గారపెంట ఆశ్రమపాఠశాల

20

గారపెంట ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలో ఒక మారుమూల చెంచుగూడెం. సుమారు ఇరవయ్యేళ్ళ కిందట మొదటిసారి ఆ వూరువెళ్ళాను. పుల్లలచెరువునుంచి అడవిబాటన అక్కడికి ఒక రోడ్డు వేయించాము. అక్కడొక ఆశ్రమపాఠశాల ఉంది. నల్లమల ప్రాంతంలో చదువుకుని పైకి వచ్చిన చెంచుయువతీ యువకులు ఆ ఊళ్ళోనే ఎక్కువ మంది కనిపించారు నాకు. కాని ఆ ఆశ్రమపాఠశాలకి అప్పట్లో నేను చేయగలిగింది చాలా స్వల్పమే. ఆ తరువాత రోజుల్లో ఆ పాఠశాల హైస్కూలు స్థాయికి ఎదగడం వెనక దూరంనుంచైనా నా శుభాకాంక్షలు కూడా ఉన్నాయి.

‘మా స్కూల్లో సరస్వతీ దేవిని ప్రతిష్టిస్తున్నాం, మీరు వచ్చి విగ్రహావిష్కరణ చెయ్యాలి’ అని మూగెన్న, అంకన్న, గురవయ్య నన్ను ఏడెనిమిది నెలలకిందట ఒకసారి అడిగినప్పుడు నాకు అంత అర్హత లేదనిపించింది. ఏదో ఒక సాకుతో ఆ కార్యక్రమం వాయిదా వేస్తూ వచ్చాను. చివరికి వారి ప్రేమని నిలవరించలేక, మొన్న శుక్రవారం గారపెంట వెళ్ళక తప్పింది కాదు.

మాచర్ల-వెల్దుర్తి-యెర్రగొండపాలెం దారి ఏ జన్మలోనో నా పేగుకి ముడిపడిపోయింది. ఆ అడవిబాట, ఆ తుమ్మడొంకలు, ఆ రేగుపొదలు, ఎడారి ఇసుకలాగా రేగే ఎర్రదుమ్ము, ఒక్క నీటిచుక్క కూడా దొరకని పాషాణభూమి- ఆ దారమ్మట పోయినప్పుడల్లా నా హృదయం కరిగిపోతుంది. ఎన్ని రోజులు,రాత్రులు, ఎండల్లో, చలిలో, వానల్లో ఆ దారిన ఎన్నిసార్లు ప్రయాణించానో. తక్కిన ప్రపంచానికి అక్కర్లేని ఆ విస్మృత ప్రపంచానికి ఏదో ఒకటి చెయ్యాలని ఎంతగా తపించానో, ఎంత పోరాటం చేసానో.

ఇప్పుడు మళ్ళా పొద్దున్నే మంచుతెరలమధ్య మాచర్లనుంచి ఆ దారిన ప్రయాణిస్తుంటే, ఇన్నేళ్ళుగా అట్టకట్టినపోయిన గుండె వదులుకావడానికి చాలాసేపే పట్టింది.

గారపెంట పొలిమేరల్లో అడుగుపెట్టగానే, పాఠశాల ఇంకా కనుచూపు మేర ఉందనగానే, ఆ మనుషులు, పిల్లలు పూలతో, నాట్యాలతో, వాద్యాలతో నాకు స్వాగతం పలికారు. నా రాక కోసం ఇంతగా ఎదురు చూసేవాళ్ళు మరెవరైనా ఉన్నారా? వాళ్ళకేమీ కాని నేను, వాళ్ళకేమీ ఇవ్వలేని నేను, వాళ్ళను ఏళ్ళ తరబడి చూడకుండానే జీవితం సాగిస్తున్న నేను- నా కోసం ఆ చలిలో చామంతి పూలు నింపుకున్న దోసిళ్ళతో వేచిఉన్న ఆ మనుషులు నన్ను సిగ్గుపడేలా చేసారు, గర్వపడేలా చేసారు, సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేలా చేసారు.

దాదాపుగా ప్రకాశం జిల్లా చెంచుగూడేల నాయకులు, ఉపాధ్యాయులు, నా పాతమిత్రులు అంతా చేరుకున్నారక్కడికి. ఆ తర్వాత ఆరేడుగంటలపాటు అదొక పండగ, వేడుక. వాళ్ళు నన్ను చూసి, నేను వాళ్ళని చూసి పులకిస్తూనే ఉన్నాం.

ఆశ్రమపాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉడతల బయన్న నేను అక్కడ పనిచేసిన రోజుల్లో అప్పుడప్పుడే హైస్కూలు చదువు పూర్తిచేసుకున్న విద్యార్థి. అతణ్ణీ, అట్లాంటివాళ్ళే మరికొందరినీ అక్కడ ఉపాధాయులుగా నియమించాం. ఆ తొలితరం ఉపాధ్యాయులు ఇప్పుడక్కడ ఒక సామాజిక శక్తిగా, చైతన్యంగా మారేరు.

బయన్నని చూస్తే చాలా అశ్చర్యం వేసింది. అతడిలో పూర్వకాలపు చెంచు పెద్ద మనుషుల మర్యాద, హుందాతనం ఉట్టిపడుతున్నాయి. అతడు ఆ విగ్రహావిష్కరణ, సభానిర్వహణ ఎంతో హుందాగా నిర్వహించాడు. ఊళ్ళో ఉన్న ప్రతి పెద్దనీ, ప్రతి తల్లినీ, ప్రతి ఉపాధ్యాయుణ్ణీ పేరు పేరునా పిలిచి ఆ ఉత్సవంలో భాగస్వాముల్ని చేసాడు. ఇంకా ఆరాధనీయమైన విషయం-తన పాఠశాల సిబ్బందినీ, తన కుటుంబాన్నీ అందరికన్నా చివర పిలిచాడు.

వాళ్ళంతా ఆ రోజు నా మీద పూలవాన ప్రేమవాన కురిపించారు. పూలదండల్తో నన్ను ముంచెత్తారు. నిజంగానే అదొక అనుభవం. బహుశా నా నిద్రనుంచి నన్ను మేల్కొల్పడం కోసం భగవంతుడు విసిరిన పూలబాణం, ప్రేమపాశం.

1-2-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: