చేర్యాల ఒక సౌందర్య విశేషణం

50

చేర్యాల మరీ నేనూహించుకున్నంత చిన్న ఊరు కాదు. ఒకప్పటి తాలూకా కేంద్రమని కూడా తెలిసింది. తారురోడ్లూ, ప్రభుత్వాఫీసులూ, పెట్రోలు బంకూ, మన పెద్ద గ్రామాల్లోనూ, చిన్న పట్టణాల్లోనూ కనవచ్చే నిరర్థకమైన తీరికదనం- ఒక్క రెండు కుటుంబాలు మినహా. చేర్యాల అనే ఒక నామవాచకాన్ని సౌందర్య విశేషణంగా, ఒక చిత్రలేఖన శైలిగా మార్చేసిన ఆ రెండు కుటుంబాలు మినహా.

చేర్యాల నఖాషీ చిత్రకారుల్ని చూడాలన్న ఎన్నాళ్ళుగా నా కల నిన్నటికి నెరవేరింది. నా మిత్రురాలు, భావుకురాలు, పిల్లలప్రేమికురాలు పద్మజా రమణ అక్కడే పనిచేస్తున్నారని తెలిసినప్పటినుంచీ ఆ ఊరు వెళ్ళాలనుకుంటూ ఉన్నాను. నిన్నటికి వెళ్ళగలిగాను. ఆమె లేకపోయినప్పటికీ, ఆమె సోదరి వెంకట రమణ, ఆమె భర్త సుధాకర్ గారూ, ఇద్దరూ ఉపాధ్యాయులే, మా కోసం ఎదురుచూస్తున్నారు.

బతుకమ్మ పండగలో చివరి రోజేమో ఊరంతా, ప్రతి ఇంటా పండగ కళ. ఎక్కడ చూసినా గునుగుపూలూ, తంగెడు పూలూ, తీపివంటల ఘుమఘుమలూ. మేం వెళ్ళిన నఖాషీ చిత్రకారుల ఇల్లు ధనాలకోట నాగేశ్వర్ గారి ఇంట్లో కూడా.

చిన్న డాబా ఇల్లు. ఆ ముందుగదిలో నాగేశ్వర్ గారూ, ఆయన పిల్లలూ మా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన శ్రీమతి పద్మగారు హాల్లో కూచుని బతుకమ్మను పూలతో అలంకరిస్తూ ఉన్నది. సోఫా మీద, గోడల మీద చేర్యాల చిత్రలేఖనాలు, శిల్పాలూ.

పండగ రోజు, ఆ ఇంట్లో కూడా పండగనాటి తీరుబాటుదనంతో బాటు సాయంకాలం బతుకమ్మ కొలువు కోసం సిద్ధం కావాలన్న ఒత్తిడి-కాని మా కోసం ఆ కుటుంబం గంటకు పైగా కేటాయించారు. అడిగిన ప్రశ్నలన్నిటికీ జవాబిచ్చారు. ప్రతి ఒక్కటీ చూపించేరు, వివరించేరు, చివరికి నా కోసం ఒక బొమ్మ చివరిదాకా రంగులు దిద్ది చూపించేరు.

2

ధనాలకోట వారి పూర్వీకులు రాజస్థాన్ నుంచి వచ్చేరని కొందరంటారు. కాని కాకతీయుల చివరి కాలంలో ఆ కుటుంబం చేర్యాలకు వచ్చి స్థిరపడింది. ఆ తరువాత నిజాం కాలంలో ఆదరణ పొందింది. గత 400 సంవత్సరాలుగా నఖాషీ పనివారుగా వారు చేర్యాలకొక ఘనత సాధించిపెట్టేరు. ఇప్పటికి చాలామంది హైదరాబాదు వెళ్ళిపోగా, అక్కడ మిగిలినవి రెండే కుటుంబాలు. అంటే వాళ్ళిద్దరూ కూడా ఒక తల్లి బిడ్డలే.

మేం అడుగుపెట్టిన ధనాలకోట నాగేశ్వర్ గారి తాత వెంకట్రామయ్యగారి పేరు ఎత్తగానే అక్కడున్న ప్రతి ఒక్కరిలోనూ గర్వం, గౌరవం తొణికిసలాడాయి. గోడమీద సెపియా రంగు తిరిగిన పాతకాలపు ఫొటో లో ఆయన ఏకాగ్రచిత్తుడిగా కుంచెమీదనే దృష్టిపెట్టి కనబడుతూ ఉన్నాడు. ఆ ఫొటోకి అటూ ఇటూ ఆయన కొడుకు ధనాలకోట చంద్రయ్య ఫొటోలు ఉన్నాయి. ఒక ఫొటోలో ఆయన 1983 లో అప్పటి భారత రాష్ట్రపతి జ్ఞానీ జైల్ సింగ్ నుంచి సన్మానం పొందుతున్న దృశ్యం. చంద్రయ్యకాలంలో చేర్యాల పేరు సముద్రాలు దాటింది. ఆయన రష్యా, జర్మనీ, ఆస్ట్రియాలు సందర్శించాడు. దేశవ్యాప్తంగా ఎన్నో వర్క్ షాపులు, ఎగ్జిబిషన్లు నిర్వహించాడు.

ఆ తర్వాత నాగేశ్వర్ శ్రీమతి పద్మ కూడా మలేషియా, జర్మనీలు పర్యటించింది. కిందన చాపమీద కూచుని పిల్లలతో బతుకమ్మకి పూలు తొడుగుతున్న ఆ కళాకారిణి, ‘అవునండీ, నేను జర్మనీలో ఒక డెమొ కూడా ఇచ్చాను’ అని చెప్తుంటే మేమాశ్చర్యపోకుండా ఉండలేకపోయాం.

3

నఖాషీ చిత్రకళలో రెండు ముఖ్యమైన కళారూపాలున్నాయి. ఒకటి కాన్వాసు మీద ప్రకృతి సహజమైన రంగుల్లో రామాయణం, మహాభారతం, దశావతారాలు వంటి ఇతివృత్తాలతో బొమ్మలు చిత్రించడం. అందుకుగాను కాన్వాసు గుడ్డ మీద ముందొక ఔట్ లైన్ గీసుకుంటారు. అప్పుడు దాని మీద ఎరుపు, నీలిమందు నీలం, నిమ్మకాయరంగు పసుపు, నీలిరంగూ, పసుపు కలిపిన ఆకుపచ్చ వర్ణాలు అద్దుతారు. ఆ బొమ్మల వెనక బాక్ గ్రౌడ్ దాదాపుగా ఎర్రని ఎరుపు. అద్దిన రంగుల మీద చివరగా నల్లటి రేఖల్తో సంపూర్ణ మూర్తిని చిత్రీకరిస్తారు. దీపం మసి, నిజమైన లాంప్ బ్లాక్ లో ముంచి తీసిన కుంచెతో నాగేశ్వర్ గారు గీతలు గీస్తుంటే, ఆ గీతలో నాలుగు శతాబ్దాల నైపుణ్యమంతా అలవోకగా ప్రవహిస్తూండటం చూసాను.

మామూలు చిత్రలేఖకులనుంచి మహనీయ చిత్రలేఖకుల్ని వేరు చేసేది ఆ గీతనే. పికాసో రేఖలో కనిపించే కాన్ఫిడెన్సుని చూసి ఎంత ఆశ్చర్యపోయానో, నాగేశ్వర్ రేఖల్ని చూసి కూడా అంతే కైమోడ్చాను.

అందుకనే ‘కాపు రాజయ్య గారు కూడా కొన్నాళ్ళు వచ్చి మా నాన్నగారి దగ్గర ఈ చిత్రలేఖనం నేర్చుకున్నాడు’ అని నాగేశ్వర్ చెప్తుంటే నాకు ఆశ్చర్యమనిపించలేదు.

రెండవ కళారూపం, మాస్కులూ, బొమ్మలూ. కొండపల్లి బొమ్మలకి వాడే పొణికి కట్టె తోనే వాళ్ళు కూడా బొమ్మలు చెక్కుతారు. చింతపిక్కలపిండి, రంపం పొట్టు కలిపి మాస్కులు తయారుచేస్తారు. వాటికి కూడా ప్రకృతి సహజమైన రంగులద్ది రూపురేఖలు తీర్చిదిద్దుతారు.

‘అప్పుడప్పుడు అనేక గ్రామీణ వృత్తులవాళ్ళు మా దగ్గరకే వచ్చి బొమ్మలు గీసిమ్మనీ, చెయ్యమనీ అడుగుతారు. కురవవాళ్ళు చెప్పుకునే కాటమరాజు కథలకి బొమ్మలు చేసే ఏకైక కుటుంబం మొత్తం తెలంగాణాలో మాదే’ అన్నాడు నాగేశ్వర్. అంతే కాదు, కాకిపడగలవాళ్ళకి కథల చుట్ట కూడా తామే గీసిపెడుతున్నామని చెప్పాడు. ఆ మాట చెప్తూనే లోపల్నుంచి పెద్ద చుట్ట తెచ్చి మా ముందు పరిచి చూపించాడు. అరవై అడుగుల పొడవైన చుట్ట. ఆ కథ చెప్పడానికే కాకిపడగల వాళ్ళకి వారం రోజులు పట్టిందట.

‘బొమ్మలు పూర్తిగా గియ్యడానికి ఏడాది పడుతుందని చెప్పాను వాళ్ళకి. కాని ఏకబిగిన కూచుంటే మూడు నెలల్లో పూర్తి చెయ్యగలను’ అన్నాడాయన.

మీటరుకి 5000 చొప్పున లక్ష రూపాయల పని. కాని ఇరవై మీటర్ల పొడువున ఒక అపురూపమైన సృష్టి, ఎన్నటికీ వెలిసిపోని రంగులు, గ్రామాల్లో చుట్ట నెమ్మదిగా విప్పుతూ కాకిపడగలవాళ్ళు కథ చెప్తుంటే, రేపు నాలానే కళ్ళప్పగించే చూసే అసంఖ్యాక వదనాలు.

‘మీ ప్రధానమైన సమస్య ఏమిటి?’ అనడిగాను.

‘మార్కెటింగ్’ అన్నాడాయన.

‘అయితే, పూర్వం కన్నా ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ కళ గురించి నలుగురికీ తెలుస్తోంది. హైదరాబాద్ లో ప్రపంచ మెట్రొపోలిస్ ల సమావేశం జరిగినప్పుడు 3000 బొమ్మలకి ఆర్డరు దొరికింది. ఇంటిల్లిపాదికీ పని దొరికింది’ అని చెప్పాడాయన.

4

ఇప్పుడు నాలుగవతరం కళాకారుడు కూడా ఆ ఇంట్లో వికసిస్తూ ఉన్నాడు. నాగేశ్వర్ గారి కుమారుడు సాయికిరణ్ మాదాపూర్ లో శ్రీ వెంకటేశ్వర కాలేజిలో బాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ పూర్తి చేసాడు. చేర్యాల నఖాషీ చిత్రకళ మీద డిసెర్టేషన్ పూర్తిచేసాడు.

ఆ చిత్రలేఖనం మీద ఒక బ్లాగు, ఫేస్ బుక్ పేజీలు (www.facebook.com/cheriyal.artisans) కూడా నిర్వహిస్తున్నాడు.

‘ఆధునిక చిత్రకళ గురించి చదువుకుంటున్నవాడిగా నువ్వు ఈ చిత్రలేఖనానికి చేరుస్తున్న విలువ ఏమిటి?’ అనడిగాం.

చాలా ఆలోచనలూ, ప్రయత్నాలే విన్నాం అతణ్ణుంచి. ‘చూడండి, ఇది ప్రాచీన డిజైనింగ్, దీన్లో పెర్ స్పెక్టివ్ లేదు. బొమ్మల్లో కూడా పురాణగాథలే ఉన్నాయి. మేం వాటితో పాటు గ్రామీణ జీవితదృశ్యాలు కూడా గియ్యడం మొదలుపెట్టాం. తరతరాలుగా బొమ్మల్లో బాక్ గ్రౌండ్ ఎరుపు రంగే. మేం ఆ బాక్ గ్రౌండ్ రంగు మార్చాం. నేనిట్లానే బొమ్మలు గీస్తే బయటప్రపంచం చేర్యాల బొమలు గీస్తున్నావనే అంటుంది. అలాగని ఈ శైలిని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేను’ అన్నాడతడు.

Tradition కీ, innovation కీ మధ్య తలెత్తే సంఘర్షణకి ఇప్పుడు ఆ పిల్లవాడి హృదయం వేదికైంది.

‘ఈ మాస్కులు చూడండి. వీటిని టిష్యూ స్టాండ్లుగా, స్పెట్స్ పెట్టుకునే స్టాండ్లుగా, కీ చైన్లుగా కూడా మారుస్తున్నాను. శైలి అదే, కాని నా ఇన్నొవేషన్ వల్ల వాటికి కొత్త మార్కెట్ దొరుకుతోంది’ అని తాను రూపొందిచిన కొత్త పరికరాలు చూపించేడు.

5

బయట గాల్లో బతుకమ్మ పాటలు తేలివస్తున్నాయి. రంగుల్నీ, బొమ్మల్నీ కులవృత్తి చేసుకున్న ఒక కుటుంబాన్ని చూసిన సంతోషంతో నా మనసు మెత్తనై పోయింది. ఆ గృహిణి అప్పటికి బతుకమ్మ అలంకరణ పూర్తి చేసి,పీట మీద ప్రతిష్టించి దీపం వెలిగించింది. విజ్జి ఆ దేవత ముందు కానుకగా కొత్తవస్త్రాన్ని సమర్పించింది.

తిరిగి వస్తూండగా చెప్పింది విజ్జి.’వాళ్ళ ఇలవేల్పు నిమిషాంబ అట. ఆ పేరు వినగానే నా మనసులో చెప్పలేని సంచలనం కలిగింది. మీకేమనిపించింది ఆ పేరు వినగానే?’ అనడిగింది.

నేనాలోచిస్తూన్నాను.

తనే మళ్ళా అందుకుంది. ‘నిమిషాంబ అంటే ప్రతి నిమిషం వాళ్ళని కనిపెట్టుకుని ఉన్న దేవత అనే కదా.’

అవును. తక్కిన ప్రపంచం అధికభాగం ఏళ్ళకు ఏళ్ళే నిరర్థకంగా గడుపుతున్న కాలంలో ప్రతినిమిషాన్ని ఆ కుటుంబం వర్ణతేజోభరితం చేసుకోగలుగుతున్నదంటే, ఆ నిమిషాంబ అనుగ్రహమే కదా.

20-10-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: