కలాం ఎఫెక్టు

19

కలాం ఆత్మకథను నేను అనువదించిన కొత్తలో, ఒక ప్రసిద్ధ విప్లవ రచయిత నాతో ఆ పుస్తకం గురించి మాట్లాడుతూ ‘కలాం ప్రొడక్షన్ గురించి మాట్లాడినట్టుగా డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడలేదు కదా’ అన్నాడు.గ్లోబలైజేషన్ సందర్భంగా దేశంలో సంపద సృష్టి ముమ్మరమైన సమయంలో కలాం కూడా సంపద సృష్టించడం గురించి మాట్లాడేడు తప్ప, సృష్టించిన సంపద నలుగురికీ అందుబాటులోకి రావడం గురించీ, అసమానతలు తొలగిపోవడం గురించీ ఆయన మాట్లాడలేదనీ, పోరాడలేదనీ, ఆ రచయిత భావన.

కాని కలాం పట్ల నా ఆరాధనకి కారణం ఆర్థిక, రాజకీయ రంగాలకి సంబంధించింది కాదు. ఉత్పత్తి పెరిగినంత మాత్రాన, లేదా పంపిణీ వ్యవస్థ మెరుగుపడినంత మాత్రాన,మన సమాజం మరింత మెరుగైన సమాజం కాగలదని నేనెప్పుడూ నమ్మలేదు. చిన్నప్పుడు హైస్కూల్లో నా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు, సోషలిజం గురించి చెప్తూ ఉత్పత్తి సాధనాలు సామాజికనియంత్రణలోకి రావడమే సోషలిజమని చెప్పాడు. కాని ఆచరణలో సమాజమంటే రాజ్యమేననే తెలుసుకోవడానికి ప్రపంచం 1917 నుంచి 1980 దాకా ఆగవలసి వచ్చింది. అయినా కూడా ప్రపంచమంతా వామపక్ష ఉద్యమాలు ఉత్పత్తి సాధనాల్ని సమాజమెట్లా నిర్వహించగలదో అధ్యయనం చెయ్యడం మానేసి, ప్రయోగాలు చెయ్యడం మానేసి, రాజ్యాధికారం కోసం పోరాటాలు సాగిస్తూనే ఉన్నారు.

ఇంతదాకా అప్రధానీకరణకు లోనైన వివిధ సమూహాలు కూడా తమ అస్తిత్వాన్ని, తమ సాంఘిక ముద్రనీ గుర్తుపట్టే క్రమంలో వామపక్ష ఉద్యమాలు నడిపిన తోవనే నడుస్తూ, తాము కూడా రాజకీయాధికారం కోసం తపిస్తూ ఉన్నారు.

ప్రపంచం రెండు శిబిరాలుగా చీలిపోయిందని కమ్య్యూనిష్టు మానిఫెస్టో అన్నప్పణ్ణుంచీ, మనుషుల్ని రెండు శిబిరాలుగా విడగొట్టి చూస్తూనే ఉన్నాం. చాలాకాలం పాటు ఆ శిబిరాల్ని వర్గప్రాతిపదికన విడగొట్టారు. ఆ తర్వాత జాతి, వర్ణం, రంగు, లింగం, ఇక్కడ భారతదేశంలో కులం-

కాని నేనేమనుకుంటానంటే, మనుషులు అన్నిదేశాల్లోనూ, చైనాలోనూ, స్వీడన్ లోనూ కూడా, ప్రధానంగా రెండే విభాగాలు- privileged, under privileged. సదుపాయాలూ, సౌకర్యాలూ ఉన్నవాళ్ళూ, అవి లేనివాళ్ళూను. కొందరికి అటువంటి సదుపాయాలు పుష్కలంగా ఉండటానికీ, చాలామందికి కనీస సౌకర్యాలు కూడా లేకపోవడానికీ వర్గం, లింగం, కులం కారణం కావచ్చు, ఆ అసమానతలు కొనసాగడానికి కూడా అవి ఆస్కారం కావచ్చు. కాని మనం ధిక్కరించవలసిందీ, వ్యతిరేకించవలసిందీ ఆ సౌకర్యాల్ని కొందరే అనుభవించడాన్ని, వారు అటువంటి సౌకర్యాలు అనుభవించడానికి చాలామందికి అవి లేకుండా చెయ్యడాన్ని.

అటువంటి సౌకర్య నిర్మూలన రాజ్యాధికారం ద్వారా సాధ్యపడుతుందా?

పారడాక్స్ ఏమిటంటే, ఏ అసమానతానిర్మూలనకోసం underprivileged రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తారో, ఆ రాజ్యాధికారం సిద్ధించగానే వాళ్ళల్లో ఒక చిన్నభాగం, privileged గా మారిపోతారు. అంటే అంతదాకా విమోచనశీలత్వాన్ని కనపరచిన ఆ సమూహం ఇక అప్పణ్ణుంచీ తిరిగి మళ్ళా ఆధిపత్య ధోరణిని సంతరించుకుంటుంది. అంటే, రాజ్యంగా మారిపోతుంది. ఇదొక విషమ ప్రహేళిక. దీని ప్రకారం underprivileged కి ఎప్పటికీ రాజ్యాధికారం సిద్ధించదు. ఇంకా చెప్పాలంటే, రాజ్యాధికారం స్వభావతః privileged కాబట్టి, పాలనాధికారం పొందిన ప్రతివాడూ పాలకుడుగానే ప్రవర్తిస్తాడు.

అందుకనే గత మూడు దశాబ్దాలుగా, పాలక స్వభావాన్ని సంతరించుకోని పాలకుడికోసమే నేను అన్వేషిస్తూన్నాను. ఒకప్పుడు వామపక్షవాదులు అటువంటి ఆలోచనల్ని యుటోపియన్ భావాలుగా కొట్టిపారేసేవారు. కాని సోవియెట్ రష్యా కూలిపోయిన తర్వాత,సమసమాజాన్ని కోరుకునేవాళ్ళంతా ఆలోచించక తప్పని ప్రశ్న ఇది: రాజ్యాధికారం లేకుండా అత్యధికసంఖ్యాకులకు మేలు చెయ్యలేం. కాని రాజ్యాధికారం సిద్ధించగానే పాలకస్వభావాన్ని సంతరించుకోకుండానూ ఉండలేం. పాలకస్వభావాన్ని సంతరించుకోకుండా రాజ్యాధికారాన్ని పొందడమెట్లా, బహుజనహితం కోసం దాన్ని వినియోగించడమెట్లా?

కాని అటువంటి ప్రవర్తన సాధ్యం చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నవాళ్ళు సమకాలిక ప్రపంచంలో కొందరు మనముందున్నారు. వారందరిలోనూ నన్ను కలాం ఎక్కువగా ఆకర్షించడానికి కారణమదే. ఇప్పుడు పి.ఎం.నాయర్ రాసిన ‘కలాం ఎఫెక్టు’ (హార్పర్ కాలిన్స్, 2011) చదివిన తరువాత కలాం పట్ల పట్ల నా నమ్మకం మరింత బలపడింది.

పి.ఎం.నాయర్ భారతీయ పాలనా సర్వీసులో 1967 బాచ్ కి చెందిన అధికారి. కలాం రాష్ట్రపతి అవగానే ఆయన్ని పిలిపించి రాష్ట్రపతి కార్యదర్శిగా నియమించారు. వారిద్దరూ అయిదేళ్ళూ కలిసి పనిచేసారు. ఆ సందర్భంగా రాష్ట్రపతి స్థానంలో కలాం లోని మానవుడు ఎలా ఆలోచించేవాడో, మాట్లాడేవాడో, ప్రవర్తించేవాడో చాలా దగ్గరనుంచి చూసిన నాయర్ తన అనుభవాల్ని ఎంతో హృద్యంగా వివరించేడు.

ఆ అనుభవాలన్నీ మనం మళ్ళా మళ్ళా చెప్పుకోవలసినవీనూ, మన పిల్లలకు నూరిపొయ్యవలసినవీను. ముఖ్యం, ఈ అనుభవం చూడండి. నాయర్ ఇట్లా రాస్తున్నాడు:

‘నేను లేనప్పుడు ఈ పెన్సిలెవరు తీసారు?’ ఆ ప్రశ్నిస్తున్నది నా తండ్రి, కోపంతో అరుస్తున్నాడు. మేమప్పుడు కేరళలో తొడుప్పుళ లో ఉండేవాళ్ళం.మా నాన్న అక్కడ జిల్లా మున్సిఫ్. ఇంటిదగ్గరకూడా ఆయన తన కేసుఫైళ్ళు రాసుకోవడానికి ఒక బల్లా, కొంత స్టేషనరీ ఉండేవి. మా ఇంటి మొత్తానికి అదొకటే టేబులూ, ఆ కాగితాలూ, కలాలే ఏకైక స్టేషనరీ.’

‘నేనప్పుడు అయిదో క్లాసు చదువుతున్నాను. నా హోం వర్కు పుస్తకంలో ఏదో అండర్ లైన్ చేసుకోవలసి ఉండింది. అందుకని నేను మా నాన్న ఆఫీసు పెన్సిలు వాడుకున్నాను. మళ్ళా దాన్నక్కడే పెట్టేసాను. మా నాన్నకి తెలీదనుకున్నాను. కాని నా ఊహ తప్పయింది.ఆయన దాన్ని కనిపెట్టేసాడు.’

‘ఆయనకి ఎదురు చెప్పే ధైర్యం మా ఇంట్లో ఎవ్వరికీ లేదు. ఇక అబద్ధం ఆడటం ఊహించడానికి కూడా లేదు. అందుకని నేను ముందుకి అడుగేసి ‘నాన్నా, నేనే తీసాను…అండర్ లైన్ చేసుకోవడానికి ..’ ఆ మాటలు కూడా కష్టంగా పలికానే తప్ప, క్షమించండి అనడానికి కూడా ధైర్యం చాలకపోయింది నాకు.’

‘ఆఫీసు సామాను ఆఫీసు పనికేగాని,ఇంటిపనికి కాదని తెలీదా నీకు?’ ఆ ప్రశ్న వెనకనే నా వంటిమీద మూడు బెత్తం దెబ్బలు కూడా. ఆ బెత్తం నాకో పాఠం నేర్పింది. నా జీవితమంతా నాకు దారిచూపించినపాఠం.

‘నైతిక ప్రవర్తనకు సంబంధించినంతవరకూ అదే అత్యున్నత ఉదాహరణ అనుకున్నాను. కాని నేను పొరబడ్డాను. దివంగతుడైన నా తండ్రి పట్ల నా గౌరవం చెక్కుచెదరలేదుగానీ, నేను చూడవలసింది మరికొంత మరికొంత మిగిలేఉందని తెలుసుకున్నాను.’

మే, 2006. ‘నాయర్, మా బంధువులు వారం పదిరోజులుండటానికి ఇక్కడికొస్తున్నారు. వాళ్ళకయ్యే ఖర్చు ఆఫీసు లెక్కల్లోకి పోకుండా చూడండి, అదంతా నా ప్రైవేటు ఖర్చు ‘అన్నారు కలాం నాతో. ఆయన బంధువులు మొత్తం 52 మంది వచ్చారు.. వాళ్ళల్లో తోంభై ఏళ్ళ వయస్కుడైన ఆయన పెద్దన్నయ్యనుంచి ఏడాదిన్నర వయసు కలిగిన మునిమనమరాలుదాకా. కలాం ఒక మాట చెప్పారంటే ఆ మాటకెంత విలువ ఇస్తారో నాకు తెలుసు.’

‘వాళ్ళంతా వచ్చారు. ఎనిమిదిరోజులపాటున్నారు. అజ్మీర్ షరీఫ్ కి వెళ్ళారు. వాళ్ళల్లో యువతీయువకులు డిల్లీలో షాపింగ్ కి కూడా వెళ్ళారు. తిరిగి వాళ్ళంతా వెళ్ళిపోయారు.’

‘అసాధారణమైన విషయమేమిటంటే, వాళ్ళున్నన్ని రోజులూ, ఒక్కసారి కూడా ప్రభుత్వవాహనం వాడలేదు. ముఖ్యంగా వచ్చినవాళ్ళు అంతమందైనప్పుడు! తన బంధువులు రాష్ట్రపతి భవన్లో నివసించిన గదులకు కలాం అద్దె చెల్లించారు. చివరికి వాళ్ళు తాగిన టీ కప్పులకి కూడా లెక్కగట్టారు. మొత్తం బిల్లు 3 లక్షల 52 వేలు. మొత్తం కలాం తన జేబునుంచి చెల్లించారు. ఆయన ఆ విషయమెవ్వరికీ చెప్పుకోలేదు. నేను రాస్తున్నానంటే కారణం, ఇప్పుడైనా నలుగురికీ తెలియాలనే. నేనీ విషయం బహిరంగం చేసినందుకు ఆయన నన్ను మన్నిస్తారనే అనుకుంటున్నాను. ఒకప్పుడు తొడుప్పళలో ఆ సంఘటన జరిగినప్పుడు నేను నా తండ్రి ముందు నిలబడలేకపోయాను. కాని ఇప్పుడు ఈ మానవుడి ముందు, ఇంత నిరాడంబరంగా నా ముందు చూపిన ఉదాహరణ ముందు, నిలబడి సగౌరవంగా నా ప్రణతులు చెల్లిస్తున్నాను.’

7-2-2016

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

Leave a Reply

%d bloggers like this: