ఎమ్మెస్ తన కవితాసంపుటి ‘శబ్దభేది’ కి ముఖచిత్రం వెయ్యమని అడిగినప్పుడు ఒక పువ్వూ, దానిమీద వాలిన ఒక సీతాకోకచిలుకా స్ఫురించాయి. వాటిని నీటిరంగుల్లో ఎమిల్ నోల్డె లాగా చిత్రించాలని కూడా అనిపించింది.
ఎమిల్ నోల్డె ( 1867-1956) తొలితరం జర్మన్ ఎక్స్ ప్రెషనిస్టిక్ చిత్రకారుల్లో ప్రసిద్ధుడు. ఇరవయ్యవ శతాబ్దం ముగిసే సమయానికి రసజ్ఞులు అతణ్ణి 20 వ శతాబ్దపు నీటిరంగుల చిత్రకారుల్లో అగ్రశ్రేణి చిత్రకారుడిగా గుర్తించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆ రంగులు. పసుపు బంగారం, రక్తారుణం, ఊదా,పాటలవర్ణాలతో అతడు చిత్రించిన అనేకానేక పుష్పాలు, ముఖ్యంగా పాపీలు చూపరుల్ని నిశ్చేష్టుల్ని చేస్తాయి. ఆ రంగుల్లో ఆ translucence, ఆ luminosity ఎక్కణ్ణుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? పరిశుభ్రమైన ఆ రంగులు, ఆ నీడలు అతడి దర్శనానికి చెందినవే అయినప్పటికీ, వాటిని నాలాంటి ఒక విద్యార్థి అనుకరించడం అసాధ్యమా?
ప్రసిద్ధ యూరోపియన్ చిత్రకారులు చిత్రించిన చిత్రాలు కేవలం వర్ణకృతులు మాత్రమే కాదు. వాటివెనక వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోని బాధానందాలు, వేదనా, అనుభవించిన సంఘర్షణా కూడా ఉంటాయి. నోల్డె ని మొదటిరోజుల్లో నాజీలు నెత్తికెత్తుకున్నా, తరువాతి రోజుల్లో అతడి ‘కళ’ ని సందేహించడం మొదలుపెట్టారు. అతణ్ణి నిర్బంధించి బొమ్మలు వెయ్యవద్దని శాసించారు. నోల్డె చిత్రించిన పూలరేకల్లో ని పారదర్శకత, సౌకుమార్యం వెనక ఆ క్షోభ కూడా ఉంది. అట్లాంటి నలుగులాట ఏమీ పడకుండా నేను కూడా ఆ సంగీతమయవర్ణధనువుని ఎక్కుపెడతానంటే ఎట్లా?
అయినా కూడా నాలో ఉన్న ఒక పసివాడు ఈ మాటలేవీ వినడు. నోల్డె జపాన్ కాగితం మీద సాధించిన ఫలితాన్ని నా దగ్గరుండే చైనీస్ రైస్ పేపర్ మీద రాబట్టలేనా అనుకున్నాను. మొదటి బొమ్మ విఫలమయింది. కాని రెండవ బొమ్మ, నన్ను నేను పక్కకు నెట్టుకుని, ఒక విహ్వల క్షణంలో చీనావాడి కుంచెతో చీనాకాగితం మీద అలవోకగా రంగులద్దితే రూపొందింది. మళ్ళా మరొక బొమ్మ గియ్యాలని చూసానుగానీ, ఆ విహ్వల క్షణం, ఆ వివశక్షణం నాకు మళ్ళీ దొరకనేలేదు.
చూడండి, మొదటి బొమ్మ నోల్డె నీటిరంగుల చిత్రం, రెండవ బొమ్మ నేను చిత్రించింది.
23-8-2015