గ్రంథాలయాల నీడన

10

ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యదర్శి డా. రావి శారద గారు గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా తమ గ్రంథాలయానికి ఆహ్వానించారు. మొన్న సాయంకాలం మొదటిసారిగా ‘సర్వోత్తమ భవనం’ లో అడుగుపెట్టాను.

ఆధునిక అంధ్రదేశ చరిత్రలో సామాజికంగా, సాంస్కృతికంగా, రాజకీయంగా గొప్ప విప్లవాత్మక పాత్ర పోషించిన గ్రంథాలయోద్యమ కేంద్రం అది. మా మాష్టారు హీరాలాల్ గారు ఒక సారి ఒక మాటన్నారు: ‘ఆంధ్రదేశంలో జాతీయోద్యమమంటే గ్రంథాలయోద్యమమే’ అని. ‘ఆంధ్రప్రదేశ్ లో గ్రంథాలయోద్యమ చరిత్ర అంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘ చరిత్రనే’ అని వావిలాల గోపాలకృష్ణయ్య అన్నారు.

ఆంధ్రదేశంలో మొదటి పౌర గ్రంథాలయాన్ని మంతిన ఆదినారాయణమూర్తి అనే ప్రాథమికోపాధ్యాయుడు 1886 లో విశాఖపట్టణంలో ప్రారంభించాడట. 1905 కల్లా ఆంధ్రదేశంలో 20 దాకా గ్రంథాలయాలు ఏర్పడ్డాయట.

1914 లో విజయవాడలో రామమోహన ధర్మపుస్తకభాండాగార కార్యకర్తలు దేశంలోని గ్రంథాలయ నిర్వాహకులందరినీ మొదటిసారి సమావేశపరిచారట. ఆ సభకి చిలకమర్తి అధ్యక్షులు. గంజాం నుండి బళ్ళారిదాకా, హైదరాబాదు సంస్థానంతో కలుపుకుని 60 గ్రంథాలయాలకు చెందిన 200 మంది ప్రతినిధులదాకా ఆ సభలో పాల్గొన్నారు. గ్రంథాలయాల స్థాపన, నిర్వహణ ఒక ఉద్యమస్థాయిలో చేపట్టాలని, అయ్యంకి వెంకటరమణయ్య, సూరి వెంకట నరసింహశాస్త్రి కలిసి ఆంధ్రప్రదేశ గ్రంథభాండాగార సంఘాన్ని స్థాపించారు. తర్వాత రోజుల్లో అది ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘంగా మారి ఒక పరిపూర్ణ శతాబ్దాన్ని పూర్తిచేసుకుని కొనసాగుతున్నది.

‘నూరేళ్ళ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం: సంక్షిప్త చరిత్ర’ అనే పుస్తకం,పట్టుమని 40 పేజీలు కూడా లేని పుస్తకం చదువుతుంటే తీవ్ర హృదయోద్వేగానికి లోనవకుండా ఉండలేం.

ఎందుకంటే, ఆ సంఘమే లేకపోతే, ఆ ఉద్యమమే లేకపోతే,నేనిట్లా ఉండేవాణ్ణా అనిపించింది నాకు. ఆ సాయంకాలం ఆ గ్రంథాలయ ఆవరణలో జరిగిన సమావేశంలో పిల్లల్నీ, పెద్దల్నీ ఉద్దేశించి మాట్లాడమన్నప్పుడు నేను గ్రంథాలయాల గురించే మాట్లాడేను. నా జీవితాన్ని నేను చదువుకున్న గ్రంథాలయాలతోనే గుర్తుపట్టగలననీ, నా జీవితమంతా ఒక గ్రంథాలయం నుంచి మరొక గ్రంథాలయానికి ప్రయాణమేననీ కూడా చెప్పాను.

నా గ్రంథాలయాలు: మొదటి గ్రంథాలయం, మా ఇంట్లో చిన్న చెక్క అలమారులో ఉండే పుస్తకాలు. శ్రీ మహాభక్తవిజయమూ, చలంగారి ‘స్త్రీ’ కూడా అక్కడే పరిచయమయ్యాయి. రెండవ గ్రంథాలయం, మా ఊళ్ళో శ్రీధర బ్రహ్మావధాన్లు గారి ఇంట్లో వాళ్ళ అన్నయ్య శ్రీధర సత్యనారాయణమూర్తిగారు కొని దాచుకున్న పుస్తకాలు. అడవిబాపిరాజు, పానుగంటి వంటి రచయితలు అక్కడే పరిచయమయ్యారు నాకు. మూడవది, మా గ్రామ పంచాయితీలో పంచాయతీ రాజ్ శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన గ్రామీణ గ్రంథాలయం. కొడవటిగంటి కుటుంబరావు ‘అహింసా ప్రయోగం’, ‘పానకంలో పీచు’ తళతళలాడే అట్టలతో నాకిప్పటికీ కళ్ళముందు కదుల్తున్నాయి.

నాలుగవ గ్రంథాలయం, రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీ. రోజూ మా అన్నయ్య అక్కణ్ణుంచి నాకో పుస్తకం తెచ్చేవాడు. రాత్రంతా, మా ఇంటి అరుగు మీద సగం వత్తి తగ్గించిన హరికెన్ దీపం వెలుతుర్లో ఆ పుస్తకం పూర్తి చేసేసేవాణ్ణి. పొద్దున్నే అది పట్టుకు పోయి మరొక కొత్త పుస్తకం తెచ్చేవాడు. ప్రతి గురువారం సాయంకాలం మాత్రం రెండు రోజులకు సరిపడా పెద్ద పుస్తకం తెచ్చేవాడు. ‘మల్లారెడ్డి’, ‘చెంఘిజ్ ఖాన్’, ‘మొగలాయీ దర్బారు కుట్రలు’, ‘విజయనగర సామ్రాజ్యవైభవం’ లాంటి పుస్తకాలు అప్పుడే చదివాను.

మొదటిసారి మా అన్నయ్య నన్ను రాజవొమ్మంగి బ్రాంచి లైబ్రరీకి తీసుకువెళ్ళాడు. అక్కడ పుస్తకాల అలమారుల మధ్య కూచుని ఉన్న లైబ్రేరియన్ నా కళ్ళకొక హీరోలా కనిపించాడు. జీవితంలో పెద్దయ్యాక ఒక లైబ్రేరియన్ కావాలని గట్టిగానే అనుకున్నాను.

తాడికొండ గురుకులపాఠశాల ని అక్కడ అంతకుముందు నడిచిన బేసిక్ ట్రయినింగ్ స్కూలు ఆవరణలో ప్రారంభించారు. ఆ భవనాలతో పాటు బేసిక్ ట్రయినింగ్ స్కూలు లైబ్రరీ కూడా గురుకులపాఠశాలకి దక్కింది. ఎంత అద్భుతమైన లైబ్రరీ! అక్కడ నేను చదివిన మొదటి పుస్తకాలు, తారాశంకర్ బంధోపాధ్యాయ ‘కవి’, మాస్తి ‘చిక్కవీర రాజేంద్ర’, కురతలైన హైదర్ ‘అగ్నిధార ‘, హరినారాయణ ఆప్టే ‘నేను’, వ్యంకటేష్ మాడ్గూళ్కర్ ‘బనగర్ వాడి’లతో పాటు చాలా తెలుగు పుస్తకాలు కూడా. కాని, వాటన్నిటిలోనూ’ బనగర్ వాడి’ నా రక్తంలోకీ ఇంకిపోయింది. నా జీవితాన్ని మలుపు తిప్పిన రచన అది. పది పదకొండేళ్ళ లేత వయసులో ఆ పుస్తకం నా మీద ఎంత తీవ్రమైన ముద్ర వేసిందో అదంతా మా అక్క రాసిన ‘భారతీయ నవల’ కి ముందుమాటలో రాసాను.

నా జీవితానికి, నా వ్యక్తిత్వ నిర్మాణానికీ గొప్ప ఆలంబన నిచ్చింది రాజమండ్రిలో గౌతమీ గ్రంథాలయం. నాళం కృష్ణారావుగారు 1893 లో శ్రీ వీరేశలింగ గ్రంథభాండాగారం గా స్థాపించిన గ్రంథాలయం అది. రాజమండ్రి చరిత్రలోనే కాదు, ఆధునిక తెలుగు సాహిత్య చరిత్రలో కూడా గౌతమీ గ్రంథాలయం నిర్వహించిన పాత్ర వెలకట్టలేనిది. ఆ కల్పవృక్ష ఛాయన నేను తత్త్వశాస్త్రం అధ్యయనం చేసాను. ఆ ఋణం తీర్చుకోవడం కోసం పాశ్చాత్య తత్త్వశాస్త్రం నుంచి ‘సత్యాన్వేషణ’ పేరిట ఒక సంకలనం చేసి ఆ గ్రంథాలయానికి అంకితమిచ్చాను.

హైదరాబాదు వచ్చేక, మా గిరిజన సంక్షేమశాఖలో గిరిజన సాంస్కృతిక శిక్షణా, పరిశోధనా సంస్థ వారి గ్రంథాలయం నాకెంతో బాసటగా నిలబడింది. హైదరాబాదులోని అత్యుత్తమ గ్రంథాలయాల్లో మొదటి పదింటిలో అది కూడా ఒకటి. ముఖ్యంగా ఆంత్రొపాలజీ, సోషియాలజీ, ఫోక్ లోర్ లలో చాలా అరుదైన పుస్తకాలున్నాయక్కడ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భాగంగా నేనక్కడ గడిపిన పదహారేళ్ళలోనూ, ఆ లైబ్రరీని మరింత బలోపేతం చేసాను. సాంఘిక శాస్త్రాలతో పాటు, ఇండాలజి, ఫిలాసఫి, సైన్సు, సైకాలజి లకు చెందిన పుస్తకాలు కూడా ఎన్నో కొనిపించాను. ఇప్పటికీ,ఆ గ్రంథాలయం నా friend, philosopher, guide గా ఉంటూనే ఉంది.

ఏ ఊరు వెళ్ళినా, ఒక్క రోజు కన్నా ఎక్కువ ఉండవలసి వస్తే, నేను మొదటవెతుక్కునేది అక్కడి గ్రంథాలయాల్నే. చాలా గ్రంథాలయాలు కనీసం ఒక్క పుస్తకానికేనా, నాకు జీవితమంతా గుర్తుంటాయి. మా నాన్నగారికి జమాబందిలెక్కలు రాయడానికి అడ్డతీగల వెళ్ళినప్పుడు అక్కడి బ్రాంచి లైబ్రరీలోనే ఫణీశ్వర నాథ వర్మ ‘మూడో ఒట్టు’ కథ చదివాను. అరకులోయ గవర్నమెంటు హైస్కూలు లైబ్రరీలోనే కాలరిడ్జ్ ‘ద్ రైమ్ ఆఫ్ యాన్షియెంటు మారినర్’ చదివాను. గూటెన్ బర్గ్ ముద్రించిన మొదటి పుస్తకం ‘బైబిల్’ చూపించినందుకు గాను మాంచెష్టర్ లోని జాన్ రైలాండ్సు లైబ్రరీకి నేనెప్పటికీ ఋణపడి ఉంటాను.

రోజుకో పుస్తకం కోసం రోజంతా ఎదురుచూసిన ఆ నా పసితనపు రోజులెక్కడ? ఇప్పుడు ఒక్క క్లిక్ తో కొన్ని లక్షల పేజీలు ప్రత్యక్షమయ్యే ఆన్ లైన్ మహాగ్రంథాలయాల తలుపులు తెరుచుకునే రోజులెక్కడ? ఇప్పుడు పుట్టి పెరుగుతున్న పిల్లలెంత అదృష్టవంతులు! అదే చెప్పాను, ఆ సాయంకాలం ఆ పిల్లలకీ, వాళ్ళ తల్లిదండ్రులకీ.

19-11-2016

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: