చిత్రలేఖనం, వర్ణలేపనం

55

మనం చిత్రలేఖనం అని వ్యవహరించే కళలో నిజానికి రెండు విద్యలున్నాయి, డ్రాయింగూ, పెయింటింగూను. బొమ్మలు గియ్యడం, రంగులు వెయ్యడం.

ప్రాచీన చీనా చిత్రకారులూ, భారతీయ, పారశీక మీనియేచర్ చిత్రకారులూ ప్రధానంగా రేఖా చిత్రకారులు. యూరోప్ లో కూడా తొలితరం చిత్రకారులు రేఖాచిత్రకారులే. దాదాపుగా క్లాసిసిజం కాలం దాకా కూడా అంటే పందొమ్మిదో శతాబ్ది మొదటిరోజులదాకా కూడా రేఖకే ప్రాధాన్యం. కాని డెలాక్రా వంటి రొమాంటిసిస్టులతో మొదలై, ఇంప్రెషనిస్టులతో పతాకస్థాయికి చేరుకున్న వర్ణలేపనకౌశల్యం ఇరవయ్యవ శతాబ్దిలో రేఖాలేఖనాన్ని పూర్తిగా పక్కకు నెట్టింది. మాడర్న్ ఆర్ట్ పేరు మీద మనం గాలరీల్లో చూసే చాలా ప్రదర్శనల్లో రంగులు తప్ప రేఖలు కనిపించవు. ఒక కాన్వాసూ, కుంచె, ఒక ఏక్రిలిక్ డబ్బా ఉంటే చాలు పెయింటింగు పూర్తయిపోతుందని ఔత్సాహికులు భావిస్తున్న కాలమిది.

సమకాలీనులైన పెద్ద చిత్రకారుల ప్రదర్శనల్లో కూడా నన్ను నిరుత్సాహ పరిచే అంశం, వాళ్ళు బొమ్మలు బాగానే గీస్తారు, రంగులు బాగానే పూస్తారు గాని, ఆ చిత్రంలో మనం దేని మీద దృష్టిపెట్టాలో, లేదా మన దృష్టిని ఏది ఆకర్షించాలని వాళ్ళు కోరుకుంటునారో అర్థం కాదు. వాళ్ళు తమ శైలినే తమ పెయింటింగుగా భావిస్తున్నట్టనిపిస్తుంది.  ఒక్కమాటలో చెప్పాలంటే, వాళ్ళ దగ్గర ఏ కౌశల్యాలున్నా, కంపొజిషనల్ స్కిల్స్ మాత్రం కొరవడ్డాయని చెప్పాలి.

ఈ పరిస్థితికి కారణం డ్రాయింగూ, పెయింటింగూ వేర్వేరు కళలని భావించడమే. కాని ప్రాథమికంగా నువ్వు డ్రాయింగులో నిపుణుడివి కాకపోతే, పెయింటింగులో పారం ముట్టలేవు.

కాని డ్రాయింగు నేర్పేదెవరు? అది గురు ముఖతః లేదా కళాశాలలో అభ్యసించవలసిన నైపుణ్యమనే భావన ఉన్నందువల్ల చాలామంది డ్రాయింగు నేర్చుకోకుండానే పెయింటింగు లోకి అడుగుపెట్టేస్తున్నారు. కాని డ్రాయింగు ఒట్టి నైపుణ్యం మాత్రమే కాదు, అది ప్రధానంగా ఒక దృక్పథం. ప్రతి ఒక్క మనిషికీ డ్రాయింగు చేతనౌను. చూడండి, మనం పిల్లలుగా ఉన్నప్పుడు, మనలో బొమ్మలు గియ్యనివాళ్ళెవరు? ఇప్పుడు కూడా బోర్ కొట్టే తరగది గదిలోనో, విసిగించే రివ్యూ మీటింగుల్లోనో డూడ్లింగ్ చెయ్యనివాళ్ళెవరు? మనం పెద్దవుతూనే అన్నిటికన్నా ముందు మనలోని చిత్రకారుల్ని కోల్పోతున్నాం. కాని, నిజంగా డ్రాయింగులోకి ప్రవేశించడానికి గురువు అవసరం లేదు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారులెంతమందో స్వయంగా నేర్చుకున్నవాళ్ళే. వాన్ గో చిత్రలేఖనాల్ని ఉదాహరణలుగా చూపించని డ్రాయింగు పాఠ్యపుస్తకాలుండవు. కాని ఒక రెల్లుకలమూ, సొంతంగా చేసుకున్న వ్యూ ఫైండరూ పట్టుకుని పొలాల్లోకి పోయి వాన్ గో చిత్రకళని అభ్యసించాడని తెలుసుకోవడంలో ఎంత స్ఫూర్తి ఉంది!

పెయింటింగుకి డ్రాయింగు ప్రాతిపదిక మాత్రమే కాదు, దానికదే ఒక స్వయంపూర్ణమైన కళ అని చెప్పడం కోసం ద ఆర్ట్ స్టూడెంట్స్ లీగ్ ఆఫ్ న్యూయార్క్ వారు ఈ మధ్య The Visual Language of Drawing: Lessons on the Art of Seeing (2012) అనే పుస్తకం వెలువరించారు.

అందులో సమకాలీన చిత్రకారుల్లోసుప్రసిద్ధులు 15 మంది తమ కౌశల్య రహస్యాల్ని ఎంతో ఉదారంగా పంచుకున్నారు. వారితో చేసిన ఇంటర్వ్యూల తో పాటు, సంపాదకుడు జేమ్స్ ఎల్.మెక్ ఎలిన్నీ రాసిన చక్కటి ఉపోద్ఘాతమూ, ముఫ్ఫైకి పైగా మౌలిక భావనల వివరణా, బిబ్లియోగ్రఫీ కూడా ఉన్నాయి.

పోస్ట్ మాడర్న్ తత్త్వవేత్తలు text ని దాటి ఏదీ లేదన్నట్టే, ఈ సంపాదకుడు కూడా డ్రాయింగుని దాటి ఏదీ లేదంటాడు. మన దైనందిన జీవితంలో మనం వాడుతున్న ప్రతి వస్తువూ, మన దుస్తులూ, పుస్తకాలూ, కార్లూ, రోడ్లూ, భవనాలూ, హోటళ్ళూ, అడ్వర్టైజ్ మెంట్లూ ప్రతి ఒక్కటీ మొదట ఒక డ్రాయింగు గానే పుడుతున్నాయంటాడు. ఒక డిజైనర్ నమూనా గీసి చూడకుండా ఏ వస్తువూ, ఏ నగరమూ, ఏ ప్రచారమూ సాధ్యం కాదంటాడు.

అలాగని డ్రాయింగు కేవలం ఒక యాంత్రిక నమూనా కాదు, అది ఎప్పటికప్పుడు నవనవోన్మేషమైన దృక్పథం. ఒక పందొమ్మిదో శతాబ్ది రచయిత ఇలా రాసాడట:

‘ భౌతిక శాస్త్రవేత్తకైనా, వర్ణనాత్మక కవిత్వం చెప్పే కవికైనా, చిత్రకారుడికైనా, శిల్పికైనా కూడా తప్పని సరిగా పెంపొందించుకోవలసిన సామర్థ్యం, కాని అతికష్టం మీద గాని ఒనగూడని సామర్థ్యం కళ్ళముందున్నదాన్ని దర్శించగలగడం. చూడటం ఒక ఇంద్రియధర్మం. కాని దర్శించడం ఒక కళ’

డ్రాయింగు సాధనమొదలుపెట్టాక మనకీ సంగతి మొదటినాలుగైదు రోజుల్లోనే తెలిసిపోతుంది. ఉన్నదున్నట్టుగా చిత్రించాలనుకునే వాళ్ళకి మొదట చెప్పే పాఠం, అక్కడ ఎలా కనిపిస్తున్నదో అలా గియ్యి, అది ఎలా ఉంటుందని నువ్వనుకుంటున్నావో అలా కాదు అని. ఇది చాలా విలువైన పాఠం. ఈ మాట జీవితవాస్తవికతను చిత్రించాలనుకునే రచయితలకు కూడా వర్తిస్తుంది. చాలాసార్లు మనం వాస్తవం ఎట్లా ఉందో దాన్ని కాక, ఎలా ఉంటుందనుకుంటామో అట్లా మన ఊహ మేరకు రాస్తాం. అక్కడ ఉన్నదాన్ని ఉన్నట్టుగా చిత్రించడం మొదలుపెట్టగానే, మనని నివ్వెరపరిచేటంత సాదృశ్యంతో చిత్రం మనముందు ఆవిష్కారమవుతుంది.

అలాగని, డ్రాయింగు ఒకసారి సాధనచేసి శీఘ్రంగా పరిపూర్ణతకు చేరుకుని ఆ తర్వాత పెయింటింగు మొదలుపెట్టవచ్చనుకుంటే, అదీ పొరపాటే. సుప్రసిద్ధ జపనీయ చిత్రకారుడు హొకుసాయి ఇట్లా అన్నాడని సంపాదకుడు తన ముందుమాటలో రాసాడు:

‘ఆరేళ్ళ వయసునుంచే నాకు చూసినవాటిని చూసినట్టు చిత్రించాలనే పిచ్చి ఉండేది. యాభై ఏళ్ళ వయసు వచ్చేటప్పటికి, నేను అసంఖ్యాకంగా చిత్రించేను. కాని నాకు డెభ్భై ఏళ్ళు రాకముందు నేను గీసిందంతా లెక్కలోకి రానిదే. ప్రకృతి నిజంగా ఎలా కనిపిస్తుందో, జంతువులు, మొక్కలు, చెట్లు, పక్షులు, చేపలు, కీటకాలు వీటి గురించిన ఏ కొద్దిపాటి జ్ఞానమో నాకు డెభ్భై మూడో ఏట నుంచీ సాధ్యమవుతున్నది. ఇలాగే నడిస్తే, ఎనభై ఏళ్ళకి నేను కొంత పురోగతి సాధిస్తాను, తొంభై ఏళ్ళకల్లా ఆకృతిరహస్యాన్ని ఆవిష్కరించగలుగుతాను, నూరేళ్ళకి నిస్సంకోచంగా ఒక అద్భుతస్థితికి చేరుకోగలుగుతాను, ఇక నూటపదేళ్ళ వయసు వచ్చేటప్పటికి, నేనేది గీస్తే అది, ఒక చిన్న చుక్కగానీ, గీతగానీ, సజీవంగా అలరారకతప్పదు. నేను జీవించినంతకాలం జీవించబోయేవాళ్ళు నా మాటలు నిజమని ఒప్పుకుంటారు. ‘

ఈ వాక్యాలు చిత్రకళకే కాదు, అసలు మనిషి జీవితకళకే వర్తిస్తాయని మనం ఒప్పుకోవలసి ఉంటుంది. ఈ మాటలు కన్ ఫ్యూసియస్ సుప్రసిద్ధ వాక్యాల్ని గుర్తు చేస్తున్నాయి. ఆ చీనా తాత్త్వికుడు తన శిష్యులతో అన్నాడట:

‘నాకు పదిహేనేళ్ళ వయసురాగానే నేను అధ్యయనం మొదలుపెట్టాను. ముప్పై ఏళ్ళకల్లా నా కాళ్ళు భూమ్మీద స్థిరంగా పాతుకోగలిగాను. నలభై ఏళ్ళు వచ్చేటప్పటికి జీవితవైరుధ్యాలు నన్ను బాధించడం మానేసాయి. యాభై ఏళ్ళకి ఆకాశం ఏం చెప్తోందో తెలుసుకోగలిగాను. అరవై ఏళ్ళకి ఆ మాటలు ప్రశాంతంగా వినడం నేర్చుకున్నాను. డెభ్భై ఏళ్ళు రాగానే నా అంతరాత్మ ఆదేశాల్ని పాటించగలిగే స్థాయికి చేరుకున్నాను.’

హొకుసాయి 89 ఏళ్ళు మాత్రమే జీవించాడుగానీ, ఈ పుస్తకానికి ఇంటర్వ్యూ ఇచ్చిన విల్ బార్నెట్ అనే చిత్రకారుడు 101 ఏళ్ళు బతికాడు. ఆయన మాటలు హొకుసాయిని గుర్తుతెచ్చేవిగానే ఉన్నాయి. ఆ ఇంటర్వ్యూలో చివరి ప్రశ్న, ఆయనిచ్చిన జవాబు చూడండి:

ప్రశ్న: ..ఒక శతాబ్ది కాలం పాటు చిత్రకారుడిగా జీవించేక, రానున్న వందేళ్ళలో డ్రాయింగు భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదని మీరు ఆశిస్తున్నారు?

బార్నెట్: (నవ్వుతో) పూర్వకాలపు మహనీయ చిత్రకారులెవరైనా ఈ ప్రశ్నకి జవాబుచెప్పగలిగి ఉండేవారా? ప్రతి ఒక్కరోజూ ఒక సుసంపన్నమైన అనుభవమే. కళ సాధారణజీవితం నుంచే ప్రభవిస్తుంది. రోజువారీ సంఘటనలే: పార్కులో ప్రేమికులు, పసిపాపను చంకనెత్తుకున్న తల్లి, మనలాగా పార్కు బెంచీమీద కూచుని కళ గురించి మాట్లాడుకుంటున్న ఇద్దరు మనుషులు- ఇవే గొప్ప కళాకృతులుగా రూపొందగలవు. అట్లాంటి బతికిన క్షణాలతో మనల్ని అనుసంధానించేదే చిత్రలేఖనం. సర్వదా.’

20-10-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d