కొత్త అనుభవం

Reading Time: 2 minutes

 

325

జీవితంలో గొప్ప కళల్లోనూ, గొప్పనైపుణ్యాల్లోనూ, ముఖ్యమైన సందర్భాల్లోనూ, మనం పాటించే రెండు విలువలు, measurement, judgment అన్నిటికన్నా ముందు వంట వండటంలో చాలా అవసరమని గ్రహించేను. సాధారణ జీవితంలో చాలా సాధారణంగా జరిగిపోయే పనులని భావించే వంటలోనూ, డ్రైవింగ్ లోనూ, ఈ రెండు నైపుణ్యాలూ దాదాపుగా విలువలస్థాయికి చేరుకున్నాయని కూడా అర్థమయింది.

లాక్షణికుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్షేమేంద్రుడు మాట్లాడిన ఔచిత్యం-మహాకవులుగా కీర్తింపబడ్డవాళ్ళు కూడా సాధించలేకపోయిన విలువ- మన ఇళ్ళల్లో గృహిణులకి తమ రోజువారీ జీవితంలో చాలా సునాయాసమైన సాధన అని కూడా తెలుసుకున్నాను.

విజయవాడ రాగానే నా జీవితం నాకిచ్చిన గొప్ప మెలకువ ఇది. ఇక్కడికి రాగానే ఏవేవో చెయ్యాలనుకున్న నాకు, అన్నిటికన్నా ముందు నా వంట నేను వండుకోవడమనే కొత్త అనుభవం ఎదురయింది, ఆ అనుభవం నాకు ఊహించని సంతోషాన్ని కలిగించింది. బహుశా, ఇప్పటి భాషలో చెప్పాలంటే, సాధికారికత ను కలిగించిందని చెప్పాలి.

రూమీ అనుకుంటాను, ఒక మాటన్నాడు: ‘నీకు ఏ అనుభవం ఎదురయినా, దాన్ని స్వాగతించు, ప్రతి అనుభవమూ నీ ఇంట్లో అడుగుపెట్టే అతిథి లాంటిదే’ అని.

ఉద్యోగజీవితం దాదాపుగా పూర్తి కావొస్తున్న సమయంలో, అకస్మాత్తుగా సంభవించిన ఈ మార్పువల్ల, మళ్ళా కొత్త చోట, కొత్తగా జీవితం మొదలుపెట్టడం, కష్టమనే అనిపించింది.ఎప్పుడో, పందొమ్మిదేళ్ళ వయసులో రాజమండ్రిలో మొదటిసారి ఉద్యోగంలో చేరినప్పుడో, లేదా ఈ ఉద్యోగంలో చేరినప్పుడు ముఫ్ఫై ఏళ్ళ కిందట, పార్వతీపురంలోనో, జీవితాన్ని ఒంటరిగానూ, కొత్తగానూ మొదలు పెట్టడానికున్న ఉత్సాహం, ఓపిక ఇప్పుడు ఉండటాయనుకోలేను. కాలం విలువ తెలిసిన తర్వాత, ప్రతి రోజూ, ప్రతి గంటా విలువైదే అని తెలుసుకున్నాక, వంట వండుకోవడంలోనూ, గిన్నెలు కడుక్కోవడంలోనూ కాలం వ్యయపరచలేను కదా అనుకున్నాను.

కాని నెల్లాళ్ళుగా నా వంట నేనే వండుకుంటున్నాక, ఇప్పుడు నాకు లభించే ప్రతి తీరిక క్షణమూ, ఇంతకుముందు లభించిన తీరిక గంటల కన్నా ఎంతో విలువైనదని తెలుసుకుంటున్నాను.

ఈ నడివయసులో జీవితం నాకు నేర్పిన చాలా విలువైన పాఠమిది.

ఒకప్పుడు సుదర్శనంగారితో మాట్లాడుతూ, ‘రజ్జు సర్ప భ్రాంతి’ గురించి అడిగాను. అది సర్పం కాదు, రజ్జువే అని తెలుసుకోవాలని కదా అంటున్నారు, అటువంటిదానికి, ఆ భ్రాంతిపడటం ఎందుకు? ఆ భ్రమానుభవానికి ఏదైనా ప్రయోజనముండాలి కదా అనడిగాను.

అందుకాయన చెప్పిన మాటలు జీవితాంతం గుర్తుంటాయి నాకు.

‘అవును, నిజమే,అది సర్పం కాదు, రజ్జువే, కాని సర్పం అనుకోకపోతే,కదలిక ఉండదు, నువ్వు కుర్చీలో కూచున్నావనుకో, భయంతో కనీసం కాళ్ళన్నా పైకి లాక్కుంటావు. ఆ భ్రాంతి, ఆ భయమే లేకపోతే, జీవితంలో కనీసపు కదలిక కూడా ఉండదు’ అన్నారాయన.

మన జీవితాల్లో సంభవించే ప్రతి కొత్త అనుభవమూ, మనం లోనయ్యే ప్రతి ఆకాంక్షా, మనల్ని ఆకట్టుకునే ప్రతి వ్యామోహమూ అంతిమంగా మనల్ని ఎక్కడికి చేర్చినా, అన్నిటికన్నా ముందు అవి మన జీవితంలో ఒక కొత్త కదలిక ను తీసుకువస్తాయి. ఆ కదలికను స్వాగతించాలి. ప్రతి ఒక్క భ్రాంతి చివరికి జ్ఞానంలోనే పర్యవసిస్తుంది.

ఉద్యోగపరంగా నా జీవితంలో వచ్చిన ఈ కదలిక వెనక నా ప్రమేయం లేకపోయినా, నా అంతరాంతరాల్లో ఏదైనా ఒక భ్రాంతి ఉండిఉండవచ్చు. అది ఏమై ఉండవచ్చునో నేను చెప్పలేను.

కాని నా కదలిక నాకు చాలా తొందరగా నేర్పిన పాఠం మాత్రం చాలా విలువైనదే.

అన్నిటికన్నా ముందు, గత పాతికేళ్ళుగా, ఒక డాక్టరును ఒక వంటమనిషిగా మార్చానన్న అపరాధభావం నుంచి ఏ కొంతనో బయటపడగలిగాను. ఒక జెన్ సాధువు అన్నాడట: ఒక సాధువుకి ఒక పూట విశ్రాంతి దొరికిందంటే అర్థం, ఒక గృహిణికి అదనంగా మరొక పూట పని పెరిగిందని. ఈ వాక్యం చదివిన తర్వాత (బహుశా ఇరవయ్యేళ్ళయి ఉంటుంది) నేను ఎవరింటికైనా అతిథిగా పోవడం మానుకున్నాను. కాని ఇక్కడికి వచ్చాక, నాకు అర్థమయిందేమంటే, నా తీరికసమయపు వ్యాపకాలవల్ల ముందు నేను నా గృహిణికే పనిభారం పెంచానని. నేను కవితలు రాస్తూ, బొమ్మలేసుకుంటూ గడపడానికి, నా ఇల్లాలికి మరిన్ని అదనపు పనిగంటల భారాన్ని మోపానని.

ఇంతా చేసి, నేను వంట వండుకోవడం మొదలుపెట్టగానే, ఒక స్త్రీకి సమానం కాగలిగానని అనుకుంటే అది పొరపాటే, నేను నా కోసం వండుకుంటున్నాను. ఒక తల్లి పిల్లలకోసం వంట చేస్తుంది, భార్య భర్తకోసం వంట చేస్తుంది, ఒక గృహిణి వండి వడ్డించి అతిథి తృప్తిగా తేన్చేదాకా ఓపిగ్గా నిలుచుంటుంది. నా చిన్నతనంలో, ఎన్నో రాత్రులు, మేమంతా అన్నాలు తినేసాక, మా అమ్మ ఏమీ తినకపోవడం నాకు గుర్తొస్తూంది. ఏమమ్మా, నువ్వు తినడం లేదంటే, ఈ రోజు సోమవారమనేది, మరో రోజు లక్ష్మివారమనేది. నేనది నిజమనే అనుకునేవాణ్ణి. ఇప్పుడు తెలుస్తోంది ఆ సోమవారాలకీ, లక్ష్మివారాలకీ అర్థమేమిటో.

ఒక పురుషుడు పరిపూర్ణుడయితే అతణ్ణి బుద్ధుడనీ, యేసు అనీ, గాంధీ అని అంటాం. కాని వాళ్ళంతా కూడా అత్యంత సాధారణమైన అత్యంత సాధారణ గృహిణి కన్నా కూడా ఒక మెట్టు దిగువలోనే ఉంటారని ఇప్పుడు తెలుసుకున్నాను.

2-8-2016

Leave a Reply

%d bloggers like this: