ఒక సూఫీ సాయంకాలం

Reading Time: 2 minutes

54

నా వరకూ ప్రపంచ కవితా దినోత్సవం నిన్న సాయంకాలమే అడుగుపెట్టింది. ‘లా మకాన్’ లో ఎవరో హిందుస్తానీ గాయకుడు భక్తిగీతాలు ఆలపించబోతున్నాడు, వెళ్తారా అని ఒక మిత్రురాలు మెసేజి పెట్టడంతో నిన్న సాయంకాలం నేనూ, అక్కా, ఆదిత్యా ఆ సంగీత సమారోహానికి హాజరయ్యాం. ‘లా మకాన్’ ఎనిమిదవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఆ కచేరీ సంగీతసాహిత్యాల్ని జమిలిగా వర్షించింది. మరవలేని వసంతరాత్రిగా మార్చేసింది.

శుభేందు ఘోష్ డిల్లీ విశ్వవిద్యాలయంలో బయో-ఫిజిక్సులో ఆచార్యుడిగా పనిచేస్తున్నాడు. రాంపూర్ ఘరానాలో హిందుస్తానీ సంగీతాన్ని సాధన చేసాడు. ఆయన గురువు ఒక ఖాన్ సాహెబ్. తమది తండ్రీ కొడుకుల అనుబంధంగా ఉండేదని, కానీ, దురదృష్టకరమైన ఆ రోజు తమని తీవ్ర దుఃఖానికి లోను చేసిందని చెప్పాడు. 1992 డిసెంబరు 6 వ తేదీన బాబ్రీ మసీదును కూలదోస్తున్నప్పుడు తాను తన గురువు దగ్గరే ఉన్నాడనీ, ఆ దృశ్యాన్ని టివిలో చూస్తున్నప్పుడు తమ చుట్టూ గాలిగడ్డకట్టిందనీ, మొదటిసారిగా తమ మధ్య మాటలు కరువయ్యాయనీ చెప్పాడాయన. అంతదాకా తన గురువుదేమతం, తనదే మతం అనే ధ్యాస తమకెన్నడూ కలగలేదనీ, తామిద్దరూ, హిందూ మహ్మదీయ మతాలకు అతీతమైన సంగీత మతానికి చెందినవారుగానే కొనసాగుతూ వచ్చామనీ చెప్పాడాయాన. ఆ రోజు నుంచీ ఉత్తరభారతదేశాన్ని మతోన్మాద పిశాచం వెన్నాడుతూనే ఉన్నదనీ, దాన్నుంచి దేశాన్ని విముక్తిపరచడమెట్లా అన్నదే తనని వేధిస్తున్నదనీ కూడా చెప్పాడు. మరొకవైపు ఈ దేశంలో గత ఏడెనిమిది వందల ఏళ్ళుగా, మతాలకు అతీతమైన మానవత్వాన్ని మేల్కొల్పిన కవులూ, సంగీతకారులూ, వాగ్గేయకారులూ ప్రభవిస్తూనే ఉన్నారనీ, వారి గీతాలాపనతోనైనా ఈ ద్వేషదగ్ధ దేశాన్ని చల్లబరచవచ్చుననే ఆశతో తానీ సంగీత కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పాడు.

తన ఉద్దేశ్యాన్ని వివరించిన తర్వాత, సుమారు గంటన్నరసేపు ఆయన గొప్ప ప్రేమైకజీవులైన భక్తికవుల గీతాలాపన చేపట్టాడు. మొదటగా 13 వ శతాబ్దానికి చెందిన అమీర్ ఖుస్రో ఘజల్ ను చారుకేశి రాగంలో ఆలపించడంతోటే అతడు శ్రోతల హృదయాల్ని కైవసం చేసుకున్నాడు. ఆ తర్వాత కబీర్ గీతమొకటి ఆలపించాడు. అప్పుడు తాన్ సేన్ కృతిని దర్బారీ రాగంలో ఒక ఖయాల్ గా ఆలపించడంతో కచేరీని పతాకస్థాయికి తీసుకుపోయాడు. ఆ తర్వాత తిరిగి మళ్ళా నేలమీదకు దిగివచ్చి జానపద బాణీల్లో ప్రసిద్ధ సూఫీ సాధు కవీంద్రుడు బుల్లేషా, నజీర్ అక్బరా బాదీ, ప్రసిద్ధ బావుల్ గీత కర్త లాలన్ ఫకీర్ల గీతాల్ని ఆలపించాడు. ఫైజ్ అహ్మద్ ఫైజ్ విప్లగీతమొకటి ఆలపించి చివరగా టాగోర్ సుప్రసిద్ధ గీతం ‘ఎక్లా చలో’ తో తన గీతవితరణ ముగించాడు.

ఆయన పాడుతున్నంతసేపూ నిజంగానే దుఃఖం లేని ఒక దేశానికి, ఒక రసమయసమాజానికి అక్కడ తెరతీసాడు. అందరూ గానం చేసింది ఒక ప్రేమైకదేశం కోసమే అయినప్పటికీ, కవినుంచి కవికీ, గానం నుంచి గానానికీ ఎంత వైవిధ్యముందో ఆ వివిధత్వాన్నంతా చూపిస్తూ భారతీయ బహుళతాధర్మానికి పట్టం కట్టాడు. బుల్లేషా గీతాన్ని ఆలపించేటప్పుడు ఆయన శ్రోతల్లోంచి ఎవరేనా ముందుకొచ్చి నాట్యం చేస్తే తప్ప తాను పాడలేనన్నాడు. నాట్యం చెయ్యని వాళ్ళు కవ్వాలీ తరహాలో కరతాళాలేనా వాయించితీరాలన్నాడు. ఆ గీతం పాడుతున్నంతసేపూ ఆ ప్రాంగణాన్ని పండగరోజు ముంగిలిగా మార్చేసాడు.

ద్వేషంతోనూ, దూషణతోనూ తగలబడిపోతున్న నా దేశానికి ఇప్పుడు కావలసింది ఇటువంటి గీతకారులు, ఇటువంటి సంగీత కారులూను. మనుషుల్ని మందనుంచి విడదీసి మనిషికి సన్నిహితం చేసే శక్తి కవిత్వమేనన్నది మరో మారు అనుభవానికొచ్చింది నాకు.

ఆయన ఆలపించిన గీతాల్లో ఒక గీతం తెలుగు అనువాదం మీ కోసం.

బాబా బుల్లేషా

ప్రేమ ఒక నమాజుగా మారిపోయాక

ప్రేమ ఒక నమాజుగా మారిపోయినప్పణ్ణుంచీ
నేను మందిరాలు, మసీదులూ వదిలిపెట్టేసాను.

వేలాది గ్రంథాలు పఠించానంటావే
నిజంగా తెలిసిందా నీకు నువ్వెవరో?
పండితుడా! ఎందుకా పుస్తకాలు పదివేలు?
నీకు దొరికేదక్కడ శుష్కజ్ఞానం, శూన్యహస్తాలు.
ఊరకనే నీ నెత్తిన మోస్తున్నావొక బరువు,
నిజంగా నీకు కావలసింది ప్రేమసించితమధువు,
నిన్ను బయటా లోపలా కడిగేసే రససింధువు.
ఎన్నిసార్లు ఎక్కిదిగావు ఆ మందిరాలు, మసీదులు
ఒక్కసారేనా తెరిచిచూసావా నీ హృదయకవాటాలు?
పోరాడలేకపోతున్నావు నీ కోరికల్తో, కల్పనల్తో
ఇంకెట్లా నెగ్గగలవు పోరాడి సైతానుతో?

అంతరంగంలోనే ఉన్నాడని మర్చిపోతున్నావు
ఆకాశమంతా గాలిస్తావెందుకంటాడు బుల్లేషా.

21-3-2018

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d bloggers like this: