నేను సద్గురు జగ్గీవాసుదేవ్ అనుయాయిని కాను, ఆయన బోధనలపట్లా, సంభాషణలపట్లా నాకేమీ ప్రత్యేకమైన ఆసక్తి లేదు. ఆయన చెప్పే క్రియాయోగాన్ని అనుసరించడానికి ఆయన పట్ల గొప్ప నమ్మకం ఉండాలి, లేదా ఆయన్ని విమర్శించాలంటే, ఆయన ప్రత్యర్థుల్లాగా, ఆయన పట్ల బలమైన అనుమానాలేనా ఉండాలి. నాకు ఆ నమ్మకమూ లేదు, ఆ అనుమానాలూ లేవు.
కాని నిన్నా, మొన్నా, కోయంబత్తూరు ప్రాంతంలో ఆయన స్ఫూర్తితో అమలు చేస్తున్న రెండు మూడు కార్యక్రమాలు చూసేక ఆయన పట్ల గౌరవం కలిగింది.
‘ఈశవిద్య’ పేరిట ఈశ ఫౌండేషన్ తో కలిసి పాఠశాల విద్యా ప్రమాణాలు పెంచడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుప్పం నియోజకవర్గంలో ఒక ప్రత్యేక కార్యక్రమం మొదలుపెట్టింది. రెండేళ్ళ కిందట ప్రణాళికా శాఖ కార్యదర్శిగానూ, ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానూ ఉన్న టక్కర్ గారు ఆ ప్రయత్నాల గురించి చెప్త్తూ గిరిజన ప్రాంతాల్లో కూడా అటువంటి ప్రయత్నాలు మొదలుపెట్టవచ్చేమో చూడమన్నారు. ఆ దిశగా ‘కరాడిపత్’ సంస్థతో కలిసి మేం పాడేరు ప్రాంతంలో ఇంగ్లీషు బోధనా కార్యక్రమం మొదలుపెట్టాం. పోయిన ఏడాది మేమా గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు, అనుకోకుండా మారుమూల ప్రాంతమైన మంపలో గిరిజన ఆశ్రమపాఠశాలకు వెళ్ళినప్పుడు అక్కడ కరాడి పత్ పద్ధతిలో పిల్లలు ఉత్సాహంగా ఇంగ్లీషు నేర్చుకోవడం కనిపించింది.అప్పణ్ణుంచీ ఈశవిద్య పాఠశాలలు స్వయంగా పోయి చూడాలని అనుకుంటూ ఉన్నది ఇప్పటికి నెరవేరింది.
గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలు సాధించగల బోధన-అభ్యసన పద్ధతిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో 2006 లో కోయింబత్తూరు తాలూకాలో సందెగౌండెన్ పాళయం అనే ఊళ్ళో మొదటిసారిగా ఈశవిద్య తరఫున ఒక పాఠశాల ప్రారంభించారు. ఇప్పుడా పాఠశాలల సంఖ్య తొమ్మిదికి పెరిగింది. రానున్న కాలంలో తమిళనాడులోని 206 తాలూకాల్లోనూ తాలూకాకి ఒకటి చొప్పున 206 పాఠశాలలు ప్రారంభించాలని ఈశవిద్య ఆలోచిస్తున్నది.
మంగళవారం మధ్యాహ్నం కొబ్బరి, అరటి తోటల మధ్యనుంచి ప్రయాణిస్తూ మేమొక సన్నని బాటపట్టి, పోక చెట్ల మధ్య పొదరిల్లులాంటి ఒక పాఠశాలకు చేరుకున్నాం. అక్కడ మమ్మల్ని పిల్లలు పూలగుత్తులతో స్వాగతించారు. ఆ తర్వాత సుమారు మూడుగంటల పాటు, వాళ్ళు మాకు ఆ పాఠశాలలోని ప్రతి ఒక్క విభాగాన్నీ, విద్యాప్రయోగాన్నీ, విశేషాన్నీ పరిచయం చేసారు. ఎనిమిది, తొమ్మిదో తరగతులకు చెందిన ఆ నలుగురు బాలబాలికలూ తమ పాఠశాలని పరిచయం చేసిన తీరు మమ్మల్ని అబ్బురపరిచింది. ఆ విద్యావిధాన రూపకర్తల ప్రయత్నాలు సఫలమయ్యాయనిపించింది.
అది ఇంగ్లీషు మీడియంలో కిండర్ గార్టన్ నుండి పన్నెండో తరగతి వరకు నడిచే పాఠశాల. ప్రస్తుతం పదకొండో తరగతిదాకా మాత్రమే ఉంది. పన్నేండో తరగతి వచ్చే ఏడాది మొదలవుతుంది.
ఆ భవనాలు మరీ ఆడంబరంగానూ, పెద్ద ఖర్చుతో నిర్మించినవీ కావు. కాని ధారాళంగా గాలీ,వెలుతురూ వచ్చేటట్టు వాటిని కట్టారు. వాటిని సద్గురునే స్వయంగా డిజైన్ చేసాడని వారు చెప్పారు. ముఖ్యంగా ఆ కిటికీలు నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఆ కిటికీలు దాదాపుగా ఆరుబయటి వాతావరణాన్ని నాలుగుగోడల మధ్యకూ తీసుకు రాగలిగాయి.
ఆ పాఠశాలలో ఇంగ్లీషు, తమిళం, గణితం బోధించడానికి విస్పష్టమైన మెథడాలజీ ఉంది సి.పి.విశ్వనాథ్ ఆనే ఆయన రూపొందించిన ఆ బోధనావిధానం పిల్లలు భాషలూ, గణితమూ సులభంగా నేర్చుకోడానికి అనుకూలంగా ఉంది. ఇంగ్లీషు మాధ్యమం అయినప్పటికీ, పిల్లలు తమిళంలో కూడా చెప్పుకోదగ్గ సామర్థ్యం కనపరిచారు. వాళ్ళని నేను తిరుక్కురళ్ నుంచి కొన్ని కురళ్ళు చెప్పమంటే పిల్లలు తడుముకోకుండా చెప్పగలిగారు. భారతియార్ రాసిన పాటలేమన్నా పాడగలరా అని అడిగితే, ‘ఓడి విలయ్యాడు పాపా..కూడి విలయ్యాడు పాపా’ అంటో వాళ్ళు ఆలపిస్తూంటే నాకు చెప్పలేనంత సంతోషం కలిగింది. (నేను భారతి అంటూంటే పిల్లలకి అర్థం కాలేదు, ఒక ఉపాధ్యాయిని నన్ను సరిదిద్దింది, భారతియార్ అంటో.)
కిండర్ గార్టన్ పిల్లలకోసం ఈశవిద్య ప్రత్యేకమైన వర్క్ బుక్స్, ఉపాధ్యాయ కరదీపికలు రూపొందించింది. పిల్లలు ఆడుకోడానికి, ఆడుకుంటూ నేర్చుకోడానికి కూడా ప్రత్యేకమైన అభ్యసన సామగ్రి రూపొందించింది. కంప్యూటర్ విద్య, లైబ్రరీ, లాబరేటరీ, క్రీడావిద్యల మీద కూడా వాళ్ళు చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఆ పాఠశాల కేవలం డే-స్కూలుగానే పనిచేస్తున్నది. రోజూ గ్రామాల్నుంచి పిల్లలు బడికి రాడానికి బస్సు సౌకర్యం ఉంది. సుమారు 800 మంది పిల్లలకిగాను దాదాపు 25 మంది ఉపాధ్యాయ సిబ్బంది, మరొక 10 మంది బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. ప్రతి తరగతికీ 40 మంది పిల్లల చొప్పున రెండేసి సెక్షన్లు ఉన్నాయి. ఒక్క కిండర్ గార్టన్ కి మాత్రం మూడు సెక్షన్లు. పాఠశాల తరగతి గదులు, వరండాలు, ఆవరణ, టాయిలెట్లు చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. పిల్లలు గీసిన బొమ్మలు, రాతలు, చార్టులతో గోడలు కలకల్లాడుతున్నాయి.
ఆ పాఠశాల అమలు చేస్తున్న కార్యక్రమాల్లో చెప్పుకోదగ్గవి వరండా కార్యక్రమాలు. పిల్లలు ఇంటర్వెల్ లోనూ, ఖాళీసమయాల్లోనూ వరండాలో తిరుగుతుండే సమయాన్ని కూడా సృజనాత్మకంగా వాడుకోవడానికీ, వాళ్ళ మానసిక సంచలనాల్ని విడుదల చెయ్యడానికీ రకరాకల కొత్త ఆలోచనలతో రూపొందించిన కార్యక్రమాలవి.
అన్ని ఖర్చులూ కలిపి ఒక్కొక్క పిల్లవాడికీ ఏడాదికి 13000 దాకా అవుతుందనీ, అది భక్తులు విరాళంగా సమకూరుస్తున్నారనీ చెప్పారు. ఆ పిల్లల్లో సుమారు 80 శాతం మంది దళితులు, వెనుకబడిన తరగతులకు చెందిన కుటుంబాల నుంచి వచ్చినవాళ్ళే. ఆ పాఠశాల వాళ్ళ జీవితాల్లో ఏదన్నా మార్పు తెచ్చిందా అని పిల్లల్ని అడిగాను. వాళ్ళు చాలా సంతోషంగానూ, చాలా పాజిటివ్ గానూ ప్రతిస్పందించేరు.
తమ పాఠశాలల్లో అనుసరిస్తున్న బోధనా విధానం ఇస్తున్న సత్ఫలితాల్ని చూసేక, ఆ విధానాన్ని ప్రభుత్వ పాఠశాలలకు కూడా వర్తింపచేస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈశవిద్య ప్రభుత్వపాఠశాలల దత్తత కార్యక్రమం మొదలుపెట్టింది.
అది మేం చూసిన రెండవ కార్యక్రమం. 2012-13 లో మొదలైన ఆ ప్రయత్నం కింద ఇప్పటిదాకా, సుమారు 54 ప్రభుత్వ పాఠశాలల్ని దత్తత తీసుకున్నారు. కోయంబత్తూరు డివిజన్లో 13 పాఠశాలల్లో ఈశవిద్య కృషి మొదలుపెట్టింది. వాటిలో మంగళవారం ఒక పాఠశాలనీ, బుధవారం పొద్దున్న మరొక పాఠశాలల్నీ మేం సందర్శించేం.
ఒకటి, ముట్టత్తువాయల్ అనే గ్రామంలో తమిళనాడు ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ నడుపుతున్న ఆశ్రమ పాఠశాల. ఈశపాఠశాల చూసిన కళ్ళతో ఆశ్రమపాఠశాలని చూస్తే చాలా దిగులు కలిగింది. కానీ, ఏదో దగ్గరివాళ్ళను చూసిన సంతోషం కూడా కలిగింది. ఆ ఉన్నతపాఠశాలలో 87 మంది మాత్రమే పిల్లలున్నారు. అయిదుగురు ఉపాధ్యాయులున్నారు. అక్కడ ఈశపాఠశాలలో గోడలు కూడా కలకల్లాడుతుంటే, ఇక్కడ తరగది గదులు కూడా కళావిహీనంగా ఉన్నాయి.
ఆ పిల్లలు దాదాపుగా ఇరుళ అనే తెగకు చెందిన వాళ్ళు. వాళ్ళల్లో 16 మంది చదువులో వెనకబడ్డట్టు గుర్తించి, ఈశవిద్య వాళ్ళకి రెమిడియల్ కోచింగ్ ఇవ్వడానికి ప్రత్యేకంగా ఒక ఉపాధ్యాయినిని ఏర్పాటు చేసింది. ఆ పిల్లల్ని ప్రోత్సహించడానికి ఈశవిద్య రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉన్నది. ఉదాహరణకి వాళ్ళల్లో ఒక పిల్లవాడి చొక్కాకి 100% attendance అనే బాడ్జి తగిలించి ఉంది. మరొక పిల్లవాడికి class leader అనే బాడ్జి తగిలించి ఉన్నది.
ఆ ప్రాంగణంలోనే ప్రాథమిక పాఠశాల కూడా ఉంది. అక్కడ పిల్లలు చాలామంది, కాని ఉపాధ్యాయులు ఇద్దరే. అక్కడ సర్వశిక్షా అభియాన్ రూపొందించిన కృత్యపత్రాలు, రకరకాల అభ్యసన సామగ్రి కూడా ఉన్నాయి. కాని ఈశ పాఠశాల కిండర్ గార్టన్ సెక్షన్లలో మేం చూసిన ఉత్సాహం, వెలుగు అక్కడ కనిపించలేదు.
ఎందుకని?
ఆ మాటే అడిగితే, అక్కడొక ఉపాధ్యాయిని చాలా ఆవేశంగా తమిళంలో పెద్ద ప్రసంగమే చేసింది. అదంతా మామూలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు చెప్పే విషయమే. అందుకని తెలుగు సినిమా తమిళ డబ్బింగ్ లో చూస్తున్నట్టే ఉంది. ఆ మాటే చెప్పాను ఆమెతో. వాళ్ళు తల్లితండ్రుల్ని తప్పుపడుతున్నారు. కాని అంతా చెప్పేక ఆమె ‘ఇరవయ్యేళ్ళ పైబడి పాఠాలు చెప్తున్నాను. కాని ఒక్క పిల్లవాడు, ఒక్క పిల్ల కూడా బయటికి పోయి పెద్ద చదువులు చదవడం చూడలేకపోయాను’ అన్నది దీనంగా.
నేనామెను ఊరడించవలసి వచ్చింది.
‘చూడు, నీ తరగతిలో బాలికలు ఎంత చక్కగా శుభ్రంగా తయారై వచ్చారో, ఎంత చక్కగా జడ వేసుకున్నారో, భయం లేకుండా ఎట్లా కూచున్నారో. ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు ఏం చెప్తున్నాయంటే, అట్లా బాలికలు కనీసం అయిదు సంవత్సరాలు పాఠశాలలో గడిపినా కూడా దేశం ఎంతో బాగుపడుతుందని. ఎందుకంటే, వాళ్ళు తిరిగి గ్రామాలకు వెళ్ళాక, మామూలు జీవితాల్లో ప్రవేశించినా కూడా, ఆ జీవితాలు తమ తల్లులు జీవించిన జీవితం కన్నా ఎంతో మెరుగ్గా ఉంటాయి. వాళ్ళు చిన్న వయసులో పెళ్ళికి అంగీకరించరు, బిడ్డకీ బిడ్డకీ మధ్య ఎడం పాటిస్తారు, కుటుంబనియంత్రణ పాటిస్తారు, తమ పిల్లల్ని బడికి పంపిస్తారు. కాబట్టి, ఇరవయ్యేళ్ళుగా నువ్వీ తమిళ గిరిజన సమాజానికి చాలానే సేవ చేసావు, నిరుత్సాహపడకు’ అని చెప్పాను.
2
ఆ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయినిని ఊరడించేనేగాని, ఆ రాత్రంతా నన్ను ఆ దిగులు వదల్లేదు. మర్నాడు మేం మరిరెండు ప్రభుత్వ పాఠశాలలు చూసేం.
ఒకటి, తొండముత్తూరు గ్రామంలో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాల. విశాలమైన ఆవరణ. తగినన్ని తరగతి గదులు. మర్నాటి రిపబ్లిక్ దినోత్సవం కోసం కొందరు పిల్లలు ఆటలు ప్రాక్టీసు చేస్తున్నారు. పదవతరగతి పిల్లలు పరీక్షలు రాసుకుంటున్నారు. మొత్తం 969 మంది పిల్లలకు గాను 36 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారంతా 99 శాతం దళితులు, వెనకబడిన తరగతుల పిల్లలు. ప్రభుత్వం ఎనిమిదవ తరగతి దాకా పిల్లలకి దుస్తులు, పుస్తకాలు, మధ్యాహ్నభోజనం ఉచితంగా సమకూరుస్తున్నది. తొమ్మిది, పదో తరగతి పిల్లలకి ఏడాదికి 1500 ఉపకారవేతనం అందిస్తున్నది. 11 వతరగతిలో చేరగానే పిల్లలందరికీ సైకిళ్ళు, పన్నెండో తరగతిలో లాప్ టాప్ లు అందచేస్తున్నది.
పాఠశాల గత కొన్నేళ్ళుగా పదో తరగతిలోనూ, పన్నెండో తరగతిలోనూ సరైన ఫలితాలు చూపించలేకపోతున్నదని, ఈశవిద్య సహకారం తీసుకోవడం మొదలుపెట్టింది. 12-13 నుండి ఈశవిద్య అక్కడ ముగ్గురు ఉపాధ్యాయుల్ని అదనంగా సమకూర్చి రెమిడియల్ కోచింగ్ చేపడుతున్నది. ఈ ఏడాది 57 మంది పిల్లలు చదువులో వెనకబడ్డట్టు గుర్తించారు. అంటే ఆరుశాతమన్నమాట. వాళ్ళల్లో 20 మంది ఆరవతరగతిలోనే ఉన్నారు. ఆ రెమెడియల్ కోచింగ్ వల్ల రెండేళ్ళుగా నూటికి నూరు శాతం ఫలితాలు రావడం మొదలయ్యింది.
మేము చూసిన మూడవపాఠశాల కూడా తొండముత్తూరు బ్లాకులోనే ఉంది గాని నీలగిరి అడవుల సరిహద్దుల్లో ఉన్నది. నరసిపురం అనే గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాల. అక్కడ కూడా దాదాపుగా పిల్లలంతా దళిత, వెనకబడ్డ కుంటుంబాలకు చెందినవాళ్ళే. అక్కడి ప్రధానోపాధ్యాయిని కూడా మేమున్నంతసేపూ తల్లిదండ్రులమీద ఫిర్యాదు చేస్తూనే ఉంది.
కాని ఆమె కేవలం ఫిర్యాదులతోనే ఆగిపోలేదు. తన పాఠశాలలో పేరెంట్స్-టీచర్స్ అసోసియేషన్ ని పునరుద్ధరించి ప్రతి నెలా మీటింగులు ఏర్పాటు చేస్తూ ఉంది. ఆ మీటింగులకి తల్లులు తప్పకుండా రావాలని పట్టుబడుతున్నాననీ, తండ్రులు పిల్లలకొచ్చిన స్కాలర్ షిప్ కూడా తాగేస్తున్నారనీ, అందుకని తల్లుల్ని కూడగడితే తప్ప మార్పు రాదనీ చెప్పుకొచ్చింది. రేపటి రిపబ్లిక్ డే నాడు పేరెంట్స్-టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తోనే జెండావందనం చేయించబోతున్నానని చెప్పింది. ఈశవిద్య ఆ పాఠశాలలో కూడా రెమిడియల్ కోచింగ్ కి ఒక ఉపాధ్యాయిని సమకూర్చింది. ఆ పాఠశాల అడివి అంచున ఉండటంతో, రోజూ ఏనుగులు మందగా వచ్చిపడతాయనీ, ఉన్న ఒక్క వాచ్ మన్ నూ జిల్లా విద్యాశాఖాధికారి తన కార్యాలయానికి డెప్యుటేషన్ తీసేసుకోవడంతో ఈశవిద్యనే ఒక వాచ్ మన్ ను సమకూర్చిందని కూడా ఆమె చెప్పింది. ఈ రెండు సదుపాయాలతో పాటు ఈశవిద్య తరఫున అక్కడ పిల్లలతో ఒక నర్సరీ కూడా పెంచుతున్నారు.
మేము చూసిన ఆ మూడు ప్రభుత్వ పాఠశాలల్లోనూ కూడా ప్రభుత్వమూ, ఉపాధ్యాయులూ శక్తివంచనలేకుండా పిల్లలకోసం కృషి చేస్తున్నట్టు అర్థమవుతూనే ఉంది. భవనాలు, సదుపాయాలు, పిల్లలకి ప్రభుత్వం ఏ సౌకర్యాల్లోనూ తక్కువచేయలేదు. కాని ఈశ మెట్రిక్యులేషన్ స్కూల్లో మాకు కనిపించిందేదో, ఆ మూడు పాఠశాలల్లోనూ కూడా కనిపించలేదు. ఏమిటది?
మేము ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉన్నాం. మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈశవిద్య వంటి ప్రైవేటు సంస్థలకీ, ప్రభుత్వానికీ మధ్య ఎక్కడో ఒక తేడా ఉంది. బహుశా, ఆ తేడా ఇద్దరు తండ్రుల మధ్య తేడా లాంటిది. ఒక తండ్రి తన పిల్లలకి శక్తివంచనలేకుండా, తన సుఖం కూడా పక్కన పెట్టి, సమస్తం సమకూర్చాలనుకుంటాడు, సమకూరుస్తాడు, ప్రభుత్వం లాగా. కాని తన పిల్లల్ని పట్టించుకునే తీరికమాత్రం ఉండదతడికి. మరొక తండ్రి చాతనయినంత సమకూరుస్తాడుగాని, రోజూ కొంతసేపేనా పిల్లల్తో గడుపుతాడు. తాను వాళ్ళతో పాటే, వాళ్ళ కూడా ఉన్నానన్న భరోసా కలిగిస్తాడు. గొప్ప ధార్మికసంస్థలు నడిపే పాఠశాలల్లోలాగా.
అలాగని ఈశవిద్య పాఠశాలకి సద్గురు రోజూ వచ్చిపోతున్నాడనుకుంటే పొరపాటే. ఈ పదిపదకొండేళ్ళ కాలంలో ఆయన ఆ పాఠశాలని ఒక్కసారే సందర్శించేడట. కాని, ఆయన తరఫున తమ అమూల్యమైన కాలాన్ని ఆ పాఠశాలకోసం వెచ్చించే వాలంటీర్లని ఎంచుకుని వాళ్ళకి ఆ పాఠశాల అప్పగించాడు. కాని ప్రభుత్వమో? ఏనుగుల బెడద ఉందని తెలిసికూడా ఒక మారుమూల పాఠశాలలో ఉన్న వాచ్ మేన్ ని తన ఆఫీసుకి డెప్యుటేషన్ మీద తెచ్చేసుకునే విద్యాశాఖాధికారులుంటారక్కడ.
ఈ లోటునెట్లా పూడ్చటం?
3
ఈశఫౌండేషన్ చేపడుతున్న మరొక కార్యక్రమం వ్యవసాయరంగానికి చెందింది. తొండముత్తూరు బ్లాకులోనే సుమారు వెయ్యి మంది కొబ్బరి తోటల రైతుల్ని సమీకరించి ఏర్పాటు చేసిన కార్యక్రమం. వేలంగిరి ఉళవన్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ పేరు మీద పూలువపట్టి అనే గ్రామంలో ఒక సంస్థని ఏర్పాటు చేసారు. అంతకుముందు రైతులు తమ కొబ్బరిని అమ్ముకోవడానికి దళారులమీదనే ఆధారపడేవారు. కొబ్బరి ఎంతకు అమ్మాలో దళారులే నిర్ణయించేవారు. దాన్నుంచి బయటపడి, తమ ఫలసాయానికి గిట్టుబాటు ధర సంపాదించుకోవడం కోసం రైతులు 2013 లో ఒక కంపెనీగా ఏర్పడ్డారు. భారతప్రభుత్వానికి చెందిన స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చరల్ కన్సార్టియం (SFAC) వారికి దారిచూపించడమే కాకుండా మొదటి మూడేళ్ళూ ఆర్థికసహాయం కూడా అందించింది.
పూలువపట్టి గ్రామంలో ఒక్క శనివారం తప్ప వారంలో ప్రతి రోజూ సంత జరుగుతుంది. మేం వెళ్ళినప్పుడు కూడా వందల వాహనాలతో, కుప్పలు పోసిన కూరగాయల్తో ఆ ప్రదేశమంతా ఎంతో సందడిగా ఉంది.
‘మామూలుగా రైతులు ఒక సంఘంగా సంఘటితమయ్యేటప్పుడు ఏదో ఒక రకం పంటకే, అంటే అరటి, కొబ్బరి లాంటి ఏదో ఒకదానికే పరిమితమవుతారు.కాని మేం అయిదు రకాల పంటలు-కొబ్బరి, అరటి, పోక, కూరగాయలు, పసుపు పండించే రైతుల్ని కూడగట్టాం. ఇటువంటి సంఘం నాకు తెలిసి ఇదొక్కటే’ అన్నాడు ఆ సంఘానికి వెన్నెముకలాగా పనిచేస్తున్న ఒక వాలంటీరు.
పాడేరు ప్రాంతంలో కాఫీ పెంచుతున్న రైతుల్నీ, గిరిజనప్రాంతాల్లో జీడిమామిడి, మిరియాలు, పసుపు మొదలైన పంటల్ని పెంచుతున్న రైతుల్నీ ఆ మార్గంలో సంఘటితపరచగలమా అని మా బృందసభ్యులు వారితో చర్చిస్తూ ఉన్నారు. కాని ఇక్కడ కూడా గమనించవలసిన విషయమొక్కటే. కేవలం ప్రభుత్వ సహాయం వల్ల ఆ సంఘం ఎదగలేదు.
‘ముఖ్యంగా మీకు ఎట్లాంటి హిడెన్ అజెండా ఉండకూడదు. డబ్బుకోసమో,అధికారం కోసమో, చివరికి పేరు కోసమో కూడా మీరు పనిచేయకూడదు. రైతులు బాగుపడాలి, వాళ్ళకి గిట్టుబాటుధర రావాలి. అదొక్కటే మీ ధ్యేయంగా ఉండాలి’ అన్నాడు ఆ వాలంటీరు మాతో.
26-1-2017 & 28-1-2017
ఫేస్ బుక్ వాల్ మీద మిత్రుల స్పందనలు చూడాలనుకుంటే ఇక్కడ తెరవండి