రెజిన్ మాధ్యమం

Reading Time: 2 minutes

69

మిత్రురాలు స్వర్ణలత తన సోదరి ఒక చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేస్తోందనీ, ఆ ప్రారంభోత్సవంలో నన్ను కూడా ఉండమనీ అడిగితే వెళ్ళాను. నిన్న మధ్యాహ్నం ఐకాన్ ఆర్ట్ గాలరీలో ఆ ప్రదర్శనని నా మిత్రుడూ, సహాధ్యాయీ, ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వంలో డైరక్టరు జనరల్ ఆఫ్ పోలీసు గా ఉన్న మహేందర్ రెడ్డి ప్రారంభించారు. నా అత్మీయమిత్రుడూ, కవీ, గాయకుడూ సుద్దాల అశోక తేజ, కవి, చరిత్రపరిశోధకుడూ సిరామోజు హరగోపాల్ కూడా ఆ వేడుకలో పాలు పంచుకున్నారు.

ఆ చిత్రకళా ప్రదర్శన రెండు విధాలుగా ప్రత్యేకమైనది. మొదటిది, చిత్రకారిణి ఉషారాణి, రెజిన్ మాధ్యమంలో చిత్రించిన చిత్రాలవి. రెజిన్ ఒక రసాయన పదార్థం. దాన్ని రంగుల్లో కలిపి చిత్రించవచ్చు, లేదా దాని మీద రంగులు పోసి చిత్రించవచ్చు. కాని, అది చాలా కష్టతరమైన ప్రక్రియ. ఈ మాధ్యమాన్ని ఉపయోగించే కళాకారుడు artist మాత్రమే కాదు, artisan కూడా. భారతదేశంలో ఈ మాధ్యమంలో చిత్రిస్తున్నవాళ్ళెంతమందో లేరు. నగరంలో కూడా నేనిప్పటిదాకా చూసిన మొదటి ప్రదర్శన ఇదే. చిత్రకారిణి అమెరికాలో ఉండగా ఈ మాధ్యమం గురించి తెలుసుకుని ప్రయోగాలు మొదలుపెట్టాననీ, చాలావరకూ సఫలీకృతురాల్ని అయ్యాననీ చెప్పుకొచ్చారు. కొత్త చిత్రకళామాధ్యమంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన మరొక నాలుగు రోజులపాటు ఉంటుంది కాబట్టి, చిత్రలేఖనంలో ఆసక్తి ఉన్నవాళ్ళూ, రెజిన్ మాధ్యమం గురించి తెలుసుకోవాలనుకున్నవాళ్ళూ చూడవచ్చు.

రెండవది, ఇతివృత్తాల పరంగా, ఆ చిత్రలేఖనాలన్నీ ప్రధానంగా యాబ్ స్ట్రాక్ట్ వర్ణలేపనాలు. సాధారణంగా ఒక చిత్రకారుడి పరిణతిని మనం రూపచిత్రకళలో కన్నా నైరూప్య చిత్రకళలోనే ఎక్కువ గుర్తుపట్టగలం. రూపచిత్రకళ, ఒక గీతానికి స్వరాలు కూర్చి పాడే సంగీతమైతే, నైరూప్య చిత్రకళ, స్వరాలతో గమకాలు పలికించడం వంటిది. అక్కడ చిత్రకారుడి మనోధర్మం, అతడి హృదయస్పందనం మనకి మరింత తేటతెల్లంగా గోచరిస్తాయి. అతడు తన మనోనేత్రాలతో సంభావిస్తున్న రేఖల్నీ,రంగుల్నీ, వంపుల్నీ, కిరణాల్నీ, నీడల్నీ మనం అపరోక్షంగా అనుభూతిగా చెందగలుగుతాం. ఆ విధంగా చూసినట్లయితే, ఈ చిత్రకారిణి రెజిన్ మాధ్యమంద్వారా చిత్రించిన abstract patterns ఎంతో గతిశీలకంగానూ, స్పందనశీలాలుగానూ ఉన్నాయని చెప్పవచ్చు. ఆ పాటర్న్స్ ను చూడటానికైనా ఆ ప్రదర్శనను చూడవలసి ఉంటుంది.

చిత్రకారిణి రూపచిత్రకళలో కూడా సిద్ధహస్తురాలని చెప్పడం కోసం రెండు ముఖచిత్రాలూ, ఒక స్థిరజీవనచిత్రం, మరొక రెండు చిత్రలేఖనాల్ని కూడా ప్రదర్శించింది. కాని, సందర్శకులు ఆ నైరూప్య చిత్రలేఖనం తమలో రేకెత్తించే స్పందనల్ని పోల్చుకునే పనిలోనే నిమగ్నులైపోతూండటం చూసాన్నేను.

ఆవిష్కరణ అయ్యాక అక్కడున్న వారందరి కోరిక మీదా అశోక్ తేజ చక్కటి పాట ఒకటి ఆలపించాడు. అందులో ఆయన అడవిని ‘ఆకుపచ్చని కోయిల’ అన్నాడు. ఎంతైనా అతడు కూడా మాటలచిత్రకారుడు కదా!

4-11-2017

Leave a Reply

%d bloggers like this: