ఏది ఇచ్చినా శ్రద్ధగా ఇవ్వాలి

Reading Time: 3 minutes

5

ఈ గాంధీజయంతి నాడు నన్ను నెల్లూరులో పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమానికి రమ్మని కాళిదాసు పురుషోత్తం గారు పిలిచారు. మబ్బుతో, ముసురుతో అల్లుకున్న ఉదయం. నాకోసం అల్లుభాస్కరరెడ్డిగారు, కోడూరి ప్రభాకారరెడ్డిగారు రైల్వే స్టేషన్ కి వచ్చారు. భాస్కరరెడ్డిగారు అత్యంత ప్రభావశీలమైన మనిషి. తన చుట్టూతా ఉన్న ప్రపంచాన్ని సంస్కరించి ప్రయోజనకరంగా మార్చడంలో ఆయన చూపించగల సంస్కారం ఏ కొద్ది మంది మాత్రమో చూపగలుగుతారు. ప్రభాకరరెడ్డిగారిది నిశ్శబ్దమైన సన్నిధి. ఆయన వల్లా, ఆయన శ్రీమతి ఇందిరమ్మవల్లా, వారి ఇల్లు ఒక ఆశ్రమంలాగా శోభిస్తూంటుంది.

నెల్లూరు దగ్గర పల్లెపాడులో పినాకినీ ఆశ్రమాన్ని 1921 లో గాంధీగారు స్వయంగా వచ్చి ప్రారంభించారు. పొణకా కనకమ్మగారు పెన్నా నది ఒడ్డున 13 ఎకరాల భూమి ఆశ్రమానికి కానుక చేసారు. దక్షిణాఫ్రికాలో గాంధీజీ స్నేహితుడు రుస్తుంజీ అక్కడొక ఆశ్రమభవనాన్ని నిర్మించారు. ఇటీవలనే వార్ధా ఆశ్రమం సహకారంతో అక్కడొక స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మరొక భవనం కూడా నిర్మించారు. ఆరేడేళ్ళ కిందట ఆశ్రమపాలకవర్గం ఆ ఆశ్రమాన్ని ప్రభుత్వానికి అప్పగించేసిన తరువాత ఇప్పుడదక్కడ రెడ్ క్రాస్ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

గాంధీజీ 143 జయంతిని అక్కడ జరుపుకోవడానికి నెల్లూరులో గాంధీ అభిమానులంతా విచ్చేసరు. కార్యక్రమానికి లవణంగారు ముఖ్య అతిథిగా వచ్చారు. ప్రముఖ విద్యావేత్త, అభ్యుదయవాది, శాసనమండలి సభ్యుడు బాలసుబ్రహ్మణ్యం మరొక అతిథి.

పొద్దున్నే పెన్నా నది ఒడ్డున చుట్టూ పచ్చటి చేలమధ్య, పొలాల మధ్య ఆ అశ్రమంలో పిల్లలతో, పెద్దలతో గాంధీజి గురించి ముచ్చటించుకోవడం నాకెంతో సంతోషమనిపించింది. నేను గాంధీగురించి చెప్పాలంటే కస్తూర్బా గురించి కూడా మాట్లాడుకోవలసిఉంటుందని చెప్పాను. ముఖ్యంగా ఈ మధ్య నేను అనువాదం చేసిన పుస్తకం ‘గాంధీ వెళ్ళిపోయాడు: మనకు దిక్కెవరు’ (ఎమెస్కో,2011) గురించి చెప్పాను. గాంధిజీ మరణానంతరం, సేవాగ్రాంలో దేశభవిష్యత్తు గురించి సాగిన ఆ చర్చ అప్పటికన్నా ఇప్పుడెక్కువ అవసరంగా కనిపిస్తోందని చెప్పాను.

అయితే, నాకు లవణం గారి ప్రసంగం చాలా బాగా నచ్చింది. ఆయన చిన్నప్పుడే గాంధీజీ ఆశ్రమంలో గడిపిన వ్యక్తి. ఆయనా, హేమలతగారు కలిసి విముక్తజాతుల పునరావాసంలో, జోగినుల పునరావాసంలో చేసిన కృషి అసామాన్యమైంది. ‘సంస్కార్’ తరఫున వారు నిజామాబాద్ జిల్లా వర్నిలో నడిపిన జోగిని పిల్ల్లల పాఠశాలని నేను 95 లో చూశాను. ఎంతో ఆదర్శవంతమైన పాఠశాల అది.

లవణంగారు సూటిగా పిల్లల హృదయాల్ని తాకేలా మాట్లాడారు. ముఖ్యంగా గాంధీతో తన జ్ఞాపకాల్ని నెమరేస్తూ చెప్పిన ఒక విషయం నన్ను చాలా ఆకట్టుకుంది. అది 1945 నాటి మాట. వార్ధా ఆశ్రమానికి వెళ్ళిన గోరాగారి కుటుంబాన్ని పలకరించడానికి గాంధీజీ వారు బసచేసిన చోటికి వచ్చారు. లవణంగారి చెల్లెలు అప్పటికి రెండున్నర నెలల పసిపాప. తల్లి ఒక చీరెతో ఉయ్యెల కట్టి ఆ గుడ్డ ఉయ్యెలలో పిల్లను పడుకోబెట్టింది. ఆ గుడ్డ ఉయ్యెలలో పిల్లని చూసిన గాంధీజీ ఆ చిన్నపిల్ల నలిగిపోతుందని వెంటనే ఊళ్ళోకి మనుషుల్ని పంపించి మర్నాటికల్లా ఊయెల తెప్పించారట. మర్నాడు మళ్ళా వాళ్ళని చూడటానికి వచ్చినప్పుడు, ఆ ఉయ్యెలలో పిల్లని చూసి సంతోషంతో ఊయెల ఊపాడట. ఆ సంగతి తలుచుకుంటూ లవణంగారు ఇలా అన్నారు: ‘1945 లో ఒక వైపు మొత్తం ప్రపంచాన్ని పట్టించుకుంటున్న ఆ మనిషి, అదే సమయంలో తనని చూడటానికి వచ్చిన కుటుంబంలో రెండున్నర నెలల పసిపాప గురించి కూడా అతృతపడగాలిగాడంటేనే ఆయన ప్రేమాస్పద హృదయమెటువంటిదో తెలుస్తుంది ‘ అని.

ఆ మధ్యాహ్నం నెల్లూరు దగ్గర్లో అల్లూరు మండలంలో గొల్లపాలెం గ్రామంలో ఒక స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న ‘ఛైల్డ్ ‘ అనే ఆశ్రమపాఠశాలకు వెళ్ళాం.

అది చిన్న పాఠశాల. ఒకటవ తరగతి నుంది పదవతరగతి దాకా మొత్తం వందమందికి పైగా బాలబాలికలు ఉన్నారు. వాళ్ళంతా అనాథలు. ముఖ్యంగా రైళ్ళల్లొ దోపీడీలకూ, నేరాలకూ పాల్పడే ముఠాలనుంచి రక్షించిన చిన్నపిల్లల్ని ఆ పాఠశాలలొ చేర్చుకుంటున్నారు.భాస్కరరెడ్డి గారు, ప్రభాకర రెడ్డిగారు ఇస్తున్న ప్రోత్సాహంతో రామచంద్ర శరత్ బాబు ఆయన సతీమణి ఆ పాఠశాలను నడుపుతున్నారు.

ఆ పాఠశాలలో అడుగుపెట్టగానే నా అలసట మొత్తం ఒక్కసారిగా ఎగిరిపోయింది. ఆ ప్రాంగణంలో అడుగుపెట్టగానే చిన్ని తామరపూలకొలను మనల్ని పలకరిస్తుంది. నా జీవితమంతా పాఠశాలలు సంతోషచంద్రశాలలుగా మారాలని కలలుగన్నాను. అటువంటి ఒక కల సాకారం చెందినట్టుగా ఆ పాఠశాల గోచరించింది. అక్కడి పరిశుభ్రత, ఆ చిన్నారుల వదనాల్లో చిరునవ్వులు, ఉత్సాహం నాకెంతో బలం పోసాయి. అక్కడొక చిన్న సభ చేసారు. ప్రముఖ కవి, మిత్రుడు పెరుగురామకృష్ణ ఆ సభని నిర్వహించాడు. నన్ను మాట్లాడమంటూనే, నేనొక పారవశ్యంతో నన్ను నేను మర్చిపోయి మాట్ళేడేను. గత నలభైయేళ్ళుగా తాడికొండతో మొదలైన నా అనుభవాలు, ఊహలు వాళ్ళతో పంచుకున్నాను. విజయనగరం జిల్లాలో, చీపురుపల్లిలో ‘శోధన’ కామేశ్వరరావుగారు నిర్వహిస్తున్న ‘బాలబడి’, గుంటూరు దగ్గర చౌడవరంలో డా.నన్నపనేని మంగాదేవిగారు నిర్వహిస్తున్న ‘చేతన’, అదిలాబాదుజిల్లా ఉట్నూరులో మనోహరప్రసాద్ గారు నడుపుతున్న బాలబడులు, వేణుగోపాలరెడ్డిగారు నడుపుతున్న ‘ఏకలవ్య’ పాఠశాలలు ‘- ఇటువంటి ప్రయత్నాలే నేను జీవిస్తున్న సమాజం పట్ల, ప్రపంచం పట్ల ఆశ రేకెత్తించేవి. తక్కిన జీవితం ఎంత నిరాశామయంగా ఉన్నా ఈ మహనీయప్రయత్నాల్ని తలుచుకున్నప్పుడల్ల్లా నాకు కొత్తగా జవసత్త్వాలు ఒనగూడినట్టనిపిస్తుంది.

‘ఛైల్డ్’ పాఠశాలని చూడగానే, నాకు నా పిల్లల్ని కూడా అక్కడకు తీసుకువెళ్ళాలనిపించింది. నా మిత్రులకీ, తెలిసినవాళ్ళకీ ఆ పాఠశాలగురించి బిగ్గరగా చెప్పాలనిపించింది.

నన్ను హాష్టలు రూముల్లో తిప్పుతూ, శరత్ బాబు గారు ఒక బీరువా దగ్గర ఆపి తెరిచి చూపించారు. ‘మా దగ్గరకు ఎప్పుడు ఏ పిల్లలు వస్తారో, ఏ వయసు పిల్లలు వస్తారో తెలియదు కాబట్టి, రకరకాల వయస్సులకి తగ్గట్టు ఒక్కొక్కరికీ మూడేసి జతల చొప్పున కుట్టించి సిద్ధంగా పెట్టుకున్నాం’ అన్నారు. ఆ మాటలు వినగానే నాకు కలిగిన అనుభూతి నేను వివరించలేనిది. ఉపనిషత్తులు ‘ఏది ఇచ్చినా శ్రద్ధగా ఇవ్వమని’ చెప్పాయి. ఆ పాఠశాల ఉపనిషత్సందేశానికి ఉదాహరణలాగా ఉంది. మీలో ఎవరు ఎప్పుడు నెల్లూరు వెళ్ళినా, ఒక పూట సమయం కేటాయించుకుని ఆ పాఠశాలకు వెళ్ళి ఆ పిల్లల్ని పలకరించడి. వీలైతే మీరు కూడా వారికేదైనా తోడ్పాటు ఇవ్వగలిగితే ఇవ్వండి.

అలాగని, ఆ పిల్లలు గాని ఆ పాఠశాల బృందంగాని మననేమీ యాచించరు. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నన్ను కోరిందొకటే. ‘మీకు వీలైతే అబ్దుల్ కలాం ఒక్కసారైనా ఈ పాఠశాలకు వచ్చేలా చూడండి’ అనే.

3-10-2012

ఫేస్ బుక్ వాల్ మీద చర్చ చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి

 

Leave a Reply

%d bloggers like this: