గురూజీ మాటలు మరికొన్ని

16

నిన్న గురూజీ మాట్లాడిన మాటలు కొన్ని రాసాక, రోజంతా ఆయన మాటలే మరెన్నో పదేపదే గుర్తొస్తున్నాయి.. అందుకని మరికొన్ని వాక్యాలు:

11

ఒక రోజు నా దగ్గరికి కొంతమంది ఆర్థశాస్త్రవేత్తలు వచ్చారు. వాళ్ళు భారతీయ ఆర్థికవ్యవస్థమీద ఎన్నో పుస్తకాలు రాసారు. వాళ్ళు మాట్లాడుతున్న శాస్త్రం నాకు అణుమాత్రం కూడా తెలీదు. కాని వాళ్ళు నా చుట్టూ మూగి జొరీగల్లాగా గుయ్యిమంటూనే ఉన్నారు.

‘చెప్పండి గురూజీ, ఈ పాపం ఎవరిది? ఎవరు దీనికి బాధ్యులు? భారతదేశంలో ఈ పేదరికం ఎందుకిట్లా పెరిగిపోతూ ఉంది? దీనికి మీరు చెప్పే సూచనలు నిజంగా పరిష్కారాలనుకుంటున్నారా?’ లాంటివే చాలా ప్రశ్నలు.

కాని దీనికెవరు బాధ్యులు అని వాళ్ళు పదే పదే అడుగుతుంటే నాకో కథ గుర్తొచ్చింది.

వాళ్ళకిట్లా చెప్పాను. ‘ ఒకరోజు ఒక ఇంటికొక అతిథి వచ్చాడు. ఆ గృహిణి ఆ అతిథికి మర్యాద చెయ్యడానికి పరమాన్నం పెట్టాలనుకుంది. పనిమనిషిని పిలిచి పక్కింటికి వెళ్ళి పాలు తెమ్మంది. పనిమనిషి పాలు తెస్తూండగా, ఆకాశంలో ఒక డేగ ఒక పాముని కరుచుకుపోతూఉంది. ప్రాణభయంతో కొట్టుకుంటున్న ఆ పాము నోట్లోంచి విషబిందువులు కిందకు రాలి ఆ పనిమనిషి మోసుకుపోతున్న పాల గిన్నెలో పడ్డాయి. ఆ సంగతి గమనించని పనిమనిషి ఆ పాలు యజమానురాలికిచ్చింది. ఆ గృహిణి పరమాన్నం చేసి ఆదరంతో వడ్డించింది. ఏమీ ఎరగని అతిథి ఆ విందుని ఆరగించి తక్షణమే మరణించాడు.

కానీ అప్పుడే ఒక సమస్య వచ్చిపడింది. అక్కడకు చేరుకున్న యమదూతలకి ఆ పాపం ఎవరి ఖాతాలో రాయాలో తెలియలేదు. గృహిణిని బాధ్యురాలందామా అంటే ఆమెకి విషయం తెలీదు, పనిమనిషికి కూడా తెలీదు. పాముమీద బాధ్యత మోపుదామంటే, నా ప్రాణం కాపాడుకునే యాతనలో నేనున్నాను. నేనెట్లా బాధ్యురాలనంది. ఈ పాపం డేగకి చుడదామా అంటే, నా ఆహారాన్ని నేను వెతుక్కోవడం పాపమెట్లా అవుతుందని అడిగింది. ఏమీ పాలుపోని యమదూతలు తిరిగి యమధర్మరాజు దగ్గరకే పోయి ఆ సంగతంతా చెప్పారు.

ఆయనకి కూడా ఒక క్షణం ఏమీ పాలుపోలేదు.

‘సరే, ఇంతకీ ఆ ఇంటిపక్కల ఇరుగూ పొరుగూ ఏమనుకుంటున్నారు?’ అని అడిగాడాయన.

‘వాళ్ళా, అంతా తలకో మాటా మాట్లాడుకుంటున్నారు’ అన్నారు యమదూతలు.

‘ఆహా, ఈ పాపమంతా వాళ్ళ ఖాతాలో రాయండి’ అన్నాడు యమధర్మరాజు.

నేనా రోజు ఆ అర్థశాస్త్రవేత్తలకి ఆ కథంతా చెప్పి ‘ ఈ దేశంలో బీదరికం ఎవరి పాపం అని అడుగుతున్నారు కదూ. ఈ ఘోరాన్ని చూస్తూ తలకొక మాటా మాట్లాడుతున్న మీదే ఈ పాపమంతానూ’ అన్నాను.

12

మీరు విద్య గురించి ఏదన్నా చెప్పమన్నారు. చదువు అంటే ఏమిటి?

ఒకప్పుడు మన దేశంలో పాఠశాలలు ఉండేవి కావు. ప్రతి ఒక్కడూ గురువే. ప్రతి తండ్రీ గురువే. సమాజం మొత్తం పిల్లవాడికి విద్యనేర్పేది. అది కూడా ఎట్లాంటి విద్య! ఒళ్ళొంచి పనిచేసే విద్య. ఇప్పట్లాగా కాదు. నలుగురికీ పనికొచ్చే విద్య.

మీ క్లాస్ రూముల్లో మీరేం చేస్తున్నారు? ఎదిగే వయసులో వున్న కుర్రగాళ్ళని తీసుకెళ్ళి పొద్దస్తమానం నాలుగు గదుల మధ్యా కూర్చోబెడుతున్నారు. ఆ ఎముకలు వికసిస్తాయా? ఆ నరాలు సాగుతాయా? ఆ కండరాలు బలపడతాయా? స్కూలునుంచి బయటపడేటప్పటికి ఆ పోరగాళ్ళు ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు. వాళ్ళ వల్ల ఒక రైతుకి గాని, ఒక కుమ్మరికిగాని, ఒక కమ్మరికిగాని, ఒక వడ్రంగికిగాని, ఒక సాలెమనిషికిగాని, అవుసలాయనికి గానీ ఏదన్నా మేలు జరుగుతుందా? అసలు ఆ చదువు చదివినందువల్ల ఆ గ్రామంలో ఏదన్నా కొత్త వికాసం సాధ్యపడుతుందా?

నేనొకప్పుడు ఒక జైన యువకుడు సన్న్యాసం స్వీకరించే క్రతువు చూడటానికి వెళ్ళాను. అది చాలా ఆసక్తికరంగా ఉండింది. అక్కడ తక్కిన తంతంతా పూర్తయ్యాక సన్న్యాసం స్వీకరించబోతున్న ఆ యువకుడు తమ కుటుంబం మీద ఆధారపడ్డ వాళ్ళందరి దగ్గరికీ వెళ్ళి మొక్కాడు.

‘ఈరోజునుంచీ నేను మీకు ఏ విధంగానూ ఉపకరించను. నా వల్ల ఒక నేతపనివాడికి అదనంగా పనిదొరకదు. కంసాలికి, వడ్రంగికి, చాకలికి, రైతుకి ఎవ్వరికీ పనిదొరకదు. ఇందుకు నన్ను మీరు మన్నించండి. మీ అందరిమీదా ఆధారపడుతూ, మీ అందరికోసం బతకవలసిన నేను నా ముక్తిని వెతుక్కుంటూ సన్న్యాసినవుతున్నాను. నన్ను క్షమించండి’ అన్నాడు.

బహుశా ఈ మాట ఇప్పుడు మనం బళ్ళో వేసే ప్రతి పోరగాడితోటీ చెప్పించవలసిఉంటుంది. బళ్ళో చేరబోతున్న ప్రతి పిల్లవాడూ ఊళ్ళో ప్రతి ఒక్క ఇంటికీ వెళ్ళి క్షమాపణ అడగాలి.

‘నన్ను క్షమించండి. ఈ రోజునుంచీ నేనీ గ్రామానికి ఏ విధంగానూ పనికిరాను. పొలం దున్నను. గుడ్డనెయ్యను. ఇల్లు ఊడ్చను. కలుపు తియ్యను. సామాజికంగా మీకేవిధంగానూ సహకరించకుండా నా దారి నేను చూసుకోవడానికి పోతున్నాను’ అని చెప్పించవలసి ఉంటుంది.

2-3-2015

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: