ఋషీవాలీ విద్యాసంస్థల్తో నా పరిచయం ఇరవయ్యేళ్ళ కిందటిది. యునిసెఫ్ సలహామేరకు పాడేరులోనూ, ఉట్నూరులోనూ ఆనందలహరి కార్యక్రమం అమలు చేసినప్పుడు ఋషీవేలీ రూరల్ స్కూల్ వారు రూపొందించిన కరికులం ని మేం గిరిజన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసాం. ఆ కరికులం కింద రూపొందించిన కృత్యపత్రాల్ని నేరుగా వాడకుండా వాటిని గిరిజన సంస్కృతికీ, గిరిజన సమాజానికీ సన్నిహితంగా ఉండేలా సరిదిద్దుకుని మరీ అమలుచేసాం.
కానీ అప్పుడు నేను ఋషీవాలీ ప్రధాన పాఠశాల ఎలా పనిచేస్తుందో చూడలేదు. ఆ పాఠశాల కృష్ణమూర్తి ఆలోచనలకు అనుగుణంగా ప్రారంభించారని మాత్రమే తెలుసు. కాని గత కొన్నేళ్ళుగా దేశంలో ఉత్తమపాఠశాలల రాంకింగులో ఆ పాఠశాల క్రమం తప్పకుండా మొదటిస్థానంలోనే నిలుస్తున్నదని విన్నాక, ఆ పాఠశాల ఎట్లా పనిచేస్తున్నదో స్వయంగా చూడాలనుకున్నాను. అందుకోసం మంగళవారం ఋషీవాలీ వెళ్ళి రెండురోజులు అక్కడే ఉండి ఆ పాఠశాల ను దగ్గరగా పరిశీలించాను.
నేను చూడాలనుకున్నది ప్రధానంగా ఆ పాఠశాలలో ఆచరిస్తున్న మంచి పద్ధతుల్ని. పెద్దగా పెట్టుబడితో నిమిత్తం లేకుండా ఏ గ్రామీణ పాఠశాలలోనైనా అమలు చేయగల సూత్రాలూ, ఆచరణలూ అక్కణ్ణుంచి నేనేమైనా వెంటతెచ్చుకోగలనా అన్నదే నా వెతుకులాట.
ఇరవయ్యేళ్ళ తరువాత కూడా ఆ పాఠశాల యాజమాన్యం నన్ను గుర్తుపట్టి సుహృద్భావంతో పలకరించడం నాకెంతో సంతోషమనిపించింది. ఆ పాఠశాలల డైరెక్టర్ రాధికా హెర్జ్ బెర్గర్, కార్యదర్శి కుమారస్వామిగారు, బర్సర్ శైలేంద్రగారూ, ఋషీవేలీ గ్రామీణ పాఠశాలల కార్యక్రమాన్ని నేడు ప్రపంచమంతా విస్తరింపచేస్తున్న పద్మనాభరావు దంపతులూ ప్రతి ఒక్కరూ నన్నెంతో ఆప్యాయంగా చేరదీసుకున్నారు. నేనడిగిన ప్రశ్నలకి ఎంతో ఓపిగ్గా జవాబులిచ్చారు. నేను చూడాలనుకున్న ప్రతి ఒక్క అంశాన్నీ అరమరికలు లేకుండా చూడటానికి సాయపడ్డారు.
ఋషీవాలీ పాఠశాల సంపన్నులకోసం, ఉన్నత ఆదాయవర్గాల కోసం నడుస్తున్న పాఠశాల అని ప్రజల్లో ఒక అభిప్రాయముంది. కాని అక్కడ అనుసరిస్తున్న చాలా పద్ధతులు ప్రతి గ్రామీణపాఠశాలలోనూ, జిల్లాపరిషత్, ప్రభుత్వ, సంక్షేమశాఖల పాఠశాలల్లో కూడా అమలు చేయదగ్గవనే నాకనిపించింది.
అవి కొన్ని కృష్ణమూర్తి తాత్త్వికతనుంచి ఏళ్ళమీదట రూపొంది ఆ పాఠశాల సంస్కారంలో అంతర్భాగమైపోయాయి. కొన్ని, ఆ పాఠశాలలో గతంలో పనిచేసిన ఎందరో విద్యావేత్తలు, ఉపాధ్యాయులూ ప్రవేశపెట్టగా కాలక్రమంలో పాఠశాలలో భాగమైపోయినవి.
ఉదాహరణకి, ఆ పాఠశాలలో రోజు ముగిసిపోయాక, ఇక సాయంకాలం బోజనానికి వెళ్ళడానికి ముందు అస్తమయసంధ్యవేళ పిల్లలంతా ఒక ఆచారాన్ని ఎంతో నిష్టగా పాటించడం చూసేను. ఆ పాఠశాలని ఆనుకుని ఉన్న ఒక చిన్న కొండచరియమీద పిల్లలంతా పోయి నిశ్శబ్దంగా కూచుంటారు. దూరంగా కొండలమీద నెమ్మదిగా సూర్యాస్తమయం అవుతూఉంటే వారు మౌనంగా ఆ అస్తమయ సంధ్యాదృశ్యాన్నే చూస్తూ ఉంటారు. కొందరు బహుశా తమ అంతరంగంలో తమని తాము పరికిస్తూ ఉండవచ్చు. దాదాపు ఇరవై నిమిషాలపాటు వారట్లా ప్రగాఢ నిశ్శబ్దంలో ఆ సూర్యాస్తమయాన్ని చూసిన తరువాత మౌనంగా పాఠశాల ప్రాంగణంలోకి తరలిపోతున్న దృశ్యం చూసేను. ‘కృష్ణమూర్తి నోట్ బుక్’ లో కనిపించే ఈ దృశ్యం అక్కడ రోజూవారీ ఆచరణకావడానికి గోర్డాన్ పియర్స్ అనే ప్రిన్సిపాలు కారణమట.1950-58 మధ్యకాలంలో ఆయన ప్రవేశపెట్టిన ఈ అపురూపమైన ఆచరణని తరతరాలుగా పిల్లలు అంగీకరిస్తూ తమ దైనందిన జీవితంలో ఒక భాగంగా మార్చుకున్నారు.
పాఠశాలలో నాలుగవతరగతినుంచి ఎనిమిదవ తరగరి వరకు జూనియర్ స్కూలు. తొమ్మిది నుంచి పన్నెండో తరగతి వరకు ఉన్నత పాఠశాల. వారంలో మూడు రోజులు, సోమ, బుధ, శుక్రవారాలు పిల్లలందరికీ కామన్ అసెంబ్లీ. అంటే అంతా ఒకచోట చేరి నిలబడి జాతీయగీతాలు పాడే తరహా సమావేశం కాదు. ఆ రోజు వాళ్ళంతా పాఠశాల ఆడిటోరియంలో కూచుని సుమారు అరగంట సేపు వివిధ ప్రార్థనాగీతాలు సంగీతమయంగా ఆలపిస్తారు. అట్లాంటి సమావేశంలో బుధవారం పొద్దున్న పాల్గొన్నాను. తక్కిన మూడురోజుల్లో, అంటే మంగళవారం, గురువారం, శనివారం ఎవరి అసెంబ్లీ వాళ్ళు నిర్వహించుకుంటారు. అక్కడ కూడా పిల్లలు నాటికలు, నాటకాలు, పద్యాలు, కవిత్వం ,ప్రసంగాలు ఏదో ఒకటి నలుగురితోనూ పంచుకుంటారు. గురువారం పొద్దున్నే జూనియర్ స్కూలు అసెంబ్లీ చూసాను. అక్కడ పిల్లలు తెలుగులో చిన్న చిన్న నాటికలు ప్రదర్శించేరు. రెండు సమావేశాల్లోనూ నేను చూసిన మరో అంశం, ఆ సమావేశాలు ముగియగానే పిల్లలు తక్షణమే లేచివెళ్ళిపోకుండా రెండునిముషాల పాటు మౌనంగా ఉండి అప్పుడు లేవడం. వాళ్ళంతదాకా లోనైన అనుభవాన్ని వంటబట్టించుకోడానికీ, తమని తాము మానసికంగా కూడగట్టుకోడానికీ ఆ రెండు మూడు నిముషాల మౌనం ఎంతో అద్భుతంగా ఉపకరిస్తుందనిపించింది.
ఇట్లాంటి విలువైన ఆచరణలు చాలానే ఉన్నాయి. ఎనిమిదవ తరగతిదాకా పరీక్షలు లేకపోవడం, పిల్లల మార్కులు తక్కిన పిల్లలందరికీ తెలిసేలాగా బహిరంగంగా ప్రకటించకపోవడం, పిల్లల నోటు పుస్తకాల్లో మార్కులు వెయ్యడానికి బదులు సూచనలు రాయడం లాంటివి ఏ పాఠశాలకైనా ఆదర్శాలుగా స్వీకరించదగ్గవే అనిపించింది. తరగతిగదిలో రాంకు లిస్టు పెట్టడం గురుకుల పాఠశాలల పద్ధతి. అది మంచి సంప్రదాయమనే అనుకున్నాను ఇన్నాళ్ళూ. కానీ అట్లా రాంకు లిస్టు తరగతిగదిలో బాహాటంగా ప్రదర్శించడంలో ఎంత క్రూరత్వముందో ఇప్పుడు మొదటిసారిగా తెలిసివచ్చింది.
ఇక తాత్త్వికంగా ఆ పాఠశాలకు ఇరుసులాగా పనిచేస్తున్నది కృష్ణమూర్తి దృక్పథమే.
‘మీ పాఠశాలలో కృష్ణమూర్తి ఒక ఐకన్ మాత్రమేనా, లేక ఆయన ఆలోచనల్ని మీరు నిజంగా అనుష్టిస్తున్నారా’ అని సూటిగా అడిగినప్పుడు పాఠశాల సెక్రెటరీ కుమారస్వామి చాలా విలువైన అంశాలు ప్రస్తావించేరు.
ఆయన చెప్పిన దాని ప్రకారం, కృష్ణమూర్తి ఆలోచనలనుంచి పాఠశాల ప్రధానంగా స్వీకరించినవి మూడు అంశాలు. మొదటిది, పిల్లవాడి స్వేచ్ఛ. బాలబాలికల్ని నిర్బంధంలో కాకుండా స్వేచ్ఛగా ఎదగనిచ్చినప్పుడే వాళ్ళు సృజనాత్మకంగా ఎదుగుతారనీ, నిజమైన శీలవంతులుగా రూపోందుతారనీ, అందుకోసం ఋషీవాలీ మొదటినుంచీ సాహసప్రయోగాలు చేపడుతూనే ఉన్నదనేది. రెండవది, పిల్లవాణ్ణి, ఉపాధ్యాయుణ్ణి నిరంతరం క్రియాశీలంగా ఉంచడం. ఆయన మాటల్లో చెప్పాలంటే to engage. దానికి నిరంతరం చర్చ, మాట్లాడుకోవడం,ఆలోచనలు పంచుకోవడం ముఖ్యసాధనాలు. పాఠశాల కరికులం, రోజువారీ షెడ్యూలూ అందుకు అనుగుణంగానే రూపొందించుకున్నామని అన్నారాయన. మూడవది, లెర్నింగ్ శిశుకేంద్రంగా సాగాలంటే, పాఠశాల ఉపాధ్యాయుడిమీద ఎక్కువ దృష్టి చూపించవలసి ఉంటుంది, శ్రద్ధ చూపించవలసి ఉంటుందనేది. తాము టీచర్ ట్రైనింగ్ అనే మాటకి బదులు టీచర్ మెంటరింగ్ అనే మాటని వాడతామనీ, శిక్షణ అంటే, ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరినుంచీ నేర్చుకునే అవకాశాలు వీలైనన్ని కల్పించడమేననీ అన్నారాయన.
చాలాకాలం ఆ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసి ఇప్పుడు టీచర్ మెంటరింగ్ చేస్తున్న అలోక్ మాథుర్, చంద్రిక మాధుర్ దంపతులతో కూడా కొంత చర్చించేను. ‘మీరు ఎంత చెప్పండి, ఎంత చేయండి, ఉపాధ్యాయుడు తాను ఏ స్కూల్లో చదువుకున్నాడో, ఎలా చదువుకున్నాడో ఆ అనుభవాన్నే తిరిగి తన పిల్లలకి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. ఉపాధ్యాయులు మంచి పాఠశాలల్లో చదవకపోతే ఆ బాధానుభవమే వాళ్ళు బోధిస్తున్న పాఠశాలల్లోనూ పునరావృతమవుతుంది’ అన్నారు చంద్రిక మాధుర్. ఆ మాట నిజంగానే కఠోరవాస్తవం.
‘మరి దీన్నుంచి విముక్తి ఎలా’ అనడిగేను.
‘అందుకు మనం చెయ్య్వలసింది: ఉపాధ్యాయుల్ని పోల్చకుండా ఉండటం. ప్రతి ఉపాధ్యాయుడూ తోటి ఉపాధ్యాయుల ద్వారా కూడా నేర్చుకునేలా చూడటం. రెండవది, మూడు నాలుగు రోజుల ట్రైనింగ్ ఇచ్చి వదిలిపెట్టడం కాదు, రోజూ ముఖాముఖి ప్రతి ఉపాధ్యాయుణ్ణీ engage చెయ్యడం, మాట్లాడించడం, మనం నేర్పడం కాదు, అతడు నేర్చుకునేలా చూడటం, అట్లా నేర్చుకోడానికి సానుకూలవాతావరణం సృష్టించడం’ అన్నారామె.
ఆ తర్వాత, మీనాక్షి తపన్, ఆమె బృందంతో కొంతసేపు గడిపాం. డిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో సోషియాలజి ప్రొఫెసర్ గా పనిచేస్తున్న మీనాక్షీ తపన్ సబ్బటికల్ మీద ఆ పాఠశాలలో ఉపాధ్యాయ శిక్షణ కోసం మాడ్యూల్స్ తయారు చేయిస్తున్నారు. ఆమె డాక్టరల్ పరిశోధన ఋషీవాలీ పాఠశాలమీదనే చేసారట. ఆ బృందం తయారు చేస్తున్న మాడ్యూల్స్ కూడా ఒకటి రెండు సవివరంగా పరిశీలించేను.
నాతో పాటు ఆ పాఠశాల పూర్వవిద్యార్థి, ప్రస్తుతం గ్రామీణపాఠశాలలకి సహకరిస్తున్న సందీప్ నాతో పాటు తిరుగుతూ ఆ పాఠశాలను ఒక విద్యార్థి దృక్పథంనుంచి పరిచయం చేస్తూ వచ్చేడు. చాలాకాలం ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి, ప్రస్తుతం గ్రామీణపాఠశాలలకు సమన్వయకర్తగాపనిచేతున్న రాజేష్ నాకు తరగతిగదులు, డైనింగ్ హాలు, ఆర్ట్ మ్యూజియం లతో పాటు గ్రామీణపాఠశాలని దగ్గరుండి చూపించేడు.
అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పాఠశాల ఆవరణ, ఆ చెట్లూ, వాటిమధ్య ధారాళమైన కాంతీ, చిక్కటి మాఘమాసపు నీడలూ-బహుశా ఆ పాఠశాల సుసంపన్నత అంతా ఆ ప్రకృతి సౌందర్యంలోనే ఉన్నదనుకోవాలి.
రెండు ఉదయాలూ, రెండు సాయంకాలాలూ ఆ పాఠశాలలో గడిపేక చూడవలసిన పార్శ్వాలన్నీ చూసేక, చర్చించవలసినవారందరితో చర్చించేక, ఆ పాఠశాల ఒక సున్నితమైన సంఘర్షణకు లోనవుతున్నదని గ్రహించేను. కాని రోషెన్ దలాల్ రాసిన Rishi Valley School: The First Forty Years (2007) చదివిన తరువాత, ఆ పాఠశాలలో ఈ సంఘర్షణ గత ఎనభై ఏళ్ళుగానూ కొనసాగుతూనే వస్తున్నదని అర్థమయింది.
స్వేచ్ఛకీ, సంస్థాగతమైన అమరికకీ మధ్య తలెత్తే సంఘర్షణ అది. సున్నితమైన తల్లిదండ్రులున్న ప్రతి ఇంట్లోనూ తలెత్తే ప్రశ్నలే అవి. శిశువుని స్వేచ్ఛగా ఎదగనిస్తేనే, సృజనాత్మకంగానూ, మానవీయంగానూ ఎదుగుతాడు. కానీ. సౌకర్యవంతమైన సాంఘిక జీవితం, ఆర్థిక భద్రత, సదుపాయాలూ కావాలంటే, పరీక్షలూ, కొలమానాలూ, మార్కెట్ ప్రభావాలూ తప్పనిసరి. ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించడం ఎలా? అసలు సాధించగలమా? ఆ ప్రయత్నంలో ఏదో ఒకదాన్ని బలివ్వకుండా రెండు ఆదర్శాల్నీ సమంగా నిలుపుకోగలమా?
బహుశా ఇప్పుడు కృష్ణమూర్తిని ఈ ప్రశ్న అడిగితే ఏమంటాడు? అసలు నీకా ప్రశ్న తలెత్తుతోందంటేనే నీలో ఏదో అభద్రత ఉందనీ, భయం ఉందనీ అంటాడేమో కదా అనుకుంటూనే కృష్ణమూర్తి సంభాషణలు School Without Fear (2016) చదవడం మొదలుపెట్టాను.
27-2-2017