కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్

25

కోణార్క సూర్యదేవాలయం ఫొటోలు చూసి మిత్రులు కోణార్క గురించి రాయమని అడిగారు. ముప్పై ఏళ్ళ కిందట మాయాధర్ మానసింగ్ రాసిన ‘కోణార్క’ కవిత చదివినప్పణ్ణుంచీ కోణార్క చూడాలన్న కోరిక రెండేళ్ళ కిందట తీరింది. కాని ఇప్పుడు నేను ఆ కోణార్క గురించి కాక, భువనేశ్వర్ లోని మరొక కోణార్క ని పరిచయం చేయబోతున్నాను.

2

అచ్యుత సమంత 1965 లో కటక్ జిల్లాలో ఒక కుగ్రామంలో జన్మించాడు. ఆయన నాలుగేళ్ళ వయసులోనే తండ్రి ఒక రైలు ప్రమాదంలోమరణించాడు. తండ్రి చిన్న ఉద్యోగి కావడం వల్లా, ఎటువంటి ఆస్తిపాస్తులు లేనందువల్లా ఆ కుటుంబం దుర్భరమైన దారిద్ర్యాన్ని చవిచూడవలసి వచ్చింది. తన తల్లినీ, ఏడుగురు తోబుట్టువుల్నీ పోషించుకోవడానికి సామంత చెయ్యని పనిలేదు. రకరకాల కూలిపనులు చేసుకుంటూనే ఉత్కళ్ విశ్వవిద్యాలయం నుంచి రసాయనశాస్త్రంలో ఎమ్మెస్సీ పూర్తిచేసాడు. మొదట్లో కొన్నాళ్ళు లెక్చెరర్ గా పని చేసాడు.

1992-93 లో 5000 రూపాయల్తో ఒక చిన్న ఇంజనీరింగ్ ఇన్ స్టిట్యూట్ తెరిచాడు. దానికి కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజి అని పేరుపెట్టాడు. ఆ రోజుల్లో, ఒరిస్సాలో మారుమూలప్రాంతాలనుంచి భువనేశ్వర్ వలస వచ్చి మురికివాడల్లో నివసిస్తున్న గిరిజనకుటుంబాల మీద ఆయన దృష్టి పడింది. ఆ మురికివాడల్లో పిల్లలు కూడా తనలానే దయనీయమైన పేదరికం లో గడపడం ఆయన్ని కలచివేసింది. తనలాగే వాళ్ళు కూడా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కోసం ఒక స్కూలు తెరిచాడు. అప్పట్లో ప్రసిద్ధ సాంఘికసేవకుడు బాలు అనే ఆయన్ని అధ్యక్షుడుగా ఉండమని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (కిస్) ని 93-94 లో స్థాపించాడు. తాను అవివాహితుడిగా ఉండిపోయి తన జీవితాన్ని ఆ రెండు విద్యాసంస్థల అభ్యున్నతికే అంకితం చేసేసాడు.

25 సంవత్సరాలు గడిచేయి.

2017.

ఇప్పుడు కళింగ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజి (కిట్)ఒక డీమ్డ్ యూనివెర్సిటీ సుమారు 300 ఎకరాల కాంపస్ లో ఇంజనీరింగ్, లా, మెడిసిన్, మానేజిమెంట్, బయో టెక్నాలజి, పోలిటెక్నిక్, డెంటల్, కంప్యూటర్ అప్లికేషన్లతో పాటు రూరల్ మానేజిమెంట్ కళాశాలలు పనిచేస్తున్నాయి.వాటన్నిటిలోనూ సుమారు 25000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వాళ్ళల్లో ఇంగ్లాండ్, జర్మనీ, ఇటలీ, యుఎస్ లనుంచి మాత్రమే కాక ఆఫ్రికాదేశాల విద్యార్థులు కూడా ఉన్నారు.

92-93 నుంచీ కూడా కిట్ తన ఆదాయంలో 7 శాతం నిధుల్ని కిస్ కోసం వ్యయపరుస్తూ ఉంది. దాంతో కిట్ ఎంత శరవేగంతో అభివృద్ధి చెందిందో అంతే అనూహ్యమైన స్థాయిలో కిస్ కూడా క్షణక్షణాభివృద్ధి చెందింది. ఇప్పుడు ఆ పాఠశాల 80 ఎకరాల కాంపస్ లో 25000 మంది గిరిజన విద్యార్థులకి సర్వతోముఖాభివృద్ధికోసం పనిచేస్తూ ఉంది. ఆ విద్యార్థుల్లో 13000 మంది 10 వ తరగతి దాకానూ, 12000 మంది కిట్ తాలూకు వివిధ కళాశాలల్లో వివిధ రకాల పోస్ట్ మెట్రిక్ కోర్సుల్లోనూ చదువుకుంటున్నారు.

25000 మంది విద్యార్థులు, అది కూడా నిరుపేద గిరిజన విద్యార్థులకి ఒకే ప్రాంగణంలో ఉచిత నివాస భోజన విద్యాసదుపాయం కల్పిస్తున్న సంస్థ ప్రపంచంలోనే మరెక్కడా లేదు. గిరిజనుల సంగతి అలా ఉంచి తక్కిన విద్యార్థుల కోసం కూడా ఆ స్థాయిలో నడుస్తున్న పాఠశాల భారతదేశంలో ప్రభుత్వం ఆధ్వర్యంలోగాని, ప్రభుత్వేతర సంస్థల ఆధ్వర్యంలో గాని మరొకటి లేదు.

కిట్ , కిస్ లకు వ్యవస్థాపకుడిగానూ, కార్యదర్శిగానూ రెండు దశాబ్దాల మేరకు పనిచేసిన తరువాత ఇప్పుడు అచ్యుతసమంత అన్ని రకాల ఆధికారిక బాధ్యతలనుంచీ పక్కకు తప్పుకున్నారు. కిట్ కు ప్రత్యేకంగా వైస్ ఛాన్సెలర్, కిస్ కు ఒక సి.ఇ.ఓ ఉన్నారు. ఆ రెండు సంస్థల్నీ పర్యవేక్షించే సంస్థకు శ్రీమతి శాశ్వతి బాలు అధ్యక్షులుగాను, ఒక రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ అధికారి కార్యదర్శిగానూ ఉన్నారు. కాని సమంత ఆ విద్యాసంస్థల దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా, అనుక్షణ స్ఫూర్తిప్రదాతగా కొనసాగుతూనే ఉన్నారు.

3

రెండేళ్ళుగా వింటున్న ఈ సంస్థని పోయిన గురువారం స్వయంగా పోయి చూడగలిగాను. గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, గురుకులపాఠశాలలు నిర్వహించడం, పర్యవేక్షించడమే వృత్తిగా గడిపిన నాకు, 25000 మంది విద్యార్థుల్తో ఒక పాఠశాల నడుస్తోందని విన్నప్పుడు, ఆ ఆలోచనే ఎంతో wild గానూ, crazy గానూ అనిపించింది. అటువంటి పాఠశాలల్ని ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏర్పాటు చెయ్యగలమేమో చూడమని ముఖ్యమంత్రి గత రెండేళ్ళుగా గిరిజన సంక్షేమ శాఖకి చెప్తూనే ఉన్నారు.

చూస్తే తప్ప నమ్మలేం అనడానికి ఆ పాఠశాలనే ఉదాహరణ.

మేం ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే పిల్లలు మాకు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. లోపలకి అడుగుపెడుతూనే ఆ ప్రాంగణంలో దేశభక్తుల విగ్రహాలు కనిపించాయి. ‘ఉత్కళమణి’ గోపబంధు దాస్ విగ్రహానికి పూలమాల వెయ్యకుండా ఉండలేకపోయాను. వివిధ రకాల స్పోర్ట్స్ లో ప్రతిభ చూపించిన విద్యార్థులు వాళ్ళ పతకాలతో మా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళని పేరుపేరునా అభినందించాక, మమ్మల్ని సమావేశ మందిరానికి తీసుకువెళ్ళారు. అక్కడ పదివేలమందికి పైగా బాలబాలికలు సమావేశమయ్యారు. అందరు గిరిజనబాలబాలికల్ని అట్లా ఒక్కచోట నేనింతదాకా కలుసుకోలేదు. ఒరిస్సాలో ఉన్న 34 జిల్లాల్లోనూ 20 జిల్లాలు గిరిజన జిల్లాలు. 62 తెగలకు చెందిన గిరిజన జనాభా రాష్ట్ర జనాభాలో 24 శాతం ఉంది (ఆంధ్రప్రదేశ్ లో 5 శాతం మాత్రమే). ఆ తెగలన్నిటికీ చెందిన పిల్లలున్నారక్కడ. వాళ్ళ ముందు నిలబడి మాట్లాడటానికి మైకు చేతిలోకి తీసుకోగానే నా వళ్ళంతా ఒక విద్యుదావేశానికి లోనయ్యింది. నాకు గోపీనాథ మొహంతి గుర్తొచ్చాడు. గిడుగు రామ్మూర్తిగారు గుర్తొచ్చారు. మీకు గోపీనాథ మొహంతి తెలుసా అని అడిగాను పిల్లల్ని. తెలుసన్నాయి పదివేల కంఠాలు ఒక్కసారిగా.

ఇక అప్పణ్ణుంచి రాత్రి ఎనిమిదింటిదాకా ఆ పాఠశాలలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చూస్తూ, ఆశ్చర్యపోతూ, ఆనందానికి లోనవుతూ గడిపాం. అక్కడ వంటశాలలో అన్నం, పప్పు సౌరవిద్యుత్ తో నడిచే స్టీం కుకింగ్ మీద వండుతున్నారు. రెండు ఆర్వో ప్లాంట్స్ ఉన్నాయి. వడ్డన పిల్లలే స్వయంగా చేసుకుంటున్నారు. పిల్లల మాసిన గుడ్డలు ఉతకడానికి అత్యాధునికమైన వాషింగ్ మెషీన్లు, డ్రయ్యర్లు ఉన్నాయి. ఈ సౌకర్యం ప్రభుత్వ పాఠశాలల్లో ఊహించడానికి కూడా లేదు. అత్యాధునికమైన కుట్టుమిషన్లు, కట్టర్లు, చలువచేసే పరికరాల సముదాయం ఉంది. పిల్లలు తమ యూనిఫాం తామే కుట్టుకుంటున్నారు. మరొక వైపు పచ్చళ్ళు తయారుచేసే యూనిట్ ఉంది. గిన్నెలు తోముకోడానికీ, బాత్ రూములు శుభ్రపరుచుకోడానికీ అవసరమైన ఫినాయిలు, డిష్ క్లీనింగ్ పౌడరు కూడా పిల్లలే స్వయంగా తయారు చేసుకుంటున్నారు. ఇవి కాక గిరిజన శైలి చిత్రకళ, హస్తకళలతో చిత్రలేఖనాలు, దుస్తులు, బొమ్మలు తయారు చేసే విభాగాలు ప్రత్యేకంగా ఉన్నాయి. వాటిమీద ఏటా కోటిరూపాయలదాకా ఆదాయం సమకూరుతున్నది.

ఆటలకీ, క్రీడలకీ అత్యాధునికమైన ఆటస్థలం, సదుపాయాలతో పాటు ఒక జూడో శిక్షణా విభాగం కూడా ఉంది. ఆ పిల్లల్ని రానున్న రోజుల్లో ఒలింపిక్స్ కి పంపే ప్రయత్నాలు మొదలయ్యాయి. బాలురకి, బాలికలకీ వేరువేరుగా నివాసగృహాలున్నాయి. వాళ్ళకి టు-టైరు మంచాలు, పరుపులు, దుప్పట్లు సమకూర్చారు. మొత్తం పాఠశాలకీ, హాస్టలుకీ అన్నిటికీ కలిపి 1087 మంది బోధన, బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు.

ఆ కార్యక్రమాలన్నింటిలోనూ మూడింటి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మొదటిది,ఆ పిల్లలకోసం 24 x 7 ప్రాతిపదికన ఒక 200 పడకల ఆసుపత్రి ఒకటి పాఠశాల ప్రాంగణంలోనే నడుస్తున్నది. తమ పిల్లల్లో డ్రాప్ ఔట్ నూటికి ఒకటి కన్నా తక్కువ ఉండటానికి తాము అందిస్తున్న వైద్యసదుపాయం కూడా ఒక ముఖ్యకారణమని ఆ నిర్వాహకులు మాతో చెప్పారు. రెండవది, UNFPA సహకారంతో ఆ పాఠశాలలో అమలు జరుగుతున్న జీవననైపుణ్యాల శిక్షణ. రిప్రొడక్టివ్ సెక్సువల్ హెల్త్ శిక్షణ కూడా. ఆ కార్యక్రమం కింద చక్కటి కౌన్సిలింగ్ సువ్యవస్థితంగా పనిచేస్తున్నది. పిల్లలు ఏడాది పొడుగునా తల్లిదండ్రులకి దూరంగా ఉన్నప్పటికీ, సంతోషంగా ఉండటానికి ఆ కౌన్సిలింగ్ చాలావరకూ కారణమని చెప్పాలి. ఇక మూడవది, పిల్లలు మొదటితరగతిలో చేరినప్పుడు, వాళ్ళ మాతృభాష నుంచి ఒరియాలోకీ, ఇంగ్లీషులోకీ ప్రయాణం సజావుగా జరగడంకోసం గిరిజన భాషల్లో అమలు జరుగుతున్న విద్యాబోధన. 62 తెగలకు చెందిన పిల్లలూ తమ పాఠశాలలో ఉన్నారనీ వాళ్ళు 18 గిరిజన భాషల్లో మాట్లాడతారనీ, వాళ్ళకి అనువైన పాఠ్యప్రణాళికలు రూపొందించడం తమకి ఒక సవాలు అనీ ఆ నిర్వాహకులు చెప్పారు. కాని వాళ్ళిప్పటిదాకా రూపొందించిన, రూపొందిస్తున్న సామగ్రిని సవివరంగా చూశేము. ఆ పాఠ్యసామగ్రి అత్యున్నతస్థాయి బోధనాసామగ్రి అని చెప్పడానికి నాకేమీ సంకోచం లేదు.

ఇలా ఆ పాఠశాల గురించి ఎంతైనా చెప్పవచ్చు. కాని ఈ మధ్యనే 52 వ ఏట అడుగుపెట్టిన అచ్యుత సమంత ఇంత స్వల్పకాలంలోనే ప్రభుత్వాలు కూడా చెయ్యలేని, ఊహించలేని మహత్తరమైన ఒక విద్యాసంస్థని నెలకొల్పి తక్కిన ప్రపంచానికి ఉదాహరణగా చూపిస్తున్నాడు. అబ్దుల్ కలాం, ఐక్యరాజ్యసమితి ప్రతినిధులనుంచి రాజకీయ నాయకులు, సినిమాతారలదాకా ఆ పాఠశాల ఇప్పుడొక తీర్థస్థలి. నోబెల్ పురస్కారస్వీకర్తలు అధికసంఖ్యలో (పదిమందికి పైనే) సందర్శించిన పాఠశాల కూడా దేశంలో అదొక్కటే.

ఒక మానవుడు తోటిమనుషుల పట్ల చెప్పలేనంత ప్రేమతో వారి జీవితాల్లో వెలుగుతీసుకురావడానికి కట్టిన ఆధునిక కోణార్క ఆ పాఠశాల.

11-4-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d