ఉన్నత విద్యలో కొత్త ప్రయోగాలు

30

మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివెర్సిటీలో ఏర్పాటు చేసిన ఒక ఓరియెంటేషన్ కార్యక్రమంలో నిన్న పాల్గొన్నాను. దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చెరర్లు, ఉపాధ్యాయ శిక్షణా కళాశాలల ప్రిన్సిపాళ్ళు సుమారు యాభై మందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరం.

‘ఉన్నత విద్యలో కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు’ అన్న అంశం మీద ఒక పూటంతా వారితో గడిపాను. నేను మాట్లాడటమే కాక, వారి వారి కళాశాలల్లో వారు చేపడుతున్న కొత్త ప్రయోగాల గురించి కూడా మాట్లాడించేను.

కొత్త ఆలోచనలు, కొత్త ప్రయోగాలు సైన్సులోనూ,సాహిత్యంలోనూ ఎంత అవసరమో అంతకన్నా కూడా విద్యారంగం లోనూ, పాలనా రంగంలోనూ మరింత అవసరమనేదే నేను నేను పదే పదే చెప్పే అంశం. మన దేశంలో విద్య గురించీ, విద్యాలయాల గురించీ మాత్రమే నా ఆవేదన కాదు.

ప్రపంచవ్యాప్తంగానే విద్యాలయాల పరిస్థితి ఒక్కలానే ఉంది. ఇప్పుడు రిప్ వాన్ వింకిల్ నిద్ర లేచి వస్తే, తక్కిన ప్రపంచమంతా మారిపోయి కనిపించినా, స్కూళ్ళని మాత్రం గుర్తుపడతాడనీ, ఎందుకంటే, అవి అతడి కాలంలో ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అలానే ఉన్నాయనీ ఒక విద్యావేత్త వాపోయాడు. ఆ మాట విషాదకరవాస్తవం.

ఇందుకు కారణమేమిటంటే, గత నూటయాభై ఏళ్ళుగా మనం విద్యాలయాల్ని ఫాక్టరీ నమూనాలోనే చూస్తున్నాం, ఫాక్టరీల్లానే నడుపుతున్నాం. పారిశ్రామిక విప్లవకాలం నుంచీ, మనం విద్యని ఒక సరుకుగా భావించడానికి అలవాటు పడిపోయాం. తక్కినసరుకుల్లాగే విద్యని కూడా మానుఫాక్చర్ చెయ్యవచ్చుననీ, పాకేజి చెయ్యవచ్చుననీ, రవాణా చెయ్యవచ్చుననీ, గోదాముల్లో నిల్వచెయ్యవచ్చుననీ, అమ్మవచ్చుననీ, కొనవచ్చుననీ భావిస్తూ ఉన్నాం. కాని, 21 వ శతాబ్దంలో విద్య ఇంకెంత మాత్రం ఒక సరుకు కాదు. దాన్ని మనం ‘ఉత్పత్తి’ చెయ్యలేం. ఇప్పుడది ఒక సృజనాత్మక కార్యకలాపం. ఒక చిత్రకారుడు చిత్రం గీసినట్టుగా, ఒక స్వరకర్త ఒక పాటకి స్వరాలు కూర్చినట్టుగా, ఒక కవి కవితని అల్లినట్టుగా, విద్య కూడా ఇప్పుడు పూర్తి సృజనాత్మక వ్యవహారం.

అంతేనా? బహుశా కవితలూ, చిత్రాలూ ఇంకా విడి విడి వ్యక్తులు సృజిస్తూ ఉండవచ్చు, కాని విద్య ఇంకెంతమాత్రం వ్యక్తులు సృజించేది కాదు, సైన్సులాగా, పాలనలాగా అది కూడా బృంద వ్యవహారమే. కొంతమంది వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి ఒక ఉమ్మడి ధ్యేయాన్నేర్పరచుకుని, ఒక ఉమ్మడి ప్రణాళిక ప్రకారం సాగించవలసిన ఉద్యమం.

మన దేశంలోనూ, మూడవ ప్రపంచంలోని చాలాదేశాల్లోనూ రాజకీయ పరివర్తనకోసం మనుషులు బృందాలుగా ఏర్పడి ఉద్యమాలు చేపట్టే సంస్కృతి ఉంది. చివరికి కవులు కూడా బృందాలుగా ఏర్పడి కవిత్వంలో ఉద్యమాలు తెచ్చిన ఉదాహరణలున్నాయి. కాని నిజానికి ఇట్లాంటి ఉద్యమాలు రావలసింది విద్యారంగంలో. కాని ఇక్కడ మాత్రం కొత్త ప్రయోగాలు ఇంకా వ్యక్తులు చేపట్టవలసినవి అని మాత్రమే మనం భావిస్తూ ఉన్నాం.

21 వ శతాబ్దంలో అభివృద్ధికి రెండు రథచక్రాలు: information, innovation. మానవచరిత్రలో మున్నెన్నడూ లేనంత వేగంతోనూ, పరిమాణంలోనూ సమాచారం లభ్యంకావడం, ప్రయాణించడం మాత్రమే గ్లోబలైజేషన్ కాదు, ఆ సమాచారాన్ని వినియోగించుకోవడంలో కూడా మున్నెన్నడూ చూడని కొత్తపుంతలు తొక్కుతున్నారు. చాలా ఆవేదన కలిగించే అంశమేమిటంటే, సినిమారంగంలోనో, కమ్యూనికేషన్స్ రంగంలోనో ఉన్న ఈ గతిశీలత, అవకాశాల్ని అందిపుచ్చుకోవడానికి చూపుతున్న ఈ ఆతృత విద్యారంగంలో కనిపించకపోవడం. పోనీ, విద్య లాభసాటిరంగం కాదంటామా అంటే, పెట్టుబడి, లాభాలు, తద్వారా లభిస్తున్న రాజకీయాధికారాల్ని దృష్టిలో పెట్టుకుంటే, మన రాష్ట్రాల్లో నడుస్తున్న కార్పొరేట్ విద్యాసంస్థల ముందు చలనచిత్రరంగం దిగదుడుపే.

నేననుకుంటాను, ఈ లోపం తల్లిదండ్రుల్లో ఉందని. సినిమా ప్రేక్షకులుగా మనం చిత్రదర్శకులనుంచి ఆశిస్తున్న కొత్తదనాన్ని, కన్స్యూమర్లుగా మన మొబైల్ ఫోనుల్లో ఆశిస్తున్న కొత్త ఫీచర్స్ ని తల్లిదండ్రులుగా మన పిల్లలు చదువు కుంటున్న విద్యాలయాలనుంచి ఆశించడం లేదని. ఎప్పుడైనా ఏ పేరెంట్ అయినా తన పిల్లలు చదువుకుంటున్న విద్యాలయాల్లో ఆ నెలలో లేద ఆ ఏడాదిలో ఏ కొత్త ప్రయోగం చేపట్టారని ఏ పాఠశాల యాజమాన్యాన్నైనా ఎప్పుడైనా ప్రశ్నించారా?

అందుకని, నిన్న నేను కలుసుకున్న ఉపాధ్యాయులతో కొత్త ప్రయోగాల గురించీ, వాటిని చేపట్టవలసిన అవసరం గురించీ మాట్లాడేను. కొత్త ప్రయోగాలు చేపట్టడంలోనూ, వాటిని పెద్ద ఎత్తున వ్యాప్తి చెయ్యడంలోనూ ఉండే ఇబ్బందుల గురించి కూడా మాట్లాడేను. ఎవెరెట్ ఎం.రోజెర్స్ అనే ఆయన తన Diffusion of Innovations (1962) అనే సుప్రసిద్ధ రచనలో, కొత్త ప్రయోగాల్ని అమలు చెయ్యడంలో అయిదు దశలుంటాయని చెప్పింది వాళ్ళకి పరిచయం చేసాను. రోజెర్స్ చెప్పిదాని ప్రకారం, కొత్త ఆలోచనలు మొదట పరిచయ దశని దాటవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకోవడం లేదా అటువంటి ఆలోచనలు సాగించడం అన్నమాట. తరువాతది ఒప్పించే దశ. ఆ ఆలోచనల్ని, లేదా ఆ ప్రయోగాల్ని నలుగురూ చేపట్టవలసిన అవసరం గురించి నలుగుర్నీ ఒప్పించే దశ. ఆ తర్వాత, నిర్ణయం తీసుకునే దశ. ఆ దశలో ఆ ప్రయోగాలు మనం చేపట్టాలో వద్దో ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ తర్వాతది అమలు పరిచే దశ. ఆ ప్రయోగాల్ని మన పరిస్థితులకు తగ్గట్టుగా మార్చుకుని అమలు చేస్తాం. మామూలుగా ఇక్కడితో ఆగిపోవచ్చు, కాని రోజెర్స్, మరొక దశ కూడా ఉంటుందంటాడు. అదేమంటే, మనమేదన్నా కొత్త ప్రయోగం చేపట్టినప్పుడు, మన అంతరంగంలో ఒక విధమైన అస్తిమితం, అసౌకర్యం ఉంటాయనీ, మనం తీసుకున్న నిర్ణయం సరైంది అవునో కాదో మనకి నిశ్చయమయ్యేదాకా మనం తృప్తిచెందలేమనీ అంటాడు. దీన్ని అతడు confirmation stage అంటాడు. మనం చేపట్టిన ప్రయోగాల గురించి మనకి ధ్రువీకరణ కావాలంటే మనం వాటిని విస్తారంగా పంచుకోవాలి, చర్చించుకోవాలి, అధ్యయనం చెయ్యాలి. కాని మనమింకా మొదటి దశ, అంటే పరిచయదశకే చేరుకోలేదన్నదే నా బాధ.

నిన్న కొంతమంది ఉపాధ్యాయులు వారి వారి కళాశాలల్లో చేపడుతున్న కొత్త ప్రయోగాల గురించి చెప్పినప్పుడు నేను చేసింది వాటిని confirm చెయ్యడమే. అన్నిట్లోనూ రెండు చాలా విలువైన ప్రయత్నాలు అనిపించాయి. ఒకటి, కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ ఇన్సూరెన్సుకిందకు తీసుకురావడం. విద్యార్థికి ఒక్కొక్కరికి 15 రూపాయల చొప్పున వారి స్పెషల్ ఫీజు నుంచి కట్టి ఆ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రామీణ విద్యార్థులకి ఎంతో మేలు చేసింది. ఇది వెంటనే ఒక ప్రభుత్వ విధానంగా మారవలసిన అవసరం ఉందనిపించింది. మరొకటి, ఒక జువాలజీ లెక్చెరర్ చెప్పిన విషయం. తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులందరికీ రక్తపరీక్షలు చేయించి, వాళ్ళల్లో ఎవరు ఎనీమిక్ గా ఉన్నారో గుర్తుపట్టి, వారికి తగిన సలహాలూ, సూచనలూ అందించామని. ఇది కూడా ప్రభుత్వవిధానంగా మారవలసిన అవసరం ఉంది.

ఈ రెండూ కూడా out of box ఆలోచనలే. గొప్ప ప్రయోగాలు.అయితే బోధనలోనూ, అభ్యసనంలోనూ కూడా ఇటువంటి కొత్తపుంతలున్నాయా? ఉన్నాయనే ఒకరిద్దరు చెప్పారు. ఒక ఇంగ్లీషు ఉపాధ్యాయుడు తాను పాఠం చెప్పిన తరువాత, తన విద్యార్థులకి ఏమి అర్థమయిందో, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లద్వారా తిరిగి చెప్పమంటున్నాను అని చెప్పాడు. ఇటువంటి ప్రయోగాలు అసంఖ్యాకంగా జరగాలన్నదే నా ఆకాంక్ష.

3-11-2017

ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు ఇక్కడ చూడొచ్చు

Leave a Reply

%d