చిత్రలేఖన పద్ధతుల గురించి

Reading Time: 3 minutes

r

తెలుగులో చిత్రకళా ప్రశంస (అప్రిషియేషన్ అనే పదానికి సరైన తెలుగు పదం నాకింతదాకా దొరకలేదు) చాలా తక్కువ. ఆ మాటకొస్తే ఒక కవితనీ, కథనీ ఎట్లా చదవాలో కూడా నేర్పే కోర్సులేవీ మనకి లేవు. సంగీతం విషయం చెప్పనక్కర్లేదు. ఏదైనా ఒక సంగీత కచేరీమీద పత్రికల్లో వచ్చే సమీక్షలు చదివితే సంగీత ప్రశంసకు తగిన పదబంధాలు మనకింకా దొరకనేలేదని తెలుస్తుంది.

ఒక కవిత చదివినట్టే, ఒక చిత్రలేఖనాన్ని కూడా చదవ వచ్చు, అలా చదవడానికి కొన్ని పద్ధతులుంటాయి, కొన్ని సాంస్కృతిక సూత్రాలుంటాయి. అలాగని ఆ పద్ధతులూ, ఆ సూత్రాలూ నిర్దిష్టంగానూ, శిలాక్షరాలూగానూ ఉండేవి కావు, చాలాసార్లు గొప్ప చిత్రకారులూ, వారి చిత్రలేఖనాలూ వారి వారి జీవితకాలాల్లో నిరాదరణకీ, అపహాస్యానికీ గురికావడం మనకి తెలియంది కాదు. యూరోప్ లో సుప్రసిద్ధ ఆధునిక చిత్రకారులు చాలామంది జీవితమంతా ఆత్మసంశయంలోనే గడిపిపోయారు. వాన్ గో నే ఇందుకు గొప్ప ఉదాహరణ. ఎవరో ఒకరిద్దరు, షెజానె వంటివారు, ప్రజాభిప్రాయం మీద ఆధారపడకుండా ఉండగలిగే ఆత్మవిశ్వాసంతో, ప్రజలకి దూరంగా ఒంటరిగా తమ సాధనతాము చేసుకుంటూ పోయేరు.

తెలుగులో చిత్రకళా ప్రశంసకొక సంప్రదాయముంది. సంజీవదేవ్, బుచ్చిబాబు, చలసాని ప్రసాదరావు, ఈ మధ్య మిసిమి పత్రికలో కాండ్రేగుల నాగేశ్వరరావుగారు, చినుకు పత్రికలో మాకినీడి సూర్యభాస్కర్ వంటివారు నిశ్శబ్దంగా ఆ పనిచేస్తూ ఉండకపోలేదు. కాని అది జరగవలసినంత విస్తృతంగా జరగడంలేదు.

ఇటువంటి నేపథ్యంలో, ఈ మధ్య గణేశ్వరరావు గారు కొన్ని చిత్రలేఖనాల్ని తీసుకుని విశ్లేషణాత్మకంగా పరిచయం చేస్తూండటం నాకెంతో సంతోషాన్ని కలిగిస్తోంది. ఆ పరిచయ వాక్యాలు తెలుగు సమాజం రెండు చేతుల్తోనూ స్వాగతించదగ్గవి.

కేవలం చిత్రలేఖనాల గురించే కాదు, చిత్రలేఖన పద్ధతుల గురించి కూడా ఆయన రాస్తున్నారు. మొన్న, plein air చిత్రలేఖనం గురించి రాసారు. అమెరికాలో అది దాదాపుగా ఒక ఉద్యమస్థాయిలో విస్తరిస్తుండటం గురించి కూడా రాసారు.

యూరోప్ లో చిత్రలేఖనం పందొమ్మిదో శతాబ్ది తొలిరోజులదాకా స్టూడియోకి మాత్రమే పరిమితమైన కళ. దాన్ని విశాలప్రపంచంలోకి తీసుకొచ్చిన ఖ్యాతి ఇంప్రెషనిస్టులకి దక్కుతుంది. దానికి ముఖ్యకారణం, ఆయిల్ పెయింట్లు ట్యూబులుగా లభ్యం కావడమేనని మనకి తెలుసు. అంతదాకా ఆయిల్ పెయింట్లని నూరి, కలిపి చిన్న చిన్న తోలుతిత్తుల్లో స్టూడియోల్లో భద్రపరుచుకునేవారు. ఆ రంగుల్ని బయటకు తీసుకురావడం అసాధ్యం. అంతేకాక,పెద్ద పెద్ద మొత్తాల్లో ఆ రంగులు స్టూడియోల్లో ఉండేవి కాబట్టి పెద్ద పెద్ద కుంచెల్తో వర్ణలేపనం చేయడానికి వీలుండేది. కాబట్టి,ఇంప్రెషనిష్టులకి ముందు, కాన్వాస్ మీద బ్రష్ స్ట్రోక్ కనిపించడం పెద్ద దోషంగా పరిగణించబడేది. ఎల్ గ్రెకో (1541-1614) చిత్రాలు చూడండి, ఆ రంగులెక్కడా మనకి మానవ హస్తాలు చిత్రించిన రంగుల్లాగా కనిపించవు.

61

కాని ట్యూబుల్లో పెయింట్లు లభ్యం కావడం మొదలైన తర్వాత, ఇంప్రెషనిష్టులు ఆరుబయట బొమ్మలు వెయ్యడానికి పూనుకోగానే, చిన్న చిన్న కుంచెలు వాడటం మొదలుపెట్టారు. ఒకసారి కుంచెలోకి తీసుకున్న రంగుతో రెండు మూడు స్ట్రోక్స్ కన్నా ఎక్కువ వెయ్యడం కుదరదు. మళ్ళ కుంచె రంగులో ముంచాల్సిందే. అందుకని, ఇంప్రెషనిష్టు యుగంలో బ్రష్ స్ట్రోక్స్ ని బట్టి ఆ చిత్రకారుడి మనోధర్మాన్ని అంచనా వెయ్యడం మొదలయ్యింది. పిసారో, మోనె వంటి చిత్రకారుల చిత్రాల్లో కనిపించే ఎనర్జీ ఆ బ్రష్ స్ట్రోక్స్ వల్లనే నని వేరే చెప్పనవసరం లేదు.

62

ఇంతకీ, plein air చిత్రలేఖనం మొదలుకాగానే ఇంప్రెషనిస్టులు alla prima పద్ధతికూడా మొదలుపెట్టారు. అంతకుముందు, స్టూడియోలో బొమ్మ వెయ్యడానికి ముందు కాన్వాసుని రకరకాల పద్ధతుల్లో ట్రీట్ చేసేవారు. తాము వెయ్యాలనుకున్న చిత్రాన్ని ముందు chiaroscuro పద్ధతుల్లో నలుపు, తెలుపు రంగుల్లో చిత్రించుకునేవారు. అప్పుడు నల్లరంగులమీద పారదర్శకంగానూ, తెల్లరంగులమీద అపారదర్శకంగానూ, వరసగా ఎన్నో పూతలు రంగు వేసుకుంటూపోయేవారు. దాన్ని glazing అంటారు. ఆ పద్ధతిలో ఒక్కొక్క చిత్రలేఖనం పూర్తి చేయడానికి కనీసం ఏడాది కాలం పట్టేది. కొన్నికొన్ని సార్లు కారవగ్గియో లాంటి చిత్రకారుడికి కొన్నేళ్ళు కూడా పట్టేది. అట్లాంటి తైలవర్ణ చిత్రలేఖనాన్ని ఇంప్రెషనిష్టులు కొన్ని గంటల వ్యవధికి, కొన్ని సార్లు ఒక్క గంట వ్యవధికి కుదించేసారు. చిత్రలేఖన పద్ధతిలోని ఆ మార్పు చిత్రలేఖన శైలిలో అనూహ్యమైన మార్పు తెచ్చింది. ఇదంతా కూడా plein air చిత్రలేఖనం వల్ల వచ్చిన మార్పు.

63

ఇప్పటికీ చాలామంది ఫొటోలు చూసి బొమ్మలు వేస్తున్నారు. చాలామంది ప్రసిద్ధ చిత్రకారుల డెమోలు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు వాళ్ళు కూడా ఫొటోల్ని బట్టే బొమ్మలు వేస్తూండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను కూడా నిన్నమొన్నటిదాకా ఫొటోల్ని బట్టే బొమ్మలు వేస్తూండేవాణ్ణి. కాని ఏ చిత్రకారుడైనా అసహ్యించుకోవలసిన పద్ధతి ఇది.

కొందరేమంటారంటే, ఫొటోల్ని బట్టి వెయ్యడం తప్పు కాదు, కాని ఆ ఫొటోలు మీరే తీసినవై ఉండాలి అని. ఫొటోల్ని రిఫరెన్సుగా వాడుకోవచ్చంటారు కొందరు. కానీ, నువ్వు నిజంగా చిత్రకారుడివి కావాలనుకుంటే, కెమేరాని దూరం పెట్టు.

ఇందుకు రెండు కారణాలు: మొదటిది, ఏ చిత్రకారుడి ప్రతిభ అయినా, అతడు తాను చూస్తున్న దృశ్యాన్ని ఎంత సరళీకరించగలడు అన్నదాన్ని బట్టే ఆధారపడుతుంది. simplification. ఏ వివరాలు అవసరమో, అవి మాత్రమే చిత్రకారుడు పట్టుకోవాలి, మనకి చూపించాలి. కాని కెమేరా అన్ని వివరాల్నీ మనముందు హాజరు పరుస్తుంది. ఫొటోని బట్టి బొమ్మ వెయ్యడం మొదలుపెట్టగానే మనం కూడా slavish గా ఆ వివరాలన్నీ నమోదు చేసుకుంటూ పోతాం. ఆ దారిలో మనం కళాకారులుగా కాక, బరువుమోసే కూలివాళ్ళుగా మారిపోతాం.

ఇక రెండవది, చిత్రలేఖనంలో నిజమైన magic రేఖలోనూ, రంగులోనూ లేదు. అది tone లో ఉంది. మంద్రంనుంచి సాంద్రానికి ( from light to dark) కనిపించే values అమరికలో ఉంది. ఒక దృశ్యాన్ని మనం మానవ నేత్రాలతో చూసినప్పుడు, ఆ రంగుల నిశ్రేణిలో కనిపించే అందాన్ని చూడగలుగుతాం. కాని కెమేరా కన్నుకి ఆ సౌలభ్యం లేదు. అది దృశ్యంలోని tonal depth ని flatten చేసేస్తుంది. అందుకని, ఫొటో ఆధారంగా వేసే బొమ్మ కూడా ఫొటోలానే నిర్జీవంగా కనిపిస్తుంది.

ఈ సమస్యని అధిగమించడానికి రెండు మార్గాలు: ఒకటి, సాంప్రదాయికంగా చిత్రకారులు పాటిస్తూ వచ్చిన పద్ధతి. లోకేషన్ కి వెళ్ళినప్పుడు చూసిన దృశ్యాన్ని tonal sketch వేసుకుని, ఇంటికొచ్చాక, రంగుల్లో చిత్రించడం. రెండవది, లోకేషన్ లోనే, plein air లోచిత్రించడం. రెండవ పద్ధతి నిజంగా ఒక సవాలు. ఇప్పటికి ఆ సవాలుని స్వీకరించడంలోని ఆనందం నాకు అనుభవానికొచ్చింది.

22-7-2016

arrow

Paintings by Rembrandt, El Greco, Monet and Caravaggio

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: