కాలామ సుత్త

9

రాత్రి విజ్జీ నేనూ కూచుని బుద్ధుడి సంభాషణల్లోంచి ‘కాలామ సుత్త’ అనువాదం చేస్తూ ఉన్నామేమో రాత్రంతా నిద్రలో కూడా ఆ మాటలే నా అంతశ్చేతనలో కదలాడుతూ ఉన్నాయి.

కాలామసుత్త ని ‘కేశముత్తియ సుత్త’ అని కూడా అంటారు. అది అంగుత్తరనికాయంలో ఉన్న ఒక సంభాషణ. విద్యగురించీ, తెలుసుకోవడం గురించీ, ముఖ్యంగా ఇతరులు చెప్పారన్నదాన్నిబట్టికాక, మనిషి తనకై తాను తెలుసుకోవలసిన అవసరం గురించీ మాట్లాడిన సంభాషణ అది.

బుద్ధుడి జీవితాన్నీ, సంభాషణల్నీ పొదిగి ‘బుద్ధ చర్య’ రాసిన మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ కూడా బుద్ధుడి ధార్మిక భావాలు తెలుసుకోవాలనుకుంటే, ‘కాలామసుత్త’, ‘సామగామ సుత్త’ చదవాలన్నాడు.

ఒకప్పుడు బుద్ధుడు కోసలరాజ్యంలో సంచరిస్తూ కేశపుత్తమనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ కాలాములనేవాళ్ళు ఆయన్ను కలిసి ఒక మాట అడిగారు. ‘భగవన్, మా పట్టణానికి ఎందరో శ్రమణులూ, బ్రాహ్మణులూ వస్తూంటారు. వాళ్ళ వాళ్ళ వాదాలు ప్రవచిస్తూ, ఎదటివాళ్ళు చెప్పేదాన్ని నిందిస్తారు, తిరస్కరిస్తారు, చీల్చి చెండాడతారు. ఆ ఇద్దరిలోనూ ఎవరు చెప్తున్నది సత్యం, ఎవరు చెప్తున్నది అసత్యం?’ అని.

ఆ ప్రశ్నకు జవాబుగా బుద్ధుడు ఎంతో ప్రేమతోనూ, నేర్పుతోనూ చెప్పిన సమాధానమే కాలామసుత్త. ఆ సుత్తని మొత్తం చదవాలనుకున్నవాళ్ళు ఆన్ లైన్ లో చూడవచ్చు. కాని బుద్ధుడు వాళ్ళకు చెప్పిన అద్భుతమైన ఈ మాటల్ని మాత్రం ఇక్కడ పేర్కోకుండా ఉండలేకపోతున్నాను.

ఆయన వాళ్ళతో అన్నాడు కదా: ‘చూడండి, పదే పదే వింటూవస్తున్నందువల్ల దేన్నీ గుడ్డిగా అనుసరించకండి. సంప్రదాయం చెప్పిందనిగాని, అందరూ నమ్ముతున్నారనిగానీ, శాస్త్రాలు చెప్తున్నాయనిగాని, ఏవో కొన్ని నీతిసూత్రాల్నిబట్టిగాని, లేదా తార్కికంగా వివేచించుకున్నామనిగాని, లేదా ఏదో ఒక ధోరణి నడుస్తోందనిగానీ, లేదా చెప్తున్నవాడు బాగా చెప్తున్నట్టే కనిపిస్తున్నాడనిగానీ, లేదా ఈ శ్రమణుడు మన గురువుకదా అన్న మొహమాటంతోగాని, దేన్నీ నమ్మకండి, అనుసరించకండి. మీకై మీరు ఏ విషయాలైతే కుశలాలనీ, ఏవైతే నిందించబడేవి కావనీ, వేటిని పెద్దవాళ్ళు ప్రశంసించారనీ, ఏ విషయాల్ని పాటిస్తే, అనుసరిస్తే మీకు హితం, సంతోషం చేకూరుతాయనీ మీకై మీరు స్వానుభవంతో తెలుసుకుంటారో వాటిని మాత్రమే నమ్మండి, అనుష్ఠించండి’ అని.

2500 ఏళ్ళ తరువాత కృష్ణమూర్తి ఈ మాటలే మాట్లాడేడు. స్వానుభవంమీద నిర్ణయించుకున్న సత్యాన్నే అనుష్టించడం గురించి ఆయన పదేపదే చెప్తూ వచ్చాడు.

అటువంటి మనిషికి మటుకే బుద్ధుడు చెప్పినట్టుగా మనుషులపట్ల మైత్రి, కరుణ, సంతోషం, సమదృష్టి అనే నాలుగు ఆశ్రయాలూ దొరుకుతాయి. అతడికి మాత్రమే జీవితాన్నీ, మృత్యువునీ దాటిన నాలుగు సాంత్వనలూ చిక్కుతాయి.

26-1-2015

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: