ్ళు పోసినప్పుడు క్షణాల్లోనే ఆ తేమ ఆ మొక్క ఆకుల్లో ఈనె, ఈనెకీ పాకిపోయినట్టు, ఆ ఆశ్రమానికి వెళ్ళి అక్కడ కూచున్న కొద్ది క్షణాల్లోనే ఒక అద్వితీయప్రశాంతి నా రక్తనాళాలన్నిటా శాంతసంగీతం లాగా ప్రవహించడం అనుభవానికొస్తూంటుంది.

ఇన్నేళ్ళుగా నేనాయన చెప్తూ వచ్చిన మాటలన్నీ పుస్తకరూపంలో పెట్టాలనుకున్నాను. కాని ఆ అద్వితీయమైన, ఆ సుమనోహరమైన ఆ అదిలాబాదు యాసని ఎట్లా పట్టుకోవడం? అయిదేళ్ళ కిందట ఒక వేసవిలో ఆయన దగ్గర దాదాపు పదిరోజులు గడిపి ఆయన మాట్లాడిన మాటలు రికార్డు చేసాను. కాని ఆ యాసని అట్లానే పొల్లుపోకుండా ఎత్తిరాసి ఆ మాటల్ని ఒక పుస్తకంగా ఎప్పుడు తీసుకువస్తానో తెలీదు.

కాని ఒకప్పుడు అదిలాబాదు రేడియో కోసం ప్రసిద్ధ రచయిత బి.మురళీధర్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసాడు. ఆ రికార్డుని అల్లు భాస్కరరెడ్డిగారు ట్రాన్స్ క్రైబ్ చేయించారు. ఆ ప్రసంగాల్ని వీలైనంత త్వరలో పుస్తకంగా తేవాలి.

ఆ పుస్తకానికి ఏం పేరు పెట్టాలి? ‘కళా విప్లవకారుడు’. కాని ఆ పేరు గురూజీకి నచ్చలేదు. విప్లవమా? నేను తెచ్చిన విప్లవమేముంది? అయినా విప్లవానికి చాలా అర్థాలున్నాయి కదా అన్నాడాయన.

‘ప్రవక్త’, ‘దార్శనికుడు’.. ఈ పేర్లేవీ ఆయనకు నచ్చలేదు.

‘జీవనశిల్పి’. ఈ శీర్షిక దగ్గర ఆయన ఒక క్షణం ఆగారు.

గురూజీ ఆలోచనల్ని నాలుగుమాటల్లో చెప్పవచ్చు. కాని అలా చెప్పినందువల్ల సమాజానికీ, సౌందర్యానికీ, సహజీవనానికీ, సభ్యతకీ, ఆర్థికవ్యవస్థకీ చెందిన ఎన్నో సూక్ష్మ వివరాలు, ఒక జీవితకాలాన్ని వ్యయపరిచి ఆయన మాత్రమే చేయగలిగిన అసంఖ్యాక పరిశీలనలు, సత్యావిష్కరణలు మీకు అందకుండా పొతాయి.

అయినా ఈ నాలుగు వాక్యాలూ రాయకపోతే ఈ ప్రస్తావనకి పరిపూర్ణతలేదు.

గురూజీ చెప్పేదేమంటే, ఈ రోజు ప్రపంచమంతా గ్లోబలైజేషన్ సంభవిస్తూఉంది. ఇక్కడ మన దేశంలో మన సభ్యత, ఆర్థికవ్యవస్థ, సామాజికసంబంధాలు అతలాకుతలమవుతున్నాయని మనం క్షోభపడుతున్నాం. ఇందుకు రకరకాల పరిష్కారాలు వెతుకుతున్నాం. కాని గ్లోబల్ ఆర్థికవ్యవస్థకు ప్రత్యామ్నాయం చిన్నచిన్న పనిముట్లలో, పరికరాల్లో, నేతమగ్గాల్లో, కుమ్మరి సారెలో, కమ్మరికొలిమిలో ఉంది. అయితే చిన్న తరహా యంత్రాలు పెద్ద యంత్రాల ఆర్థికవ్యవస్థనీ ఎదుర్కోవాలంటే వాటి మీద ఉత్పత్తి అయ్యే వస్తువుల డిజైన్ మారాలి. స్థానిక ఉత్పత్తులు, స్థానిక ఆర్థిక వ్యవస్థలూ, స్థానిక విపణులూ వికసించాలంటే స్థానిక రూపరచన (లోకల్ డిజైన్ ) బలపడాలి. స్థానిక రూపరచన స్థానిక సభ్యత మీదా, స్థానిక సౌందర్య దృక్పథం మీదా ఆధారపడిఉంది. అంటే గ్లోబలైజేషన్ కి ప్రత్యామ్నాయం సరళంగానూ, ప్రజలజీవితాల్లోంచి వికసించే సౌందర్యదృక్పథమన్నమాట.

ఆ సరళసౌందర్యమే ఆయన ఆశ్రమానికి వెళ్ళినప్పుడల్లా నన్ను సాంత్వనపరిచే ఓషధీవిశేషం.

28-2-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: