మాధ్యమాలు

70

నా నీటిరంగుల చిత్రలేఖనం మీద పూజ్యులు గణేశ్వరరావుగారు నిన్న రాసిన మాటలు నాకెంతో సంతోషం కలిగించాయి. నా ఇరవయ్యేళ్ళ వయసులో నా కథలు చదివి కాళీపట్నం రామారావుగారు రాసిన ఉత్తరం నాకెంత స్ఫూర్తి కలిగించిందో, ఇప్పుడు ఈ మాటలు నాకంత ప్రోత్సాహాన్నిస్తున్నాయి. నా సాధన కొనసాగించడానికి మళ్ళా కొత్తగా ఒక ప్రోద్బలం దొరికింది.

గత పదేళ్ళుగా నేను అత్యధిక సమయం చిత్రలేఖనం మీదనే గడుపుతూ వచ్చాను. చిత్రకళని అర్థం చేసుకోవడానికీ, చిత్రలేఖన మాధ్యమాల స్వభావాన్ని అర్థం చేసుకోవడానికీ శాయశక్తులా కృషి చేసాను. దాంతో పోలిస్తే, సాహిత్య అధ్యయానికీ, రాయడానికీ నేను కేటాయించిన సమయం చాలా చాలా తక్కువ. కానీ, అందుకు నాకేమీ విచారం లేదు. (ఇప్పుడు, నాకెవరైనా గురువు దొరికితే, సంగీత సాధన కూడా చేయాలని ఉంది. కచేరీలు చేయడానికి కాదు, రాగలక్షణాన్నీ, రాగస్వభావాన్నీ అర్థం చేసుకోవడానికి.)

చిత్రలేఖనం గురించి ఇన్స్ స్ట్రక్షన్ మాన్యువల్స్ తెప్పించుకుని, నాకై నేను స్వీయ అధ్యయనం మొదలుపెట్టాక, ప్రతి మాధ్యమాన్నీ స్వయంగా పరిశీలించి చూసాను. ఆయిల్ కలర్స్, ఆక్రిలిక్స్, మనం పోస్టరు రంగులుగా పిలిచే గ్వాష్, ట్రాన్స్పరెంట్ నీటిరంగులు వంటి వర్ణలేపన మాధ్యమాలు, చార్ కోల్, క్రేయాన్లు, కాంట్ క్రేయాన్లు, సాఫ్ట్ పేస్టల్సు, ఆయిల్ పేస్టల్స్, సిల్వర్ పాయింట్ వంటి రేఖాలేఖనమాధ్యమాలతో పాటు లినోకట్, మోనోప్రింట్, వుడ్ కట్ వంటి ప్రింటు మాధ్యమాలు కూడా ప్రతి ఒక్కటీ స్వయంగా నేర్చుకోడానికి ప్రయత్నించాను. కాలాన్నీ, వనరుల్నీ నీళ్ళలాగా కర్చు చేసుకుంటూ, తీవ్రమైన నిస్పృహకి లోనవుతూ కూడా ప్రతి ఒక్క మాధ్యమాన్నీ నాకై నేను అర్థం చేసుకోడానికి చూసినందువల్ల నాకు లభించిన గొప్ప అవకాశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిత్రకారుల చిత్రలేఖన సౌందర్యాన్ని అర్థం చేసుకోడమెట్లానో బోధపడటమే. ఇప్పుడు నేను చిత్రకారుడిగా సఫలం కాకపోయినా నాకే విచారమూ లేదు. ప్రసిద్ధ ప్రాచ్య, పాశ్చాత్య, ఆదిమ, ఆధునిక, అత్యాధునిక చిత్రకళా ధోరణుల విస్తృత ప్రపంచంలో ప్రయాణించడానికి నాకొక పాస్ పోర్ట్ దొరికింది. అంతకు మించి కోరుకోవలసింది కూడా లేదు.

‘ఒక పువ్వు రంగు చూస్తూ శతాబ్దాలు బతగ్గలను’ అన్నాడు శేషేంద్ర. ఆ మాట నేను చిత్రలేఖనాల గురించి చెప్పగలను. సోంగ్ రాజవంశపు కాలంలో చీనా చిత్రకారులు పట్టువస్త్రాలమీద చిత్రించిన వెదురుపొదల్నీ, సీతాకోకచిలుకల్నీ, తామరపూలనీ, పక్షుల్నీ చూస్తూ ఉంటే నాకు కాలం తెలియదు. మరొక పాతికేళ్ళ సాధన తర్వాతేనా నేను వాళ్ళలాగా ఒక తూనీగనైనా చిత్రించగలననుకోను. కాని, చిత్రించాలన్న ఒక తపన నాలో రగులుతూ ఉందే, దానికే నేనెంతో పరవశిస్తూ ఉంటాను. దీపకాంతి ని చూసి మోహపడకుండా ఉండలేని శలభంలాగా రంగులు నన్ను తీవ్రంగా ఉద్దీపింపచేస్తూంటాయి. దీపంలో ఉన్నదే శలభంలోనూ ఉన్నదని, రూమీ, బహుశా నన్ను చూసే రాసి ఉంటాడు.

చిత్రకళామాధ్యమాలను అర్థం చేసుకోవడానికి నేను సాహిత్యమాధ్యమాలతో పోల్చుకుంటూ ఉంటాను. నాకు అర్థమయినదాన్ని బట్టి, తైలవర్ణమాధ్యమం నాటకం లాంటిది. ఆయిల్ కలర్స్ ద్వారా టోనల్ వాల్యూస్ అత్యంత ప్రగాఢంగా చిత్రించవచ్చు. ఒక చిత్రంలో డ్రామా ఏర్పడేది రేఖలవల్లా, రంగులవల్లా, వస్తువు వల్లా కాదు. ఆ ఇంద్రజాలమంతా టోన్ వల్ల సంభవిస్తుంది. రాఫేల్ చిత్రించిన The School of Athens (1511) చూడండి. దాంతో పోల్చదగ్గది ఒక షేక్ స్పియర్ నాటకం మాత్రమే. కాని, ఆధునిక జీవితం తైలవర్ణాల మాధ్యమానికి అనువైంది కాదు. నెలలతరబడి రంగులు ఆరేదాకా నీ ఉద్వేగాన్ని ఉగ్గబట్టుకుని ఉండటం సాధ్యం కాదు. ఫ్లెమిష్ చిత్రకారుల్లాగా పలచటి రంగుపూతలు (గ్లేజింగ్) పూసుకుంటూ ఒక తామరపూవుని చిత్రించాలని నేనొకసారి విఫల ప్రయత్నం చేసాను. కొన్ని నెలలలపాటు కొన్ని పూతలు పూసాక, నా తొలిస్ఫూర్తి చల్లారిపోయి, ఆ కాన్వాసు బయట పారేసాను.

ఏక్రిలిక్, గ్వాష్ మాధ్యమాలు చిన్న కథలు రాయడం లాంటివి. మరీ ముఖ్యంగా ఏక్రిలిక్. అందులో నీటిరంగుల సారళ్యమూ, తైలవర్ణాల గాఢతా రెండింటికీ అవకాశం ఉండటంతో, ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చిత్రకారులంతా ఏక్రిలిక్ మాధ్యమాన్నే అనుసరిస్తున్నారు. చిన్నకథకులాగే ఏక్రిలిక్ కి ఎక్కువ సమయం అవసరం ఉండదు. కాని, కథాప్రక్రియలాగే ఏక్రిలిక్ కి కూడా దాని పరిమితులు దానికున్నాయి. ఆ రంగులు ఆరడానికి ఎక్కువ వ్యవథి అవసరంలేకపోవడమే దాని బలమూ, బలహీనతా కూడా. ఎంత గొప్పగా రాసినప్పటికీ, ఒక కథ ఒక నవల ఎట్లా కాదో, ఒక ఏక్రిలిక్ చిత్రలేఖనం ఎంత బాగా వేసినప్పటికీ, ఒక ఆయిల్ పెయింటింగ్ కి సమానం కాలేదు.

పేస్టల్స్ ప్రత్యేకమైన మాధ్యమం. వాటికి రంగులు కలుపుకోవలసిన పనిలేదు. వేసిన రంగులు ఆరడంకోసం వేచి ఉండనక్కర్లేదు. ఆయిల్ కలర్స్ లోలాగా వాటిలో కూడా టోనల్ గాఢత సాధ్యమవుతుంది. కాని, పేస్టల్స్ తో అతి పెద్ద సమస్య దుమ్ము. అవి వేస్తున్నప్పుడు రాలే దుమ్ము చాలా కష్టం. ముఖ్యంగా అలర్జీలతో బాధపడే నాలాంటి వాడికి.

అన్ని మాధ్యమాల్లోనూ చార్ కోల్ అత్యంత ప్రతిభావంతమైన మాధ్యమం. అత్యంత ప్రాచీనమాధ్యమం కూడా. ఆదిమానవుడి డ్రాయింగ్ మీడియమది. డైరీ, ఉత్తరం, ట్రావెలాగ్, మ్యూజింగ్స్ లాంటి మాధ్యమం అది. అందులో నీ ఆత్మనివేదనాన్ని ధారాళంగా, త్వరగా, సంతృప్తికరంగా వ్యక్తం చేసుకోవచ్చు. మసిబొగ్గు సాధించగలిగినంత స్పష్టమైన టోనల్ వాల్యూస్ ని ఆయిల్ కలర్స్ కూడా తీసుకురాలేవు. కాని, ఉత్తరాలద్వారా, డైరీల ద్వారా ఇతిహాసాల్ని చిత్రించలేనట్టే, చార్ కోల్ ద్వారా చారిత్రిక, సామాజిక సన్నివేశాల మహాచిత్రణ చెయ్యలేం.

ఇక మిగిలింది నీటిరంగుల మాధ్యమం. సాంకేతికంగా ఏక్రిలిక్, పోస్టర్ కలర్సూ కూడా నీటిరంగులే అయినప్పటికీ, అవి opaque. అంటే వాటిని ఉపయోగిస్తున్నప్పుడు మనం చిక్కటి రంగులమీద లేతరంగులు చిత్రించవచ్చు. చిక్కటి ఆకుపచ్చ గుబుర్లు చిత్రించి ఆ కొమ్మల్లో తెల్లటి పూలు చిత్రించవచ్చన్నమాట. కాని, నిజమైన నీటిరంగులు, వాటిని transparent watercolors అంటారు, ఆ రంగుల ద్వారా దట్టమైన రంగుల మీద లేతరంగులు చిత్రించడం అసాధ్యం. అందుకని opaque మాధ్యమాలు, అంటే ఆయిల్స్, పేస్టల్స్, ఏక్రిలిక్, గ్వాష్ వంటి రంగులు వాడేటప్పుడు from dark to light చిత్రిస్తారు. కాని పారదర్శకమైన నీటిరంగులు చిత్రించేటప్పుడు, from light to dark చిత్రిస్తారు. అంటే ముందు లేత రంగుల పూతలు పూసి అప్పుడు ముదురురంగులు చిత్రించాలి. ఇటువంటి పారదర్శకమైన రంగులు వాడే చిత్రకారుల్ని purist watercolorists అంటారు. వాళ్ళు కచ్చితంగా పాటించే ఒక ముఖ్యమైన నిబంధన నలుపు, తెలుపు రంగులు వాడకపోవడం. కాగితం తాలూకు తెలుపునే తెలుపుగా వాడాలి. ఉదాహరణకి నేను చిత్రించిన కొండలు, పడవ బొమ్మలో మీరు చూస్తున్న తెలుపు కాగితం తాలూకు తెలుపునే. నలుపుకి బదులు, రెండు లేదా మూడు రంగులు కలిపి నలుపుకి సమీపంగా ఉండే నల్లరంగు సృష్టించుకుని దాన్ని వాడాలి. ఒక చిత్రలేఖనంలో ఉండే ఇంద్రజాలం టోనల్ వాల్యూస్ వల్ల మాత్రమే వస్తుందనుకున్నప్పుడు, నలుపూ, తెలుపూ వాడకపోతే ఇక ఇంద్రజాలమెక్కడ? కాని, పారదర్శక నీటిరంగుల చిత్రాల్లో, కాగితం తాలూకు తెలుపు అంతకన్నా గొప్ప ఇంద్రజాలాన్ని సృష్టిస్తుంది. అద్వితీయమైన దాని translucence ముందు తైలవర్ణాలు కూడా వెలవెలబోతాయి.

కాని పారదర్శకమైన నీటిరంగులు చాలా చాలా unforgiving medium. తైల వర్ణాలు అట్లా కాదు. వాటి క్షమాగుణానికి అంతంలేదు. మీరు ఎన్ని సార్లు తప్పులు చేసినా దిద్దుకోవచ్చు, సవరించుకోవచ్చు, మార్చుకోవచ్చు. కాని, పారదర్శక నీటిరంగుల్తో చిత్రం మొదలుపెట్టాక, ఏమరుపాటు, అంచనాలోపం, నీటిపరిమాణం, కుంచె కదలిక, మొదటి పూత ఆరడానికి పట్టే సమయం, నీ మనఃస్థితి దేనివల్ల ఏ చిన్నపొరపాటు సంభవించినా ఇక ఆ చిత్రం విఫలమైపోయినట్టే. (సరిదిద్దుకోవచ్చని కొందరంటారు, కాని, ఆ సవరణ కూడా అక్కడ కొట్టొచ్చినట్టు కనబడుతూనే ఉంటుంది.) అత్యంత నిర్దయాపూర్వకమూ, కఠిన నియమబద్ధమూ, కాని అంతిమఫలితంలో సుకోమలమూ, లలితమధురమూ అయిన నీటిరంగుల మాధ్యమాన్ని మనం సాహిత్యప్రక్రియల్లో గీతరచనతో పోల్చవచ్చు. ధాతుమాతు సమన్వయం సంపూర్ణంగా కుదిరిన ఒక వాగ్గేయకారకృతిలాంటిదది. చక్కగా కుదిరిందా, ఆ కృతికి దైవత్వం సిద్ధిస్తుంది. నీటిరంగుల చిత్రం కూడా అంతే.

ఈ సవాళ్ళవల్లా, ఈ సవాళ్ళను ఎదురుకోవడంలో లభించే అద్వితీయ ఆనందంవల్లా అన్ని మాధ్యమాల్లోనూ నేను చివరికి నీటిరంగుల్ని ఎంచుకున్నాను. Transparent watercolors. కాని, ఆ రంగులు హిమాలయాలంత స్వచ్ఛమైనవీ, ఎత్తైనవీ, సుదూరమైనవీను. చాలా జీవితం వృథాగా గడిపేసాను. మిగిలిన కొద్ది కాలంలోనూ ఎంత సాధన చేయగలనో, కానీ, చీనా జపాన్ చిత్రకారుల్లాగా ఒక వెదురుపొదనో, ఒక తూనీగనో చిత్రించిపోగలిగితే చాలు. ఒక త్యాగరాయకృతిలాగా అది నిలబడిపోగలిగితే చాలు!

21-12-2017

Leave a Reply

%d bloggers like this: