నీటిరంగుల్ని అసాధారణమైన సామర్థ్యంతో సాధనచేస్తున్న సమకాలిక చిత్రకారులందరిలోనూ జీన్ లూయీ మొరెల్లి కి నేను పెద్ద పీట వేస్తాను. కొన్ని వందల ఏళ్ళుగా చీనా, జపాన్, భారతదేశంలోనూ, గత రెండు శతాబ్దాలుగా బ్రిటన్ లోనూ, అమెరికాలోనూ, వందేళ్ళుగా ప్రపంచమంతటా వికసిస్తూ వచ్చిన ఈ కళా ప్రక్రియను గత పాతికముఫ్ఫై ఏళ్ళుగా మొరెల్లి మనం ఊహించలేని ఎత్తులకి తీసుకుపోతూ ఉన్నాడు.
ఆయన 1945 లో పుట్టాడు. చిత్రకళను స్కూల్లోనూ, కళాశాలలోనూ అభ్యసించాడు. హెన్రీ గోయెట్జ్ అనే ప్రసిద్ధ సర్రియలిస్టు చిత్రకారుడు, ప్రింట్ మేకర్ స్టూడియో లో అప్రెంటిస్ గా పనిచేసాడు. 1989 లో పారిస్ శివార్లలో తన సొంత స్టూడియో ఏర్పాటు చేసుకున్నాడు. అప్పణ్ణుంచీ అతడు నీటీరంగుల చిత్రకళకి సంబంధించి ఎన్నో ప్రదర్శనలు, వర్క్ షాపులు నిర్వహిస్తూ ఉన్నాడు. తన సాధన రహస్యాల్ని Watercolor Painting: A Complete Guide to Techniques and Materials పేరిట 1999 లో పుస్తకరూపంలో వెలువరించాడు. అప్పణ్ణుంచీ ఆ రచన ప్రపంచమంతటా wet-in wet పద్ధతి సాధనచేసేవారికి కరదీపికగా ఉపకరిస్తూనే ఉంది.
మనం నీటిరంగులుగా వ్యవహరించే వాటిలో రెండు రకాలున్నాయి. ఒకటి, పారదర్శకంగా ఉండేవి (transparent), మరొకటి, అపారదర్శకంగా ఉండేవి (opaque). మామూలుగా మనం పోస్టర్ కలర్స్ గా పిలిచేవి, (కొందరు వీటిని బాడీ కలర్స్ అని, డిజైనర్స్ కలర్స్ అని కూడా అంటారు), గత యాభై ఏళ్ళుగా ప్రపంచ చిత్రకళరంగాన్ని పరిపాలిస్తున్న ఏక్రిలిక్స్ అపారదర్శకమైన నీటిరంగులు. వీటి ప్రత్యేకత ఏమిటంటే, వీటితో బొమ్మలు వేసేటప్పుడు, తైలవర్ణాల్లాగా, దట్టమైనపూత మీద మళ్ళా పలచని పూత వెయ్యవచ్చు. ముదురునీలంరంగునో, నలుపునో గీసాక, దానిమీద పసుపుగీతలో, తెల్లగీతలో గియ్యవచ్చు. అంటే, అక్కడ తప్పులు చేస్తే దిద్దుకునే అవకాశం ఉంటుంది. తైలవర్ణాల్లాగా అవి అత్యంత క్షమాశీలాలు.
కాని పారదర్శకమైన నీటిరంగులకి ఆ సౌలభ్యం లేదు. అక్కడ ఒకసారి దట్టమైన రంగు అద్దాక, దానిమీద మళ్ళా పల్చని పూత పుయ్యలేం. కాబట్టి ఆ రంగుల్ని మనం ముందు పలచటి పూతతో మొదలుపెట్టి, చివరకి చిక్కటి, దట్టమైన రంగులు వెయ్యవలసిఉంటుంది. ఆ క్రమంలో ఏ చిన్న పొరపాటు చేసినా దాన్ని దిద్దుకోలేం. స్వభావరీత్యా అవి అత్యంత క్రూరమైనవి. most unforgiving.
మామూలుగా ప్రతి ఒక్కరూ నీటిరంగులు చాలా సులభమైన మాధ్యమమనుకుంటారు. కాని మొదలుపెట్టాక, అవి ఎంత నిర్దయాత్మకాలో తెలిసాక, అందులోని సవాలు ఏమిటో అనుభవానికొస్తుంది. కాని వాటి పారదర్శకత వల్ల, మరే మాధ్యమమూ, చివరికి తైలవర్ణాలు కూడా అందివ్వలేని అపారతేజోమయత్వాన్ని, అంతర్జ్యోతిస్సీమల్ని పారదర్శక జలవర్ణ చిత్రాలు సుసాధ్యం చేస్తాయి. అద్భుతమైన వాటి transparent, translucent కాంతి కోసమే ఎందరో చిత్రకారులు తమ జీవితకాలమంతా వివశులవుతున్నారు, వ్యామోహపడుతున్నారు.
సృష్టిలో ఏడురంగులూ కలిస్తే తెల్లటి రంగుగా మారుతుందనిమనకు తెలుసు. కాని రంగుల పళ్ళెంలో మనం ఏ మూడు రంగుల్ని కలిపినా, తెలుపు రావడానికి బదులు బురద వస్తుంది. నీటిరంగుల చిత్రకారుణ్ణి వేధించే సమస్య ఇదే. రంగుల్తో కాంతిని చిత్రించడమెట్లా?
పాదార్థికమైన రంగుల్తో కాంతిని చిత్రించాలనుకోవడమే మొరెల్లి చేస్తూ వచ్చిన సాధన.
ఆ క్రమంలో మొరెల్లి తెలుసుకున్న రహస్యాల వెనక రెండు మూడు వందల ఏళ్ళుగా యూరోప్ లో చిత్రకారులు, భౌతిక శాస్త్రవేత్తలు, రాసాయనిక శాస్త్రవేత్తలు వెల్లడి చేస్తూ వచ్చిన ఆవిష్కరణలున్నాయి. అన్నిటికన్నా, గొప్ప రహస్యం మొరెల్లి కనుక్కున్నది, వినగానే మీకు నవ్వు పుట్టించవచ్చుగాని, గొప్ప సత్యం, ఏమిటంటే, నీటిరంగుల్లో చాలా ముఖ్యమైంది, రంగు కాదు, నీరు అనేది.
నీటిపోకడని, ముఖ్యం, కాగితం మీద పూసిన తరువాత నీరు ఎట్లా ప్రవర్తిస్తుంది, కుంచెలోకి తీసుకున్నతరువాత, నీరు ఎట్లా కదులుతుంది, తడి కాగితం మీద, రంగుతో నింపిన కుంచెని పెట్టినప్పుడు, ఆ రెండింటిలోనూ ఉన్న నీరు ఒకదానితో ఒకటి ఎట్లా పెనవైచుకుంటుదన్నదే మొరెల్లి గత మూడు దశాబ్దాలుగా చేస్తూ వస్తున్న పరిశీలన.
అందుకనే అతడు, నీటిరంగుల చిత్రం గియ్యడమంటే, నీటితో ఒక సంభాషణకు పూనుకోవడమంటాడు. నీరు చెప్పే సందేశాన్ని కళ్ళతో వినమంటాడు. జెన్ బౌద్ధులు, గెస్టాల్ట్ తత్త్వవేత్తలు చెప్పేటట్టు, ఆ ఒక్క క్షణం, ఆ most critical moment కోసం వేచిఉండమంటాడు.
19-2-2016
Painting: Jean Louis Morelle