చిత్రలేఖనమంటే నిశ్చలప్రయాణం

Reading Time: 2 minutes

52

నిన్న నేను వేసిన ఇంకు చిత్రాన్ని షేర్ చేస్తూ సురేశ్ కొలిచాల గారు ఎంతో ప్రేమతో, ఆదరంతో నా గురించి నాలుగు మాటలు చెప్పారు. ఒక నదీగీతాన్ని తెలుగు చేసి అందరికీ అందించారు. ఆయన చూపించిన అభిమానానికి బదులుగాఏమివ్వగలను? మరికొన్ని మంచి భావాలు పంచుకోవడం తప్ప!

నిన్నటి ఇంకు బొమ్మ చీనా, జపాన్ తరహా చిత్రలేఖనం. ఒక విధంగా చెప్పాలంటే దాన్ని Tao of sketching అని కూడా అనొచ్చు. తంగ్ వంశ పరిపాలనా కాలానికి చెందిన ఫు ఝై అన్నాడట: ‘చిత్రలేఖనమంటే, రంగు కాదు, తావో’ అని. తావో దార్శనికుడు లావో త్సే అన్నాడట: ‘మనిషిని భూమి పాలిస్తుంది, భూమిని ఆకాశం, ఆకాశాన్ని తావో, తావో ని ప్రకృతి’ అని. తావో అంటే ప్రకృతితో మమేకం కావడం.

కాని ప్రకృతి అంటే ఏమిటి? యావో ఝుయి అనే మరొక ప్రాచీన లాక్షణికుడిలా అన్నాడట: ‘బయటినుంచి చూస్తే మనం ప్రకృతి నుంచి నేర్చుకున్నట్టనిపిస్తుంది. కాని, నిజానికి మనం మన అంతరాత్మనుంచి నేర్చుకుంటున్నాం’ అని.

చిత్రలేఖనంద్వారా తావోని సాధించడమంటే, నీ ఆత్మని నువ్వు కనుగొనడం, కాగితం మీద పెట్టడమన్నమాట.

అందుకనే లావో ఝీ అనే మరొక అలంకారికుడిట్లా అన్నాడు:

‘ముందు మనం తెలుపంటే ఏమిటో తెలుసుకోవాలి. అప్పుడు నలుపుతో చిత్రించాలి. మొత్తం విశ్వం నడిచేదే ఈ దారిన.’

ఇది చైనా తత్త్వశాస్త్రానికే మూలకందమైన ‘యిన్-యాంగ్’ సూత్రమని మనకు తెలుస్తూనే ఉంది కదూ.

తెల్లకాగితం మీద ఇంకుతో ఒక గీత గీసినా, చుక్కపెట్టినా, కుంచెతో పూత పూసినా, తెలుపు-నలుపులతో యిన్-యాంగ్ నే ఆవాహన చేస్తున్నాడని చీనా చిత్రకారుడికి తెలుసు.

అందుకనే గు కై ఝై అనే ఒక చిత్రకారుడు

‘నువ్వు రంగులేస్తున్నప్పుడు నువ్వు వ్యక్తీకరిస్తున్నది నీ అంతరంగాన్నే’

అని అన్నాడట.

ప్రాచీనా చీనా కళాకారులు, తత్త్వవేత్తలు చిత్రలేఖనాన్ని ఒట్టి కళగా భావించలేదు. వాళ్ళ దృష్టిలో అదొక వ్యక్తిత్వ వికాస సాధన. యువాన్ దీ (508-554) అనే చక్రవర్తి అన్నాడట:

‘మనిషి మరింత పరిణతి చెందే కొద్దీ , అతడి కుంచెలోనూ, ఇంకులోనూ కూడా ఆ పరిణతి కనిపిస్తుంది’

అని.

కన్ ఫ్యూసియస్ అయితే స్పష్టంగా చెప్పేసాడు కూడా:

‘నేను నైతికసూత్రాల్ని అర్థం చేసుకుని, దయాన్వితంగా నడుచుకున్నప్పుడు మాత్రమే నిజమైన కళాకారుణ్ణి కాగలుగుతాను ‘

అని.

ఈ సూత్రాలన్నిటినీ, అయిదో శతాబ్దానికి చెందిన ఝీ హే అనే లాక్షణికుడు ఆరు సూత్రాలుగా నిర్దేశించెపెట్టాడు. చీనా చిత్రకళకి మూలస్తంభాల్లాంటి ఆ సూత్రాలు, కావటానికి, ఆరు సాధారణ వాక్యాలే అయినప్పటికీ వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అవి:

• చక్కటి చిత్రలేఖనానికి ప్రాణం,లయ, ఆత్మ ఉండాలి.
• కుంచె మీద అదుపు ఉండాలి.
• పై రెండు సూత్రాల ప్రకారం నువ్వు చిత్రించేదేదైనా వాస్తవానికి అనుగుణంగా ఉండాలి.
• ప్రకృతిలో ఎట్లా ఉందో అట్లా నువ్వు చిత్రించే రంగులుండాలి.
• చక్కటి అమరిక ఉండాలి.
• పూర్వ చిత్రకారుల చిత్రలేఖనాలనుంచి నేర్చుకోవాలి.

దాదాపుగా పదిహేను శతాబ్దాల పాటు చీనా, జపాన్ చిత్రకారులకి అనుల్లంఘ్యమైన ఈ నియమాలకీ, భారతీయ చిత్రలేఖనంలోని షడంగాలకీ మధ్య పోలిక ఉందని అందరికన్నా ముందు అవనీంద్రనాథ్ టాగోర్ అన్నాడు. ఆయన ఆ మాట ఏ ముహూర్తంలో అన్నాడోగానీ, గత వందేళ్ళుగా పండితులు, చరిత్రకారులు, కళా విమర్శకులు చీనా, భారతీయ లక్షణ గ్రంథాల్ని పోల్చి, పోల్చి చదువుతూనే ఉన్నారు.

వాత్యాయన కామసూత్రాలకు వ్యాఖ్యానం రాస్తూ, యశోధరుడనే ఒక లాక్షణికుడు మొదటిసారి ఈ షడంగాల గురించి ప్రస్తావించాడు. అవి:

• రూపభేదం: వివిధ రూపాలగురించీ, వాటిమధ్య తేడాల గురించీ తెలిసి ఉండటం
• ప్రమాణాని: కొలతలు, అనుపాతాలు, నిష్పత్తుల గురించిన పరిజ్ఞానం
• భావమ్: భావావేశం, భావప్రసారం.
• లావణ్య యోజనం: చిత్రమంతటిలోనూ కనవచ్చే ఒక మెరుపు, అది కూడా చిత్రమంతటా పరుచుకుని ఉండే వెలుగు కావాలి
• సాదృశ్యం: చిత్రానికీ, బయటి వస్తువుకీ మధ్య ఉండవలసిన పోలిక మాత్రమే కాదు, చిత్రకారుడు ఏది దర్శించి చిత్రలేఖనానికి పూనుకున్నాడో, ఆ దర్శించినదానికీ, అంతిమంగా ఆ చిత్రలేఖనానికీ మధ్య ఉండవలసిన పోలిక కూడా.
• వర్ణకాభంగం: రంగులు వెయ్యగలిగే సామర్థ్యం.

ఒక పరిశోధకుడు, చీనావాళ్ళఆరుసూత్రాల్నీ, భారతీయషడంగాల్నీ ఇట్లా పోల్చవచ్చంటాడు:

• ప్రాణం, లయ, ఆత్మ:  భావం
• కుంచె మీద అదుపు:  లావణ్యసంయోజనం
• ఆకృతిని పట్టుకోవడం: రూపభేదం
• రంగులు చిత్రించడం: వర్ణికాభంగం
• అమరిక: ప్రమాణాని
• అనుకరణ: సాదృశ్యం

ఇదంతా చదివాక మనకేమనిపిస్తుందంటే, ప్రాచీన భారతీయ చిత్రకారులకీ, చీనా చిత్రకారులకీ కూడా, చిత్రలేఖనమంటే, చలంగారు కవిత్వం గురించి చెప్పినట్టు ‘తనకీ ప్రపంచానికీ సామరస్యం కుదరడం’.

అట్లా కుదిరినతర్వాత, ఆ చిత్రకారుడికి భౌతిక ప్రపంచం నిమిత్తమాత్రమే. ఒకప్పుడు చైనాలో ఝొంగ్ బింగ్ (375-443) అనే చిత్రకారుడుండేవాడట. అతణ్ణి ఒక రాజు తన ఆస్థానంలో ఉద్యోగమిస్తానని పిలిస్తే అతడు నిరాకరించేడట. తన జీవితమంతా తిరగగలిగినంతకాలం నదులూ, కొండలూ చూస్తూ తిరిగేడట. చివరి రోజుల్లో జబ్బుపడి ఇంట్లో మంచం పట్టినప్పుడు కూడా తాను ‘మంచం మీద పడుకునే ప్రయాణిస్తున్నా’నని చెప్పేవాడట.

చిత్రలేఖనమంటే, నువ్వున్నచోటనే నిశ్చలంగా కూచుని ప్రకృతిలో ప్రయాణించడమే కదా.

14-11-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: